కోడికి.. గుడ్డుకి తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్.. రోజా మాటలు వింటే మగవాళ్లే సిగ్గు పడతారు..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీకి రాకపోవడంతో రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తున్నాం అంటూ హాట్ కామెంట్స్ చేశారు.. జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతీ నెలా జీతాలు తీసుకుంటున్నారని వెల్లడించారు.. అయితే, జీతం తీసుకుని డ్యూటీ చేయనంటే ఉద్యోగులను సస్పెండ్ చేసి, ఉద్యోగం నుంచి తీసేస్తున్నాం.. అటువంటిది ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు..? అని నిలదీశారు.. అసలు.. కోడికి… గుడ్డుకి తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ ఫైర్ అయ్యారు.. మరోవైపు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజాపై హాట్ కామెంట్లు చేశారు అయ్యన్నపాత్రుడు.. రోజా మాటలు వింటే మగవాళ్లే సిగ్గు పడతారన్న ఆయన.. అటువంటివి అన్నీ సెల్ ఫోన్ ల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయి.. సినిమాలకు సెన్సార్ ఉన్నట్టే సెల్ ఫోన్లు కు కూడా సెన్సార్ ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఆ దిశగా మేధావులు పిల్ దాఖలు చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
నకిలీ మద్యం కేసులో నిందితులకు షాక్.. ఐదు రోజుల కస్టడీకి అనుమతి..
ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసు తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఈ కేసులో నిందితులకు షాక్ ఇచ్చింది విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు.. నకిలీ మద్యం తయారీ కేసులో ఏడుగురు నిందితులకు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది ఎక్సైజ్ కోర్టు.. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు, అల్లా భక్షులను కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.. ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.. మరోవైపు, అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ శాఖ పోలీసులు.. గోవాకు చెందిన శిబూ, జనేష్‌ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. తర్వాత చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. ఇక, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఇద్దరు నిందితులను మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు పోలీసులు..
క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి, కేశినేని చిన్ని వివరణ.. ఎవరు ఏం చెప్పారంటే..?
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరయ్యారు.. గత కొన్ని రోజులుగా తిరువూరు అంశానికి సంబంధించి పంచాయితీ జరుగుతోంది.. సీఎం చంద్రబాబు వీరిద్దరినీ క్రమ శిక్షణ సంఘం ముందు హాజరు కావాలని చెప్పారు… దీంతో, ఈ రోజు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందు వివరణ ఇచ్చారు… ఆయన కేశినేని చిన్ని మీద చేసిన విమర్శలు ఆరోపణలు అన్నిటికి సంబంధించి ఒక బుక్లెట్ కూడా టిడిపి క్రమ శిక్షణ సంఘానికి అందించారు… తాను చేసిన విమర్శలు అందుకు గల కారణాలు అన్ని ఆ బుక్ లెట్ లో వివరించారు… టిడిపి క్రమశిక్షణ కమిటీ కొలగపూడి శ్రీనివాస్ కు కొన్ని ప్రశ్నలు వేసింది..తాను డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాను అన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించి నట్టుసమాచారం… ఈ విమర్శలు ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చింది ఎలాంటి ఆధారాలు ఉన్నాయని వివరణ అడిగారు.. ఇక, కొలికపూడి వివరణ తర్వాత సాయంత్రం 4 గంటలకు క్రమశిక్షణ సంఘం ముందు ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు… ఆయనను కూడా క్రమ శిక్షణా కమిటీ కొన్ని ప్రశ్నలు వేసింది… వివరణ కోరింది.. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఈ రకమైన విభేదాలు వస్తున్నాయని ప్రశ్నించింది… క్రమ శిక్షణ కమిటీ అడిగినవాటికి చిన్ని సమాధానం చెప్పారు.. అంతే కాకుండా తిరువూరు ఎమ్మెల్యే చేసిన విమర్శలకు కూడా సమాధానం చెప్పారు… తిరువూరు ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి క్రమశిక్షణ సంఘం ముందు తన అభిప్రాయం వ్యక్తం చేశారు కేశినేని చిన్ని. క్రమశిక్షణ సంఘం అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ ఇద్దరి అభిప్రాయాలు తీసుకుంది… ఒక నివేదిక తయారు చేయనుంది… ఈ నివేదిక సీఎం చంద్రబాబుకు అందించనుంది.. ఆ తర్వాత ఈ నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం హాట్ టాపిక్ గా మారింది.
విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలిపై వేటు వేసిన ప్రభుత్వం..
విద్యార్ధులతో కాళ్లు పట్టించుకున్న ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాగా, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న సుజాత వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఉపాధ్యాయురాలు ఎంతో హుందాగా సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ కుర్చీలో కూర్చిని ఉండగా.. ఇద్దరు విద్యార్థినులు ఆ హెచ్‌ఎం కాళ్లు నొక్కుతున్నారు. ఈ చిత్రాన్ని చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. వైరల్‌గా మారిన ఆ ఫొటోపై సోషల్ మీడియాలో పెద్ద దుమారనే రేగింది.. అయితే, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఉపాధ్యాయురాలిపై వేటు వేసింది.. శ్రీకాకుళం జిల్లా బందపల్లి గిరిజన పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న సుజాతను సస్పెండ్ చేసింది.. సుజాత విద్యార్ధులతో కాళ్లు పట్టించుకున్నట్లు ఉన్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై, హెచ్‌ఎం సుజాతపై విచారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇదే సమయంలో.. సుజాతపై విచారణ పూర్తయ్యే వరకూ ఆమెపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
దేశం గర్వించే స్థాయిలో భోగాపురం ఎయిర్‌పోర్ట్.. 91.7 శాతం పనులు పూర్తి..
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధాన వనరుగా మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ. ఆర్. దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలతో కలిసి విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, రెండు నెలల క్రితం 86.61 శాతం పనులు పూర్తయితే, ప్రస్తుతం 91.70 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశించిన డెడ్‌లైన్ డిసెంబర్ 2026 కంటే ముందుగానే — వచ్చే ఏడాది జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నామని వెల్లడించారు. మిగిలిన 8.3 శాతం పనులను వేగంగా పూర్తి చేస్తామని, డిసెంబర్ లేదా జనవరిలో వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. భోగాపురం ప్రాజెక్ట్ ప్రారంభం తర్వాత స్థానిక యువతలో ఆలోచనా దిశ మారిందని, రియల్ ఎస్టేట్ సహా పలు రంగాలు వృద్ధి చెందుతున్నాయని తెలిపారు. విమానాశ్రయం పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్రలో ఆర్థికాభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. స్థానికంగా ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపనపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలు ఏర్పడుతున్నాయని, వాటికన్నా అధిక వృద్ధిని భోగాపురంలో చూడబోతున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
చెల్లిని బయటకు పంపిన కసాయి కేటీఆర్ కాదా..?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 30 వేల మెజార్టీ తో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. BRS ఉప ఎన్నికలు వచ్చాయి.. మా MLA చనిపోయారు… ఆయన సతీమణికి ఓటేయండి అని అడుగుతున్నారని, పట్నం వచ్చిన పేదలకు ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి పీజేఆర్ అన్నారు. పీజేఆర్ ఆడబిడ్డల కోసం కృష్ణ జలాలు హైదరాబాద్ తీసుకువచ్చారని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది పీజేఆర్ అని రేవంత్ రెడ్డి. అలాంటి పీజేఆర్ చనిపోతే.. ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు కూడా పీజేఆర్ కుటుంబానికి మద్దతు ఇచ్చారని, కానీ కేసీఆర్ మాత్రం.. సెంటిమెంట్ లేదు.. ఏకగ్రీవం ఇచ్చేది లేదని పీజేఆర్ కుటుంబం మీద పోటీకి పెట్టారన్నారు. పీజేఆర్ కుటుంబంనీ కేసీఆర్ తన ఇంటి ముందు మూడు గంటలు కూర్చోపెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు.
ఫాం హౌస్ నుండే వస్తలేడు.. అధికారంలోకి ఎలా వస్తాడు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్, PJR టెంపుల్ వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదల మేలు కోరే కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని జూబ్లిహిల్స్ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసం పూర్తి చేశారు, కానీ రాష్ట్రంలో మరో పెద్ద ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు” అని గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను విమర్శించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ మూడు సంవత్సరాలు కాదు, రాబోయే ఐదేళ్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
‘‘ఉమర్ ఖలీద్ అమాయకుడు’’.. దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ గురించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఉమర్ ఖలీద్ ‘‘నిర్దోషి, అమాయకుడు’’ అంటూ ఆయన అనడం కొత్త వివాదాన్ని రేపింది. జాతీయ భద్రతలకు ఆందోళన కలిగించే తీవ్రమైన కేసుల్లో ఉన్న వ్యక్తి పట్ల దిగ్విజయ్ సింగ్ సానుభూతి చూపిస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడి చేసింది. దిగ్విజయ్ సింగ్ తన సోషల్ మీడియా పోస్టులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలీద్ ఐదేళ్లుగా నిర్బంధంలో ఉన్నప్పటికీ న్యాయం దక్కడం లేదని ఆయన అన్నారు. ‘‘ఉమర్ ఖలీద్ చరిత్రలో డాక్టరేట్ పొందారు. ఆయన ఉన్నత విద్యావంతుడు, సున్నితమైన వ్యక్తి. ఆయనపై ఎలాంటి నేరాలు ఆరోపించబడినా దర్యాప్తు చేసి పరిష్కరించాలి. ఆయన ఐదున్నర సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. ఆయనపై ఎటువంటి అభియోగాలు నిరూపించబడలేదు. సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ బెయిల్ ఒక హక్కు అని చెబుతుంది; జైలు ఒక మినహాయింపు. కానీ ఇక్కడ, ఆయనకు ఈ హక్కు ఎక్కడ మంజూరు చేయబడింది? ఆయన విచారణలు కొనసాగుతున్నప్పుడు, న్యాయమూర్తులు నిరంతరం తేదీలను వాయిదా వేస్తారు. తేదీ నిన్నటిది, కానీ అది వాయిదా పడింది. నేడు అధికారంలో ఉన్నవారు అలాంటి నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. దీని కారణంగా, ఆయనకు అర్హత ఉన్న వాటిని కూడా పొందడం లేదు.’’ అని అన్నారు.
సాహో భారత్.. మలేషియాలో యూపీఐ అధికారిక సేవలు ప్రారంభం
భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రపంచ మైలురాయిని సాధించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగం అయిన NIPL మలేషియాలో అధికారికంగా తన సేవలను ప్రారంభించింది. దీంతో UPI సేవలను స్వీకరించిన ప్రపంచంలో తొమ్మిదవ దేశంగా మలేషియా అవతరించింది. ఈ కీలక పరిణామంతో మలేషియాను సందర్శించే లక్షలాది మంది భారతీయ పర్యాటకులకు గణనీయమైన ఉపశమనం, సౌకర్యం లభించనుంది. ఇకపై మలేషియాలో కొనుగోళ్లు చేయడానికి భారతీయులు నగదు లేదా విదేశీ కరెన్సీపై మాత్రమే ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది.
ఫోన్ పే PhonePe Protect ఫీచర్.. మోసపూరిత నంబర్‌కు ఒక్క రూపాయి కూడా బదిలీ కాదు..
సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. రోజుకో ఎత్తుగడతో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఫేక్ లింక్స్, మెసేజెస్ పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే PhonePe Protect అనే ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. డిజిటల్ వరల్డ్ లో మీ డబ్బుకు మీరు దీనిని సేఫ్టీ షీల్డ్ గా పరిగణించవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో, మీరు డబ్బు పంపుతున్న నంబర్ అనుమానాస్పద నంబర్ అవునా కాదా అని మీకు తెలుస్తుంది. ఈ ఫీచర్‌ను PhonePe ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కూడా ప్రదర్శించింది. ఇప్పుడు, మీరు మోసపూరిత చరిత్ర కలిగిన నంబర్‌కు చెల్లింపు చేస్తే, మీకు హెచ్చరిక వస్తుంది. పొరపాటున కూడా మీరు మోసగాడికి డబ్బు పంపకుండా, మీ డిజిటల్ లావాదేవీ 100% సురక్షితంగా ఉండేలా చూసుకోవడం దీని ఉద్దేశ్యం. ఈ ఫీచర్ కోసం PhonePe భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుండి డేటాను ఉపయోగిస్తుంది. DoT ఇటీవల ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) అనే కొత్త సాధనాన్ని ప్రారంభించింది. ఈ ఫీచర్ ఆర్థిక మోసానికి సంబంధించిన మొబైల్ నంబర్‌లను ట్రాక్ చేస్తుంది.
క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఆ ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు
క్రికెట్‌లో సెంట్రల్ కాంట్రాక్టుల గురించి తెలుసు కదా.. ఈ కాంట్రాక్టులు క్రీడాకారులకు చెల్లించే డబ్బులకు సంబంధించినవి. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 2025-26 సీజన్ కోసం కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను ప్రకటించింది. ఈసారి ఈ జాబితాలో మొత్తం 30 మంది పురుషుల అంతర్జాతీయ ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. వీరిలో 14 మంది ఆటగాళ్లు రెండేళ్ల ఒప్పందాలపై సంతకం చేయగా, 12 మంది ఆటగాళ్లకు ఒక ఏడాది కాంట్రాక్టులు లభించాయి. ఇంతకీ వాళ్లు ఎవరు, గతంలో ఒప్పందం పొంది కొత్త జాబితాలో చోటు దక్కించుకోని వారు ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మునుపటి సెంట్రల్ కాంట్రాక్టులో భాగమైన ఆరుగురు ఆటగాళ్లకు తాజా జాబితాలో చోటు ఇవ్వలేదు. కాంట్రాక్టు రద్దు చేసిన ఆ ఆరుగురు ఆటగాళ్లు ఎవరంటే.. జానీ బెయిర్‌స్టో, జాక్ లీచ్, లియామ్ లివింగ్‌స్టోన్, ఓలీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన క్రిస్ వోక్స్‌కు కూడా జాబితాలో ప్లేస్ లేదు. ఈ సారి కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన వాళ్లు ఎవరంటే.. సోనీ బేకర్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, జామీ ఓవర్టన్, ల్యూక్ వుడ్.
పెద్ది మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసిందోచ్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు కలిసి సాంగ్ గురించి చర్చిస్తున్న ఫొటోను రిలీజ్ చేశారు. చికిరి అంటే ఏంటో రేపు ఉదయం 11.07 గంటలకు తెలుసుకోండి అంటూ పోస్టు పెట్టింది మూవీ టీమ్. రేపు ఉదయం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి రాబోతోంది. ఆ పాటను లిరికల్ రూపంలో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ మధ్య పెద్ది మూవీ నుంచి పెద్దగా అప్డేట్లు రాలేదు. అందుకే ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు ఈ సాంగ్ ను తీసుకొస్తున్నారు. సాంగ్ కు సంబంధించి అన్ని పనులు అయిపోయాయంట. రేపు రిలీజ్ తర్వాత మంచి హైప్ పెరుగుతుందని మూవీ టీమ్ భావిస్తోంది. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా ఈ సాంగ్ ఉండబోతోందంట. సరికొత్తగా ఉండనున్న ఈ సాంగ్ ఎలాం ఉంటుందో చూడాలి.
నన్ను ఇబ్బంది పెట్టొద్దు.. బండ్ల గణేష్ షాకింగ్ పోస్ట్
బండ్ల గణేశ్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన ఏ స్టేజ్ ఎక్కినా సరే రచ్చ రచ్చే. ఆయన చేసే కామెంట్లు ఇండస్ట్రీలో తుఫాన్ సృష్టిస్తున్నాయి. రీసెంట్ గా బండ్ల ఓ ఈవెంట్ కు వెళ్లినప్పుడు బండ్ల గణేశ్ ఒక ప్లాప్ తర్వాత సినిమాలు తీయట్లేదని.. త్వరలోనే రావాలని నిర్మాత ఎస్కేఎన్ అన్నాడు. దానికి బండ్ల రిప్లై ఇస్తూ.. తాను బ్లాక్ బస్టర్ మూవీ తర్వాతనే సినిమాలకు గ్యాప్ ఇచ్చానని.. త్వరలోనే స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నట్టు చెప్పాడు. ఇంకేముంది రకరకాల కథనాలు వచ్చేశాయి. చిరంజీవితో సినిమా చేస్తున్నాడని.. పవన్ కల్యాణ్ తో మూవీ ఉంటుందంటూ రకరకాల వార్తలు వచ్చేశాయి. ఈ వార్తలపై తాజాగా బండ్ల గణేశ్ రియాక్ట్ అయ్యాడు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించట్లేదు. నేను ప్రొడ్యూసరగా చేస్తున్నట్టు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు రాసి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ రాసుకొచ్చాడు బండ్ల. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. అసలు బండ్లను ఎవరు ఇబ్బంది పెట్టారంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో.. అసలు నువ్వు ఎవరితో సినిమా తీస్తావో ముందు చెప్పు అంటున్నారు. బండ్ల గణేశ్ మాత్రం వరుస మూవీల ఈవెంట్లకు వస్తూ బిజీగా ఉంటున్నాడు. ఎక్కడకు వచ్చినా మంచి స్టఫ్ ఇచ్చి వెళ్తున్నాడు.
