Site icon NTV Telugu

గుడ్ న్యూస్.. తగ్గిన సిమెంట్ బస్తాల ధరలు

సొంతిల్లు కట్టుకోవాలనుకునే వారికి సిమెంట్ కంపెనీలు ఊరట కలిగించే వార్తను అందించాయి. 50 కిలోల బస్తాపై రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గిస్తున్నట్లు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.40 తగ్గింది. తమిళనాడులో రూ.20 తగ్గగా… కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బస్తా ధర రూ.30 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. తాజా ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో సిమెంట్ బస్తా బ్రాండ్‌ను బట్టి రూ.280 నుంచి రూ.320కి లభించనుంది.

Read Also: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు హీరో ప్రభాస్ రూ. కోటి విరాళం

ధరలు తగ్గించిన సిమెంట్ కంపెనీల జాబితాలో ఆల్ట్రాటెక్, అంబుజా, రామ్ కో, సాగర్ సిమెంట్స్, చెట్టినాడ్, ఇండియా సిమెంట్స్, హెడల్ బర్గ్, ఎన్ సీఎల్ ఇండస్ట్రీస్, దాల్మియా భారత్, ఓరియంట్ సిమెంట్స్, శ్రీ సిమెంట్ వంటి సంస్థలు ఉన్నాయి. వాస్తవానికి సిమెంట్ కంపెనీలు నవంబర్ నెలాఖరులో ధరలను పెంచాలని భావించాయి. అయితే ఆశించినంత డిమాండ్ లేకపోవడం, డీలర్లు వ్యతిరేకించడంతో సంస్థలు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాయి. కాగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో నిర్మాణ రంగం నెమ్మదించింది. ఈ నేపథ్యంలో సిమెంట్ వంటి వస్తువులకు గిరాకీ తగ్గిపోయింది.

Exit mobile version