చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదని అర్థమైందని… అందుకే భార్య పేరుతో ప్రజల్లో సింపతీ పొందాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిని తాము ఏమీ అనలేదని.. ఒకవేళ అని ఉంటే రికార్డులు చూపించాలని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. రాజకీయంగా తెలివిగల వాడు కాబట్టే.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలిసి చంద్రబాబు భార్య పేరుతో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనేక కుటుంబాలను ఏడ్పించిన వ్యక్తి చంద్రబాబు అని… ఆయన ఏడవడం ఏంటి? అంటూ అంబటి రాంబాబు విస్మయం వ్యక్తం చేశారు.
Read Also: నాడు జగన్… నేడు చంద్రబాబు..సభలో సీన్ రిపీట్
బాబాయ్, గొడ్డలి, చెల్లెలు సంగతి తేల్చాలని చంద్రబాబు అన్నప్పుడు తాము కూడా వంగవీటి రంగ, మాధవరెడ్డి హత్య గురించి కూడా తేలాలని చెప్పామన్నారు. తన అమ్ములపొదిలో అస్త్రాలన్నీ అయిపోయాక చివరగా సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించేందుకు చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చారని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని.. టీడీపీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్ వైపు ఉన్నారని… చంద్రబాబు పరిస్థితి ఆడలేక మద్దెలదరువు లాగా ఉందన్నారు. చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలను ప్రజలను గమనించాలని… ప్రజలు తగిన సమయంలో చంద్రబాబుకు మళ్లీ బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబుకు ధైర్యముంటే తమను రాజకీయంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు కన్నీళ్లు వచ్చాయో లేదో తాను చూడలేదని.. అసెంబ్లీలో మాత్రం చంద్రబాబు నవరసాలను చూపించారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.