NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

నిషేధిత ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానా..

ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై భారీగా జరిమానా విధించేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్‌ రూల్స్‌ను సవరించింది.. ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించనున్నట్టు పేర్కొంది.. పాలిథీన్ క్యారీబ్యాగులు ఉత్పత్తి, విక్రయాలపైనా, ఈ కామర్సు కంపెనీల పైనా దృష్టి పెట్టాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. నిషేధించిన ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతి, తయారీపై మొదటిసారి తప్పుగా రూ. 50 వేలు, రెండోమారు రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులు, స్టాక్ చేసినా, పంపిణీ చేసినా డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రూ. 25-50 వేలు జరిమానాతో పాటు సీజ్ చేసిన ఉత్పత్తులపై కేజీకి 10 రూపాయల చొప్పున పెనాల్టీ విధించనున్నారు.. ఇక, వీధి వ్యాపారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులుల వినియోగిస్తే రూ. 2500 నుంచి రూ. 5 వేల వరకు జరిమానా పడనుంది.. దుకాణాలు, సంస్థలు, మాల్స్ లాంటి చోట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే రూ. 20 వేల నుంచి రూ. 40 వేల జరిమానా వసూలు చేయనున్నారు.. అంతేకాదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల రవాణా చేస్తే రూ. 25 వేల నుంచి రూ. 50 వేల జరిమానా పడనుంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా.. ఎస్ఈబీ, రవాణా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.

నా భార్యకు ఐటీ నోటీసులు రాలేదు..

తన భార్యకు ఐటీ నోటీసులపై స్పందించారు మంత్రి గుమ్మనూరు జయరాం.. నా భార్య కు ఎలాంటి ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.. నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు.. మాది ఉమ్మడి కుటుంబం.. నాభార్య పై భూమి కొంటే బినామీ ఎలావుతుంది? అని నిలదీశారు.. నేను న్యాయ బద్ధంగా భూమి కొనుగోలు చేశానన్న ఆయన.. వ్యవసాయంలో సంపాదించి భూమి కొనుగోలు చేసినట్టు వెల్లడించారు.. ఇక, తాము కంపెనీ భూములు కొనలేదు.. రైతు బీడు పెట్టుకొని అమ్మితే కొనుగోలు చేసినట్టు వెల్లడించారు..

పేకాడుతూ దొరికిన మాజీ ఎమ్మెల్యే..

ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. ఏపీ గేమింగ్ యాక్ట్ 3 అండ్ 4 ప్రకారము సెక్షన్ 275 కింద కేసు నమోదు చేశారు.. ఈ ఎఫ్ఐఆర్ లో ఏ9 గా వరుపుల సుబ్బారావు పేరును చేర్చారు.. గత నెల 26న పేకాడుడూ పోలీసులకు దొరికిపోయారు వరుపుల సుబ్బారావుతో పాటు మరో ఎనిమిది మంది.. వీరి దగ్గర రూ. 53,410 నగదు స్వాధీనం చేసుకున్నారు.. కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు పోలీసులు.. దీంతో, ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు..

9,168 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

గ్రూప్-4 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ.. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది.. అగ్రికల్చర్, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2, బీసీ వెల్ఫేర్‌లో 307, పౌర సరఫరాలశాఖలో 72, ఆర్ధికశాఖలో 255, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్‌లో 2,701 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 742 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2,077, ఎస్సీ వెల్ఫేర్‌లో 474 పోస్టులు, లేబర్ డిపార్ట్‌మెంట్‌లో 128 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్‌లో 221 పోస్టులు, హోమ్ శాఖలో 133 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 97 పోస్టులు భర్తీచేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. ఇక, ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది టీఎస్పీఎస్సీ . వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇచ్చిన హామీల్ని అమలు చేస్తాం

నల్లగొండలో 12 స్థానాలను గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదని, మీరు ఇంతలా ఆశీర్వదించినందుకు ఇక్కడికి వచ్చామని మంత్రి కేటీఆర్ మునుగోడులో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశంలో వ్యాఖ్యానించారు. మునుగోడును‌ గెలిపిస్తే నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. మీరు గెలిపించింది కేవలం ఒక్క కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని కాదని, మా అందరినీ అని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఉమ్మడి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేదని.. కేసీఆర్ వచ్చాక నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు క్లాసులు కూడా ప్రారంభించామని తెలిపారు. దామరచర్లలో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కారణంగా.. రాబోయే వందేళ్ల వరకు విద్యుత్ అవసరాలు తీర్చే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. అక్కడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తామని మాటిచ్చారు. తెలంగాణలో అత్యధికంగా వరి పండించేది నల్లగొండ జిల్లాలోనే అని, ఇక్కడి సాగు విస్తీర్ణం కేవలం కేసీఆర్ ప్రోత్సాహంతోనే పెరిగిందని పేర్కొన్నారు. తిరుమల స్థాయిలో యాదాద్రికి భక్తులు తరలివస్తున్నారన్నారు. దండు మల్కాపురంలో 540 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ స్థాపించి, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు టీఆర్ఎస్‌ను ఏవిధంగా గుండెల్లో పెట్టుకుని 12 నియోజకవర్గాల్లో గెలిపించారో.. మిమ్మల్ని అలానే గుండెల్లో పెట్టుకుంటామన్నారు. రాబోయే ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో.. ఇవాళే సమీక్ష చేసేశామన్నారు. రూ. 402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీల్లో రూ.334 కోట్లు, గిరిజనుల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల కేటాయిస్తున్నామన్నారు.

ఫొటోలకు పోజులిచ్చిన కొత్త జంట.. దాడి చేసిన ఏనుగు

కేరళ త్రిస్సూర్‌లోని గురువాయుర్ ఆలయంలో నవంబర్ 10వ తేదీన కొత్తగా పెళ్లి అయిన ఓ జంట మెడలో మాలలతో ఏనుగు సమీపంలోకి వెళ్లారు.. ఏనుగు ముందు నిలబడి ఫోటోలకు పోజులిచ్చారు.. వారికి కుడివైపుగా గజరాజు ఉండగా.. ఆ కొత్త జంటపై ఫోటోగ్రాఫర్ కెమెరాను క్లిక్ మనిపించసాగారు.. అయితే, ఆ కెమెరా ఫ్లాష్‌ వల్లో.. మరే కారణమో తెలియదు.. కానీ, ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్క సారిగా దాడికి దిగింది.. అప్పటికే ఏనుగుపై ఉన్న మావటి అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో.. అతడిని ఎత్తి కిందకు విసిరింది.. ఇక, తొండంతో అతడిని పైకెత్తేందుకు యత్నించగా.. జారిపోయిన మావటి.. కింద పడి.. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు.. కానీ, ఏనుగు తొండంతో పైకి ఎత్తే ప్రయత్నం చేసిన సమయంలో.. అతని శరీరంపై ఉన్న బట్టలు మొత్తం ఊడిపోయాయి.. ఇక, ఏనుగుపై ఉన్న మరో మావటి ఆ గజరాజును అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి.. ఏనుగు ఆగ్రహంతో దాడి చేసిన వీడియోను వెడ్డింగ్ మోజిటో అనే ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది వైరల్‌గా మారిపోయింది.

రాధా నాయుడుకి కాళ్లు మొక్కిన డిప్యూటీ సీఎం..

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మొరవకండ్రిగలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైతు కాళ్లు పట్టుకున్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఆ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ఓ వృద్ధ దంపతుల దగ్గరకు వెళ్లారు నారాయణస్వామి, వైసీపీ నేతలు.. ఓ నేత.. మీకు డ్వాక్రా రుణమాఫీ జరిగిందా? అని ప్రశ్నిస్తే ఆ వృద్ధురాలు జరిగిందని సమాధానం చెప్పారు.. ఇక, పెన్షన్‌ వస్తుందా? అని మరో ప్రశ్న వేశారు.. నీకా? పెద్దాయనకా? అని ఆ మహిళను ప్రశ్నించగా.. పెద్దాయనకు అని సమాధానం ఇచ్చారు.. అయితే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటూ మరో ప్రశ్న వేశారు.. దీనికి ఆ రైతు.. జగన్మోహన్‌రెడ్డి అని సమాధానం ఇవ్వడమే కాదు.. ఆయనే రావాలి ఈసారి మళ్లీ కూడా అంటూ బదులిచ్చారు.. దీంతో, ఆ రైతుకు దగ్గరగా వెళ్లిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. మీ పేరు ఏంటి? అని అడిగారు.. దాంతో.. రాధా నాయుడు అంటూ సమాధానం ఇచ్చాడు ఆ రైతు.. రాధానాయుడు గారు.. సీఎం జగనన్న పాలన బాగుందని చెప్పారు.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందని చెప్పారు.. దీంతో… ఓ డిప్యూటీ సీఎంగా ఆయనకు నేను పాదాభివందనం చేస్తున్నానంటూ.. ఆ రైతుకు పాదాభివందనం చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..

ఎలాన్ మ‌స్క్‌పై నెట్‌ఫ్లిక్స్ సీఈవో ప్రశంసలు..

ఎలాన్‌ మస్క్‌పై నెట్‌ఫ్లిక్స్ సీఈవో రీడ్ హేస్టింగ్స్ ప్రశంసలు కురిపించారు.. మస్క్ “ఈ భూమి మీద ఉన్న ధైర్యవంతుడు, అత్యంత సృజనాత్మక కలిగిన వ్యక్తి” అని పేర్కొనగా.. దానికి మస్క్ స్పందిస్తూ, “వావ్, మంచి మాటలకు ధన్యవాదాలు.” అంటూ ట్వీట్‌ చేశారు.. అతను చేసిన ట్వీట్ చూస్తే, హేస్టింగ్స్ వ్యాఖ్యను మాస్క్‌ హృదయపూర్వకంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది.. “ప్రజాస్వామ్యం మరియు సమాజం కోసం [ట్విట్టర్] మరింత మెరుగ్గా ఉండటానికి, మరింత బహిరంగ వేదికను కలిగి ఉండటానికి అతను ఈ డబ్బు మొత్తాన్ని వెచ్చించాడు.. నేను ఆ ఎజెండా పట్ల సానుభూతితో ఉన్నాను” అని హేస్టింగ్స్ చెప్పారు. మస్క్ వివిధ రంగాల్లో సాధించిన అద్భుతాలే అందుకు నిద‌ర్శనం.. అత‌ను వంద శాతం ఆత్మవిశ్వాసంతో ఉంటారని.. త‌న విజ‌యాల‌తో ప్రపంచానికి సాయ‌పడాలనేది ఆయన కోరిక అంటూ మ‌స్క్‌పై ప్రశంసల వర్షం కురిపించారు రీడ్ హేస్టింగ్స్.. అంతటితో ఆగకుండా.. ఒక సంస్థను నడిపే వ్యక్తిగా.. త‌న‌కు, మ‌స్క్‌కు ఉన్న తేడాను కూడా చెప్పుకొచ్చారాయన.. నేను నిదానంగా, గౌర‌వ‌ప్రద‌మైన నాయ‌కుడిగా ఉండాలని చూస్తాను.. కానీ, మ‌స్క్ అవేం ప‌ట్టించుకోడు.. త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా ఉంటారు.. నేను ఆయనలా పనిచేయలేను బాబోయ్ అన్నారు.. ఇక, మస్క్‌ అంటే నాకు చాలా గౌర‌వం అని పేర్కొన్న ఆయన.. ట్విట్టర్‌లో మార్పులు చేస్తున్నాడని అతడిని విమర్శించడం సరికాదని హితవుపలికారు..

మహేష్ కొడుకా.. మజాకా

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా స్కూల్ లో జరిగిన ఒక ప్రోగ్రామ్ లో గౌతమ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. థియేటర్ ప్రొడక్షన్ లో ఒక స్కిట్ చేస్తూ కనిపించాడు. వన్ నేనొక్కడినే సినిమాలో కెమెరా ముందు నటించిన గౌతమ్ ఇన్నాళ్ల తరువాత ఇదుగో ఇలా స్టేజిపై కనిపించాడు. లవ్ స్టోరీలా సాగిన ఈ కథలో గౌతమ్ ప్రధాన పాత్ర చేస్తున్నట్లు కనిపించాడు. ఇంగ్లిష్ లో డైలాగులు అదరగొట్టడమే కాకుండా హావభావాలను చక్కగా పలికించాడు. ఈ వీడియోను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొడుకు గురించి మురిపెంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గుజరాత్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్

గుజరాత్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలి విడతలో 56.88 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. చిన్న చిన్న ఘటనలు, అధికార ప్రతిపక్షాల ఆరోపణల మధ్య పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 13,065 పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. గుజరాత్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన తొలిదశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియగా.. గురువారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తొలిదశలో 89 స్థానాలకు మొత్తం 788 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని నమోదు చేసుకున్నారు. గురువారం దక్షిణ గుజరాత్‌లోని 19 జిల్లాలు, కచ్‌ సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఓటింగ్ జరిగింది. 788 మంది అభ్యర్థుల్లో 718 మంది పురుషులు.. 70 మంది మహిళలు తమ అదృష్టాన్ని నమోదు చేసుకున్నారు.