సినీ ప్రియులు, థియేటర్ల యజమానులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ఇకపై రాష్ట్రంలో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ఉత్తర్వులు జారీచేసింది. ఈ వంద శాతం ఆక్యూపెన్సీ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది.కరోనా ప్రభావంతో ఇన్ని రోజులూ థియేటర్లలో ఆక్యూపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో థియేటర్ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఇవాళ విడుదల కానున్న మహా సముద్రంతో పాటు, దసరాకు కానుకగా విడుదలవుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి సినిమాలకు లబ్ధి చేకూరుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఇప్పటికీ అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం వాటిపై కూడా ఆంక్షలను సడలించింది. ఇకపై ఏపీలో రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ నిబంధనలు అమల్లో వుంటాయని తాజా ఆదేశాల్లో తెలిపింది. దీంతో సెకండ్ షో సినిమా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రదర్శించుకునేందుకు అవకాశం లభించింది.