5G Spectrum: టెలీకమ్యూనికేషన్స్ రంగంలో ఐదో తరం తరంగాల సేవలకు నేడు మరో అడుగు ముందుకు పడనుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి వేళయింది. ఈ ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఆరంభంకానున్న ఈ వేలం ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. వివిధ సంస్థలు తమ అవసరానికి తగిన ఫ్రీక్వెన్సీ కోసం బిడ్లను దాఖలు చేస్తాయి. ఫ్రీక్వెన్సీ ఆధారంగా మొత్తం 9 బ్యాండ్లను వేలానికి అందుబాటులో ఉంచారు. అన్ని బ్యాండ్లలోనూ కలిపి మొత్తం 72 గిగా హెర్ట్‌జ్‌ల స్పెక్ట్రాన్ని విక్రయిస్తారు.
వేలంలో సొంతం చేసుకునే స్పెక్ట్రాన్ని 20 ఏళ్ల పాటు వాడుకోవచ్చు. ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలనుకుంటే కనీసం పదేళ్లు ఆగాలి. ప్రస్తుతం మనం వాడే స్మార్ట్ ఫోన్లు 4జీ స్పెక్ట్రం ఆధారంగా పనిచేస్తున్నాయి. ఇంతకన్నా పది రెట్లు వేగంగా పనిచేయటానికి 5జీ స్పెక్ట్రం వీలు కల్పిస్తుంది. ఈ స్పెక్ట్రమ్ కోసం ప్రధానంగా రిలయెన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ పాల్గొంటున్నాయి. 5జీ స్పెక్ట్రం వేలం ఇవాళ, రేపు రెండు రోజులు పడుతుందని చెబుతున్నారు.
read also: TJ Gnanavel: ‘జై భీమ్’ డైరెక్టర్ కొత్త సినిమా.. ఈసారి భర్తను చంపినవాడిపై భార్య న్యాయపోరాటం
టెలికం సంస్థలే కాకుండా టెక్నాలజీ కంపెనీలు కూడా తమ సొంత అవసరాల (నెట్‌వర్క్) కోసం స్పెక్ట్రమ్‌ని వాడుకునేందుకు పర్మిషన్ ఇవ్వటం ఈ వేలం ప్రత్యేకత అని నిపుణులు చెబుతున్నారు. స్పెక్ట్రం కనీస విలువ దాదాపు 4.3 లక్షల కోట్లు అని అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నారు. వేలం పూర్తయ్యాక 5జీ సేవలు వచ్చే నెల(ఆగస్టు)లో గానీ ఆపైవచ్చే నెల(సెప్టెంబర్)లో గానీ అందుబాటులోకి రానున్నాయని అంటున్నారు. టెలీకమ్యూనికేషన్లతోపాటు వివిధ రకాల వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీసులకు స్పెక్ట్రం అవసరం.
ఈ స్పెక్ట్రాన్ని తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి అధిక ఫ్రీక్వెన్సీ వరకు వివిధ బ్యాండ్లలో విభజిస్తారు. ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగిన తరంగాలు ఎక్కువ డేటాను ఎక్కువ వేగంతో మోసుకెళ్తాయి. తక్కువ ఫ్రీక్వెన్సీ గల తరంగాలకి కవరేజీ ఎక్కువ ఉంటుంది. గానీ వేగం తక్కువ. 2జీ నెట్‌వర్క్‌లో 900, 1800 మెగా హెర్ట్‌జ్ బ్యాండ్‌లను వాడతారు. 3జీలో 900, 2100 మెగా హెర్ట్‌జ్ బ్యాండలను వినియోగించుకుంటారు. 4జీలో 850, 1800, 2300, 2500 మెగా హెర్ట్‌జ్ తరంగాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు 5జీలో తక్కువ శ్రేణి, మధ్య శ్రేణి, అధిక శ్రేణి ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు వేలానికి అందుబాటులో ఉన్నాయి.
తక్కువ శ్రేణిలో 600, 700, 800, 900, 1800, 2300 మెగా హెర్ట్‌జ్; మధ్య శ్రేణిలో 3.3 గిగా హెర్ట్‌జ్, అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 26 గిగా హెర్ట్‌జ్ స్పెక్ట్రాలను వేలం వేయనున్నారు. 600, 700 మెగా హెర్ట్‌జ్, 3.3 గిగా హెర్ట్‌జ్, 26 గిగా హెర్ట్‌జ్ బ్యాండ్లను తొలిసారిగా వేలం వేస్తున్నారు. జియో 800 మెగా హెర్ట్‌జ్, ఎయిర్‌టెల్-వీఐలు 900 మెగా హెర్ట్‌జ్ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయొచ్చని అనుకుంటున్నారు. 1800 మెగా హెర్ట్‌జ్ కోసం మూడు కంపెనీలూ పోటీపడే సూచనలున్నాయి.
5జీ సర్వీసులకి 3.3 గిగా హెర్ట్‌జ్, 26 గిగా హెర్ట్‌జ్ స్పెక్ట్రం కీలకం. వీటిని సీ బ్యాండ్, ఎంఎం వేవ్‌గా పేర్కొంటారు. ఎంఎం వేవ్ తక్కువ రేటుకే లభిస్తుంది. సీ బ్యాండ్ రేట్ ఎక్కువ. 5జీ స్పెక్ట్రం కోసం కంపల్సరీగా అడ్వాన్స్ పేమెంట్ చేయాలనే రూలేం లేదు. 20 వాయిదాల్లో చెల్లించే వీలు కల్పించారు. ప్రతి సంవత్సరం ప్రారంభంలో కడితే సరిపోతుంది. స్పెక్ట్రం యుటిలిటీకీ ఛార్జ్ ఇవ్వాల్సిన పనిలేదు. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న 5జీ స్పెక్ట్రం వేలంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.