Site icon NTV Telugu

జల జగడం.. సీజేఐ ఎన్వీ రమణ కీలక సూచనలు

CJI NV Ramana

CJI NV Ramana

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… లేఖలు, ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలు.. ఇలా చివరకు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు సీజేఐ.. తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. అంతేకాదు మూడోపక్షం జోక్యం అవాంఛనీయం అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదంపై విచారణలో భాగంగా ఈ కామెంట్లు చేశారు జస్టిస్ రమణ.. ఇక, ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. మధ్యవర్తిత్వం ద్వారానే సమస్య పరిష్కరించుకోవాలని సీజే సూచించారు. రెండు రాష్ట్రాలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు… రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ లాయర్లు మధ్యవర్తిత్వంపై జోక్యం చేసుకోవాలని సీజేఐ సూచించారు.

కాగా, తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది.. మంచినీరు, సాగునీరు ప్రయోజనాల కోసం.. తమకు న్యాయబద్ధమైన వాటాకోసం తెలంగాణ నిరాకరిస్తోందనేది ఆంధ్రప్రదేశ్ ఆరోపణ.. శ్రీశైలం డ్యామ్‌ ద్వారా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా నీటిని వినియోగిస్తోందంటోంది ఏపీ.. దీంతో.. రిజర్వాయర్‌లో నీటిపరిణామం తీవ్రంగా తగ్గిందని చెబుతోంది.. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని ఇప్పటికే తెలంగాణను కోరింది ఏపీ.. అయితే, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తుండడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ.. తెలుగు ప్రజల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. తాను న్యాయపరమైన అంశాల విచారణలోకి వెళ్లదలచుకోలేదన్నారు.. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడిని.. తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదం పరిష్కారానికి సిద్ధపడినట్లైతే సమాఖ్యస్పూర్తికి, రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఈ వివాద పరిష్కారానికి తోడ్పాటు అందిస్తా.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల జోక్యంతో న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటే మాత్రం.. ఈ కేసు విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని.. మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యమైతేనే తను ఈ విషయాన్ని చేపడతానన్నారు.

Exit mobile version