సంక్రాంతి ‘పండుగ’ చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ.. రికార్డు స్థాయిలో ఆదాయం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ).. అసలైన సంక్రాంతి పండుగ చేసుకుంది.. రాష్ట్రంలోని పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటిన విషయం విదితమే.. ఈ సమయంలో.. ఇతర ప్రాంతాల్లో ఉపాధి, ఉద్యోగం కోసం వెళ్లిన వాళ్లు.. సొంత ఊళ్లకు తరలివచ్చారు.. కొందరు సొంత వాహనాల్లో వెళ్తే.. మరికొందరు పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్‌ను ఆశ్రయించారు.. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది.. ఈ సమయంలో ఆర్టీసీ ఆదాయం రూ.23 కోట్లు దాటినట్టు ఆ సంస్థ ప్రకటించింది.. పండు సమయంలో 7200 బస్సులతో మొదలుపెట్టి 9,097 బస్సులు నడిపింది ఏపీఎస్ఆర్టీసీ.. మొత్తం 23.71 కోట్ల సంక్రాంతి పండుగ సమయంలో ఆదాయాన్ని ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ.. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణికులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనంగా పేర్కొంది ఏపీఎస్ఆర్టీసీ.. పండు సమయంలో ప్రయాణికులు వారి ప్రయాణ వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారని.. ఇతర, ప్రైవేట్ వాహనాలు మరియు సొంత వాహనాల కంటే ఆర్టీసీకే మొగ్గు చూపారని పేర్కొంది.. ప్రయాణికులకు ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉంచడం, నిర్వహనకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు బస్సులను పర్యవేక్షించడం, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని.. దీనివల్లే ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించిందని పేర్కొంది.. సంస్థలోని సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, వారియొక్క కృషి ఫలితంగానే ఈ సంక్రాంతి ప్రత్యేక సమయంలో ఆర్టీసీ ఈ ఘనత సాధించిందని ప్రకటించారు..
రంగం ఏదైనా భారతీయులదే విజయం.. దావోస్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి.. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ప్రపంచంలో అందరికీ అత్యంత ఆమోదయోగ్యమైన ఏకైక కమ్యునిటీగా భారతీయులు గుర్తింపు పొందారన్నారు.. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజున, భారత పరిశ్రమల సమాఖ్య ప్రత్యేక సెషన్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ముఖ్యమంత్రి ప్రసంగించారు. 100కు పైగా దేశాల్లో తెలుగువారు ఉన్నారని, తక్కువ సమయంలోనే ఇంతలా తెలుగువారు విశ్వవ్యాప్తం అవుతారని ఎవరూ ఊహించలేదన్నారు. రెండో రోజు దావోస్ పర్యటనలో సీఐఐ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.. మానవ వనరుల లభ్యత ఏపీకి ప్లస్ పాయింట్ అని, భారతీయ పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, తమ ప్రతిభతో రాణిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్ నాయకులను సిద్ధం చేయడానికి అమరావతిలోని గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ దోహదపడుతుందన్నారు సీఎం చంద్రబాబు.. నాయకత్వ వికాసాన్ని పెంపొందించడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎండీ బిజినెస్ స్కూల్, జీఎల్‌సీ మధ్య అవగాహన కలిగిందన్నారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, దైనందిన జీవితాన్ని మెరుగుపరచడానికి ఏఐ, రియల్ టైమ్ డేటా వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు వివరించారు. భారతదేశం అందించిన సేంద్రియ వ్యవసాయం ప్రపంచ సమాజానికి ఒక వరంగా చంద్రబాబు పేర్కొన్నారు. పీ4 మోడల్ ద్వారా ప్రభుత్వ-ప్రైవేటు-పబ్లిక్ భాగస్వామ్యాన్ని ఇటు పాలనలోనూ తీసుకువచ్చామని చెప్పారు. హరిత పారిశ్రామికీకరణ, డీప్-టెక్ ఇన్నోవేషన్, సమ్మిళిత నాయకత్వంపై దృష్టి సారించామని చెప్పారు.రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్‌కు గ్లోబల్ హబ్‌గా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.
దావోస్ వేదికగా మోడీపై చంద్రబాబు ప్రశంసలు.. సరైన వ్యక్తి పీఎంగా ఉన్నారు..
దావోస్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. దావోస్ సీఐఐ సెషన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలు.. పెట్టుబడుల అంశంపై మాట్లాడిన ఆయన.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ.. సరైన సమయమంలో దేశానికి సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారన్నారు… మూడో సారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని.. చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉంది… కానీ, భారతదేశంలో లేదన్నారు. పరిపాలనలో ఒక స్పష్టతతో ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. GDP వృద్ధి రేటులో భారతదేశం అగ్రగామిగా ఉందని, ఇదే స్థాయిలో వృద్ధి నమోదు చేస్తామనే నమ్మకం ఉందన్నారు.. 2028 నుంచి భారత యుగం ప్రారంభమవుతుందని చెప్పారు సీఎం చంద్రబాబు. భారతదేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్‌గా చేసేందుకే ‘వికసిత్ భారత్ 2047’ ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ తొలి రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర – 2047 విజన్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న 10 మార్గదర్శక సూత్రాలను ముఖ్యమంత్రి వివరించారు. కాస్ట్ ఆప్టిమైజేషన్, పర్యావరణ సమతుల్యతపై దృష్టి పెట్టి గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్, ఫ్యూయల్ మార్కెట్‌లలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా చేస్తున్నామని, కాకినాడ వంటి పటిష్టమైన ఓడరేవుల ద్వారా ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్వర్ణాంధ్ర – 2047 విజన్ రూపకల్పనలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మార్గనిర్దేశాన్ని మరిచిపోలేమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
దావోస్‌లో మంత్రి లోకేష్ బిజీబిజీ.. ఏపీలో పెట్టుబడులపై వరుస సమావేశాలు
దావోస్ పర్యటలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు.. ఏపీలో పెట్టుబడులపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఫిలిప్ మోరిస్ సంస్థ ప్రతినిధితో భేటీ అయిన ఆయన.. ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు.. ఏపీలో వ్యూహాత్మక విస్తరణకు.. ప్రకాశం, గుంటూరు పరిసర ప్రాంతాలు అనుకూలమని వెల్లడించారు.. జెడ్ ఎఫ్ ఫాక్స్‌కాన్ సీఈవోతో సమావేశమయ్యారు లోకేష్.. సప్లయ్ చైన్ కార్యకలాపాల విస్తరణకు ఏపీ అనుకూలమని వివరించారు.. ఏపీలో వాహన తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు మంత్రి లోకేష్.. దావోస్ బెల్వెడేర్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా “పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు లోకేష్. ఉష్ణోగ్రతలను అదుపు చేయడానికి క్లీన్ ఎనర్జీ ఒక్కటే ఏకైక పరిష్కారం. ప్రపంచవ్యాప్తంగా పరివర్తన కోసం 2030 నాటికి పునరుత్పాదక శక్తి, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి 4 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. 2030 నాటికి ఈ రంగంలో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి.. 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని వెల్లడించారు. డీకార్బనైజ్డ్ ఎకానమీకి బెంచ్‌మార్క్ ని సెట్ చేస్తూ సస్టయినబుల్ ఎనర్జీలో ప్రపంచ అగ్రగామిగా అవతరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఏపీలో 5230 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్ట్ (IRESP)ని కలిగి ఉందని వివరించారు మంత్రి నారా లోకేష్..
జిల్లా అధ్యక్షులను నియమించిన ఏపీ బీజేపీ.. కొత్త అధ్యక్షులు వీరే..
ఆంధ్రప్రదేశ్‌లో తన సొంత బలాన్ని పెంచుకోవడంపై కసరత్తు ప్రారంభించింది ఏపీ బీజేపీ.. దీనిలో భాగంగా.. వివిధ జిల్లాల అధ్యక్షులను నియమించింది.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ.. పొత్తులతో కాకుండా సొంతంగా బలపడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. జిల్లా అధ్యక్షుల మార్పులు, చేర్పులపై కసరత్తు చేసింది.. ఇక, ఈ రోజు పలు జిల్లాల అధ్యక్షులను ప్రకటించింది భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాఖ.. మొత్తంగా 24 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది బీజేపీ..
తెలంగాణ ప్రభుత్వంతో మరో కంపెనీ ఒప్పందం.. రూ.500 కోట్ల పెట్టుబడి
తెలంగాణలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో స్కైరూట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ ఏరో స్పేస్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేశారు. ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ దాదాపు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. కాగా.. ఈ ఒప్పందం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు.. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు.
ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..? అని దుయ్యబట్టారు. మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని హరీష్ రావు ఆరోపించారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడిక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే మీ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతున్నదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో, మంత్రులందరూ పక్క రాష్ట్రాల్లో బిజీగా ఉంటే ప్రజలను ఎవరు పట్టించుకోవాలని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో పోలీసు పహారా నడుమ గ్రామ సభలు నిర్వహించాల్సిన దుస్థితి రావడం దారుణమని హరీష్ రావు అన్నారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ఒకవైపు గ్రామ సభలు నిర్వహిస్తుంటే.. మరోవైపు కార్యకర్తలకే పథకాలు ఇస్తామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెప్పడం సిగ్గుచేటని హరీష్ రావు దుయ్యబట్టారు. అలాంటపుడు గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నట్లేనా.. అర్హులైన వారికి పథకాలు ఎగ్గొడుతున్నట్లేనా..? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు హామీలిస్తం, అధికారంలోకి వచ్చాక ఎగ్గొడుతం అన్నట్లుగా వ్యవహరిస్తే, ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు.. అర్హులైన అందరికి ఇస్తామని చెప్పి ఇప్పుడు భారీ కోతలు విధిస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుల పాపం, అధికారులకు శాపంగా మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. మీరు నిర్వహిస్తున్న గ్రామ సభలు దగా.. ఆరు గ్యారెంటీలు అమలు దగా.. రుణమాఫీ చేయడం దగా.. పంట బోనస్ ఇవ్వడం దగా.. రైతు భరోసా అమలు దగా.. రేషన్ కార్డుల జారీ దగా.. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక దగా అని హరీష్ రావు మండిపడ్డారు.
గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్‌కి వెళ్లిన బిజినెస్‌మ్యాన్.. 2 రోజుల తర్వాత గదిలో శవం..
రాజస్థాన్‌కి చెందిన ఒక వ్యాపారవేత్త లక్నోలోని ఓ హోటల్‌లో శవంగా కనిపించాడు. చనిపోయిన వ్యక్తిని రాజస్థాన్ జలోర్ జిల్లాకు చెందిన 44 ఏళ్ల నీలేష్ భండారీగా గుర్తించారు. భండారీ రెండు రోజుల క్రితం నగరంలోని కామ్తా ప్రాంతంలోని ఒక హోటల్‌లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో దిగాడు. సోమవారం ఆయన మృతదేహం హోటల్ గదిలో లభ్యమైంది. అతడితో వచ్చిన మహిళ కనిపించడం లేదని, ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. భండారీకి అప్పగికే వివాహమైంది, అతడి కుటుంబం జాలోర్‌లో నివసిస్తోందని డీసీపీ పంజక్ కుమార్ సింగ్ తెలిపారు. కామ్తాలోని హోటల్ సాఫ్రాన్‌లో సోమవారం ఇతడి మరణం గురించి స్థానిక చిన్‌హాట్ పోలీస్ స్టేషన్‌కి సమాచారం వచ్చింది. ప్రాథమిక విచారణ తర్వాత పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. శరీరంపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరణానికి అసలు కారణం వెల్లడికానుంది.
సంజయ్‌రాయ్‌కి మరణశిక్షపై రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
కోల్‌కతా ఆర్‌జీ కర్ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి కోర్టు జీవితఖైదు విధించింది. రూ.50,000 జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితుడికి మరణశిక్ష విధించాలని బెంగాల్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. అయితే నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ పెరగడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది. దీంతో ఈ కేసును బుధవారం విచారించనుంది. జనవరి 20న సీల్దా కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ల నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం విచారిస్తోంది.
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో కీలక విషయాలు..
బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అనే అక్రమ బంగ్లాదేశీ వ్యక్తి అతడిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో సైఫ్‌పై దాడి చేయడంతో, 6 చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకలో కత్తి విరిగిపోయింది. ఈ ఘటన తర్వాత సైఫ్‌ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యలు శస్త్రచికిత్స చేసి వెన్నెముకలో విరిగిన కత్తిని బయటకు తీశారు. ఈ రోజు(మంగళవారం) సైఫ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. అయితే, సైఫ్‌పై దాడి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని సైఫ్ అలీ ఖాన్ గట్టిగా పట్టుకోవడంతో, విడిపించుకునే ప్రయత్నంలో అతడి వెన్నులో కత్తితో పొడిచినట్లు తెలిసింది. ఈ దాడిలోని వెన్నెముక లో 2.5 అంగుళాల కత్తి ముక్క విరిగిపోయింది. ఇది మరో 2 మి.మీ లోతుగా గుచ్చుకుంటే తీవ్ర గాయమయ్యేదని వైద్యులు చెప్పారు. ఇంట్లోకి వచ్చిన నిందితుడు బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడిని ముందు నుంచి సైఫ్ గట్టిగా పట్టుకున్నాడు. ఈ సమయంలో తన చేతిలో ఉన్న కత్తితో సైఫ్ వీపులో పొడిచాడు.
సింహంతో టిక్‌టాక్.. తుంటరి యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం
ఈ మధ్య సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. వీడియోలు పోస్టు చేసేందుకు యువత అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. ఫేమస్ కోసమో.. లేదంటే లైక్‌లు కోసమో తెలియదు గానీ.. హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకునే స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోయాయి. అయినా కూడా చాలా మందికి బుద్ధి రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. సహజంగా సింహాన్ని చూస్తేనే.. వణుకుపుడుతుంది. అలాంటిది దాని దగ్గరకు వెళ్లి టిక్‌టాక్ చేసేందుకు ప్రయత్నించి దాని నోటికి చిక్కాడు. అంతే సింహం దాడిలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చేరాడు. పంజాబ్ ప్రావిన్సుకు చెందిన ముహమ్మద్ అజీమ్ అనే యువకుడు.. లాహోర్ సమీపంలోని జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లాడు. బోనులో ఉన్న సింహంతో టిక్‌టాక్ చేసేందుకు లోపలికి వెళ్లాడు. అంతే వెంటనే సింహం దాడికి దిగింది. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి అతడిని రక్షించారు. తీవ్రగాయాలు కావడంతో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధింత యాజమాన్యంపై మండిపడ్డారు. అంతేకాకుండా ఫామ్ యజమాని బ్రీడింగ్ లైసెన్సును రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.
బ్లూటూత్ కనెక్టివిటీతో టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటో.. సింగిల్ ఛార్జ్‌తో 179KM రేంజ్!
ఎలక్ట్రిక్ ఆటో కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టూ వీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ బ్లూటూత్ కనెక్టివిటీతో ఎలక్ట్రిక్ ఆటోను తీసుకొచ్చింది. కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ను విడుదల చేసింది. పేరుకు తగ్గట్టుగా కింగ్ సైజ్ ఫీచర్లతో అదరగొడుతోంది. అద్భుతమైన రేంజ్, స్పీడుతో వస్తుంది. ధర కూడా తక్కువే. ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో ధర రూ.2.95 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇది సింగిల్ ఛార్జ్ తో 179 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోకు 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ అందించబడుతుంది. TVS King EV Max అధిక పనితీరు గల 51.2V లిథియం-అయాన్ LFP బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఆటో గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. TVS King EV Max ఎకో మోడ్‌లో 40 kmph వరకు, సిటీ మోడ్‌లో 50 kmph వరకు, పవర్ మోడ్‌లో 60 kmph వరకు వేగంతో దూసుకెళ్తుంది. దీని బ్యాటరీ కేవలం 3 గంటల 25 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
చిలుకూరి బాలాజీ గుడిలో ప్రియాంక చోప్రా
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ స్వామివారిని వీసాల దేవుడిగా కూడా చెబుతారు. పెళ్ళాడి అమెరికాలో నటి ప్రియాంక చోప్రా బాలాజీని దర్శించుకొని, ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. లాస్ ఏంజెలెస్ నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ రాగా మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించనున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇక మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో `ఎస్‌ఎస్‌ఎంబీ29` పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇటీవలే ప్రారంభమవగా రహస్యంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు కూడా పాల్గొనగా మూవీకి సంబంధించిన కాస్టింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్య తర్వాత సినిమా కోసం బాలీవుడ్ విలన్..?
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే నాగ చైతన్య తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టుకున్నట్లు తెలిసింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య చేయబోయే తదుపరి సినిమాకు మేకర్స్ క్రేజీ టైటిల్ ను ఆలోచిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య తన తదుపరి సినిమాను ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ విషయంలో ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ తో షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాయి. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించబోతున్నారు. ఈ చిత్రాన్ని 2025 చివరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ఇంకా ఖరారు చేయలేదు.
ఆ ఒక్క విషయంలో మాత్రం గేమ్ ఛేంజర్ ఫెయిల్ కాలేదు
మెగా ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. అయితే చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా ఇది కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉండేవి. ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే భారీగా బుక్కైన సంగతి తెలిసిందే. దీనిని బట్టే ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఉన్నారన్న సంగతి అర్థం అవుతుంది. కానీ థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, భారీ బడ్జెట్ తో శంకర్ మార్కులోనే తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “గేమ్ ఛేంజర్”. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేదు. వసూళ్ల పరంగా ఏ చిత్రం టార్గెట్ రీచ్ కాలేకపోవచ్చు కానీ ఒక విషయంలో మాత్రం ఫెయిల్ కాలేదని చెప్పుకోవచ్చు.