కరోనా మహమ్మారి మొదట చైనాలోని వూహాన్ నగరంలో బయటపడింది. అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి లక్షలాది మంది మృతి చెందారు. వైరస్ రూపాంతరం చెంది బలాన్ని పెంచుకుంటూ ఎటాక్ చేస్తున్నది. చైనాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్నది. ఇకపోతే, అటు చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రష్యాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ వెయ్యి మంది కరోనాతో మృతి చెందుతున్నారు అంటే అక్కడ తీవ్రత ఎంత అధికంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
Read: థానే మున్సిపల్ కార్పోరేషన్ కీలక నిర్ణయం: వ్యాక్సిన్ తీసుకోకుంటే…
చైనా, రష్యా సరిహద్దుల్లో ఉన్న హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్‌లో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీహే నగరంలో కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయితే, కరోనా మూలాలు కనుగొనేందుకు అక్కడి అధికారులు సిద్ధం అయ్యారు. కరోనా వ్యాప్తికి కారణమైన వాటికి సంబంధించిన కీలక ఆనవాళ్లు చెప్పిన వారికి 15,500 డాలర్లు బహుమానంగా అందిస్తామని హీహే మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది. ఒకవేళ తెలిసి కూడా ఆనవాళ్లను బయటపెట్టకుండా, దాచిపెట్టాలని చూస్తే వారికి కఠిన శిక్ష విధిస్తామని మున్సిపల్ అధికారులు ప్రకటించారు.