Business Headlines: పెరిగిన జీఎస్టీ రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. లేబుల్ వేసిన ఫుడ్ ఐటమ్స్‌తోపాటు రూమ్ రెంట్ ఐదు వేల రూపాయలకు పైగా ఉన్న ఆస్పత్రుల బిల్లులపై అదనంగా ఐదు శాతం జీఎస్టీని ఇవాళ్టి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా ప్యాక్ చేసిన గోధుమ పిండి, పనీర్, పెరుగు, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తులకీ ఇది వర్తిస్తుంది.
25-30 శాతం పెరిగిన నియామకాలు
వచ్చే నెలలో పండగ సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు పాతిక నుంచి 30 శాతం వరకు పెరిగాయి. డిమాండ్‌కి తగ్గట్లు సర్వీసులను అందించేందుకు ఇ-కామర్స్, కన్జ్యూమర్, రిటైల్, గిఫ్టింగ్ మరియు హాస్పిటాలిటీ సంస్థలు స్టాఫ్‌ని పెంచుకున్నాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల విరామం అనంతరం ఈసారి రిక్రూట్మెంట్లు ఊపందుకోవటం విశేషం.
అమెరికాలో భారీగా నిరుద్యోగ క్లెయిమ్‌లు
అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. వారం రోజుల్లోనే 9 వేలు పెరగటంతో మొత్తం సంఖ్య 2 లక్షల 44 వేలకు చేరింది. గత వారం సవరించని లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2 లక్షల 35 వేలు మాత్రమే. కాగా ఈ నిరుద్యోగ క్లెయిమ్‌ల్లో పెరుగుదల 8 నెలల గరిష్టమని కార్మిక విభాగం గణాంకాలు చెబుతున్నాయి.
నాలుగేళ్లలో పెరిగిన రైతుల ఆదాయం
గడచిన నాలుగేళ్లలో రైతుల సగటు ఆదాయం 1 పాయింట్ 3 నుంచి 1 పాయింట్ 7 రెట్ల వరకు పెరిగింది. 2018 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2022 నాటికి ధాన్యం ఎగుమతులు 50 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. దీంతో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 14 పాయింట్ 2 శాతం నుంచి 18 పాయింట్ 8 శాతానికి చేరినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.
ఇంకా తగ్గుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు మరింత తగ్గుతున్నాయి. డాలర్ బలపడటంతోపాటు అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, అత్యధిక ద్రవ్యోల్బణం తదితర ప్రభావాలు పసిడి మీద పడ్డాయి. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ ఒక శాతానికి పైగా పడిపోయాయి. ఫలితంగా పది గ్రాముల బంగారం ధర 50 వేల 107 రూపాయలు పలికింది. బులియన్ మార్కెట్‌లో పసిడి రేట్లు నేల చూపులు చూశాయి.