NTV Telugu Site icon

హుజురాబాద్‌ బై పోల్.. కొండా సురేఖకు కాంగ్రెస్‌ డెడ్‌లైన్..!

హుజురాబాద్‌లో ఉప ఎన్నికల హీట్‌ పెరిగిపోతోంది.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బరిలోకి దిగుతుండగా.. టీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ప్రకటించారు టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్.. ఇక, గత ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ స్థానంపై ఫోకస్‌ పెట్టింది… ఇప్పటికే పలు దఫాలుగా హుజురాబాద్‌ ఉప ఎన్నికలపై చర్చించింది టి.పీసీసీ.. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని భావిస్తోంది.. ఇప్పటికే అధిష్టానానికి కూడా సురేఖ పేరును రిఫర్‌ చేసినట్టుగా తెలుస్తుండగా.. ఆమె మాత్రం ఇంకా ఎటూ తేల్చడం లేదట.. దీంతో.. ఇవాళ సాయంత్రం వరకు కొండా సురేఖకి గడువు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ.. పోటీ చేసేది.. లేనిది తేల్చేయాలని సూచించింది.. కాదంటే, మరో అభ్యర్ధి కోసం ప్రయత్నాలు చేస్తామంటోంది పీసీసీ.

మరోవైపు హుజురాబాద్‌ బై పోల్‌ బరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పెట్టాలని పార్టీ సీనియర్‌ నేతలు సూచించినట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఈటల రాజేందర్, టీఆర్ఎస్‌ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్.. బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలిపితే కలిసివస్తుందని కొందరి నేతల వాదనగా ఉంది. ఇక, కాంగ్రెస్‌ పార్టీ ముందు కొండా సురేఖ కొన్ని డిమాండ్లు ఉంచింది.. వరంగల్‌లో మూడు సీట్లకు వచ్చే ఎన్నికల్లో పోటీకి హామీ ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు.. అయితే, హుజురాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాలపై ఇప్పటికే కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చిందట. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖకు డెడ్‌లైన్‌ విధించారు.. మరి.. సాయంత్రం లోపు కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.