టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ నిర్వహించే మదర్సాపై వక్ఫ్ బోర్డు అధికారులు దౌర్జన్యం రాజకీయ కక్ష సాధింపేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కక్ష సాధింపునకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, మదర్సాలపై దాడులకు పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. వైసీపీ నేతల కక్షసాధింపు చర్యలకు గుడి, బడి అనే వ్యత్యాసం కూడా లేదా..? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు విద్యనందిస్తున్న మదర్సాను సీజ్ చేయడం దుర్మార్గమన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజూ రాష్ట్రంలో ఏదోక చోట మైనారీటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, మదర్సా స్థలాలపై ప్రభుత్వం కన్ను పడిందని ఆయన ఆరోపించారు. వేలాది ఎకరాల వక్ఫ్ భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, దురుసుగా వ్యవహరించిన వక్ఫ్ బోర్డు అధికారి మహబూబ్ బాషాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్దుల భవిష్యత్తు దృష్ట్యా మదర్సాను యధావిధిగా కొనసాగించాలన్నారు.