విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. టూటౌన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందన్న విషయంపై పోలీసులకు స్పష్టత అందాల్సి ఉంది. చెడ్డీ గ్యాంగ్ సంచారంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వల్ల ఎవరికైనా నష్టం కలిగితే ప్రజలు వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మరోవైపు విజయవాడలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. చిట్టి నగర్ చనుమోలు వెంకటరావు ఫ్లైఓవర్ సమీపంలోని శివదుర్గ ఎన్‌క్లేవ్‌లోని ఓ ఇంట్లో దొంగలు ప్రవేశించి డబ్బు, బంగారం చోరీ చేశారు. సోమవారం ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని బాధితులు కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శివదుర్గ ఎన్‌క్లేవ్ ఫ్లాట్ నెంబర్ G 18లోని మొదటి అంతస్థులో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే చోరీ జరిగిన ఇంట్లోని వారు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని వారు తెలిపారు. దొంగతనానికి పాల్పడినవారిని చెడ్డీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.