ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నాం అన్నారు.. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.. ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడింది.. ఆ క్రమంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం అన్నారు. వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం అని తెలిపారు. ఇక, మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. పెండింగ్ క్లైమ్స్ మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.. జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, టీఏ, ఏపీ జీఎల్ఐఏ అంశాల్లో ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించేస్తున్నాం అని వెల్లడించారు.. పెండింగ్ బిల్లుల పైనే నాలుగు గంటల పాటు చర్చించామని.. ఉద్యోగ సంఘాలకు స్పష్టత ఇచ్చామని.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్లు చెల్లింపులు జరుపుతామని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
ఈసారి మాకు అవకాశం ఇవ్వండి.. ప్రధానికి చూపి అభివృద్ధి చేస్తాం..!
ఈసారి మాకు అవకాశం ఇస్తే.. సమస్యలను ప్రధాన మంత్రికి చూపించి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విజయనగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యం.. అందుకే మా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ నుంచి పొట్టకూటి కోసం వలసలు వెళ్లిపోతున్నారన్న ఆయన.. ఇక్కడ నుంచి గెలిచిన ఎంపీలు ఇక్కడ సమస్యల పై పార్లమెంటులో గానీ.. సంబంధిత మంత్రులను గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. దీనిపై ఎన్నికల తరువాత బహిరంగ చర్చకు మేం సిద్ధం.. మీరు సిద్ధమేనా? అంటూ సవాల్ విసిరారు జీవీఎల్. అపారమైన వనరులు ఉన్నా ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు ఎంపీ జీవీఎల్.. పెద్దపెద్ద నాయకులు ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోబడినా.. ప్రయోజనం మాత్రం శూన్యం అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గతంలో అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవడంతో ఈ ప్రాంతం తమకు కంచుకోటగా చెప్పుకుంటుందని.. ఇక, వేవ్‌లో గెలిపొందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు కంచుకోటగా చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు.. అయితే, మాకు ఇక్కడ ఒక్క సీటు కూడా లేదు.. కానీ, ఈసారి అవకాశం ఇస్తే దీనిని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లి.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారు.. ఇది దురదృష్టకరం అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
ఆర్టీసీ చరిత్రలో ఇదే తొలిసారి.. త్వరలో 1,500 డీజిల్, వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు..
త్వరలో సుమారు 1500 డీజిల్ బస్సులు, 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవి కొనుగోలు చేస్తున్నాం.. ఏపీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఇన్ని బస్సులు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అన్నారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రోజు ఓ పత్రికలో వచ్చిన వార్త పూర్తి అవాస్తవం.. నిరాధారం అన్నారు.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 140 కోట్ల కిలోమీటర్లు తిరుగుతాయి 27 కోట్ల లీటర్ల డిజిల్ ప్రొక్యూర్ చేస్తాం.. భారత్, ఇండియన్ , హిందూస్తాన్ వంటి కంపెనీల నుండి డైరక్ట్ గా టెండర్ల ద్వారా ప్రొక్యూర్ చేస్తామని తెలిపారు.. అన్ని కోట్ల లీటర్ల డిజిల్ ప్రొక్యూర్ చేస్తాం కాబట్టి ఏ కంపెనీ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తే ఆ కంపెనీకి ప్రయారిటీ ఇస్తాం.. 2022 మార్చి నుండి 2025 ఫిబ్రవరి వరకు టెండర్ 5.87 పైసలు లీటరు డిస్కౌంట్ ఇవ్వడంతో 157 కోట్లు ఆదా వస్తుంది.. అందుకే ఆ టెండర్ ఖరారు చేశామని స్పష్టం చేశారు.. బల్క్ రేట్లు పెరగడంతో లోకల్ గానే డీజిల్ ప్రొక్యూర్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం.. 2022 ఫిబ్రవరి న ప్రతి జిల్లాలో ఆర్ఎం ఓ కమిటీ ఏర్పాటు చేసి లోకల్ గా రిటైల్ ద్వారా డీజిల్ కొనుగోలు చేశామని తెలిపారు. మార్చి 1 వ తేదిన బల్క్ రేట్లు తగ్గాయి.. మరలా బల్క్ రేట్ల ద్వారా డీజిల్ కొనుగోలుకు వెళ్లామని తెలిపారు ద్వారకా తిరుమలరావు.. త్వరలో సుమారు 1500 డీజిల్ బస్సులు 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తవి కొనుగోలు చేస్తున్నామని తెలిపిన ఆయన.. ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో ఇన్ని బస్సులు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అని ప్రకటించారు.. కర్ణాటకలో కొత్తగా తీసుకువచ్చిన 15 మీటర్ల బస్సులను తీసుకొస్తాం.. 2,736 మొత్తం బస్సులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక, 15 ఏళ్లు పూర్తి అయిన 221 బస్సులు గుర్తించాం.. కొత్త బస్సులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నాలుగు నెలల్లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.. కొత్త బస్సులకు రూ.572 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.
స్మార్ట్ మీటర్లతో రైతులకు మేలే తప్ప నష్టం లేదు..!
స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేయొద్దు.. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయదారుల కోసమే స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం పెడుతోంది.. మార్చి నుంచి సెప్టెంబర్ లోపు టెండర్లు ఫైనల్ అవుతాయన్నారు.. రాష్ట్రంలో 18.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.. ఎంత విద్యుత్ వినియోగం, ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తోంది.. రైతుకు తెలియజేయటం కోసమే ఈ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. నాణ్యమైన విద్యుత్ డిస్కంల నుంచి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. DTR మీటర్ల ద్వారా, ఫీడర్ కు మీటర్ పెట్టడం ద్వారా రైతుకు ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది అనేది స్పష్టంగా చెప్పలేమని తెలిపారు. అయితే, ప్రతి కనెక్షన్ కు మీటర్ ద్వారా మాత్రమే రైతుకు విద్యుత్ వినియోగం, ప్రభుత్వ సబ్సిడీ గురించి స్పష్టంగా తెలుస్తుందన్నారు విజయానంద్.. టెక్నాలజీ ద్వారా సంస్కరణల్లో భాగంగా మాత్రమే మీటర్లు పెడుతున్నాం.. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదని వ్యాఖ్యానించారు.. రైతులు కూడా మీటర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు.. 4 వేల కోట్లు ఖర్చు చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి 1600 కోట్లు గ్రాంటును కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై అపోహలు కలిగించ వద్దు అని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం పైలెట్ ప్రాజెక్ట్ లో 83.16 శాతం మీటర్లు పని చేస్తున్నాయి.. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం అయ్యింది.. కావున.. రాష్ట్రవ్యాప్తంగా క్రమంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ఉంటుందని తెలిపారు విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్.
మంచి పనుల్ని చూపెట్టండి.. తప్పు చేస్తే చీల్చి చెండాడండి
ప్రభుత్వం చేసే మంచి పనుల్ని చూపెట్టండి, అలాగే తప్పు చేస్తే చీల్చి చెండాడండి అని మంత్రి కేటీఆర్ జర్నలిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఉద్యోగం థాంక్స్‌లెస్ జాబ్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2018 మార్చి 8వ తేదీన వీ-హబ్ ఏర్పాటు చేశామని, ఐదు సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. మహిళా జర్నలిస్టుల కోసం కొత్త కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని అన్నారు. జర్నలిజంలో వస్తున్న కొత్త పోకడలను యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని.. ఇది రెండు రోజుల వరకు సాగే కార్యక్రమమని తెలిపారు. కల్యాణ లక్ష్మి వల్ల బాల్య వివాహాలు తగ్గాయని, కేసీఆర్ కిట్ కారణంగా సురక్షిత ప్రసవాలు పెరిగాయని కేటీఆర్ అన్నారు. అలాంటి మంచి విషయాల గురించి టీవీల్లో చూపెట్టమని చెప్పిన ఆయన.. ఒకవేళ తాము తప్పు చేస్తే చీల్చి చెండాడండి అని చెప్పారు. మహిళలపై దాడులు జరిగినప్పుడు.. ఏ ఒక్కరూ స్పందించకుండా ఉండరని వివరణ ఇచ్చారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు.. ప్రతిఒక్కరూ ప్రభుత్వాన్నే నిందిస్తారన్నారు. రాత్రికి రాత్రి అన్ని జరగవని.. ప్రభుత్వంలో ఉన్న వారికి మనసు ఉండదని అనుకోవద్దని కోరారు. మహిళల్ని గౌరవించాలని చిన్నతనం నుంచే నేర్పించాలని సూచించారు. జెండర్ సెన్సివిటి కరిక్యులమ్‌లో ఉండాలని, దానికి ప్రయత్నాలు జరగాలని పేర్కొన్నారు. మహిళలపై దాడుల నివారణ పట్ల చైతన్యం ఉండాలన్నారు. రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోందన్నారు. తెలంగాణలోని 19 వేల మందికి అక్రిడిటేషన్ గుర్తింపు ఉంటే.. గుజరాత్‌లో కేవలం 3 వేల మందికి మాత్రమే గుర్తింపు ఉందని చెప్పుకొచ్చారు.
మోడీని విమర్శించండి కానీ ప్రాజెక్టులను అడ్డుకోకండి.. కేసీఆర్‌కు విజ్ఞప్తి
మీ స్వార్థం కోసం ప్రధాని మోడీని విమర్శించండి కానీ, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రాజెక్టులను మాత్రం అడ్డుకోకండని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యక్తిగా ఫాక్స్‌కాన్ సంస్థ రాష్ట్రానికి రావాలని కోరుకుంటానని, అలాగే కేంద్రమంత్రిగా విదేశీ పెట్టుబడులు దేశానికి రావాలని కోరుకుంటానని అన్నారు. మెడికల్ కాలేజీలకు దరఖాస్తు పెట్టుకోమని చెప్పినప్పుడు పెట్టుకోలేదని.. ఇప్పుడేమో కాలేజీలు ఇవ్వలేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఏమైనా మాట్లాడితే.. కేసీఆర్ కుటుంబం మొత్తం తన మీద పడతారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో దళిత విద్యార్థుల అకౌంట్‌లలో డబ్బులు జమ అయ్యాయని.. కానీ తెలంగాణలోని దళిత విద్యార్థులకు డబ్బులు రాకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. అక్రమాలు చేసే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే.. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుంబ ప్రభుత్వంపై ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.
యువకుడి దారుణం.. తండ్రిని నరికి చంపి, సవతి తల్లిపై అత్యాచారం
ఒడిశాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాలో 20 ఏళ్ల యువకుడు తన తండ్రిని నరికి చంపి, ఆపై సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన టోమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు అనుమానిస్తున్నారు. సవతి తల్లి తన తండ్రి వద్ద ఉండనివ్వకపోవడంతో ఆ వ్యక్తి వేరే గ్రామంలో నివసించాడు. ఆదివారం రాత్రి తన తండ్రి ఇంటికి వెళ్లిన అతడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. రెచ్చిపోయిన ఆ యువకుడు సవతి తల్లిలో ఓ విషయంలో వాగ్వాదానికి దిగగా.. తండ్రి జోక్యం చేసుకుని భార్యకు మద్దతుగా మాట్లాడాడు. కొద్దిసేపటికే పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఆ యువకుడు తన తండ్రిపై కోపంతో రగిలిపోయాడు. ఆ వ్యక్తి తన 65 ఏళ్ల తండ్రిని పదునైన ఆయుధంతో హతమార్చాడు. ఆ తర్వాత అతను తన సవతి తల్లిపై అత్యాచారం చేసి, ఇంటి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు టోమ్కా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే పాత్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య, అత్యాచారానికి దారితీసిన ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సవతి తల్లి అతడిని తన తండ్రితో ఉండడానికి అనుమతించలేదని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
ఢాకాలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు
బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు సంభవించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో గల గులిస్థాన్ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలో జరిగిన పేలుడులో కనీసం 14 మంది మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. 11 అగ్నిమాపక సేవల అత్యవసర విభాగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రద్దీగా ఉండే సిద్దిక్ బజార్‌లో ఉన్న ఈ భవనం అనేక కార్యాలయాలు, దుకాణాలతో కూడిన వాణిజ్య భవనం. ఏడు అంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో శానిటేషన్ మెటీరియల్స్ విక్రయించే దుకాణంలో పేలుడు జరిగినట్లు సమాచారం. పేలుడుకు కారణం అస్పష్టంగా ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఛీ ఛీ.. పాడు..బ్రహ్మచారి దేవుడి ముందు బికినీ ప్రదర్శన
హనుమంతుడు.. ఆజన్మ బ్రహ్మచారి అని అందరికి తెలుసు. ఆయన బలం.. ఆయన బుద్ది.. ఆయన దైర్యం, ప్రేమ.. అందరికి తెలిసినవే. బలం గురించి మాట్లాడుకుంటే.. కొండను ఎత్తి రాముడి కోసం తీసుకెళ్లిన బలం ఆయనది. అందుకే వ్యాయమ శాలల ముందు హనుమంతుడి విగ్రహాలు పెడతారు. అయితే అది మగవారు వరకు వర్తిస్తుంది. కానీ.. అదే ఆడవారు అయ్యి.. బికినీలు వేసుకొని ప్రదర్శన ఇస్తుంటే.. అందులోనూ బ్రహ్మచారి హనుమంతుడు ముందు.. చెప్పడానికే కొంచెం ఎబెట్టుగా ఉంది కదా.. కానీ, మధ్యప్రదేశ్ లో ఏకంగా ఇది చేసి చూపించారు. ఇక్కడా ఆడ, మగా సమానత్వం గురించి మాట్లాడడం లేదు కానీ.. బ్రహ్మచారి దేవుడు ముందు అలాంటి బట్టల్లో ఫ్యాషన్ షో చేస్తుంటే హనుమంతుని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు అంటున్నారు. మధ్యప్రదేశ్ లో నేషనల్ బాడీ బిల్డింగ్ షో ఒకటి నిర్వహించారు. లేడీ బాడీ బిల్డర్స్.. బికినీలు వేసుకొని తమ దేహ దారుఢ్యాన్ని ప్రదర్శించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ స్టేజిపై ఎదురుగా హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆయన ముందే.. బికినిలో ఉన్న మహిళలు క్యాట్ వాక్ చేసుకుంటూ వచ్చి తమ కండలను చూపిస్తున్నారు. దీంతో నెటిజన్స్ వారిపై విమర్శలను గుప్పిస్తున్నారు. ఆడవారు.. అలాంటి బట్టలు వేసుకొని దేవుడి ముందు ఇలాంటి ప్రదర్శనలు చేస్తున్నారు.. ఛీఛీ పాడు అని కొందరు.. మీ ప్రదర్శన చేస్తే చేసుకున్నారు.. అందులోకి దేవుడిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు అని ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం మరింత వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆస్కార్ లైవ్.. ఆర్ఆర్ఆర్ కు అవార్డు రాకపోతే టీవీలు పగిలిపోవుడే
ఆస్కార్.. ఆర్ఆర్ఆర్.. అవార్డులు.. గ్లోబల్ హీరోలు.. ఎన్టీఆర్.. చరణ్.. రాజమౌళి.. నాటు నాటు.. గత కొన్ని రోజులుగా ఈ పేర్లన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెల్సిందే. మార్చి 12 న జరగబోయే ఈ వేడుకలు కోసం చిత్ర బృందం మొత్తం అమెరికాలో వాలిపోయారు. ఇంటర్నేషనల్ సినిమాలతో తలపడి.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొడుతుందా లేదా..? అనేది పెద్ద మిస్టరీగా మారింది. అందుకే ప్రతి భారతీయుడు మార్చి 12 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఇక ఆస్కార్ వేదికపై మనవాళ్ళు అవార్డు తీసుకొంటే వచ్చే ఆనందం మాటలో చెప్పలేం.. అరెరే.. అలా చూడలేమే.. ఆస్కార్ లైవ్ మన ఇండియాలో ఉండదు కదా.. అని నిరుత్సాహపడకండి. ఈసారి ఆస్కార్ ను మనం లైవ్ చూడొచ్చు. అవునా.. నిజమా అంటే.. అవును.. నిజమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఆస్కార్ 2023 వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించారు. మార్చి 12 న ఈ కార్యక్రమాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో లైవ్ చూడొచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు ఎగిరిగంతేస్తున్నారు. ఈ వేదికపై చరణ్, తారక్.. నాటు నాటు సాంగ్ కు స్టెప్స్ కూడా వేయనున్నారట..ఇంటర్నేషనల్ వేదికపై మన తెలుగు స్టార్ హీరోలు స్టెప్స్ వేస్తుంటే.. అక్కడ ఉన్నవారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మనం లైవ్ లో చూసే అవకాశం కూడా ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ ప్రోగ్రాం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇండియా మ్యాచ్ ఓడిపోతే టీవీలు ఎలా పగులకొడతారో.. ఆర్ఆర్ఆర్ కు అవార్డు రాకపోతే మనోళ్లు టీవీలు పగులకొడతారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. మరి ఆర్ఆర్ఆర్ అవార్డు అందుకుంటుందా లేదా అనేది చూడాలి.