అమరావతి రాజధాని రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. వారి పాదయాత్ర నేటితో 31వ రోజుకు చేరగా.. ఈరోజు నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోకి రాజధాని రైతుల పాదయాత్ర ప్రవేశించగా… వారికి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈరోజు రైతుల పాదయాత్రలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు కూడా పాల్గొన్నారు.
Read Also: తిరుమల దర్శనాలను వాయిదా వేసుకోండి: టీటీడీ ఛైర్మన్
అయితే పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు పోలీసులు షాకిచ్చారు. పాదయాత్రలో క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలను వారు అడ్డుకున్నారు. ప్రచార రథాలను వెంట తీసుకువెళ్లరాదంటూ వారు స్పష్టం చేశారు. దీంతో ప్రచార రథాలను అనుమతించాలని పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రచార రథాలను పోలీసులు అడ్డుకోవడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి అమరావతి రైతులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రచార రథాలను అడ్డుకోవడం సరికాదని.. తమ మనోభావాలు దెబ్బతినేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఆంక్షల పేరుతో సంఘీభావం తెలుపుతున్నవారిని పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోయారు. కోర్టు అనుమతి ప్రకారమే తమ పాదయాత్ర కొనసాగుతుందన్నారు. కాగా రైతుల ఆందోళనతో నెల్లూరు-పొదలకూరు మధ్య వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
