ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం షాకిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యం కాదంటూ సీఎస్ కు లేఖ రాసింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. ఇవాళ సచివాలయంలో సీఎస్ ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించారు ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి ఆస్కార్ రావు. పలు దఫాలుగా ఉద్యోగ సంఘాలతో చర్చించినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు రాలేదని పేర్కొంది ఏపీజీఈఏ.
అశుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్యనించింది. 2010లోనే అప్పటి పీఆర్సీ సిఫార్సుల మేరకు 39 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సిందని అభిప్రాయపడింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని పొరుగు రాష్ట్రంలోనూ 30 శాతంగా పీఆర్సీ ఉందని తెలిపింది ఉద్యోగుల సంఘం.
వేతన సవరణ సంఘం సిఫార్సు చేసినట్టుగా ఇంటి అద్దెభత్యం, సీసీఏలు యథాతథంగా కొనసాగాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చే భత్యాలు కొనసాగించాలని కోరింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం.70-79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలని కోరింది ఏపీ జీఈఏ.
పెండింగ్ లో ఉన్న 5 డీఏలను తక్షణం చెల్లించాలని కోరింది ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ. తక్షణం సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది ఏపీ జీఈఏ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు తక్షణం ప్రోబెషన్ డిక్లేర్ చేయాలని సీఎస్ కు రాసిన లేఖలో కోరింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం. 1993 నుంచి పని చేస్తున్న 5 వేల మంది కంటింజెంట్ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్దీకరించాలని కోరింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సీఎస్ కు ఇచ్చిన లేఖలో పేర్కొంది ఏపీజీఈఏ.