కేసీఆర్ అధ్యక్షతన నేడు టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గం ఇందులో పాల్గొంటారు. ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రంతో డీ అంటే ఢీ అంటున్న టిఆర్ఎస్ కార్యాచరణ… ఈ సమావేశం తర్వాత ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
ధాన్యం సేకరణపై కేంద్రం చేతులెత్తేయడంతో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే0దుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో కేసీఆర్ చర్చించనున్నట్టు సమాచారం. ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ తర్వాత జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ ఎటువంటి పాత్ర పోషించబోతుందన్న అంశంపై నేతలకు క్లారిటీ ఇవ్వనున్నారు.
మరోవైపు పార్టీ కమిటీల ఏర్పాటు అంశంపై కూడా కేసీఆర్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇటు రాష్ట్రంలో… అటు కేంద్రంలో బిజెపి తీరును ఎండగట్టేందుకు అవసరమైన కార్యాచరణ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.