దసరా మహోత్సవాలకు రండి.. సీఎంకు కనకదుర్గ ఆలయం అధికారుల ఆహ్వానం..
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది.. అయితే, దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు.. క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన అధికారులు, అర్చకులు.. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దుర్గ గుడి ఈవో శీనా నాయక్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, అర్చకులు పాల్గొన్నారు.
టీడీపీ వర్సెస్ వైసీపీ.. కాకరేపుతోన్న మెడికల్ కాలేజీలు..!
ఏపీలో మెడికల్ కాలేజీల అంశం హాట్ టాపిక్‌గా మారింది.. కూటమి ప్రభుత్వం పది ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆదోని.. మదనపల్లె. మార్కాపురం.. పులివెందుల.. పెనుగొండ.. పాలకొల్లు.. అమలాపురం.. నర్సీపట్నం.. బాపట్ల.. పార్వతీపురంలో ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్‌షిప్ తో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. వీటిలో నాలుగు కాలేజీలు మొదటి దశ లో ప్రారంభం కానున్నాయి.. పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.. ఇక్కడే అసలు గొడవ మొదలయింది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది..ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడం కోసమే ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో కాలేజీలు ఏర్పాటు చేస్తోందని.. విమర్శలు చేస్తోంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. తాము 17 మెడికల్ కాలేజీలు తెస్తే. 5 ప్రారంభం అయ్యాయన్నారు. 4 వేలకు పైగా సీట్లు అందుబాటులో కి వచ్చాయన్నారు జగన్.. కేవలం ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు ధరదత్తం చెయ్యడానికి మాత్రమే పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తోందన్నారు జగన్.. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమి కూడా ప్రైవేట్ పరం అవుతోందని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని విమర్శలు చేస్తున్నారు.. అయితే, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వం చెబుతోంది.. ఆసుపత్రులు ప్రైవేట్ పరం అంటూ విషం ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. ప్రజల్లో విశ్వాసం, నమ్మకం కోల్పోయి రాష్ట్రంలో నిత్యం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలోనే వైసీపీ ఉందని.. తాజాగా మళ్లీ మెడికల్ కాలేజీలపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది..
భారీగా పడిపోయిన టమోటా రేటు.. రైతన్నకు తీవ్ర నష్టం..
టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి. ఆరుగాలం కష్టపడిన టమాటా రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటంలేదని మరికొంత మంది రైతులు వాపోతున్నారు. టమోటా విక్రయాలలో పెద్ద మార్కెట్ గా పేరొందిన మదనపల్లె మార్కెట్ లో రైతులకు ప్రస్తుతం ధరలు లేక అల్లాడుతున్నారు.గత మూడేళ్ళుగా టమాటా సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు… ధరలు ఎప్పుడు పెరరుగుతాయో ఆశగా అని ఎదురు చూస్తున్నారు. మదనపల్లె డివిజన్లో 1400 హెక్టార్లలో రైతులు టమోటా సాగు చేస్తున్నారు.ఇక మదనపల్లె మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, ఉత్తారాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లు టమోటా ఎగుమతి అవుతోంది. నిత్యం 300 నుంచి 1000 టన్నుల వరకు టమోటా ఎగుమతి చేస్తారు. కాగా నెల క్రితం టమోటా కిలో 60-70 రూపాయిల వరకు ధర పలికింది. కాగా బయట ప్రాంతాలలో కూడా టమోటా సాగు అవుతుండటంతో మదనపల్లె మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి. రెండు వారాలుగా నాణ్యమైన టమోట కిలో పది రూపాయలు పలుకుతుండగా నాణ్యత లేని రెండో రకం టమోటా కిలో ఐదు రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఎమీ చేసుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు రైతులు ..
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాపై ఉత్తర్వులు జారీ.. ఎవరికి వర్తిస్తుందంటే.?
ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది కూటమి సర్కార్.. ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. అటల్ బీమా – ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయంతో హైబ్రిడ్ మోడ్ లో కొత్త బీమా సౌకర్యం కల్పించనున్నారు.. రూ.25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు సంబంధించి విధి విధానాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, యూనివర్సల్ హెల్త్ పాలసీ కోసం ఇన్సూరెన్స్ సంస్థలను టెండర్లకు పిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రతి కుటుంబానికి ఏడాదికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించనుంది ప్రభుత్వం.. BPL కుటుంబాలకు ఇది వర్తింపుజేయనున్నారు.. ఏడాదికి 5 లక్షల వరకు కుటుంబ ఆదాయం ఉన్నవారికి హెల్త్ స్కీమ్ వర్తిస్తుంది.. ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ ఎం ప్యానల్ హాస్పిటల్స్ కు వర్తింపజేస్తారు.. 3,257 రకాల వ్యాధులకు మెడికల్ మరియు సర్జికల్ ప్రొసీజర్లకు వర్తింపజేయనున్నారు.. ఆయుష్మామాన్ భారత్ లో ఉన్న 1946 హెల్త్ బెనిఫిట్ ప్యాకేజీలకు కూడా వర్తించనుంది.. అటల్ భీమా – ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయంతో హైబ్రిడ్ మోడ్ లో కొత్త బీమా సౌకర్యం కల్పిస్తున్నారు..
కేటీఆర్‌ని ఎందుకు కలవకూడదు..? దానికి రేవంత్‌రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా..?
కేటీఆర్‌ని కలుస్తా.. ఎందుకు కలవకూడదు..? అంటూ ప్రశ్నించారు ఏపీ మంత్రి నారా లోకేష్.. వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానన్న ఆయన.. కేటీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడగాలా?.. రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా? అని ప్రశ్నించారు.. ఇక, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవితను టీడీపీలో తీసుకోవడమంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నట్టే అంటూ హాట్ కామెంట్లు చేశారు నారా లోకేష్.. మరోవైు, తెలంగాణపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేస్తుందన్నారు లోకేష్.. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. మరోవైపు, తాజా ఉపరాష్ట్రపతి ఎన్నికలపై స్పోందిస్తూ.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో వైఎస్ జగన్‌ను వైసీపీ ఎంపీలు అడగాలని సూచించారు నారా లోకేష్.. ఇప్పుడే కాదు.. 2029 ఎన్నికల్లోనూ నరేంద్ర మోడీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఇక, రెడ్‌బుక్‌లో చాలా స్కామ్‌లు ఉన్నాయని తెలిపారు నారా లోకేష్.. అవన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేశారు.. ఆ భయంతోనే వైఎస్ జగన్ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కా కేసులో ప్రభుత్వ జోక్యం లేదని పేర్కొన్నారు లోకేష్.. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు నారా లోకేష్.. కాగా, ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీపై.. తెలంగాణలో టీడీపీ పునర్‌నిర్మాణం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో.. ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి..
ఫార్ములా ఈ రేస్‌పై ఏసీబీ నివేదిక.. కేటీఆర్‌తో సహా అధికారులపై ఛార్జ్‌షీట్ సిద్ధం..!
హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది. ఏసీబీ విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండుసార్లు ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. అలాగే, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను కూడా విచారించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. E-car racing కు sponsorship చేసిన సంస్థల నుంచి BRS పార్టీకి 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు లాభం. ఈ విధంగా క్విడ్ ప్రో కో జరిగినట్టు నిర్ధారించింది ఏసీబీ.
ఫార్ములా ఈ-కార్ కేసు లొట్టపీసు కేసు.. స్కాం లేదు.. మన్నూ లేదు
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసు ‘లొట్టపీసు కేసు’ అని, ఇందులో ఎలాంటి స్కాం జరగలేదని ఆయన అన్నారు. ఒకవేళ అవకతవకలు జరిగాయని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ఏసీబీ విచారణ గురించి ప్రస్తావిస్తూ, “దూద్ కా దూద్, పానీ కా పానీ అవ్వాలి” అని, ఇందులో ఒక్క రూపాయి కూడా తారుమారు కాలేదని ఆయన స్పష్టం చేశారు. “స్కాం లేదు, మన్నూ లేదు” అని ఆయన అన్నారు. నా మీద ఎన్ని కేసులు పెట్టినా, లై డిటెక్టర్ టెస్ట్ చేసినా సిద్ధమని సవాల్ విసిరారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ ఆర్థిక, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా, గత ప్రభుత్వం తీసుకున్న అధిక వడ్డీ రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని, అలాగే, తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. గత ప్రభుత్వం ఇష్టారీతిగా అధిక వడ్డీలకు తీసుకున్న అప్పులు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారాయని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ రుణాల చెల్లింపులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, వాటిని తిరిగి చెల్లించడానికి లోన్ రీస్ట్రక్చరింగ్‌కు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డిని ఓడించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 781 ఓట్లకు గాను మొత్తం 767 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. 15 చెల్లని ఓట్లు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్డీఏ బలం 427 కాగా.. క్రాస్ ఓటింగ్ జరగడంతో 452 ఓట్లు వచ్చాయి. దీంతో దేశంలోని 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ నిలిచారు. ఈ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఎన్డీఏ ఎంపీల వేడుకలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఫలితాలు ప్రకటించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోషి నివాసాన్ని సందర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉపరాష్ట్రపతి ఫలితాలపై లేఖ విడుదల చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి..
ఉపరాష్ట్రపతి ఫలితాలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి లేఖ విడుదల చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నిక తీర్పును స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.. “ప్రజాస్వామ్య ప్రక్రియలపై ఉన్న గట్టి నమ్మకంతో స్వీకరిస్తున్నా.. ఈ ప్రయాణం నాకు గొప్ప గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చింది.. న్యాయం, ప్రతీ వ్యక్తి యొక్క గౌరవం కోసం నిలబడే అవకాశం అందించింది. నన్ను కూటమి అభ్యర్థిగా పెట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. ఉపాధ్యక్ష ఎన్నికలో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు.” అని లేఖలో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాసుకొచ్చారు.
ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి.. హమాస్ నాయకత్వం లక్ష్యంగా పేలుళ్లు
ఇజ్రాయెల్ హమాస్ నాయకత్వాన్ని వెంటాడింది. దాని వేటకు దేశంతో సంబంధం లేదు. కచ్చితమైన సమాచారం, కరెక్ట్ టార్గెట్ ఉంటే పని పూర్తి చేయడమే తెలుసు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దళాల్లో ఇజ్రాయెల్ సైన్యం కూడా ఒకటి అని పేరు. తాజా ఖతార్ రాజధాని దోహాలో ఒక్కసారి పేలుళ్లు సంభవించాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇదే సమయంలో ఇజ్రాయెల్ సైన్యం హమాస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసినట్లు ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ దళాలు ఏ ప్రదేశంలో దాడులు చేశాయో వివరాలు పేర్కొలేదు. హమాస్ ఉగ్రవాద సంస్థ సీనియర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఐడిఎఫ్ (ఇజ్రాయెల్ మిలిటరీ), ఐఎస్ఎ (భద్రతా సంస్థ) కచ్చితమైన దాడిని నిర్వహించాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
500 ఎకరాల ఆస్తికి వారసుడు ఈ తమిళ నటుడు, ఒక్క తప్పుతో అంతా నాశనం..
సినీ ఇండస్ట్రీ మెరిసే ప్రపంచం. బయటకు ఎంతో గ్లామరస్‌గా, జాలీగా కనిపించినా, లోలోపల మాత్రం ఎన్నో విషాదాలు ఉంటాయి. సక్సెస్ వస్తే స్టార్, వరసగా ఫెయిల్యూర్ ఎదురైతే అంతే సంగతి. ఇలా చాలా మంది జీవితాలు తలకిందులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క తప్పటడుగు మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది. ప్రముఖ తమిళ సినీ నటుడు, తెలుగు వారికి కూడా సుపరిచితం అయిన సత్యన్ శివకుమార్‌ది కూడా ఇదే పరిస్థితి. ‘‘కుట్టి రాజా’’గా పిలుచుకునే భూస్వామి కుమారుడైన ఈయన, సినిమాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. 500 ఎకరాలకు వారసుడు, రాజా మహల్‌ని తలపించే భవనం కలిగిన సత్యన్, చివరకు తన విలాసవంతమైన ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది.
ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ కి ప్రత్యేక పరిచయం అక్కరలేదు, ఇప్పటికే ఫ్యామిలీ హీరోగా ఈ మంచి ఇమేజ్ సంపాదించుకున్న శర్వానంద్ తాజాగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఈరోజు ఓమీ, (OMI) పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేశారు, ఇది కేవలం ఒక బ్రాండ్ కాదని, భవిష్యత్తు తరాలకు సంబంధించి ఇది ఒక విజన్ కి ప్రారంభం అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఓమీతో సిన్సియారిటీ, మంచి ఉద్దేశాలు, బాధ్యతలతో కూడిన కొత్త చాప్టర్ ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబులిటీ మెయింటైన్ చేస్తూ 100% నాచురల్ స్టోరీస్ ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు.