గత శుక్రవారం అంటే జూలై 30న ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘తిమ్మరుసు’కు మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్లను పుల్ చేసేంత మాస్ అప్పీల్ హీరో సత్యదేవ్ కు లేకపోవడంతో కలెక్షన్లు ఓ మాదిరిగానే ఉన్నాయి. అలానే ఈ సినిమాతో పాటు విడుదలైన ‘ఇష్క్’కు నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో ఎవరూ ఆ మూవీ గురించి చర్చించడం లేదు. ఇక ఈ రెండు సినిమాతో పాటు వచ్చిన మరో మూడు సినిమాల గురించి కూడా జనాలు పట్టించుకోవడం లేదు.
తెలంగాణలో నూరు శాతం ఆక్యుపెన్సీ ఉన్నా, ఆంధ్రలో యాభై శాతం ఆక్యుపెన్సీనే ఉన్నా… ఇలాంటి సినిమాలకు తేడా ఉండదని చెబుతున్నారు. ఆ మధ్య కొంతమంది ఎగ్జిబిటర్స్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని విడివిడిగా కలిసి, టిక్కెట్ రేట్లు పెంచమని విన్నవించుకున్నారు. పైకి సానుకూలంగానే స్పందించినట్టు కనిపించినా, నగరాలలోని థియేటర్ల టిక్కెట్ రేటు పెంచే విషయంలో ప్రభుత్వం మరో ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది. బి, సి సెంటర్స్ లోని థియేటర్ల టిక్కెట్ రేట్ విషయంలో కొంత మెత్తబడవచ్చని వార్తలు వస్తున్నాయి. గత నెల 30న ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం పది శాతం థియేటర్లు మాత్రమే తెరచుకున్నాయి. దాంతో ఈ నెల మొదటివారంలో విడుదల కాబోతున్న ఏడు చిత్రాల పరిస్థితి ఏమిటనేది అగమ్య గోచరంగా ఉంది. పైగా ఆంధ్రలో రాత్రి కర్ఫ్యూను ఈ నెల 14 వరకూ పొడిగించారు. అందువల్ల కేవలం మూడు ఆటలే ప్రదర్శించాల్సిన పరిస్థితి.
జూలై 30న విడుదలైన సినిమాలకు పెద్దంత ఆదరణ లేకపోయినా… చిన్న సినిమాలు మాత్రం ఆగస్ట్ 6న విడుదలకు సిద్ధమైపోతున్నాయి. 5వ తేదీ ఆంగ్ల అనువాద చిత్రం ‘ది సూసైడ్ స్క్వాడ్’ విడుదల కాబోతుండగా, 6వ తేదీన ఏకంగా ఆరు సినిమాలు థియేటర్ల ముందు క్యూ కడుతున్నాయి. ఇందులో కిరణ్ అబ్బవరం నటించిన ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’తో పాటు శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ కూడా ఉంది. వీటితో పాటే ‘మెరిసే మెరిసే, మ్యాడ్, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, క్షీర సాగర మధనం’ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
మరి ఆంధ్రాలో థియేటర్లు ఇప్పటికైతే పదిశాతం తెరిచారు… ఆగస్ట్ 6 నాటికి మరో పది శాతం తెరిచే ఆస్కారం ఉందని అక్కడి ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. మరి అదే జరిగితే… ఇలా మొక్కుబడిగా తెరచుకునే థియేటర్లతో పంపణీదారులు, నిర్మాతలకు ఎలాంటి లాభం ఉండదు. ఒకవేళ జగన్ ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంచడంతో పాటు ఆక్యుపెన్సీని నూరు శాతానికి అనుమతిస్తే, ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్’ వంటి సినిమాలు రిలీజ్ అయితే కొంతలో కొంత జనాలు థియేటర్లకు వచ్చే ఆస్కారం ఉంటుంది.