NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

స్వాతంత్య్రం కంటే ముందు నుంచి సింగ‌రేణి.. సంస్థ విశ్వవ్యాప్తంగా విస్తరించాలి
సింగ‌రేణి సంస్థ దేశ స్వాతంత్య్రం కంటే ముందు నుంచి ఉన్న సంస్థ.. ఎంతో నిష్ణాతులైన, స‌మ‌ర్ధులైన సిబ్బంది ఉన్న సంస్థ.. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగ‌రేణి ఇత‌ర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాల‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క సూచించారు. శని వారం బాబాసాహెబ్ అంబేద్కర్ స‌చివాల‌యంలో సింగ‌రేణి సంస్థ భ‌విష్యత్ ప్రణాళిలు, అభివృద్ధిపై జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధ‌న వ‌నరులకు కాలం చెల్లుతోంది. భ‌విష్యత్ అంతా విద్యుత్ బ్యాటరీలే కేంద్రంగా మార‌బోతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో లిథియం వంటి అనేక మూల‌కాల అన్వేష‌ణ‌, వాటిని వెలికితీయ‌డంపై సింగ‌రేణి దృష్టి సారించాల‌ని చెప్పారు. సింగ‌రేణి సంస్థ త‌న మ‌నుగ‌డ‌ను కొన‌సాగిస్తూ ఆస్తుల‌ను సంప‌ద‌ను సృష్టించుకోవాల‌ని సూచించారు. త‌ద్వారా రాష్ట్ర ప్రజ‌ల సంప‌దైన సింగ‌రేణి ద్వారా ఉద్యోగ‌-ఉపాధి అవ‌కాశాల కల్పన జ‌రుగుతుంద‌ని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సింగ‌రేణి సంస్థ మెట‌ల్స్, నాన్ మెటల్స్ మైనింగ్ లో ప్రపంచ‌వ్యాప్తంగా విస్తరించాల‌న్నారు. ఇందుకోసం అవ‌స‌ర‌మైతే ఒక క‌న్సెల్టెన్సీని నియ‌మించుకోవాల‌ని సింగ‌రేణి అధికారుల‌కు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గ్రీన్ ఎన‌ర్జీలో భాగంగా రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజ్ ప‌వ‌ర్ ప్లాంట్ ల‌ను ఏర్పాటుకు స‌న్నాహ‌కాలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రికి సింగ‌రేణి అధికారులు వివ‌రించారు. ఇందుకు సంబంధించి పూర్తీ డీపీఆర్ లు రూపొందిస్తున్నామ‌ని.. త్వర‌లోనూ వాటిని ప్రభుత్వానికి అందిస్తామ‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్కకు వివ‌రించారు. ఒరిస్సాలోని నైనీ బ్లాక్ లో బొగ్గు ఎప్పటినుంచి ఉత్పత్తి ఆరంభిస్తార‌ని ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.

సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై కేసులు
సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపివేశారని బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్, వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.. పోలీసులు. ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి కాన్వాయ్ తో బయలుదేరారు. కాగా.. రుణమాఫీ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నినాదాలతో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేసిందని.. హామీ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్‌ఎస్‌ నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీల చింపివేశారు. ఈ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫ్లెక్సీల చింపివేతపై హరీష్ రావు ట్వీట్ చేశారు. మాజీ మంత్రిపైనే దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తాం
దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. రూ. రెండు లక్షల లోపు ఉన్న వారికే రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఎవరికైనా రుణ మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తాం. బీఆర్ఎస్ తరహాలో రియల్ ఎస్టేట్ భూములకు రుణమాఫీ చేయం. బండి సంజయ్ మాటలు వింతగా ఉన్నాయి. కేటీఆర్ కు పీసీసీ పదవి అని బండి సంజయ్ అనడంలో అర్థం ఉందా? కాలేశ్వరంపై విచారణ జరుగుతోంది. ఎవరికైనా చట్ట ప్రకారమే శిక్షలు పడతాయి. తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల నిధుల కింద 1800 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేయాలి. అయిదేళ్ళ నుంచి ఈ నిధులు పెండింగ్ లో ఉన్నాయి. బీఆర్ఎస్ పదేళ్లలో 20 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తే, మా ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు.” అని ఎంపీ వ్యాఖ్యానించారు. కొందరు రైతులకు రుణమాఫీ కాలేదనే విషయం తమకూ తెలుసని.. రుణ మాఫీ ఫిర్యాదులపై కలెక్టర్ ఆఫీసులో “ప్రత్యేక సెల్” ఏర్పాటు చేస్తున్నామని ఎంపీ మల్లు రవి తెలిపారు. “అందరికీ రుణమాఫీ చేసేందుకు బడ్జెట్ కేటాయింపు ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులలో తెలంగాణను ముంచింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేసింది. బీజేపీ జెండా కప్పుకుని చచ్చిపోతానని రేవంత్ రెడ్డి మోడీతో అన్నారని కేటిఆర్ చెప్పడం పిచ్చికి పరాకాష్ట. కేటిఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు.” అని మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం.. స్పెషల్ కలెక్టర్ ఏం చెప్పారంటే..?
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కలకలం రేపుతుంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి కార్యాలయంలో ఘటన చోటు చేసుకుంది. పోలవరం ఎడమ కాలువ భూ సేకరణ పరిహారానికి సంబంధించిన ఫైల్స్ ను తగలబెట్టిన కొందరు సిబ్బంది.. కార్యాలయం బయట అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైన కొన్ని ఫైళ్ళు.. ఈ ఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ చేపట్టింది. కాలి బూడిదైన దస్త్రాలు పరిశీలించింది. అయితే, పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలోని బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయట పడేశామని స్పెషల్ కలెక్టర్ సరళా వందనం తెలిపారు. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు.. సిబ్బంది తగల బెట్టిన కాగితాలు ఉపయోగం లేని మాత్రమే అని స్పెషల్ కలెక్టర్ వెల్లడించారు.

ఈ కొత్త ఇల్లు మాత్రం రాసివ్వడానికి సిద్ధంగా లేను..
దువ్వాడ వాణి రోజుకో రకంగా మాటాడుతున్నారు అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలను‌ ఇంటిపైకి పంపించారు.. టెక్కలి వదిలి వెళ్లాలని మాట్లాడారు.. ఆస్తులపై మాట్లాడారు.. తండ్రిగా నా బాధ్యతను నిర్వహిస్తా.. ఒకవైపు పెద్దమనుషులను పంపిస్తూ.. మరో వైపు కోర్టుకు పోయారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా కూతుళ్ల పేరు మీద సుమారు రూ. 27 కోట్ల ఆస్తులు రాయటానికి సిద్దంగా ఉన్నాను.. కానీ, ‌ఈ కొత్త ఇళ్లు మాత్రం రాసివ్వడానికి సిద్ధంగా లేను చెప్పారు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయవద్దు.. ఓ బంగాళ ఇచ్చాను వాడుకోండి అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. ఇక, 16 నెలల్లో ఖర్చుల కోసం రూ. 40 లక్షలు ఇచ్చాను అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను తెలిపారు. లాయర్ చెప్పడంతో వాణి మాట మార్చారు.. నాటకీయంగానే ప్రస్తుతం మాట మార్చింది.. ఒక్కో రోజు ఒక్కొ ‌కండిషన్.. ఇప్పుడు కొత్తగా కలిసి ఉంటానని చెప్తుంది.. ఇంటిలోంచి తరిమి వేసిన తర్వాత చచ్చానా, బ్రతికానా చూడలేదు.. కుటుంబ పెద్దల ఒడంబడిక ద్వారా ఆస్తులు ఇవ్వాడానికి ఇష్ట పడుతున్నాను.. పిల్లలకు నాపై తప్పుడు మాటలు చెప్పింది.. భర్తను పెద్దమనుషులను వాణి గౌరవించదు.. దువ్వాడ టెక్కలిలో ఉండకుడదు.. రాజకీయంగా పతనం చెయాలన్నది వాణి ఉద్దేశం.. కోర్టులలోనే తేల్చుకుంటామని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.

బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ ఏమన్నారంటే..!
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన తాజాగా మీడియాతో స్పందించారు. ప్రస్తుతం ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందుతున్నాయో తనకు తెలియదన్నారు. అలాగే ఎలాంటి వార్తలు నడుస్తున్నాయో అసలు తెలియదన్నారు. అవి నిజమో కాదో చెప్పలేనని.. తాను ఎక్కడున్నానో అక్కడే ఉన్నానని వాటి గురించి తకేమీ తెలీదని ఆయన చెప్పుకొచ్చారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అనంతరం హేమంత్‌కు బెయిల్ రావడం.. అనంతరం సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ సమయంలో చంపై అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ హేమంత్ కేబినెట్‌లో మంత్రిగా చంపై ప్రమాణస్వీకారం చేశారు. అయితే త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇటీవల బీజేపీ ఎంపీ దీపక్ ప్రకాశ్‌లో మాట్లాడుతూ.. చంపైనే అన్యాయంగా సీఎం పీఠం నుంచి తప్పించారని.. ఆయన చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. చంపై బీజేపీలో చేరే అంశం అధిష్టానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంపై బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు వినపడుతున్నాయి. తాజాగా ఆయన కొట్టిపారేశారు.

కోల్‌కతా వైద్యురాలి ఘటనలో మమతా బెనర్జీకి అఖిలేష్ మద్దతు..
కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఈ కేసుని కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచారు. “ఆమె స్వయంగా ఒక మహిళ, ఆమె ఒక మహిళ బాధను అర్థం చేసుకుంటుంది.” అని అన్నారు. బీజేపీపై విరుచుకపడిన అఖిలేష్, ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, అలా చేయకూడదని అన్నారు. ఈ ఘటనపై వైద్యులు నిరసన తెలుపుతున్నా బీజేపీ మాత్రం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసానికి సమీపంలో దళిత మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అంశాన్ని లేవనెత్తిన ఆయన, దీనిపై బీజేపీ నేతలు మాట్లాడటం లేదని ఆరోపించారు. 69,000 మంది టీచర్ రిక్రూట్మెంట్ కేసులో కొత్త సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి ప్రస్తావిస్తూ.. బాధిత యువతకు ఇప్పుడు న్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వివక్ష సరిదిద్దబడుతోందని అన్నారు. జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ బ్రిజ్‌రాజ్ సింగ్‌లతో కూడిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం జూన్ 2020 మరియు జనవరి 2022లో విడుదల చేసిన సెలక్షన్ జాబితాలను పక్కన పెట్టింది, ఇందులో రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన 6,800 మంది అభ్యర్థులు ఉన్నారు.

ఎయిర్‌షోలో అపశృతి.. సముద్రంలో కూలిన జెట్ విమానం
ఫ్రాన్స్‌లో జరిగిన ఎయిర్‌షోలో అపశృతి చోటుచేసుకుంది. 65 ఏళ్ల పైలట్‌ విమానంతో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదంలో పైలట్‌ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి గురైన ఫోగా మ్యాగిస్టర్‌ జెట్‌ విమానం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తయారైంది. ఈ విమానాన్ని ఫ్రాన్స్‌ ఆర్మీ శిక్షణ కోసం వాడుతోంది. విమానంలో ఎజెక్షన్‌ సీటు లేకపోవడమే పైలట్‌ మృతికి కారణమని చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు రాజ్‌తో ప్రేమ ప్రచారం.. ముంబైలో అలా కనిపించిన సమంత!
నటి సమంత మాజీ భర్త నాగ చైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత బాలీవుడ్ మీడియా ఆయనను ఎక్కువగా ఫాలో అవుతోంది. మరో పక్క సమంత దర్శకుడు రాజ్‌తో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు కూడా వ్యాపించాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆమె ముంబైలో కనిపించడం ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నటుడు నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తోంది. అక్టోబర్ 2021లో పరస్పర విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో సంయుక్తంగా ప్రకటించారు. అప్పటి నుంచి సమంత సింగిల్ స్టేటస్‌ను కొనసాగిస్తోంది. నాగ చైతన్య ఇటీవల నటి శోభిత ధూళిపాళతో ప్రేమాయణం పుకార్ల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన వారం రోజుల్లోనే సమంత కూడా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాజ్ నిడిమోరు-సమంతలు డేటింగ్‌లో ఉన్నారనేది లేటెస్ట్ హాట్ న్యూస్. బాలీవుడ్‌లో ఈ రూమర్ దావానంలా వ్యాపిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ మొదలైన విజయవంతమైన సీరిస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ – డికె భారతదేశం అంతటా ప్రజాదరణ పొందారు. రాజ్ – డికె తెలుగు వారు మరియు సమంతా వారిలో ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు సమాచారం. రాజ్, డీకే దర్శకత్వంలో సమంత మరో సిరీస్ చేస్తోంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ హిందీ వెర్షన్ హనీ బన్నీ పేరుతో ఈ సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న హనీ బన్నీ నవంబర్ 7న ప్రైమ్‌లో ప్రసారం కానుంది. షూటింగ్‌లో భాగంగా కొన్ని రోజులుగా రాజ్-సమంత కలిసి కనిపిస్తున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారిందని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ రూమర్ నేపధ్యంలో సమంత ముంబైలో ప్రత్యక్షమవగా సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే రాజ్‌తో తనకు సంబంధం ఉందనే పుకార్లపై సమంతా స్పందించలేదు.