Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అంబటి 35 క్వాష్‌ పిటిషన్లపై విచారణ.. ఒకే విషయంపై అన్ని FIRలు ఏంటి? హైకోర్టు ప్రశ్న
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పై 35 క్వాష్ పిటిషన్ల విచారణను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. కీలక ప్రశ్నలు లేవనెత్తింది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 35 కేసులు నమోదయ్యాయి. అయితే, అంబటి రాంబాబు వీటిని క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై విచారణ జరుగుతుండగా, హైకోర్టు పోలీసులకు కీలక సూచనలు చేసింది. విచారణలో BNSS 35(3) ప్రొసీజర్‌ని పాటించాలని, తుది నిర్ణయం వెలువడే వరకు తొందరపాటు చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఒకే విషయంపై 35 FIRలు నమోదు చేయడం ఏంటి? అని ప్రశ్నించింది హైకోర్టు.. అంబటి రాంబాబు తరఫున హాజరైన లాయర్ కోర్టుకు చెప్పిన వివరాల్లో, ఒకే అంశంపై 35 FIRలు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. కానీ, ప్రభుత్వం తరపున వెలువడిన వాదనలో, వేర్వేరు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఈ FIRలు అందుకున్నట్టు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు ఆ అంశాన్ని పరిశీలిస్తోంది.. ఈ కేసులపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.

అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూసే అవకాశం.. ఇలా సంప్రదించండి..
అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో చూడడం కాదు.. అసెంబ్లీకి వెళ్లి.. ప్రత్యక్షంగా మన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రతిపక్ష నేతలు ఎక్కడ కూర్చుంటారు.. స్పీకర్‌ ఎటువైపు ఉంటారు? అసెంబ్లీలో సెక్యూరిటీ ఏంటి? అక్కడ ఉండే ఇతర సదుపాయాలు ఏంటి? అని ప్రత్యక్షంగా చూడడం.. తెలుసుకోవడం ఎవరికైనా ఇష్టమే.. అలాంటి అవకాశం విద్యార్థులకే వస్తే.. ఎగిరి గంతేస్తారు.. అయితే, బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింత‌కాయ‌ల అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా అసెంబ్లీ సభలో వీక్షించుకునే అవకాశం కల్పించనున్నారు. అసెంబ్లీ జరిగే ప్రతి రోజు విద్యార్థులు సభ సమావేశాలను ప్రత్యక్షంగా చూడగలుగుతారు. చట్టసభల పట్ల విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నారు.. ఇందుకు సంబంధించి స్కూల్స్, కాలేజీలు తమ విద్యార్థులను తరలించేందుకు ముందుగా అసెంబ్లీ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించారు.. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది విద్యార్థులు.. 45 నిమిషాల పాటు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.. వివరాల కోసం ఆసక్తి ఉన్న స్కూల్/కాలేజీలు ఈ ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు 0863-2449184, 0863-2449185 అని సూచించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు..

అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరు.. ట్విస్ట్‌ ఏంటంటే..?
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్ మంజూరు అయ్యింది. అంబటికి ఈ బెయిల్‌ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంజూరు చేసింది.. అయితే, ఇదే కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు అంబటి రాంబాబు.. మరో కేసులో ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో.. ఈ కేసులో బెయిల్‌ మంజూరు అయినా.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.. మరోవైపు.. పోలీసులు అంబటిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ చేసినా, మొబైల్ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో అంబటి బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం వచ్చినా.. మరో కేసులో రిమాండ్‌ ఉండడంతో.. ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి.. ఇక, గతేడాది నవంబర్ 12న పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఆరోపణలపై అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. ఈ కేసు కూడా ప్రస్తుతం ఈ నెల 22 వరకు రిమాండ్‌ కొనసాగుతోంది. అంటే.. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వాదనలు విన్న అనంతరం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని అపర్ణ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించారు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రచయిత-దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో ఉన్న డొక్కా సీతమ్మ ఇంటిని విజయేంద్ర ప్రసాద్ సందర్శించి, ఆమె వాడిన వస్తువులను పరిశీలించారు. సీతమ్మ చేసిన సేవలను తెలుసుకొని, ఆమెకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎప్పటి నుండో మహాతల్లి సీతమ్మ ఇంటికి రావాలనుకున్నాను.. ఇప్పుడు ఆమె ఇంటికి రావడంతో నా జన్మ ధన్యమైందన్నారు.. అలాగే, సీతమ్మ పేరుతో ఏ కార్యక్రమం చేపట్టినా.. తన సహాయ సహకారం అందిస్తానని కూడా చెప్పారు. ఇక, మహాతల్లి పేరు మీద సంవత్సరానికో, నెలకో ఒక్కరికైనా భోజనం పెట్టాలని నా ఆశ. నేను తీసే సినిమాల్లో సీతమ్మ పాత్రను పెట్టాలని నా మదిలో మెదిలింది అన్నారు.. మరోవైపు, ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ, డొక్కా సీతమ్మ వారసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే.!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎంఐఎం స్టార్ క్యాంపెయినర్ అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ వేదికగా తనదైన శైలిలో విమర్శల గళం విప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం కింగ్ మేకర్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మేము ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. పనులు కావాలన్నా, అధికారం కావాలన్నా ముఖ్యమంత్రులే మా దగ్గరకు రావాల్సి ఉంటుంది. అది రెడ్డి అయినా, రావు అయినా ఎవరైనా సరే.. మా మద్దతు లేకుండా రాజకీయం చేయడం సాధ్యం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం మద్దతు అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుందని ఆయన పేర్కొన్నారు.

అక్బరుద్దీన్‌కు మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్: జూబ్లీహిల్స్‌లో గెలిచింది మేమే.. ఎవరి మద్దతోనో కాదు..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తరుణంలో అధికార కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదిరింది. “ముఖ్యమంత్రులే మా దగ్గరకు రావాలి” అని అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ గెలుపుపై అక్బరుద్దీన్ చేసిన క్లెయిమ్‌ను ఆయన తోసిపుచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం మరొకరి భిక్ష కాదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి గెలిచింది. మా పార్టీ నేతలు, కార్యకర్తలు రాత్రింబగళ్లు కష్టపడితేనే ఆ విజయం సాధ్యమైంది” అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాదరణను తక్కువ చేసి చూపడం అక్బరుద్దీన్‌కు తగదని ఆయన హితవు పలికారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓటేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా రంజక పాలన చూసి ఓటర్లు పట్టం కట్టారని, తమ గెలుపును మరొకరి ఖాతాలో వేయాలని చూడటం ముమ్మాటికీ పొరపాటని ఆయన వ్యాఖ్యానించారు. తామే గెలిపించామని ఎవరైనా భ్రమల్లో ఉంటే అవి వదిలేసుకోవాలని అక్బరుద్దీన్‌నుద్దేశించి మంత్రి చురకలు అంటించారు.

‘మియాన్ ముస్లిం’ వంటి రెచ్చగొట్టే ప్రకటనలను నిషేధించాలి.. యోగి సహా బీజేపీ సీఎంలపై సుప్రీంకోర్టులో పిటిషన్
మియా ముస్లిం’, ‘కథా ముల్లా’, ‘వరద జిహాద్’ వంటి రెచ్చగొట్టే, విభజనాత్మక పదాలను బహిరంగ వేదికలపై ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, నేతల వ్యాఖ్యలపై ఈ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇలాంటి పదాలను ఉపయోగించడం రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వ్యక్తుల బాధ్యతలకు విరుద్ధమని, ఇది సమాజంలో విభజన, భయం, ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించారు. ముఖ్యంగా మతపరమైన సమూహాలను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యలు సామాజిక సమరసతకు ముప్పుగా మారుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన ‘మియా ముస్లిం’, ‘వరద జిహాద్’ వ్యాఖ్యలు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉపయోగించిన ‘కథా ముల్లా’ పదం, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, బీజేపీ నేత నితేష్ రాణే ముస్లింలను “పాకిస్తానీ పింప్స్”గా సంబోధించిన వ్యాఖ్యలను పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

క్రైస్తవ దేశానికి ముస్లిం ప్రధాని.. లండన్ పీఠంపై పాక్ సంతతి మహిళ?
ప్రస్తుతం బ్రిటిష్ రాజకీయాలు గణనీయమైన సంక్షోభం, మార్పుల కాలం గుండా వెళుతున్నాయి. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన సొంత పార్టీ అయిన లేబర్ పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇంతలో తదుపరి ప్రధానమంత్రి పదవికి షబానా మహమూద్ పేరును పార్టీలో చర్చిస్తున్నారు. ఆమె ప్రస్తుతం UK హోం కార్యదర్శిగా ఉన్నారు. పరిస్థితులు మారితే ఆమె బ్రిటన్ దేశంలో మొట్టమొదటి ముస్లిం ప్రధానమంత్రి కావచ్చు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల కావడం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో కైర్ రాయబారిగా నియమించిన పీటర్ మాండెల్సన్ పేరు కనిపించడం, స్టార్మర్‌పై ఒత్తిడిని పెంచింది. చాలా మంది లేబర్ ఎంపీలు స్టార్మర్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. లేబర్ పార్టీ బ్రిటన్‌లో అధికార పార్టీ, హౌస్ ఆఫ్ కామన్స్‌లోని 650 సీట్లలో 404 సీట్లను ఈ పార్టీ కలిగి ఉంది. 45 సంవత్సరాల షబానా మహమూద్ వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె లేబర్ పార్టీ బలమైన, ప్రతిష్టాత్మక నాయకులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు. ఆమె ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌కు దగ్గరగా వ్యక్తిగా, పార్టీలో ప్రభావవంతమైన వక్తగా ప్రసిద్ధి చెందారు. షబానా బర్మింగ్‌హామ్ లేడీవుడ్ నియోజకవర్గానికి లేబర్ పార్టీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె 1980లో బర్మింగ్‌హామ్‌లో జన్మించింది. తన కవల సోదరుడితో కలిగి అక్కడే పెరిగింది. షబానా కుటుంబం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని మీర్‌పూర్‌కు చెందినది. ఆమె 2002లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని లింకన్ కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేసింది. ఆమె 2003లో ఇన్స్ ఆఫ్ కోర్ట్ స్కూల్ ఆఫ్ లాలో బార్ వొకేషనల్ కోర్సును పూర్తి చేసి, న్యాయవాది అయ్యారు.

బాలకృష్ణపై నటి లయ క్రేజీ కామెంట్స్..!
టాలీవుడ్‌లో ఒకప్పుడు పక్కింటి అమ్మాయి‌లా.. అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు గెలుచుకున్న నటి లయ. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో సెటిల్ అయిన ఈ ‘స్వయంవరం’ భామ.. సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోలతో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. అయితే, తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అటు నందమూరి అభిమానులను, ఇటు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘విజయేంద్ర వర్మ’ సినిమాలో లయ ఒక కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. లయ మాట్లాడుతూ.. “బాలయ్య గారు సెట్స్‌లో ఉంటే ఆ ఎనర్జీనే వేరుగా ఉంటుంది. ఆయన చాలా క్రమశిక్షణతో ఉంటారు, అదే సమయంలో తోటి నటీనటులతో ఎంతో సరదాగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటారు. ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన గొప్ప అవకాశం. అవకాశం వస్తే ఆయనతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు బలంగా ఉంది” అని చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో లయ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. “బాలయ్య గారి మనసు వెన్న.. అందుకే అందరు హీరోయిన్లు ఆయనతో మళ్ళీ నటించాలని కోరుకుంటారు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి లయ కోరికను ఏ దర్శకుడు నెరవేరుస్తారో చూడాలి!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘మహా సంగ్రామం’.. 2027 సంక్రాంతికి నలుగురు సీనియర్ స్టార్ల అరుదైన పోరు!
సాధారణంగా సంక్రాంతికి ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద హీరోలు పోటీ పడటం చూస్తుంటాం. కానీ, టాలీవుడ్ ‘ఫ్యాబ్ ఫోర్’ (Fab Four) అని పిలవబడే చిరు-బాలయ్య-నాగ్-వెంకీలు ఒకేసారి బరిలోకి దిగడం ఒక అరుదైన రికార్డు. 2027 సంక్రాంతికి ఈ నలుగురు దిగ్గజాలు తమ సినిమాలతో థియేటర్లను దద్దరిల్లజేయడానికి సిద్ధమవుతున్నారు. ‘సంక్రాంతి స్పెషలిస్ట్’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ సంక్రాంతికి రావడం దాదాపు ఖాయమైంది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటికే తమ ‘సోగ్గాళ్లు’ సినిమాను జనవరి 15, 2027న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ‘బంగార్రాజు’కి సీక్వెల్ అని, ఇందులో అక్కినేని ముగ్గురు హీరోలు (నాగార్జున, చైతన్య, అఖిల్) కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు-బాబీ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. ఒక.. పవర్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌తో మెగాస్టార్ సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని ఇప్పుడు NBK111తో మళ్ళీ మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా డిసెంబర్ కల్లా పూర్తి చేసి పండగ రేసులో నిలపాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ నలుగురు సీనియర్ హీరోలకు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొత్త తరం హీరోల హవా కొనసాగుతున్నా, తమ మ్యాజిక్ ఇంకా తగ్గలేదని నిరూపించడానికి వీరంతా ఒకేసారి పోటీకి దిగడం సినీ ప్రియులకు కనువిందు చేయనుంది.

Exit mobile version