మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించనున్న కేంద్ర ప్రభుత్వం
భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2024, డిసెంబర్ 26న 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన సేవలను స్మరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించింది. ఈ సమాచారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా వెల్లడైంది. మాజీ ప్రధాని స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హోం మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో, దేశానికి మన్మోహన్ సింగ్ అందించిన అమూల్యమైన సేవలను గుర్తించేందుకు ఈ స్మారకాన్ని నిర్మించనున్నట్లు పేర్కొంది. ఆయన సేవలను గౌరవించేందుకు జ్ఞాపకార్థం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ అంశంపై తమ అభ్యర్థనను కేంద్రానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, కేబినెట్ భేటీ తర్వాత స్మారక చిహ్నం కోసం స్థల కేటాయింపుపై నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే, స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించడంలో జాప్యం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది భారత తొలి సిక్కు ప్రధానమంత్రిపై అవమానం కాదా? అని ప్రశ్నించింది.
ప్రజల దర్శనార్థం మాజీ ప్రధాని భౌతికకాయం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల దర్శనార్థం ఉంచారు. ఉదయం 8 గంటలకు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తీసుకురాగా.. 9.30 గంటల వరకు ఆయనకు నివాళులర్పించేందుకు ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం కల్పించారు. నేడు ఉదయం 11.45 గంటలకు న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ప్రధాని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించే స్థలంలో అంత్యక్రియలు నిర్వహించాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు.
నేడు కడపకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్నారు. అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. గాలివీడులో ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు. అనంతరం గాలివీడు నుంచి రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. భోజన విరామం తర్వాత రోడ్డు మార్గాన కడప ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి గన్నవరం వెళ్ళనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
కడప జిల్లాలో తీవ్ర విషాదం.. రైతు కుటుంబం సూసైడ్, నలుగురు మృతి
కడప జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక నాగేంద్ర అనే రైతు కుటుంబం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొదట తన ఇద్దరు పిల్లలకు వ్యవసాయ పొలానికి చెందిన గేటుకు ఉరివేసి చంపి ఆపై భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు. మృతులు.. నాగేంద్ర, భార్య వాణి, కుమార్తె గాయత్రీ(14), కుమారుడు భార్గవ్(15)గా గుర్తించారు. అయితే, గతంలో 8 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయగా నష్టాలు వచ్చాయి. డైరీ ఫార్మ్ ఓపెన్ చేయగా 5 ఏనుములు మిస్సింగ్ అయ్యాయి.. ఆపై గోర్ల వ్యాపారం చేయగా ఒకేసారి 48 గొర్రెలు మృతి చెందాయి.. ప్రస్తుతం కొర్ర సాగు చేయగా వర్షాలకు పంట పూర్తిగా దెబ్బ తిన్నది.. దాదాపు 30 లక్షలు అప్పులు కాగా వాటిని తీర్చాలని వాళ్ళు వేధింపులకు గురి చేయడంతో.. ఆ బాధలు తాళలేక కుటుంబంతో కలిసి మొదట గేటుకు పిల్లలకు ఉరివేసిన తర్వాత భార్యాభర్తలు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విచారణకు రండి.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు..
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇవాళ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి 7 న ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. పెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటికే గుర్తించిన ఈడీ. FEOకు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది.
మరోసారి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలుచోట్ల కమ్ముకున్న పొగమంచు
తెలంగాణలో చలి వాతావరణం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలో రెండు రోజులు వానలతో చలి తీవ్రత ఎక్కువగా పెరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోసారి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పొగమంచు కమ్ముకుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ 13.1, నల్లవల్లి 14.2, అల్గోల్ 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ జిల్లా శివంపేట 13.9, కాగజ్ మద్దూర్ 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ 14.9, కొండపాక 15.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యాయి.
‘గేమ్ ఛేంజర్’ ఇన్ సైడ్ టాక్.. సోషల్ మీడియా షేక్
రీసెంట్‌గా అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా విచ్చేసిన సుకుమార్.. ‘తాను చిరంజీవిగారితో కలిసి సినిమా చూశాను. ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ. ‘రంగస్థలం’ మూవీకి చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాం. కానీ ఈ మూవీ క్లైమాక్స్ చూసినప్పుడు మరోసారి నాకు అదే ఫీలింగ్ కలిగింది. అంతకన్నా ఎక్కువే అనిపించింది. చరణ్ చాలా బాగా చేశాడు. ఈసారి కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇది తప్పితే ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ సినిమా ఎలా ఉంటుందనే టాక్ పెద్దగా బయటికి రాలేదు. ఇంకా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోలేదు. కానీ గేమ్ ఛేంజర్ రివ్యూ ఇదే, సినిమా ఇలా ఉంటుంది, ఆలా ఉంటుందనే టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సుకుమార్ చెప్పినట్టుగానే ఈ సినిమా అవుట్ పుట్ మామూలుగా రాలేదని ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకెండాఫ్ పీక్స్‌లో ఉందంటూ చర్చించుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కాలేజ్ సీన్స్ అదిరిపోయాయని, సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని అంటున్నారు. ఇక రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉందని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
తగ్గేదేలే.. పుష్ప స్టైల్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెలెబ్రేషన్స్ అదుర్స్..
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కొనసాగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ సెంచరీతో 474 పరుగులు చేసింది. ఇక మూడో రోజు భారత్‌కు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా జోడీ శుభారంభం అందించినా, ఆట ప్రారంభమైన తొలి గంటలోనే దూకుడు ప్రదర్శించే ప్రయత్నంలో పంత్ వ్యక్తిగత స్కోరు 28 వద్ద ఔటయ్యాడు. దీని తర్వాత నాథన్ లియాన్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు. 7 వికెట్ల పతనం తర్వాత నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. నితీష్ రెడ్డి తన టెస్ట్ కెరీర్‌లో మొదటి అర్ధ సెంచరీని సాధించాడు. దాంతో పాటు టీమిండియా ఫాలో ఆన్‌ను తప్పించుకోగలిగింది. ప్రస్తుతం క్రీజులో నితీష్ 69 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 34 పరుగులతో క్రీజులో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా టెస్ట్ క్రికెట్లో తన మొదటి హాఫ్ సెంచరీ అందుకున్న నితీష్ కుమార్ రెడ్డి పుష్ప స్టైల్ లో సెలబ్రేషన్స్ చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత తన బ్యాట్ తో తగ్గేదేలే అన్నట్లుగా సింబాలిక్ గా చూపిస్తూ తన దూకుడునూ ప్రపంచానికి చాటి చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.