కరోనా వైరస్ కి పుట్టినిల్లయిన చైనాలో మళ్ళీ ఆ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. మిగతా దేశాల్లో ఆంక్షలు సడలించి అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నాయి. కానీ, చైనాలో మాత్రం మళ్ళీ వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళినవారు తిరిగి వస్తే ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలంటున్నారు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వైద్య అధికారులు ఆదేశించారు. కొవిడ్ కేసులను సున్నా స్థాయికి పరిమితం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టామని, అంతా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.
ఈమేరకు బీజింగ్ హెల్త్ కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది. బీజింగ్ దాటి బయటకు వెళ్ళినవారు వైరస్ కేసులు వెలుగు చూసినట్లైతే.. తిరిగి నగరానికి రావద్దు. పర్యటనలు పూర్తి చేసుకుని ఇప్పటికే చేరుకున్నవారు.. స్థానిక అధికారులకు తెలియజేయాలి, స్వీయ నిర్బంధంలో ఉండాలి.
వైద్యసాయం పొందాలని సూచించింది. ప్రజల ప్రయాణ రికార్డులను పరిశీలించేందుకు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. గత నెలలో చైనాలో 20 కరోనా కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. బీజింగ్‌లో తాజాగా కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇవి స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులుగా గుర్తించారు.
మరోవైపు, నవంబరు 8 నుంచి 11 మధ్య చైనా అధికార పార్టీ- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా బీజింగ్ నగరంలో ఓ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 375 మందికిపైగా అధికారులు పాల్గొననున్నారు. 2022 ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్ కూడా బీజింగ్‌లో జరగనున్నాయి. వందలాది మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరవనున్నారు.
దీంతో వైరస్ నియంత్రణ కోసం అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. విమానాశ్రయాల్లో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా జ్వరం, దగ్గు… ఇతర లక్షణాలు ఉన్నవారు దయచేసి అందరితో కలిసి భోజనాలు చేయవద్దు. పార్టీల్లో పాల్గొనవద్దు. దగ్గర్లోని ఆస్పత్రికి సాధ్యమైనంత త్వరగా వెళ్లండి. కరోనా వ్యాప్తి నియంత్రణకు స్వంత వైద్యం చేసుకోవద్దని తెలిపింది.మొత్తం మీద కరోనా కొత్త కేసులు చైనాలో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని చెప్పాలి.