ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సీజన్ మొదలైంది. ఇంటి ఇలవేల్పులకు మొక్క చెల్లించేందుకు పెద్దఎత్తున భక్తులు జాతరలకు వెళ్తుంటారు. కరోనా పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ జాతరల్లో ముందు జాగ్రత్తల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
జనవరి మాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలో జాతర సీజన్ మొదలవుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొత్తకొండ, కొమురవెల్లి, మేడారం జాతరలు జరుగుతాయి. సంక్రాంతి నుంచి మొదలయ్యే జాతరలతో ఉమ్మడి వరంగల్ జిల్లావాసులే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. సంక్రాంతి కాగానే ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు సుమారు 10లక్షలమంది భక్తులు వస్తారు.
ఇక కొమురవెల్లి మల్లన్న జాతర ఇంతకంటే ఘనంగా జరుగుతుంది. కొమురవెల్లి జాతర కూడా సంక్రాంతి నుంచే మొదలవుతుంది. మూడు నెలలకుపైగా సుదీర్ఘంగా జరిగే ఈ జాతరకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. . రాష్ట్రమంతటినుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి మల్లన్లకు మొక్కులు చెల్లించుకుంటారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం కూడా జాతరకు సిద్ధమైంది. జనవరి 10న కల్యాణోత్సవంతో ప్రారంభమయ్యే జాతర 18వ తేదీ అగ్నిగుండాల వరకు సాగుతుంది.
ఎనిమిది రోజులపాటు జరిగే ఈ జాతరలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ముఖ్యమైన మూడు తేదీల్లో లక్షల్లో ప్రజలు పోటెత్తుతారు. వీరభద్రుడికి కోరమీసాలు, కోడెమొక్కులు చెల్లించుకుంటారు. గీసుకొండ మండలం కొమ్మాల జాతర హోలీ నుంచి ప్రారంభమై 15 రోజులు జరుగుతుంది. జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో కూడా అనేక ఆలయాలు, క్షేత్రాల్లో సంక్రాంతి నుంచి శివరాత్రి మధ్య అనేక జాతరలు జరుగుతాయి. జాతరల సమయంలో కరోనా కేసులు పెరగడం అందరినీ భయపెడుతుంది. ఒమిక్రాన్ కేసులు పెరిగి ఎలాంటి ముప్పు తెస్తుందో అన్నా భయం అధికార యంత్రాంగంలో మొదలైంది.
లక్షల సంఖ్యలో భక్తజనం వచ్చి తమ ఇష్టదైవాలను కొలిచే సమయం కాబట్టి ఈసారి జాతరల్లో అనేక జాగ్రత్తలు అవసరం. కొవిడ్ విజృంభిస్తున్నందున జాతరల నిర్వహణ ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది. వేలాదిగా ప్రజలు గుమికూడే ఇలాంటి జాతరల్లో మాస్క్ పెట్టుకునేలా చేయడం, ముఖ్యంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయించడం వీలు కాని పని. దీంతో రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే జాతర విధుల్లో ఉండే పోలీసులకు పలు సూచనలు చేశారు ఉన్నతాధికారులు. భక్తుల భద్రతతో పాటు… ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆర్జిత సేవలను రద్దు చేసిన దేవాదాయ శాఖ అధికారులు కేవలం దర్శనానికి మంత్రమే అనుమతి ఇస్తున్నారు. మరోవైపు ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
