BJP District President: గుజరాత్.. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి కీలకమైన రాష్ట్రం. అక్కడ ఆ పార్టీదే చానాళ్లుగా అధికారం. బీజేపీ అగ్రనేత, ప్రధాని మోడీ గుజరాత్‌కి చెందినవారే. ఆ రాష్ట్రంలో ఏడు దశాబ్దాలుగా మద్య నిషేధం అమలవుతోంది. అయితే ఆ నిషేధాన్ని అపహాస్యం చేసేలా అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడే ప్రవర్తించటం గమనార్హం. గిరిజనులు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోటౌడేపూర్ జిల్లాలో రూలింగ్ పార్టీ బీజేపీ ప్రెసిడెంట్ పేరు రష్మీకాంత్ వాసవ. రాష్ట్రపతిగా గిరిపుత్రిక ద్రౌపదీ ముర్ము విజయం సాధించిన నేపథ్యంలో లేటెస్టుగా ఏర్పాటుచేసిన మీటింగ్‌కి హాజరయ్యాడు.
వస్తూ వస్తూనే ఫుల్లుగా మందేసి వచ్చాడు. కారు దిగి నడుచుకుంటూ వచ్చేటప్పుడే తూలుతూ కనిపించాడు. కింద పడబోయి పక్కనున్న వ్యక్తిని పట్టుకున్నాడు. దీంతో అతను రష్మీకాంత్ వాసవ వైపు విచిత్రంగా చూశాడు. స్టేజీ మీదికి వెళ్లేటప్పుడు సైతం రష్మీకాంత్ తోటి వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఇక వేదిక పైకి ఎక్కాక టేబుల్ పక్కనున్న మొదటి కుర్చీలోనే కూర్చున్నాడు. కూర్చున్నాడు అనటం కంటే కూలబడ్డాడు అనటం కరెక్టేమో. కుర్చీలో అలా ఆసీనుడయ్యాడో లేదో ఇక చూడాలి అతని ఆపసోపాలు. కుదురుగా ముందుకి చూడలేకపోయాడు. అసలు కళ్లు తెరిస్తే ఒట్టు.
read more: President of India : ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ముర్ము ఎన్నిక
మెడ వంకర టింకరగా తిరగటం మొదలుపెట్టింది. ఇట్లయితే లాభం లేదనుకొని పూర్తిగా కునుకు తీయటం ప్రారంభించాడు. నోటి నుంచి సొల్లు కారుతున్నట్లు అనుమానం వచ్చిందేమో. మధ్యలో కండువాతో మూతి తూడ్చుకున్నాడు. ఈ మీటింగ్‌లో రాష్ట్ర మంత్రి నిమిషా సుతార్ కూడా పాల్గొనటం గమనార్హం. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజీనామా చేయాలంటూ రష్మీకాంత్‌ని ఆదేశించటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పదవి నుంచి దిగిపోయాడు. ఈ వీడియో నేపథ్యంలో ఆప్, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సీఆర్ పాటిల్ ఆదేశించటంతో రిజైన్ చేసినట్లు రష్మీకాంత్ వాసవ తెలిపారు. ఈ వీడియోపై స్పందించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం తెగ ఇబ్బంది పడింది. చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయింది. రాష్ట్రంలో అసలు మద్య నిషేధం అమలవుతోందా? అని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగ్‌దీష్ ఠాకూర్ అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. ద్రౌపదీ ముర్మును అత్యున్నత రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టడాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవాలనుకున్న బీజేపీకి ఈ ఘటన మింగుడు పడటంలేదని చెప్పొచ్చు.