గూగుల్ బాటలో రిలయన్స్.. ఏపీలో మరో భారీ పెట్టుబడి..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం హయాంలో వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి.. ఇప్పటికే గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఒక లక్ష 34 వేల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను నెలకొల్పుతున్న సంగతి విషయం విదితమే కాగా.. ఈ విదేశీ సంస్థ బాటలో మన స్వదేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ కూడా విశాఖలోనే రూ.98,000 కోట్లతో 1 గిగా వాట్ సామర్థ్యం కలిగిన అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కాగా, డిజిటల్ కనెక్షన్ – రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్‌ఫీల్డ్ మరియు అమెరికాకు చెందిన డిజిటల్ రియాలిటీల జాయింట్ వెంచర్ – 2030 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 1 గిగావాట్ AI-స్థానిక, ఉద్దేశ్యంతో నిర్మించిన డేటా సెంటర్‌లను నిర్మించడానికి $11 బిలియన్ (రూ. 98,000 కోట్లు) పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. డిజిటల్ మౌలిక సదుపాయాల సంస్థ ఈ సౌకర్యాలను 400 ఎకరాల్లో అభివృద్ధి చేస్తుందని మరియు భారీ స్థాయిలో తదుపరి తరం AI పనిభారాలకు మద్దతు ఇచ్చేలా రూపొందించబడుతుందని తెలిపింది. ప్రతిపాదిత పెట్టుబడిని అధికారికం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసినట్లు డిజిటల్ కనెక్షన్ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చెందుతున్న AI మరియు క్లౌడ్ హబ్‌గా రాష్ట్ర స్థానాన్ని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. కంపెనీ ప్రకారం, కొత్త డేటా సెంటర్ పార్కులు కృత్రిమ మేధస్సు కోసం పూర్తిగా ఆప్టిమైజ్ చేయబడతాయి, హైపర్‌స్కేలర్లు మరియు పెద్ద సంస్థలకు సజావుగా పనితీరును అందించడానికి భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వ్యవస్థలు, అధిక-సాంద్రత గల రాక్‌లు, బలమైన సబ్‌స్టేషన్‌లు మరియు అనవసరమైన పవర్ ఫీడ్‌లను కలుపుతాయి. పరిశ్రమలలో AI స్వీకరణ వేగవంతం కావడంతో రాబోయే దశాబ్దంలో ఆశించిన భారీ గణన మరియు నిల్వ డిమాండ్‌లను తీర్చడం ఈ డిజైన్ లక్ష్యం. డిజిటల్ కనెక్షన్ ఇప్పటికే చెన్నైలో ఒక పెద్ద క్యాంపస్‌ను నిర్వహిస్తోంది.. విశాఖపట్నం విస్తరణ భారతదేశంలోని ప్రధాన డిజిటల్ కారిడార్‌లలో కంపెనీ పాదముద్రను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో AI మౌలిక సదుపాయాలు మరియు అధునాతన డేటా ప్రాసెసింగ్‌కు భారతదేశాన్ని ప్రధాన ప్రపంచ కేంద్రంగా ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ సౌకర్యాలు సహాయపడతాయని కంపెనీ తెలిపింది.
ఓ తుఫాన్ ముప్పు తప్పింది.. మరో వాయుగుండం భయపెడుతోంది..!
రైతులకు గుండెదడ రప్పించిన ‘సెన్యార్’ తుఫాన్ సముద్రంలోనే బలహీన పడి ఈశాన్య ఇండోనేషియా దగ్గర తీరం దాటింది. దీని ప్రభావం మీద అనేక అంచనాలు వుండగా అండమాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించక ముందే గమనాన్ని మార్చుకుంది. తీరం దాటే సమయంలో గాలులు వేగం గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల వరకు పుంజుకుంది. వచ్చే రెండురోజులు’సెన్యార్’మరింతగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ముప్పు తప్పినప్పటికీ నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సగటున 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది దాదాపు ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తర-వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతంలో కదులుతూ బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారడానికే ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుండగా వాతావరణ అనుకూలతను బట్టి తుఫాన్ గా రూపాంతరం చెందే అవకాశాలను కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. ఇది., ఉత్తర తమిళనాడు., పుదుచ్చేరి మధ్య తీరాన్ని దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాయుగుండ ప్రాంతం నుంచి రెయిన్ బ్యాండ్స్ విస్తృతి ఏపీ అంతటా వుండనుంది. దీని కారణంగా ఈనెల 29వ తేదీ నుంచి దక్షిణ కోస్తాజిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రుతుపవన ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని జల్లులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయి. వాయుగుండం తీరానికి సమీపించే కొద్దీ గాలుల ఉధృతి, వర్షాల తీవ్రత పెరుగుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రైతుల పంటలు నష్టపో కుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలనే సూచనలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఈదురు గాలులు గంటకు 35 -45 కిలో మీటర్లు.. గరిష్టంగా 55 కిలో మీటర్ల వేగముతో వీచే అవకాశముంది. దక్షిణ కోస్తాంద్ర నుంచి వేటకు వెళ్ళిన మత్స్యకారుల సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవాలని హెచ్చరికలు వున్నాయి.
జోగి బ్రదర్స్ తొలిరోజు కస్టడీ.. ఆ లింకులపై అరగంట పాటు ప్రశ్నలు..
నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు తొలిరోజు కొద్దిసేపు మాత్రమే విచారించారు. కేసులో ఏ18గా జోగి రమేష్, ఏ19గా జోగి రాము ఉన్నారు. ఇద్దరినీ 4 రోజులపాటు విచారించటానికి ఎక్సైజ్ కోర్టు అనుమతి ఇవ్వటంతో నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఇద్దరినీ విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో జోగి బ్రదర్స్ విజయవాడలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఇద్దరినీ సుమారు అరగంటపాటు ఎక్సైజ్ పోలీసులు విచారించారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ1 అద్దేపల్లి జనార్ధన్ తాను నకిలీ మద్యం తయారీకి సంబంధించి జోగి రమేష్ ఉన్నారని చెప్పటంతో పోలీసులు అద్దేపల్లితో ఉన్న లింకులపై జోగిని ప్రశ్నించారు. అద్దేపల్లి జనార్ధన్ ఆఫ్రికా వెళ్ళక ముందు జోగిని కలిసి భేటీ కావటంపై కూడా జోగిని అధికారులు ప్రశ్నించారు. జోగి బ్రదర్స్ కు అద్దేపల్లి బ్రదర్స్ కు మద్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలను గురించి అడిగి ప్రశ్నించారు. అద్దేపల్లి తాను నకిలీ మద్యం తయారు చేయటం వెనుక కారణం జోగి రమేష్ అని చెప్పారని దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. డబ్బులు కూడా పలుమార్లు ఇచ్చినట్టు చెప్పారని కొన్ని ఆధారాలను చూపించి ప్రశ్నించారు. తనకు ఈ కేసుతో సంబంధంలేదని జోగి రమేష్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అనంతరం జోగి బ్రదర్స్ కు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ సబ్ జైలుకు తరలించారు. రేపు ఉదయం కస్టడీకి తీసుకుని విచారించనున్నారు అధికారులు..
ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట..
లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముగ్గురికీ సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. కేసులో ఈ ముగ్గురు కూడా ఏ31, ఏ32, ఏ33గా ఉన్నారు. వీరికి ఏసీబీ కోర్టు గతంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ఆదేశాలను సిట్ అధికారులు హైకోర్టులో సవాలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది. ఈ నెల 26లోపుగా ఏసీబీ కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై నిందితులు ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ముగ్గురు నిందితుల పిటిషన్లను బుధవారం విచారించింది. డిసెంబరు 15వ తేదీ వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. డిసెంబరు 15న విచారణ చేపడతామని చెప్పిన సుప్రీం కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ను ఆదేశించింది. దీంతో అప్పటి వరకు నిందితులు సరెండర్ కావాల్సిన అవసరం లేదని నిందితుల న్యాయవాదులు తెలిపారు. నిందితులు ముగ్గురి తరపున న్యాయవాదులు ఈ విషయంపై ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిందని ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అందజేస్తామని, సుప్రీం ఆదేశాల కారణంగా నిందితులు సరెండర్ కాలేదని కోర్టుకు మెమెలో తెలిపారు.
రోడ్ల నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతే లక్ష్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం అమరావతిలో రహదారులు, భవనాల శాఖ (R&B) మరియు ఏపీ లింక్ (AP-Link) పై సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు మౌలిక వసతులు బలోపేతం చేయాలని సూచించారు. సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్–ఏపీ లింక్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఏపీ లింక్ రాష్ట్రంలో రోడ్లు, గోదాములు, డ్రైపోర్టులు, సరుకు రవాణా సౌకర్యాలకు మద్దతుగా పనిచేసే సంస్థ కాబట్టి, దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్ల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన సీఎం చంద్రబాబు నాయుడు.. గుంతలులేని రహదారులే ప్రభుత్వ ప్రాధాన్యత. ఎక్కడా గుంతలు, ప్రమాదకర రోడ్లు కనిపించకూడదు అని పేర్కొన్నారు.. అలాగే రోడ్ల పనుల్లో నాణ్యత పరీక్షలు తప్పనిసరి చేయాలని, రోడ్లు నిర్మించిన తర్వాత నిర్వహణ బాధ్యతను కూడా స్పష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాష్ట్రాభివృద్ధిని మొదటి లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని సూచించిన సీఎం.. రాష్ట్ర అభివృద్ధి ముందుండాలి. మనం చేసే ప్రతి నిర్ణయం, చర్యలో డెవలప్‌మెంట్ ఫస్ట్ సూత్రం ప్రతిఫలించాలి అన్నారు..
పోలీస్ శాఖలో ఖాళీ పోస్టుల భర్తీ.. సీఎస్, హోం సెక్రటరీకి హైకోర్టు కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆరా తీసింది హైకోర్టు.. అదే సమయంలో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు హోంశాఖ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై 6 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై పిటిషన్ దాఖలైన నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి కఠిన సూచనలు చేసింది. సుప్రీం కోర్టు ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా పోలీసు విభాగంలో ఖాళీలను ప్రతి ఏడాది గైడ్‌లైన్స్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించిందని పిటిషనర్ కోర్టుకు గుర్తు చేశారు. గత సెప్టెంబర్‌లో పోలీసు విభాగంలో ఖాళీల భర్తీపై, మొత్తం 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి అనుమతి ఇవ్వాలని హోం సెక్రటరీకి డీజీపీ లేఖ పంపినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ఈ కేసు విచారణను తదుపరి తేదీకి వాయిదా వేసిన హైకోర్టు, అప్పటి వరకు సంబంధిత నివేదికలు సమర్పించాలని సీఎస్ మరియు హోం సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ.. కొత్త పార్టీపై కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని వ్యాఖ్యానించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇవాళ ఆమె మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని, ఇంకా నేను ప్రజల్లో తిరగాలన్నారు. నా జనంబాట కార్యక్రమంలో.. మహిళల నుంచి పార్టీ పెట్టాలన్న డిమాండ్ ఎక్కువ వస్తుందని ఆమె వెల్లడించారు. కొత్త పార్టీదేముందని, ఎప్పుడైనా పెట్టొచ్చన్నారు కవిత. కానీ ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ ఉండాలని ఆమె వెల్లడించారు. కేసీఆర్ తో టచ్ లో ఉన్నారా అనే ప్రశ్న ఉత్పన్నం కాదని, ప్రజల నుంచి వస్తోన్న ఫీడ్ బ్యాక్ ఆధారంగానే నేను ఆరోపణలు చేస్తున్నానన్నారు. 27మున్సిపాలిటీల విలీనం వెనుక పెద్ద స్కాం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవికి నేను చేసిన రాజీనామాకు ఇంకా ఆమోదం తెలుపలేదని, ప్రజాప్రతినిధిగా సినిమాల పైరసీకి నేను వ్యతిరేకమన్నారు. అమెరికాలో ఉన్నప్పుడు నేను కూడా వెబ్ సైట్స్ వెతికి ఫ్రీ సినిమాలు చూశానన్నారు కవిత.
రూ.50,000 కోట్ల పవర్ స్కామ్ – హరీష్ రావు బాంబ్.!
మాజీ మంత్రి హరీష్ రావు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఘాటు విమర్శలు చేశారు. ఇప్పటికే ల్యాండ్ స్కాం బయట పెట్టిన తమ పార్టీ, ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న పవర్ స్కాంను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అక్షరాల రూ.50 వేల కోట్ల భారీ మోసం జరుగుతోందని, దీనిలో 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో విధాన నిర్ణయాల కోసం నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాలు, ఇప్పుడు పంపకాల కోసం మాత్రమే జరిగుతున్నాయన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశాలు వరుసగా భూ స్కాం, పవర్ స్కాం కోసం జరిగాయని ఆయన విమర్శించారు. తమ పార్టీ ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల ల్యాండ్ స్కాం ను బయట పెట్టినా, ప్రభుత్వం దానిపై ఒక్క సమాధానం కూడా చెప్పలేదని హరీష్ రావు మండిపడ్డారు. రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్లలో రూ.50 వేల కోట్ల భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “రేవంత్ ప్రభుత్వం చేసే ప్రతి పనిలో ఒక మిషన్ ఉంటుంది.. ఆ మిషనే కమిషన్” అని వ్యాఖ్యానిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలలో ప్రజల ప్రయోజనం కంటే స్వప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు.
విద్యార్థులకు అలర్ట్.. బోర్డు కొత్త మార్గదర్శకాలు..!
తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ప్రతీ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు సమయంలో విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, విద్యా సంబంధిత వివరాలు తప్పుగా నమోదు కావడం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. పేరు, తండ్రి పేరు, గ్రూపు, మాధ్యమం, భాషా సబ్జెక్టులు వంటి కీలక అంశాల్లో తేడాలు రావడం వల్ల పరీక్ష సమయాన విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. గతంలో పరీక్ష కేంద్రాల్లోనే విద్యార్థులు ఓఎంఆర్ పత్రాల్లో తప్పులు సవరించుకునే అవకాశం ఉండేది. చాలా సందర్భాల్లో తెలుగు స్థానంలో హిందీ ముద్రించబడడం, గ్రూప్ మారడం, తల్లిదండ్రుల పేర్లు తప్పుగా రావడం వంటి సమస్యల్ని అప్పటికప్పుడు సరిచేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి పరీక్ష కేంద్రాల్లో అలాంటి అవకాశం ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
అయోధ్యలో మోడీ కాషాయజెండాపై పాక్ అవాకులు.. భారత్ స్ట్రాంగ్ రిప్లై..
అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్రమోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని గమనించాం. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల దుర్వినియోగం చేయడంలో తీవ్రమైన చెడ్డ పేరు ఉన్న పాకిస్తాన్, ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతిక స్థితి లేదు. కపట ధర్మాలను బోధించే బదులు, పాకిస్తాన్ తన సొంత మానవహక్కుల రికార్డులపై దృష్టి పెట్టడం మంచిది’’ అని జైస్వాల్ అన్నారు.
యువతకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రతి సంవత్సరం లక్ష మంది కొత్త అగ్నివీర్ల నియామకం!
భారత ఆర్మీలో చేరాలనుకునే యువతకు తీపికబురు. ఇకపై ప్రతి సంవత్సరం దాదాపు లక్ష మంది కొత్త అగ్నివీర్ల నియామకం చేపట్టనున్నారు. భారత సైన్యం త్వరలో అగ్నివీర్‌ల నియామకాన్ని దాదాపు రెట్టింపు చేయనుంది. తదుపరి రిక్రూట్ మెంట్ సైకిల్ లో ప్రారంభించి, ప్రతి సంవత్సరం సుమారు 100,000 మంది కొత్త అగ్నివీర్‌లను నియమించనున్నారు. మూడు సంవత్సరాల క్రితం, కేవలం 40,000 మంది అగ్నివీర్‌లను మాత్రమే నియమించారు. సైన్యం ప్రస్తుతం దాదాపు 180,000 మంది సైనికుల కొరతను ఎదుర్కొంటోంది. COVID-19 కారణంగా 2020-21లో రెండేళ్లపాటు నియామకాలు నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం 60,000-65,000 మంది సైనికులు పదవీ విరమణ చేస్తారు. కానీ కొత్తగా నియామకాలు జరగడం లేదు. తత్ఫలితంగా, ప్రతి సంవత్సరం కొరత 20,000-25,000 పెరిగింది. అగ్నిపథ్ పథకం ప్రారంభించిన తర్వాత కూడా, కొరత తీరలేదు.
20 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్..
2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే హక్కులు భారత్ కు దక్కాయి. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం తర్వాత అహ్మదాబాద్‌ను ఆతిథ్య నగరంగా ప్రకటించారు. 20 సంవత్సరాల విరామం తర్వాత భారతదేశం కామన్వెల్త్ క్రీడలను నిర్వహించనుంది. గతంలో, 2010లో ఈ క్రీడలు న్యూఢిల్లీలో జరిగాయి. ఆ సమయంలో, భారత అథ్లెట్లు 38 బంగారు పతకాలతో సహా 101 పతకాలను గెలుచుకున్నారు. 2030 కామన్వెల్త్ క్రీడలను అహ్మదాబాద్‌లో నిర్వహించడానికి సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని గమనించాలి. అథ్లెట్లు, అధికారులు, ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ స్టేడియం, నరన్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లను ప్రధాన వేదికలుగా ప్రతిపాదించారు. కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడం అనేది ఒక దేశానికి ఒక క్రీడా కార్యక్రమం మాత్రమే కాదు. దాని అంతర్జాతీయ ప్రతిష్ట, అభివృద్ధి సామర్థ్యం,మౌలిక సదుపాయాలు దార్శనికతకు చిహ్నం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారతదేశం, కెనడా, న్యూజిలాండ్‌తో సహా ఇప్పటివరకు తొమ్మిది దేశాలు ఈ క్రీడలను నిర్వహించాయి. భారతదేశం రెండవసారి ఆతిథ్య హక్కులను గెలుచుకుంది.
శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్.. ఇట్స్ అఫీషియల్
స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం ‘బైకర్’. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్. తెలుగులో తొలిసారి ఓ బైక్ రేస్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాను డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తు్న్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సినిమాకు సంబంధించిన వర్క్స్‌ను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దే పనుల్లో యూనిట్ బిజీగా ఉందని, ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించేందుకు తాము పని చేస్తున్నామని, అందుకే ఈ సినిమాకు మరింత సమయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాను 3D, 4DX లతో పాటు ఇతర ఫార్మాట్‌లలోనూ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కారణంగా సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేయడం లేదని తాజాగా ప్రకటనలో వెల్లడించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఇందులో శర్వానంద్‌కు జోడిగా మాళవిక నాయర్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ అందిస్తున్నాడు.
మరో మూడురోజుల పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఐ బొమ్మ రవి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రవిని మళ్లీ పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు చేసిన వినతిపై నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అవసరమైన వివరాలు సేకరించాల్సి ఉందని సీసీఎస్ పోలీసులు వాదించగా, కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రవి చంచల్గూడా జైలులో రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో, రేపు ఉదయం పోలీసులు జైలు అధికారుల అనుమతితో అతన్ని బయటకు తీసుకుని సీసీఎస్ కార్యాలయానికి తరలించనున్నారు. అక్కడ మూడు రోజులపాటు రవిని ప్రశ్నించి, కేసుతో సంబంధం ఉన్న డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలు, మిగతా వ్యక్తులతో ఉన్న అనుసంధానాలు వంటి అంశాలపై వివరాలు సేకరించనున్నారు.