రైల్వే బడ్జెట్.. ఏపీకి భారీగా పెరిగిన నిధుల కేటాయింపు..
ఈ బడ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయింపులు జరిగాయని తెలిపారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. ఈ బడ్జెట్ లో యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.. ఏపీలో మొత్తం అమలవుతోన్న రైల్వే ప్రాజెక్టులు రూ. 84,559 కోట్ల వరకు కేటాయించామన్నారు.. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో, శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులను బడ్జెట్ లో ప్రకటించడం లేదన్నారు.. ఇక, రైల్వే శాఖ మంత్రి ప్రెస్ మీట్ ను వర్చువల్ గా వీక్షించిన డీఆర్ఎంలు… తెలంగాణలో మొత్తం రైల్వే లైన్లు అన్నీ విద్యదీకరణ జరిపాం.. కవచ్ లొకేషన్ సెంటర్ సికింద్రాబాద్ లో ఉంది.. 1326 కిలోమీటర్లు సికింద్రాబాద్ సెంటర్ గా కవర్ అవుతుందన్నారు అశ్వనీ వైష్ణవ్.. 200 వందేభారత్ రైళ్ళకు అనుమతి లభించింది.. నవభారత్ రైళ్ళు విజయవాడ – హైదరాబాద్ మధ్య నడపాలని నిర్ణయించాం.. అమృత్ భారత్ రైళ్లలో 450 రూపాయలకే 1000 కిలోమీటర్లు పయనించేలా సౌకర్యం కల్పిస్తున్నాం.. వంద అమృత్ భారత్ రైళ్ళు త్వరలో తీసుకొస్తాం.. ఏపీ కొత్త రాజధాని కోసం కూడా ఒక ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది.. ఏపీలో 9417 కోట్లు రైల్వే అభివృద్ధికి ఏర్పాటు చేశారు.. 100 శాతం విద్యుదీకరణ ఏపీలో పూర్తయ్యిందన్నారు.. 1560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ లు గత సంవత్సరం పూర్తయ్యాయి.. శ్రీలంకలో ఉన్న రైల్వే లైన్ల కంటే ఏపీలో ఉన్న నెట్వర్క్ పెద్దది.. రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధిలో సీఎం చంద్రబాబు సహకారాన్ని నేను అభినందిస్తాను అన్నారు.. ఏపీకి 200 వందేభారత్, 100 నమోభారత్ రైళ్లను ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు అశ్వనీ వైష్ణవ్..
జనసేన కార్యాలయంలో జనవాణి.. భూకబ్జాలపై ఫిర్యాదుల వెల్లువ
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి జనవాణి కార్యక్రమం నిర్వహించారు.. భూ కబ్జాలు, ఆక్రమణలపై జనవాణికి ఫిర్యాదులు వెల్లువలా వచ్చినట్టు జనసేన ప్రకటించింది.. అయితే, వైసీపీ నేతల దందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నట్టు చెబుతున్నారు.. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి భూబాధితులు క్యూ కడుతున్నారని జనసేన తెలిపింది.. ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తోంది.. భూ ఆక్రమణలు, రికార్డుల తారుమారుపై కూడా ఫిర్యాదు అందాయి.. భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నట్టు వెల్లడించారు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వెనామపాలెంలో తమకు వారసత్వంగా వచ్చిన ఐదు ఎకరాల భూమిలో దూడల వెంకయ్య అనే వ్యక్తి వైసీపీ నేతల అండతో రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారని.. మా భూమిని ప్లాట్లుగా మార్చేసి దొంగ డాక్యుమెంట్లతో 60 మందికి విక్రయించారని చంద్రకళ అనే మహిళ ఫిర్యాదు చేసింది.. ఇక, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన సామెల్ తన తండ్రికి బ్రిటీష్ వారు ఇనాంగా ఇచ్చిన 12 ఎకరాల భూమిని గత ప్రభుత్వ హయాంలో హస్సేన్ రెడ్డి, టంగుటూరు రామిరెడ్డితో పాటు మరో నలుగురు కలిసి ఆక్రమించారంటూ జనవాణిని ఆశ్రయించారు.. ఇలా భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు జనవాణికి వచ్చాయి..
సోనూసూద్‌పై చంద్రబాబు ప్రశంసలు..
ప్రముఖ నటుడు, సూద్ ఛారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ ప్రభుత్వానికి తన ఫౌండేషన్ ద్వారా నాలుగు అంబులెన్స్‌లను అందించారు సోనూసూద్.. ఈ సందర్భంగా సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.. ఆ తర్వాత నాలుగు అంబులెన్స్‌లను చంద్రబాబు ప్రారంభించారు. మర్యాద పూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోనూసూద్‌ను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో ‘సూద్ ఛారిటీ ఫౌండేషన్’ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం.. ఇక, సోనూసూద్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు.. “సోనూసూద్.. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది! సూద్ ఛారిటీ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అంబులెన్స్‌లను ఉదారంగా విరాళంగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ప్రశంసనీయమైన చొరవ ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తుంది.. మారుమూల ప్రాంతాలలో సకాలంలో వైద్య సంరక్షణను నిర్ధారిస్తుంది. సమాజానికి సేవ చేయడానికి మరియు ఉద్ధరించడానికి మీరు చేసే గొప్ప ప్రయత్నాలలో మీరు నిరంతరం విజయం సాధించాలని కోరుకుంటున్నాను..” అంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు..
‘ఫీజు పోరు’ మార్చి 12కు వాయిదా వేసిన వైసీపీ.. కారణం ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ.. వివిధ అంశాలపై పోరాటాలు నిర్వహిస్తూ వస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అందులో భాగంగా.. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5వ తేదీ వైసీపీ ఫీజు పోరు కార్యక్రమాన్ని తలపెట్టింది.. అయితే, ఈ నెల 5వ తేదీన తలపెట్టిన ఫీజు పోరు ఆందోళన కార్యక్రమాలను మార్చి 12వ తేదీకి వాయిదా వేసినట్టు వైసీపీ ప్రకటించింది.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాయిదా వేసినట్టు పేర్కొంది.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు వైసీపీ నేతలు.. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మార్చి 12వ తేదీన ఫీజు పోరు నిర్వహించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ, ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తున్నాం అంటూ.. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేయడానికి వెళ్తున్న అఘోరి.. అడ్డుకున్న పోలీసులు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లేల చెక్ పోస్ట్ దగ్గర నాగ సాధు అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి దేవస్థానంలో ఉన్న దర్గాను కూల్చి వేస్తానంటూ ఇటీవల ఆయన ఛాలెంజ్ చేశారు. ఇందులో భాగంగానే, ఆ దర్గాను కూల్చి వేయడానికి బయలుదేరిన అఘోరిని.. తంగళ్ళపల్లి మండలం జిల్లేల గ్రామ శివారులోని జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని తిరిగి వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, అఘోరిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక, సదరు అఘోరిని చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలి రావడంతో.. పరిస్థితులు ఉద్రిక్తతగా మారింది. తంగళ్ళపల్లి, సిరిసిల్ల పోలీసులు జిల్లేలకు చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే, పోలీసులు అఘోరితో మాట్లాడడానికి ప్రయత్నించిన అతడు మాత్రం ఒప్పుకోక పోవడంతో చివరికి చేసేదేమీ లేక టోయింగ్ వ్యాన్తో కారును బంధించి హైదరాబాద్ మార్గంలో అఘోరీ కారును పోలీసులు తరలించారు.
నిరుద్యోగం విషయంలో రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేశారు..
నిరుద్యోగ్యం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.. అందులో, తెలుగులో ఒక సామెత ఉంది- పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట.. అచ్చం అలాగే, రాహుల్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలకు ఈ సామెతకు సరిపోతుందన తెలిపారు. ఇక, రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి, వాటిని ఎన్డీయే సర్కారుకి ఆపాదించడం అతని అవివేకానికి నిదర్శనం అన్నారు. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా రాహుల్ కోసం కొన్ని వాస్తవాలను ఇక్కడ తెలియజేస్తున్నాను అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
కేంద్రమంత్రిపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు.. కారణమిదే!
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశంసలు కురిపించారు. బొగ్గు, గనుల శాఖలో సమర్థతతో పాటు పారదర్శకత తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారని కితాబు ఇచ్చారు. సింగిల్ విండో వ్యవస్థ చాలా అద్భుతమైనదని, గనులు మన సహజ సంపద అని.. ఈ విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అభినందనలు తెలపాలని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు. ‘గౌరవనీయులైన ఎంపీ.. రాజ్యసభలో ఇవాళ అడిగిన ప్రశ్నకు.. బొగ్గు, గనుల రంగంలో పారదర్శకత పెంపొందిచేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించాను. గనుల రంగంలో సింగిల్ విండో వ్యవస్థను కొనియాడిన గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గారికి కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో గనుల రంగంలో సమర్థత, పారదర్శకత తెచ్చేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
గెలుపుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు.. ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన ఆప్ అధినేత
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 55 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్‌లో కేజ్రీవాల్ ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నగరంలో అన్ని ఉచిత పథకాలను నిలిపివేస్తుందన్నారు. బీజేపీ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని.. ఒక్క రాష్ట్రం కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తామని కమలనాథులు చెబుతోందని ఆరోపించారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఈ సారి ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తోంది. అయితే మరోసారి అధికారం కోసం ఆప్.. ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
‘నెహ్రూ టైంలో పావు వంతు, ఇందిరా టైంలో రూ. 10 లక్షల టాక్స్’’..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపుల గురించి మాట్లాడారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాని మోడీ ప్రచారం చేశారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సమయంలో పన్నుల విధానం గురించి విమర్శించారు. నెహ్రూ కాలంలో ఎవరికైనా రూ. 20 లక్షల జీతం ఉంటే పావు వంతు పన్ను కట్టాల్సి వచ్చేదని, ఇందిరాగాంధీ సమయంలో రూ. 12 లక్షలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం పన్నుగా వసూలు చేశారని ప్రధాని విమర్శించారు. 10-12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో రూ. 12 లక్షల జీతం ఉంటే రూ. 2.6 లక్షలు పన్నులుగా వసూలు చేసేదని, నిన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 12 లక్షలు సంపాదించే వారు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదకుండా చేశామని చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని ఆర్కే పురంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మధ్యతరగతిని గౌరవించే, నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకు బహుమతులు ఇచ్చే ఏకైక పార్టీ బిజెపి అని అన్నారు. నిన్నటి బడ్జెట్‌ని మొత్తం మధ్యతరగతి వర్గం భారతదేశ చరిత్రలోనే స్నేహపూర్వక బడ్జెట్‌గా చెబుతోందని, భారతదేశంలో ప్రతీ కుటుంబం ఆనందంతో ఉందని ప్రధాని అన్నారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ ఎదురుదాడి చేశారు. ఆయన ఎల్లప్పుడు దేశ మొదటి ప్రధానిని నెహ్రూని సాకుగా నిందిస్తూనే ఉంటారని అన్నారు.
రూ. 300 టీ-షర్టు కోసం హత్య..
కేవలం రూ. 300 టీ-షర్టుపై చెలరేగిన వివాదం ఒక వ్యక్తి ప్రాణాలను తీసింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో టీ షర్టుపై చెలరేగిన వివాదం స్నేహితుడైన 30 ఏళ్ల వ్యక్తిని హత్య చేయడానికి కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం శాంతి నగర్ ప్రాంతంలో శుభమ్ హర్నే(30) అనే వ్యక్తి , టీ-షర్టు కొనుగోలు చేసిన అక్షయ్ ఆసోల్(26)కి రూ. 300 చెల్లించడానికి నిరాకరించాడు. దీనిని అక్షయ్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. ఇది అతడికి సరిపోకపోవడంతో శుభమ్‌కి ఇచ్చాడు. అయితే శుభమ్ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. అయితే, టీషర్టుకి డబ్బులు చెల్లించడానికి నిరాకరించడంతో అక్షయ్, శుభమ్ మధ్య వాగ్వాదం చెలరేగింది. గొడవ పెద్దది కావడంతో శుభమ్ అక్షయ్‌ని తిడుతూ డబ్బును అతడిపైకి విసిరాడు. ఘటన తర్వాత అక్షయ్ అతడి సోదరుడు ప్రయాగ్ అసోల్ కోపంతో శుభమ్ గొంతు కోశారు. దీంతో శుభం అక్కడికక్కడే మరణించాడు. ఘటన సమయంలో సోదరులిద్దరూ మద్యం తాగి ఉన్నారని నాగ్‌పూర్ పోలీస్ డీఎస్పీ మోహక్ స్వామి తెలిపారు. ఈ ఘటన తర్వాత అన్నదమ్ములిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. శుభమ్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ముగ్గురికి కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడూ చూడలేదు.. అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు
ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు.. సిక్సులు, ఫోర్లతోనే డీల్ చేశాడు. అభిషేక్‌ను ఔట్ చేసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు చెమటోడ్చినా.. చివరి వరకూ ఉండి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. 37 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. టీ20 అంతర్జాతీయ చరిత్రలో మూడవ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరఫున అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ రికార్డు అభిషేక్ పేరిట నమోదైంది. కాగా.. అభిషేక్ ఇన్నింగ్స్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ ఇన్నింగ్స్ గురించి జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. టీ20లో ఇలాంటి ఇన్నింగ్స్‌ను తానెప్పుడూ చూడలేదన్నారు. ‘ఇలాంటి టీ20 సెంచరీని నేనెప్పుడూ చూడలేదు. అది కూడా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఇదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. ఫియర్‌లెస్ క్రికెట్‌తో ముందుకు సాగాలనుకుంటున్నాం. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మేం అండగా నిలవాలనుకుంటున్నాం. 140-150 కోట్ల భారతీయులకు ప్రాతినిథ్యం వహించడం అంటే ఏమిటో మా ఆటగాళ్లకు బాగా తెలుసు.’ అని గంభీర్ చెప్పాడు.
ఆ వీడియోలలో ఉన్నది నా భార్య, గర్ల్ ఫ్రెండ్.. మస్తాన్ సాయి కీలక వ్యాఖ్యలు!
రాజ్ తరుణ్ భార్యగా చెబుతున్న లావణ్య ఫిర్యాదు నేపథ్యంలో మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు పేర్కొన్న ఆమె ప్రైవేట్ గా గడిపిన వీడియోలుతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ఇక అతన్ని అరెస్టు చేసినట్టు వార్తలు రాగా పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టినట్టు తెలుస్తోందది. ఈ క్రమంలో స్పందించిన మస్తాన్ సాయి లావణ్య చెబుతున్నట్టుగా ఆ వీడియోలలో ఉన్నది ఎవరో కాదని అన్నారు. నా భార్య.. నా గర్ల్ ఫ్రెండ్ తో తీసుకున్న వీడియోలు అవి. నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. 2017లో హనీమూన్ కు వెళ్లినప్పుడు తీసుకున్న వీడియోలు అవి.. ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయి.. వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించింది అని మస్తాన్ సాయి చెప్పుకొచ్చారు.
నన్ను చంపాలని చూస్తున్నారు!
లావణ్య ఫిర్యాదు చేసిన క్రమంలో మస్తాన్ సాయితో పాటు మరో యువకుడిని అరెస్టు చేశారు నార్సింగి పోలీసులు. లావణ్య ఇంటికి మస్తాన్ సాయితో పాటు ఖాజా అనే యువకుడు కూడా వచ్చాడని, వీరిద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పై మస్తాన్ సాయి పై బిఎన్ఎస్ యాక్ట్ లోని 329(4), 324(4), 109, 77,78 లో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మస్తాన్ సాయి నుండి ఒక ల్యాప్ టాప్, రెండు హార్డ్ డిస్క్ లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమలోనే నార్సింగి పోలీస్ స్టేషన్కు వచ్చిన లావణ్య ఎన్ టీవీతో మాట్లాడింది. నేను ఇచ్చిన ఫిర్యాదు పై స్టేట్ మెంట్ రికార్డు చేయడానికి పిలిపించారని, నాకు ఇంకా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె అన్నారు. మస్తాన్ సాయి, అతని పేరెంట్స్ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆమె హార్డ్ డిస్క్ కోసం నన్ను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించింది. ఇక నాకు ప్రాణహాని ఉంది, జరిగిన ఘటన పై మొత్తం పోలీసులకు చెప్పాను ఇన్ని రోజులు నాదగ్గర ఎవిడెన్స్ లేకపోవడంతో ఆగిపోయాను కానీ ఇప్పుడు ఎవిడెన్స్ దొరకడంతో పోలీసులకు అన్ని అందజేసానని పేర్కొన్నారు. ఇక ఈ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆమె వెల్లడించింది.