విద్యుత్ ఛార్జీల టారిఫ్ విడుదల చేసిన ఏపీఈఆర్సీ.. వారికి గుడ్‌న్యూస్..
విద్యుత్ ఛార్జీల టారిఫ్ విడుదల చేసింది ఏపీ ఈఆర్సీ.. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈ సందర్భంగా ప్రకటించారు ఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్.. 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల టారిఫ్‌లను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఛైర్మన్ ఈ రోజు తిరుపతిలో విడుదల చేశారు.. మార్చి 31 లోపు విద్యుత్ ఛార్జీల టారిఫ్ విడుదల చేయాలి.. కానీ, ఫిబ్రవరిలోనే చేస్తున్నాం అని ఈ సందర్భంగా వెల్లడించారు ఠాకూర్ రామ్‌సింగ్.. ఏ విభాగంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు.. మూడు డిస్కమ్ ల ద్వారా రాబడి రూ.44,323 కోట్లుగా అంచనా వేశామని.. మూడు డిస్కమ్ ల పరిధిలో వ్యయం అంచనా రూ. 57, 544 కోట్లుగా ఉండొచ్చని పేర్కొన్నారు.. రాబడి, వ్యయాల మధ్య అంతరం రూ. 12,632 కోట్లుగా ఉండొచ్చని.. అంతరాన్ని భరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.. దీంతో గృహ వినియోగదారుల టారిఫ్ పెంపు లేదని ఈఆర్సీ ప్రకటించింది.. వ్యవసాయం, ఉద్యోగుల నర్సరీలు, ఆక్వా కల్చర్ రైతులు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్, రాయితీలకు సంబంధించి ఆమోదం తెలిపింది ఈఆర్సీ.. స్వల్పకాలిక విద్యుత్ అవసరాల కోసం వాస్తవిక అంచనా కోసం డిస్పాచ్ ద్వారా నిర్ణయం తీసుకున్నారు.. రైలు, నౌక మార్గాల ద్వారా బొగ్గు సేకరణ కోసం ఏపీ జెన్కోకు అనుమతించింది ఏపీఈఆర్సీ..
కేంద్ర బలగాలతో జగన్‌కు రక్షణ కల్పించండి.. ప్రధాని మోడీ, అమిత్‌షాకు వైసీపీ లేఖ
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో అడుగడునా భద్రతా వైఫ్యలం స్పష్టంగా కనిపించిందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.. అయితే, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వైయస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్లిన జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదని దుయ్యబట్టారు.. జగన్ పర్యటనలు తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి అని విజ్ఞప్తి చేశారు.. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి అని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు మిథున్‌రెడ్డి.. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలుగా ఆరోపించారు.. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోందని కూటమి ప్రభుత్వం అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు వైసీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి. కాగా, ఇప్పటికే ఏపీ గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు.. వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో తగిన భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేసిన విషయం విదితమే..
వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఇది సబబేనా..?
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు.. అంతేకాదు.. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సైతం వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ రాశారు.. కేంద్ర బలగాలతో జగన్‌కు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వైఎస్ జగన్ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లో ఉందని.. ఇలాంటప్పుడు ఎక్కడికీ అనుమతి లేకుండా వెళ్లకూడదు.. కానీ, ఈసీ నియమావళిని ఉల్లంఘిస్తూ జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని మండిపడ్డారు.. ముందస్తు అనుమతి లేకుండా వెళ్లి భద్రత కల్పించాలని అడగడం సబబు కాదని హితవుచెప్పారు.. అయినా, మేం వెళ్తాం, రౌడీయిజం చేస్తాం అంటే ఎలా? అని నిలదీశారు.. రేపు నేరాలు చేస్తాం.. పోలీసుల రక్షణ కల్పించాలని కూడా అడుగుతారు.. ఇది నాకు సంబంధించిన విషయం కాదన్న ఆయన.. అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటాం..
అధైర్య పడొద్దు.. మిర్చి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాం.. రైతులని ఆదుకోవాలని కేంద్ర మంత్రిని కలిసి చెప్పాను. రైతులను ఏ విధంగా ఆదుకోవాలో కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయిస్తున్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరినట్టు వెల్లడించారు.. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా ఆలోచిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. ఏపీలో మిర్చి రైతులను ఆదుకుంటాం.. రైతులు ఎవరు అధైర్య పడొద్దు.. ఒక్కోసారి ధరలు తగ్గుతుంటాయు, పెరుగుతుంటాయి అన్నారు చంద్రబాబు.. ఏపీలో మిరప ఎక్కువ పండిస్తారు. దేశంలో పండే మిరప పంటలో 50 శాతం ఏపీ నుంచే దిగుబడి ఉంటుంది. ఈ సంవత్సరం 12 లక్షల మెట్రిక్ టన్నులు మిర్చి కొనుగోలు చేయాలి. ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల పంట మార్కెట్ లోకి వచ్చింది. సుమారు 5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేస్తున్నారు. ఈ సంవత్సరం రైతు నష్టపోయే పరిస్థితి వచ్చింది. గత ఏడాది అంతర్జాతీయంగా మార్కెట్ బాగుండడంతో, మిర్చి రైతులు పెద్ద ఎత్తున ఏపిలో సాగు చేశారు.. అనూహ్యంగా విదేశాల్లో డిమాండ్ తగ్గటంతో రైతు నష్టపోయే పరిస్థితి వచ్చిందని.. ఈ పరిస్థితుల్లో మిర్చి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందని కేంద్ర మంత్రికి చెప్పాను అన్నారు చంద్రబాబు..
మిర్చి ధరలపై ఏపీ ప్రతిపాదనలు.. రేపు కేంద్రమంత్రి కీలక సమావేశం..
మిర్చి ధరలకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలో రేపు సమావేశం జరగనుంది.. రేపు ఉదయం 11 గంటలకు కృషిభవన్‌లో సమావేశం కానున్నారు కేంద్ర మంత్రి . ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు పడిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.. ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కోరింది.. దీంతో కేంద్ర మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ నుంచి మిర్చి ఎగుమతులకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నారు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.. ఆంధ్రప్రదేశ్ లో మిర్చి మార్కెట్ ధర… అవసరం అయితే కేంద్ర సహాయంపై కూడా చర్చ జరగనుంది..
జాబ్ క్యాలెండర్‌ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసింది
యాదాద్రి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో మీట్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలుచుకుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు అడిగే ధైర్యం లేకనే తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదన్నారు కిషన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ను అధికార కాంగ్రెస్ గాలికి వదిలేసిందని, ప్రజలను, నిరుద్యోగులను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్క నిరుద్యోగికి 56 వేల రూపాయలు ప్రభుత్వం బకాయి పడిందని, రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజలకు ప్రయోజనం లేకుండా పోయిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో రౌడీయిజానికి, స్థానం లేదు. వాటిని కఠినంగా పని చేయాలన్నారు. రామలింగ మూర్తి హత్యపై సమగ్ర విచారణ జరగాలని, రాజకీయాలకు తావు లేకుండా… జరిగిన రామలింగమూర్తి హత్యపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
హైదరాబాద్ లోని మెర్క్యురీ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈసారి కేంద్ర బడ్జెట్ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించామన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని, కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని కబోధులు కాంగ్రెస్ నేతలు అని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేయడానికే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు బండి సంజయ్. తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా? అని అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో? ఎవరు అన్యాయం చేశారో బహిరంగ చర్చకు మేం సిద్దమని, ప్రధాని హోదాకు గౌరవం ఇవ్వకుండా అవాకులు పేలడం సరికాదన్నారు. ట్యాక్స్ డివల్యూషన్ రూపంలో 29 వేల 899 కోట్ల రూపాయలు కేటాయించినమన్నారు బండి సంజయ్.
అలర్ట్.. టీజీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల..
2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ విడుదలైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఏప్రిల్ 6 – 8 వరకు దరఖాస్తులో తప్పుల సవరించుకోవచ్చు. ఆలస్య రుసుము చెల్లించి.. ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కాగా.. ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు ఆన్‌లైన్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహిస్తారు. కంప్యూటర్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈఏడాది కూడా ఈఏపీసెట్ బాధ్యతలు జేఎన్టీయూ తీసుకుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కాగా, కన్వీనర్ కోటా బీటెక్ సీట్లు మొత్తం రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
సచిన్‌ను అధిగమించి రికార్డు బద్దలు కొట్టిన హిట్ మ్యాన్..
భారత జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక గొప్ప ఘనత సాధించాడు. “హిట్‌మ్యాన్” గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను రోహిత్ అధిగమించాడు. కాగా.. ఈ జాబితాలో నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 11వ పరుగును చేసిన వెంటనే.. రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు పూర్తి చేశాడు. భారత్ తరఫున వన్డే క్రికెట్‌లో 11,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ కంటే ముందు ఈ ఘనత సాధించిన భారత బ్యాట్స్‌మన్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఉన్నారు. రోహిత్ శర్మ 261 ఇన్నింగ్స్‌లలో 11,000 పరుగుల మార్కును చేరాడు. సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌లలో, విరాట్ కోహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్‌లలో 11,000 పరుగులను చేరాడు. రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్‌లలో, సౌరవ్ గంగూలీ 288 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించారు.
‘దృశ్యం 3’ కన్ఫర్మ్ చేసిన మోహన్ లాల్!
మలయాళ సినిమాల్లోని అత్యుత్తమ క్రైమ్ థ్రిల్లర్లలో దృశ్యం ఒకటి. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా రెండో భాగానికి కూడా మంచి ప్రేక్షకుల స్పందన వచ్చింది. గత కొన్ని రోజులుగా, దృశ్యం 3 కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు, దృశ్యం 3 వస్తోందని మోహన్ లాల్ ధృవీకరించారు. మోహన్ లాల్ పోస్ట్ లో జీతూ జోసెఫ్, ఆంటోనీ పెరంబవూర్, మోహన్ లాల్ కలిసి ఉన్న ఫొటో షేర్ చేశారు. “గతం ఎప్పటికీ మౌనంగా ఉండదు” అనే క్యాప్షన్‌తో దృశ్యం 3 రూపొందుతుందని మోహన్ లాల్ ధృవీకరించారు. దీంతో అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. దృశ్యం చైనీస్ భాషలోకి రీమేక్ చేయబడిన మొదటి మలయాళ చిత్రంగా కూడా నిలిచింది. ఈ సినిమా కథ ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన వారికైనా నచ్చుతుంది. 2013లో విడుదలైన దృశ్యం సినిమా అమెరికాలోని న్యూయార్క్‌లో వరుసగా 45 రోజులు ప్రదర్శితమైంది. మలయాళ సినిమా చరిత్రలో ఇది తొలిసారి. ఈ చిత్రాన్ని తమిళంలో కమల్ హాసన్ పాపనాశం పేరుతో పునర్నిర్మించగా మోహన్ లాల్ బావమరిది సురేష్ బాలాజీ నిర్మించారు. తెలుగులో కూడా దృశ్యం పేరుతో వెంకటేష్ హీరోగా రెండు భాగాల సినిమాలు చేశారు. ఇక హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ పాపనాశం సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్‌ను ప్రశంసించారు. దృశ్యం సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లోకి అనువదించగా అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించాడు. దృశ్యం సినిమా మొదటి భాగం 2013లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత, ఎనిమిది సంవత్సరాల తర్వాత, 2021లో, ఆ సినిమా రెండవ భాగం విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేరుగా స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.
మొహాలు చూపించకుండా సినిమా.. మార్చి 7న రిలీజ్
ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ‘రా రాజా’. అసలు మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది సాహసం కాదు ఒక రకమైన ప్రయోగమే అని చెప్పాలి. ఇలాంటి ప్రయత్నం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా రాజా’ టీం. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన ‘రా రాజా’ నుంచి తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ్ వీక్షించి అభినందించారు. అనంతరం రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘రా రాజా మూవీ టైటిల్‌ను గమనిస్తే ఏదో ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో ఓ మొహం కూడా కనిపించదు. అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ మొహం కనిపించదు. అలానే ఈ చిత్రంలోనూ మొహాలు కనిపించవని అంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు. హీరో హీరోయిన్ల కోసం సినిమాలకు వస్తుంటారు. కానీ ఇందులో మొహాలు కూడా కనిపించవు, కథే ముందుకు వెళ్తుంటుంది. ఇది అద్భుతమైన ఐడియా. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మార్చి 7న ఈ చిత్రం రాబోతోందని అన్నారు.
పుష్ప 2 ఎఫెక్ట్.. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పై అల్లు అర్జున్ ఫోటో
గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “పుష్ప 2” సినిమా బాక్సాఫీసులో సరికొత్త రికార్డు సృష్టించింది. సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా భారీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత సాధించారు. ఈ ఐకాన్ స్టారుకు అభిమానులకు మేజర్ గుడ్ న్యూస్ వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ మేగజీన్ “ద హాలీవుడ్ రిపోర్టర్” ఇండియా సంచిక కవర్ పేజీలో అల్లు అర్జున్ ఫోటో ముద్రితమైంది. ఈ మేగజీన్ భారతదేశంలో “ద హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా” పేరుతో విడుదలైంది. ఈ సంచికలోని మొదటి కవర్ పేజీ అల్లు అర్జున్ ఫోటోను ప్రచురించింది. దీనికి “అల్లు అర్జున్ ది రూల్” అంటూ ప్రత్యేకంగా క్యాప్షన్ ఇచ్చారు. ఈ మేగజీన్ టీమ్ అల్లు అర్జున్ పై ప్రత్యేకమైన ఫోటో షూట్ కూడా నిర్వహించింది. దీని “బిహైండ్స్ సీన్స్” వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, “ఇండియన్ బాక్సాఫీసులో పెద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతి పెద్ద అవకాశం ఇదేనని భావిస్తున్నాను. బలం, ఆత్మ విశ్వాసం మనసులో ఉండేవి. ఎవరూ వాటిని తొలగించలేరు” అని తెలిపారు. అల్లు అర్జున్ విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం ముఖ్యం అని, జీవితంలో విజయం తరువాత కూడా ఎలాంటి గర్వం లేనివారిని చాలా మందిని చూశానని, అది వారి వారి వ్యక్తిత్వం గొప్పతనమని” చెప్పారు.