కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్నింటితో పాటు సినిమా పరిశ్రమపై కూడా బాగానే పడింది. చాలా రోజులు థియేటర్లు మూతపడడంతో పాటు ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలన్నీ కుప్పలు తెప్పలుగా వాయిదా పడ్డాయి. రీసెంట్ గా థియేటర్లు రీఓపెన్ కావడంతో వారానికి కనీసం 5 సినిమాల చొప్పున బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. థియేటర్లను మళ్ళీ తెరచినప్పటి నుంచి నిన్నటి వరకు 15 నుంచి 20కి పైగానే సినిమాలు విడుదలయ్యాయి. అందులో కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో మొదటి కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన “ఎస్ఆర్ కళ్యాణమండపం” కాగా, రెండవది “రాజరాజ చోర”, నిన్న విడుదలైన సుధీర్ బాబు “శ్రీదేవి సోడా సెంటర్”. రానున్న నెల టాలీవుడ్ కు కీలకంగా మారనుంది.
Read Also : తగ్గేదే లే… “పుష్ప” అప్డేట్ అదిరిపోయింది
సెప్టెంబర్ లో వరుస సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ సినిమాల విడుదల తేదీలు వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ప్రకటించిన మూవీలు మరికాస్త ముందుకు వెళ్లనున్నాయి అనేది తాజా టాక్. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినిమా పెద్దల సమావేశం. టాలీవుడ్ ప్రముఖులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల గురించి సవరించిన కొత్త జిఓ జారీ చేస్తుందని భావిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రస్తుతం అందుబాటులో లేనందున సమావేశం సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3న రిలీజ్ డేట్ ప్రకటించిన గోపీచంద్ “సీటీమార్” వాయిదా పడింది. గత రాత్రి ఇదే విషయాన్ని మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేశారు. జిఓ జారీ చేస్తే ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావచ్చు. సెప్టెంబర్ 10న ప్లాన్ చేసిన నాగ చైతన్య “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24న విడుదల అవుతుంది. మరికొన్ని సినిమాల విడుదల ప్రణాళిక సెప్టెంబర్ మొదటి వారం తర్వాత తేలుతుంది. మరోవైపు సెప్టెంబర్‌లో నాని “టక్ జగదీష్”, నితిన్ “మాస్ట్రో” డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానున్నాయి. ఆ తరువాత దసరాకు సినిమాల జాతర జరగనుంది. బాలకృష్ణ “అఖండ”, శర్వానంద్, సిద్ధార్థ్ “మహా సముద్రం”, అక్కినేని అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, మెగా హీరో వైష్ణవ్ తేజ్ “కొండ పోలం”, “రౌడీ బాయ్స్” దసరా సెలవుల్లో థియేటర్లలోకి రానున్నాయి.