రాజధానిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ఎక్కడా లేదు..!
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఎవరి వాదన వారిదిగా ఉంది.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానంటూ వైఎస్ జగన్ ప్రకటించగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడమే కాదు.. కొత్త అవసరాలకు అనుగుణంగా మళ్లీ భూసమీకరణ చేపట్టింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనే పదానికి రాజ్యాంగంలో ప్రత్యేక నిర్వచనం లేదని, భారత రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం ఎక్కడి నుంచి పని చేస్తే.. అదే ఆ రాష్ట్ర రాజధాని” అని పేర్కొన్న జగన్.. శాసనసభ, మంత్రులు, అధికారులు అందరూ అక్కడి నుంచే పాలన సాగిస్తారని, పాలనా వ్యవస్థ మొత్తం అక్కడి నుంచే నడుస్తుందన్నదే రాజధాని అసలైన అర్థం అని వివరించారు. అసలు, నదీ పరివాహకంలో రాజధాని నిర్మాణం సరికాదు అన్నారు వైఎస్ జగన్.. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. నదీ పరివాహక (River Basin) ప్రాంతంలో రాజధాని నగరం నిర్మించాలనుకోవడం సరికాదని, రివర్ బేసిన్‌లో భవనం కట్టడానికే సాధారణంగా అనుమతి ఉండదని, అలాంటి ప్రాంతంలో మొత్తం నగర నిర్మాణం చేపట్టాలనుకోవడం ప్రమాదకరమైన, అవివేకమైన నిర్ణయం అని విమర్శించారు వైఎస్ జగన్.
మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్.. అయితే, కేబినెట్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు, పార్టీ వ్యవహారాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత పార్టీ కార్యాలయానికి తరచూ తానే రావాల్సి వస్తోందని, అయినా ప్రజల నుంచి వచ్చే వినతులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. నెలకు రెండు నుంచి మూడు సార్లు నేనే పార్టీ ఆఫీస్‌కు రావాల్సి వస్తోంది. అయినా వినతులు మాత్రం తగ్గడం లేదన్న సీఎం చంద్రబాబు.. ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రులు మరింత చొరవ చూపాలని సూచించారు. పార్టీ కోసం ఐదేళ్ల పాటు కష్టపడ్డ కార్యకర్తల పేర్ల జాబితాను అందించమని పలుమార్లు కోరినా.. ఇప్పటికీ జిల్లాల నుంచి పూర్తి వివరాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఎన్నిసార్లు అడిగినా.. పార్టీ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డ వారి పేర్లు ఇవ్వడం లేదు. ఈ నిర్లక్ష్యం సరైన పద్ధతి కాదు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణం, పార్లమెంటు స్థాయి కమిటీల ఏర్పాటులోనూ మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని పేర్కొన్న చంద్రబాబు.. పార్లమెంటు స్థాయిలో కమిటీలు కూడా నేనే పూర్తి చేశాను. దీన్ని బట్టి ఆయా జిల్లాల మంత్రుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏపీ హైకోర్టు తీర్పు కొట్టివేత.. ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయడం కుదరదు..!
సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది.. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడం కుదరదు.. అవి దర్యాప్తుకు అనుగుణంగా కొనసాగాలి అని స్పష్టం చేసింది.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, విజయవాడలో నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్‌ల దర్యాప్తుకు పంపండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్‌లపై దర్యాప్తు పూర్తయ్యే సరికి ఆరు (6) నెలల్లో తుది నివేదిక సమర్పించాలని స్పష్టమైన సమయపరం కూడా ఇచ్చింది. ప్రతివాదుల్ని అరెస్ట్ చేయకూడదు, అయితే వారు దర్యాప్తులో పూర్తిగా సహకరించాల్సి ఉంటుందని చెప్పింది. ఈ కేసులకు సంబంధించినవి అయినా, ఇప్పటికే ఉన్న ఎఫ్ఐఆర్‌లు ఏ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులకు సంబంధించిన పిటిషన్లను హైకోర్టులు ఒక్కటి కూడా రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. గతంలో ఆయా ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసిన హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయబడింది. ఎఫ్ఐఆర్‌లను రద్దుచేయడం సరైనది కాదు అని స్పష్టం చేసింది.. సీనియర్ పోలీసింగ్ అధికారులుగా నోటిఫై అయిన ఐదుగురు అధికారుల ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలని పేర్కొంది.. అయితే, సుప్రీంకోర్టు తీర్పులో రాష్ట్ర విభజన తర్వాత కూడా పాత చట్టాలు తప్పకుండా అమలులోనే ఉన్నట్లు స్పష్టంగా పేర్కొంది. పాత చట్టాలను మార్చకుంటే అవి ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని, అవినీతి నిరోధక చట్టం కూడా వర్తించాల్సిన చట్టంగా ఉన్నదని తీర్పులో పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం కింద పలు వ్యక్తులపై ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ద్వారా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఈ కేసులను సముచిత దర్యాప్తు ద్వారా సామరస్యంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తోంది.
ఢిల్లీ, కాశీ, కోల్‌కతా, లండన్ ఎక్కడున్నాయి జగన్.. మంత్రి పయ్యావుల కౌంటర్
రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి పయ్యావుల కేశవ్.. మరి ఢిల్లీ, కాశీ, కోల్‌కతా, లండన్ ఎక్కడున్నాయి జగన్..? అంటూ ప్రశ్నించిన ఆయన, ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలు, రాజధానులు నదుల ఒడ్డునే ఉన్నాయని గుర్తుచేశారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పయ్యావుల.. నాగరికత మొదలైంది నదుల పక్కనే. మనిషి జీవన వికాసం, సంస్కృతి, వాణిజ్యం, రాజ్య వ్యవస్థలు నదీ తీరాల నుంచే పుట్టాయి. అలాంటిది నది పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మించటం తప్పు అనటం అర్థరహితం అంటూ ధ్వజమెత్తారు. అమరావతి అంశంలో జగన్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవాలేనని మంత్రి మండిపడ్డారు పయ్యావుల.. అబద్ధాలు ఈ స్థాయిలో చెప్పొచ్చా..? అని ఇవాళ జగన్ నిరూపించారు. అబద్ధాలు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే వ్యవస్థలో ఆయన ఉన్నారా..? లేక ఆయన చుట్టూ ఉన్న టీమ్ తప్పుదారి పట్టిస్తోందా..? అర్థం కావడం లేదు” అని వ్యాఖ్యానించారు. ఇక, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై జగన్ చేసిన ఆరోపణలపైనా పయ్యావుల స్పందించారు. జగన్ చేసింది కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ డిపిఆర్ మాత్రమే. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు జరగలేదు. మరి ప్రాజెక్టును ఆపేశారని ఆయన ఎలా చెప్తారు..? అసలు ఆగింది ఏమిటి..? ఆపింది ఎవరు..?” అంటూ నిలదీశారు.
డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.. గత వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగా మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని.. ఇందులో భాగంగా ఆయన కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి ప్రకటించారు. అలాగే, సహకార శాఖలో ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకు గ్రూప్–2 హోదా కలిగిన డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు ఉద్యోగపరమైన స్థిరత్వం కూడా కల్పించినట్టు తెలిపారు. ఇక రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ అంశాలపైనా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ప్రతిపాదించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ పరిశ్రమలు, సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపుల ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల సంక్షేమం కోసం పాఠశాల కిట్‌ల పంపిణీకి రూ.944.53 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు మంత్రి పార్థసారధి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 39.52 లక్షల మంది విద్యార్థులకు కిట్‌ల సరఫరా చేసిన సంస్థలకు చెల్లించాల్సిన రూ.944 కోట్ల బకాయిలను చెల్లించేందుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
ఆవకాయ అనగానే గుర్తుకు వచ్చేది ఏపీ.. తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఉత్సవాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, చరిత్రను చాటి చెప్పేలా అమరావతి-ఆవకాయ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.. ఆవకాయ అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఘనమైన ఆంధ్ర వంటక వైభవాన్ని, అమరావతి సంస్కృతిని, తెలుగు సినీ చరిత్ర ఔన్నత్యాన్ని ఒకే వేదికపై చాటిచెప్పేలా అమరావతి–ఆవకాయ ఫెస్టివల్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విజయవాడ వేదికగా నిర్వహించిన ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆవకాయ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇటువంటి కార్యక్రమాలను ఆనవాయితీగా కొనసాగించాలి. తెలుగు జాతి ఔన్నత్యాన్ని, మన సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలి అని అన్నారు. రాష్ట్ర సంస్కృతి, వంటకాలు, సృజనాత్మక రంగాలను ప్రోత్సహించేలా ఈ ఫెస్టివల్‌లో 28 ప్రత్యేక ఈవెంట్లు, 4 వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఫుడ్ అంటే భారతదేశం.. భారతదేశంలో ఫుడ్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వచ్చే స్థాయికి మన వంటకాలకు ఖ్యాతి ఉంది అంటూ ఆంధ్ర వంటల గొప్పదనాన్ని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఉత్సవాలు, సంబరాలు లేక ప్రజల్లో నవ్వులు కూడా కరువయ్యాయని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్, అమ్మవారి దసరా ఉత్సవాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు. ఒకప్పుడు దసరా అంటే మైసూరు, కలకత్తా గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా ఉత్సవాలు నిర్వహించాం అని చెప్పారు.
విద్యలో నూతన సంస్కరణలు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ ఎస్) మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజకవర్గంలోనూ బాలురు, బాలికలకు ఒకొక్కటి చొప్పున వైఐఐఆర్ ఎస్ ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేనన్నారు. ప్రస్తుతం బాలికలకు స్కూల్స్ కేటాయించిన నియోజకవర్గంలో మరో విడతలో బాలురకు కేటాయించాలన్నారు. విద్యా శాఖపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వైఐఐఆర్‌సీలో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్‌లో చేపట్టే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. వైఐఐఆర్ ఎస్ ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల్లలో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణవ్యాప్తంగా అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తగినంత స్థలం, అవసరమైన మద్దతు అందజేస్తే పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయగలమని అక్షయపాత్ర ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయింపు లేదా 99 సంవత్సరాలకు లీజు తీసుకునే అంశంపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడి త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ముఖ్యమంత్రి సూచించారు.
ముంబై మేయర్ పీఠం మరాఠా హిందువుదే..
“బుర్ఖా ధరించిన ముస్లిం” ముంబై మేయర్ పీఠాన్ని చేపట్టవచ్చని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల మౌనాన్ని సీఎం దేవేంద్ర పడ్నవీస్ ప్రశ్నించారు. మరాఠీ హిందువే తదుపరి ముంబై మేయర్ అవుతారని ఆయన అన్నారు. బీజేపీకి దేశమే మొదటి ప్రాధాన్యత అని, బీజేపీ మరాఠీ, మరాఠీయేతర ఓటర్లనున విభజించడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలను తిప్పికొట్టారు. ముంబై మేయర్ పదవి మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడిందా.? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. అవును అంటూ అంటూ ఫడ్నవీస్ సమాధానం ఇచ్చారు. చెన్నైలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే, ప్రజలు సహజంగా తమిళుడే మేయర్ కావాలని కోరుకుంటారు, ఇదే విధంగా ముంబైలో మరాఠీ వ్యక్తే అవుతారని అన్నారు. జనవరి 15న జరగనున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ముఖ్యమంత్రి వ్యాఖ్య వచ్చింది. ఫడ్నవీస్ ఎంఐఎం నేత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని, ఇక్కడి మేయర్ హిందువు, మరాఠీ వారే అవతారని సీఎం స్పష్టం చేశారు. బీఎంసీతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసినా కూడా ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నారు.
‘‘మమతా బెనర్జీ కీలక ఫైల్స్ తొలగించారు’’.. హైకోర్టుకు ఈడీ..
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కోల్‌కతాలో ఐ-ప్యాక్ కార్యాలయం, ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇంట్లో సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఈ సోదాలు జరుగుతున్న సమయంలో సీఎం మమతా బెనర్జీ హుటాహుటిన ఘటనా స్థలానికి రావడం, ఐ ప్యాక్ ఆఫీసుల నుంచి కీలకమైన కొన్ని ఫైళ్లను తీసుకెళ్లడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ పరిణామాలపై ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ ఇంటి నుంచి ఒక ల్యాప్‌టాప్, అతడి ఫోన్, పలు పత్రాలు తీసుకెళ్లారని ఈడీ ఆరోపించింది. సీఎం దర్యాప్తుకు అంతరాయం కలిగిస్తున్నారని, బొగ్గు స్మగ్లింగ్ మనీలాండరింగ్‌లో పాలుపంచుకునన్న వారికి మద్దతు ఇస్తున్నారని ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై కోర్టు రేపు విచారణ జరిపే అవకాశం ఉంది. అయితే, ఈ దాడి రాజకీయ ప్రేరేపితమని, బీజేపీ, అమిత్ షా చేయించిందని మమతా బెనర్జీ ఆరోపించింది. మరోవైపు, ఈ సోదాలు సాక్ష్యాధారాల ఆధారంగా జరిగాయని, ఏ రాజకీయ సంస్థను లక్ష్యంగా చేసుకోలేదని ఈడీ చెబుతోంది. ఈ దాడి సమయంలో ముఖ్యమైన పత్రాలు చోరీకి గురయ్యాయని ఆరోపిస్తూ ప్రతీక్ జైన్ కుటుంబం కూడా ఈడీపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. బెంగాల్ సీఎం, పోలీసులు వచ్చే వరకు సోదాలు శాంతియుతగా జరిగాయి. వారు వచ్చిన తర్వాత భౌతిక పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తొలగించారని ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. మమతా బెనర్జీ, ఆమె సిబ్బంది, రాష్ట్ర పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారని, ఇది మనీలాండరింగ్ దర్యాప్తు, విచారణకు ఆటంకం కలిగిస్తోందని పేర్కొంది.
ఏప్రిల్ 3న నిహారిక ‘రాకాస’
ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ ఖరారు చేసి.. టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘రాకాస’ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా మెప్పించనున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తే.. మానస శర్మ రచయితగా వర్క్ చేశారు. తర్వాత మానస సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ5 బ్యానర్స్‌పై రూపొందుతోన్న రాకాస చిత్రంతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
రెండు రోజులాగండి, తగ్గాకే వెళ్ళండి.. టికెట్ రేట్లపై టాలీవుడ్ నిర్మాత సంచలనం
విజయవాడ నగరం నడిబొడ్డున లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం కొలువుదీరనుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ వివరాలతో పాటు, ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సినిమా టికెట్ ధరల పెంపుపై ఆదిశేషగిరిరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలు మరియు ప్రేక్షకుల కోణంలో ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెద్ద సినిమాల బడ్జెట్ పెరిగిందన్న సాకుతో టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. “పెద్ద సినిమాల రేట్లు విపరీతంగా పెంచడం వల్ల చిన్న సినిమాలు మనుగడ కోల్పోతున్నాయి. దీనివల్ల సామాన్య ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం.” ధరల భారం నుంచి తప్పించుకోవడానికి ప్రేక్షకులకు ఆయన ఒక లాజిక్ చెప్పారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులే భారీ ధరలు ఉంటాయి, ఆ మూడు రోజుల బిజినెస్ అయిపోగానే రేట్లు తగ్గుతాయి. టికెట్ ధరలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో, అప్పుడే థియేటర్లకు వెళ్లాలని ఆయన సూచించారు. అలాగే సినిమా ప్రొడక్షన్ ఖర్చులు నియంత్రణలో ఉంటేనే, టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
బెజవాడ నడిబొడ్డున కృష్ణ విగ్రహం..ఆవిష్కరించనున్న కొత్త ఘట్టమనేని హీరో
విజయవాడ నగరంతో ఘట్టమనేని కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది, ఇప్పుడదే నగర నడిబొడ్డున లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం కొలువుదీరనుంది. ఈనెల 11వ తేదీన జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అగ్నిపర్వతం’ సినిమా విడుదలై 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని కృష్ణ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తున్న ఆయన మనవడు జై కృష్ణ ఆవిష్కరించనున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో జై కృష్ణ హీరోగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక విజయవాడలోని సినిమా థియేటర్లు, ఇక్కడి ప్రముఖులతో కృష్ణ గారికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఆదిశేషగిరిరావు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.