నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల కొండ ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నది. కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే. పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నిన్నటి రోజున తిరుమల శ్రీవారిని కేవలం 3,485 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. వీరిలో 1379 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్నటి రోజున శ్రీవారి హుండీ ఆదాయం రూ. 22 లక్షలుగా ఉంది.
తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ… నాలుగు వేల లోపే దర్శనాలు…
