భారత్‌ను ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు డెంగీ వ్యాధి కలకరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా డెంగీ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో గత ఏడాది ఇదే నెలలో నమోదైన డెంగీ కేసుల కంటే ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. ఈ జాబితాలో కేరళ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. కేంద్రం చేపట్టిన చర్యలతో డెంగీ నివారణ, వ్యాప్తిని తగ్గించేలా సెంట్రల్ మెడికల్ టీమ్స్ తగిన చర్యలు తీసుకోనున్నాయి.
Read Also: తగ్గేదే లే.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో డెంగీ పరిస్థితులపై ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్షించారు. దీంతో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక టీమ్‌లను పంపాలని నిర్ణయించగా.. కేంద్ర ఆదేశాల మేరకు బుధవారం సదరు టీమ్‌లు రాష్ట్రాలకు వెళ్లాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 1,16,991 డెంగీ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ ఏడాదిలో 1,530 డెంగీ కేసులు బహిర్గతం అయ్యాయి. వీటిలో ఒక్క అక్టోబర్ నెలలోనే 1,200 కేసులు వెలుగు చూశాయి.