ప్రపంచ దేశాలను ఇప్పటికే వణికిస్తూనే ఉంది కరోనా మహమ్మారి.. భారత్‌లో కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడమే కాదు.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది.. ఇక, ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్ కేసులు అదుపులోకి వచ్చిందేలేదు.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా ఉన్నాయి.. ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితులపై తాజాగా హెచ్చరించింది ఎయిమ్స్.. వచ్చే 6 నుంచి 8 వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని.. అలా అయితేనే కోవిడ్ నుంచి మనం బయటపడి మునుపటి పరిస్థితులకు వెళ్లొచ్చు అన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా.
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని హెచ్చరించిన రణ్‌దీప్ గులేరియా.. దానిని నుంచి బయటపడాలంటే రాబోయే పండగల సీజన్‌లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక, కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. వ్యాక్సిన్ రోగాన్ని తీవ్రం కాకుండా చూస్తుందని, టీకా తీసుకున్నవారికి ఎవరికైనా ఒకవేళ కోవిడ్ సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు.. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారి ద్వారా.. వ్యాక్సిన్ తీసుకోనివారికి కోవిడ్ సోకితే అలాంటివారిలో తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు.. ఈ నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. మరోవైపు ప్రస్తుతం దేశంలో ఆశావహ పరిస్థితులున్నాయని, రోజురోజుకీ మహమ్మారి తిరోగమనంలో సాగుతోందని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేశారు గులరియా.. పండగల సీజన్ మళ్లీ కేసులను పెంచే పరిస్థితికి తీసుకురాకూడదన్న ఆయన.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు, ఎక్కువ మంది ఒక్కచోట చేరడాన్ని నిరోధించాలన్నారు.
