కరోనా భయం తొలగిపోలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తత పై ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు , ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతి పై సిఎం కెసిఆర్ సమీక్షించారు. కరోనా పట్ల భయాందోళనలు అక్కరలేదన్నారు.
అయితే అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, సానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదని, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు.
సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. అర్హులైన వారందరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని సిఎం అన్నారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్ళి చికిత్స చేయించుకోవాలన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సిఎం సూచించారు.
ఎటువంటి పరిస్థితులు తలెత్తినా కరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్దంగా వుందని సిఎం అన్నారు. ఇందుకు సంబంధించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను, రాష్ట్రంలోని వైద్యారోగ్య పరిస్థితులు సహా కరోనా పరిస్థితులను సిఎం అడిగి తెలుసుకున్నారు. గత రివ్యూ సందర్భంగా సిఎం చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటివరకు చేపట్టిన చర్యలను అధికారులు సీఎంకు నివేదించారు. ఆక్సిజన్, పడకలు, మందుల లభ్యత తదితర ఏర్పాట్లన్నీ సిద్దంగా వున్నాయని అధికారులు సిఎం కేసీఆర్‌కి వివరించారు.