NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

9am

9am

డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో వైఎస్ జగన్‌ పర్యటన..
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇలాకాలో నేడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు.. పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పర్యటన కొనసాగనుంది.. ఏలేరు వరద ఉద్ధృతితో అతలాకుతలమైన గ్రామాల్లో పర్యటించనున్న వైసీపీ అధినేత.. బాధితులను పరామర్శించనున్నారు.. దీని కోసం ఈ రోజు ఉదయం 9.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు వైఎస్‌ జగన్.. అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం వెళ్లనున్న ఆయన.. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు.. అక్కడినుంచి రమణక్కపేట వెళ్లనున్నారు.. అక్కడ బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకుని మధ్యాహ్నం అక్కడి నుంచి తిరిగి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. అయితే, వైఎస్‌ జగన్‌.. పిఠాపురంలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది.. యు కొత్తపల్లి మండలం మాధవపురం, నాగులపల్లి, రమణక్కపేట గ్రామాలలో ఏలేరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి.. బాధితులను పరామర్శించనున్నారు జగన్.. ఇప్పటికే విజయవాడలోని ముంపు ప్రాంతాల్లోనూ జగన్ పర్యటన కొనసాగింది.. వరదలు వస్తాయని తెలిసినా.. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో.. తరలించడంలో ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని దుయ్యబట్టారు.

నేడు గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం.. భేటీపై ఉత్కంఠ..
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరింది. అయితే ఇవాళ గాంధీ ఇంటికి ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి వెళతానని అక్కడే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం కూడా చేసి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పి, కేసీఆర్ వద్దకు తీసుకుని వెళతానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, గాంధీల మధ్య సవాళ్లతో గాంధీ అనుచరులు గురువారం కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి సవాల్.. పోలీసులు భారీ బందోబస్తు
నిన్న శేరిలింగంపల్లి రణరంగంగా మారిన విషయం తెలిసిందే.. కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు, అరెస్టుల వాతావరణం నెలకొంది. దీంతో గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈనేపథ్యంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారు జామునుంచే పోలీసులు గాంధీ ఇంటికి చేరుకున్నారు. ముందస్తు చర్యలో భాగంగా భారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలందరూ తరలిరావాలంటూ కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పడంతో వెళ్తున్నామని తెలిపారు. టిఫెన్… అక్కడే భోజనం చేస్తాం.. అక్కడి నుంచి గాంధీని తెలంగాణ భవన్, కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తాం’’ అని వివరించారు. గురువారం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గాంధీ రావడంతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద ముందస్తు చర్యల్లో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

నేడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ..
లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు ఇంకా ఊరట దొరకలేదు. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్‌ చేసింది. దీనిపై ఇవాళ (శుక్రవారం) తుది తీర్పును వెల్లడించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో తీర్పు తేదీని ప్రకటించింది. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్‌ చేయడంతో పాటు.. బెయిల్‌ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్‌ రెండు వేర్వేరు పిటిషన్లు ఫైల్ చేశారు. ఇటీవల దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపు లాయర్ అభిషేక్‌ మను సింఘ్వి వాదిస్తూ.. సీబీఐ అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే, మద్యం విధానంపై కేసు నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయలేదని ఆయన తరపు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్‌ వచ్చిందో.. వెంటనే సీబీఐ ‘ఇన్స్యూరెన్స్‌’ అరెస్టుకు పాల్పడిందని పేర్కొన్నారు.

సీఎం మమతాని ‘సామాజిక బహిష్కరణ’ చేస్తానని బెంగాల్ గవర్నర్ ప్రమాణం..
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘లేడీ మాక్‌బెత్ ఆఫ్ బెంగాల్’ అంటూ సీఎం మమతాని ఆయన పిలిచారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బాధ్యురాలిని చేస్తూ బెనర్జీని “సామాజికంగా బహిష్కరిస్తాను” అని తెలిపారు.. అలాగే, ఆమెతో తాను ఇకపై బహిరంగ వేదికను పంచుకోనని తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్ లేడీ మక్‌బెత్ హూగ్లీ జలాలను పట్టుకుంది.. కానీ కళంకిత చేతులను శుభ్రం చేయలేకపోతోంది అని విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకు ముఖ్యమంత్రిపై క్రియాశీలక చర్యలు తీసుకుంటాను.. గవర్నర్‌గా నా పాత్ర రాజ్యాంగ బాధ్యతలకే పరిమితం అవుతుంది అని సీవీ ఆనంద్ బోస్ అన్నారు.

ఈ నెల 21న ప్రధాని మోడీ- జో బైడెన్ కీలక భేటీ..
అమెరికా నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ప్రెసిడెంట్ బైడెన్ మోడీకి ఆహ్వానం పంపించారు. దీనికి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, భారత ప్రధాని అమెరికా పర్యటనపై నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన, షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. క్వాడ్ సభ్య దేశాల సమావేశానికి అమెరికా ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ నెల 21వ తేదీన డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఈ సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు. ఇన్- పర్సన్ క్వాడ్ సమ్మిట్‌ ఈ ఏడాది విల్మింగ్టన్‌లో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్య దేశాలుగా ఉన్నాయి. జో బైడెన్‌, మోడీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ సమ్మిట్‌కు హాజరు కాబోతున్నారు. 2021లో వైట్‌హౌస్‌లో మొట్ట మొదటి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ సమావేశం ఏర్పాటవుతూ వస్తుంది.

ఇక నో డిబేట్స్ ఓన్లీ యాక్షన్.. కమలా హారిస్ పై వెనక్కి తగ్గిన ట్రంప్
ఇకపై కమలా హారిస్‌తో ఎలాంటి డిబేట్‌లోనూ పాల్గొనబోనని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కమలా హారిస్‌తో ఇటీవల జరిగిన అధ్యక్ష చర్చలో ట్రంప్ వెనుకబడి కనిపించారు. డిబేట్ తర్వాత చాలా మంది నిపుణులు కమలా హారిస్.. ట్రంప్‌ను అధిగమించారని పేర్కొన్నారు. అయితే, ట్రంప్ దీనిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్రూత్ సోషల్‌లో రాశారు. మరో డిబేట్ కు కమలా హారిస్ చేసిన అభ్యర్థన మంగళవారం జరిగిన డిబేట్ లో ఆమె ఓడిపోయినట్లు తెలియజేస్తోందని ట్రంప్ అన్నారు. ఇప్పుడు దీనికి పరిహారంగా రెండో అవకాశం కోసం వెతుకుతోందన్నారు. నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మంగళవారం జరిగిన డిబేట్ లో నేను గెలిచానని పోల్స్ చెబుతున్నాయని ట్రంప్ రాశారు. కామ్రేడ్ కమలా హారిస్ ఈ పోటీలో ఓడిపోయారు. ఆమె వెంటనే మరొక డిబేట్ కు డిమాండ్ చేసింది. ఇప్పుడు మూడో డిబేట్ జరగబోదని ట్రంప్ రాశారు. జో బిడెన్‌తో ట్రంప్ మొదటి డిబేట్ జూన్‌లో జరిగింది. అందులో ట్రంప్ మెరుగైన ఆధిక్యంలో ఉన్నారు. రెండో డిబేట్ గత మంగళవారం కమలా హారిస్‌తో జరిగింది. ఇందులో హారిస్ ముందున్నారని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు కమలా హారిస్‌తో జరిగిన చర్చలో తానే విజేత అని అనామక సర్వేలను ఉటంకిస్తూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా, అక్టోబర్ 1న న్యూయార్క్‌లో డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి టిమ్ వాల్జ్‌తో ట్రంప్ రన్నింగ్ మేట్ జెడి వాన్స్ డిబేట్‌లో పాల్గొననున్నారు.

నవ్‌దీప్‌.. ఎందుకు అంత కోపం: ప్రధాని మోడీ
పారిస్‌ పారాలింపిక్స్‌ 2024లో పతకం గెలిచిన భారత అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో భారత పారా అథ్లెట్లను కలిసిన ప్రధాని.. వారితో సరదాగా ముచ్చటించారు. అథ్లెట్‌ జీవాంజి దీప్తి, షూటర్‌ అవని లేఖరా, జూడో అథ్లెట్ కపిల్‌ పర్మార్‌, ఆర్చర్‌ శీతల్‌ దేవి, డిస్కస్‌ త్రోయర్‌ యోగేశ్‌, జావెలిన్‌ త్రోయర్‌ నవ్‌దీప్‌ సింగ్ సహా మరికొందరు ప్రధానిని కలిశారు. కేంద్ర క్రీడల మంత్రి మన్సుక్‌ మాండవీయ, భారత పారాలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర జజారియా కూడా తదితరులు పారాలింపియన్లను కలిశారు. జావెలిన్‌ త్రోయర్‌ నవ్‌దీప్‌ ప్రధాని మోడీకి టోపీ బహూకరించాడు. నవ్‌దీప్‌ మరుగుజ్జు కావడంతో ప్రధాని కింద కూర్చుని టోపీని తీసుకుని కాసేపు మాట్లాడారు. పారాలింపిక్స్‌లో త్రో విసిరిన తర్వాత ఎందుకు అంత కోపాన్ని ప్రదర్శించావ్‌ నవ్‌దీప్‌ అని ప్రధాని అడిగారు. ‘టోక్యో పారాలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాను. ఈసారి మీకు మాటిచ్చినట్టుగానే.. మెడల్ గెలుచుకున్నాను. ఆ భావోద్వేగంలో అలా చేశాను’ అని నవ్‌దీప్‌ బదులిచ్చాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 ఫైనల్లో రెండో స్థానంలో నిలిచిన నవ్‌దీప్‌.. సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్‌ అథ్లెట్‌ సదేగ్‌పై అనర్హత వేటు పడడంతో గోల్డ్ మెడల్ నవదీప్‌ సొంతమైంది.

ఎన్నో రిలేషన్‌షిప్స్ ఉన్నాయి.. నేను ఓ సీరియల్ డేటర్‌ను: రెజీనా
2022లో ‘శాకిని ఢాకిని’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న హీరోయిన్ రెజీనా కసాండ్రా.. అబ్బాయిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘అబ్బాయిలు, మ్యాగీ.. 2 నిమిషాలలో అయిపోతాయి’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో రెజీనా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మరోసారి రెజీనా పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈసారి తన గురించే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్‌ సాయి దర్శకత్వంలో దిలీప్‌ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన సినిమా ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ నిర్మించిన ఈ సినిమా.. నేడు తెలుగు, కన్నడ, హిందీలో రిలీజ్ అవుతోంది. ఉత్సవం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రెజీనా.. తన రిలేషన్‌షిప్స్ గురించి చెప్పారు. మీకు చాలా ప్రపోసల్స్ వచ్చి ఉంటాయ్ కదా, మీ మనస్సుకు ఒక్కటి కూడా కనెక్ట్ కాలేదా? అని అడగ్గా.. ‘కనెక్ట్ అయ్యాయి. నా జీవితంలో చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. నేను ఓ సీరియల్ డేటర్‌ను అని చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం బ్రేక్ తీసుకున్నా’ అని రెజీనా చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

Show comments