హైకోర్టుకు కాకినాడ పోర్టు ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం
హైకోర్టుకు చేరింది కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం..తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడు చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. అయితే, దీనిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది హైకోర్టు.. నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించింది.. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది.. అయితే, తమ బియ్యాన్ని నౌకలో లోడు చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగ్రీ ఎక్స్ పోర్టు, పద్మశ్రీ రైస్ మిల్, సూర్యశ్రీ రైస్ మిల్ యజమానులు భాస్కరరెడ్డి. గంగిరెడ్డి, విశ్వనాధ రెడ్డి ఆరోపిస్తున్నారు.. దీనిపైనే హైకోర్టు మెట్లు ఎక్కారు.. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.. అయితే, వివరాలు సమర్పించేందుకు తమకు సమయం కావాలని ఈ సందర్భంగా హైకోర్టును కోరారు అడిషనల్ అడ్వకేట్ జనరల్.. దీంతో.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..
ఢిల్లీ పర్యటనలో పయ్యావుల.. కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కాసేపటి క్రితం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.. పయ్యావుల కేశవ్ వెంట టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు కూడా ఉన్నారు.. రాష్ట్ర బడ్జెట్ ను ఇటీవలే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం విదితమే కాగా.. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వచ్చి నిర్మల సీతారామన్ ను కలిశారు పయ్యావుల కేశవ్.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలపై నిర్మలా సీతారామన్‌తో చర్చించారు..
సంచలనం సృష్టించిన విశాఖ హనీట్రాప్ కేసు.. వెలుగులోకి మరో ట్విస్ట్..!
విశాఖకు చెందిన జాయ్ జమీనా అనే యువతి ఆన్ లైన్ లో డబ్బున్న వారిని ప్రలోభ పెట్టి అనంతరం వారిని బుట్టలో వేసుకొని చనువుగా మెలిగి వీడియోస్, ఫొటోస్ తో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగుతోందనే సమాచారంతో పోలీసులు సదరు యువతిని అరెస్టు చేశారు. ఎన్ఆర్ఐ యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. లోతుగా విచారణ చేసిన అనంతరం ఈ కేసులో మరి కొందరి ప్రమేయం ఉందని పోలీసులు ఓ ఫారెస్టు అధికారితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరికొంత మంది బాధితులు ఈ కేసులో ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించారు. ఐతే ఈ కేసు అంతా కొలిక్కి వచ్చింది అనుకుంటున్న తరుణంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ బాంబు పేల్చారు. ఈ కేసులో జాయ్ జమీమాకు ఎటువంటి సంబంధం లేదని.. ఆమెకు వ్యతిరేకంగా పోలీసులు ఎటువంటి కచ్చితమైన సాక్ష్యా ధారాలను చూపలేదని ఆరోపించారు. కేవలం చిన్న చిన్న అంశాలను పరిగణలోకి తీసుకుని ఆమెను అరెస్టు చేశారని ఆమె అమాయకురాలని మీడియా ముందుకు వచ్చి వెల్లడించారు. దీంతో నగర వాసులతో పాటు పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.. ఇక, ఇదే విషయాన్ని సీపీ దృష్టికి తీసుకువెళ్లగా ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెబుతూనే హర్షకుమార్ కుమారుడికి జాయ్ జమీమాకు ఉన్న పరిచయాలు పై విచారణ జరుగుతోందని.. హనీ ట్రాప్ కేసులో హర్ష కుమార్ వ్యాఖ్యలపై కూడా దర్యాప్తు చేస్తామని.. ఈ కేసులో ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఎందుకో అర్ధం కావడం లేదని సీపీ వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమే అని హనీ ట్రాప్ వ్యవహారంలో ఇప్పటి వరకూ నాలుగు కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. 10 మందికి పైగా బాధితులు ఉన్నారని ప్రధాన నిందితులైన జాయ్ జమీమా, వేణురెడ్డి, కిషోర్ లను అరెస్ట్ చేశామని మరో ముగ్గురిని త్వరలో అరెస్టు చేస్తామని వెల్లడించారు. బీజేపీకి సంబంధించిన ఒక చోటా నేత ఈ వ్యవహారంలో ఉన్నట్లు ప్రచారం జరిగిందని.. ఐతే అతనికి బీజేపీతో సంబంధం లేదని తమ విచారణలో తేలినట్లు కమీషనర్ వెల్లడించారు. దీంతో ఈ కేసు మరెన్ని మలుపులు తిరిగుతుందోననే ఆశక్తి విశాఖ వాసుల్లో నెలకొంది. అయితే, హనీ ట్రాప్ వ్యవహారంలో ప్రధాన నిందితులను అరెస్టు చేసినప్పటికీ.. ఈ కేసులో విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని సీపీ మాటల ద్వారా అర్ధమవుతోంది. దీంతో ఈ కేసు మరెన్ని మలుపులు తిరిగుతుందోననే ఆశక్తి నెలకొంది.
జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో 2025 జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి.. ఈ మేరకు కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుందనే ప్రచారం సాగుతోంది.. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త భూమి విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ప్రసుత్తం ఉన్న దానిపై 10 శాతం నుంచి 15 శాతం వరకు భూమి విలువలు పెరిగే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. జనవరి ఫస్ట్ నుంచి ల్యాండ్ రేట్స్ రివిజన్ జరుగుతుందనేది వాస్తవం కాదని స్పష్టం చేశారు. గ్రోత్ కారిడార్లు వున్న దగ్గర భూముల ధరలు సమీక్షించి అమలు చేయాలనే ఆలోచన ఉందని.. మార్కెట్ ధరల కంటే ప్రభుత్వ ధరలు ఎక్కువగా వున్న చోట సమీక్షిస్తామని.. గిఫ్ట్ డీఢ్ రిజిస్ట్రేషన్ ధరలను కూడా తగ్గించే ఆలోచన చేస్తున్నాం అన్నారు.
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష.. టికెట్లు విడుదల చేసేది ఎప్పుడంటే..?
వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోంది తిరుమల.. ఇక, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు.. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్‌లో విడుదల చేస్తాం.. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్‌డీ టోకెన్లు కేటాయిస్తాం అన్నారు.. తిరుపతిలో ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్లు కేటాయిస్తాం అన్నారు. టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈని ఆదేశించారు.
ఈ-కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం
ఈ-ఫార్ములా కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడించారు. కేబినెట్‌లో మాట్లాడటం సరికాదని.. సభలో చర్చ చేద్దామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ-కార్ రేసింగ్‌పై విచారణకు గవర్నర్ ఆమోదంపై కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఎవరి జైల్లో పెట్టాలని చూడటం ప్రభుత్వం చేయాల్సిన పనికాదన్నారు. తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సమస్యల పైన వారికి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పైన చర్చ పెట్టాలన్నారు. ప్రజా సమస్యల పైన చర్చించిన తర్వాత.. రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న స్కాములపైన… ఫార్ములా- ఈ వంటి అంశాల పైన చర్చించినా తాము సిద్ధమన్నారు. కొడంగల్ ప్రజల కోసం నిలబడిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉక్కుమనిషిగా మారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భవిష్యత్తులో తుక్కుతుక్కు చేస్తాడన్నారు. భవిష్యత్తులో లగచర్ల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ నుంచి మొదలుకొని అన్ని హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు.
సైబర్ నేరాల నివారణ కోసం ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ ప్రారంభం
సైబర్ నేరాల నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు P.R.O.T.E.C.T పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీస్ రూపొందించిన P.R.O.T.E.C.T(ప్రొటెక్ట్) అనే ప్రాజెక్ట్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌లు లాంచనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ డిజిటల్ ప్రపంచంలో పౌరులకు అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పని చేయనుంది. 2016 నుండి సైబర్ నేరాలను చూస్తున్నామని.. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నేరం జరిగిన తర్వాత నేరస్థులను పట్టుకోవడం కంటే అసలు నేరం జరగకుండా ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. సైబర్ నేరాలను అరికట్టే బాధ్యత అందరిపై ఉందన్నారు. స్టూడెంట్స్, వాలంటీర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. సైబర్ క్రైమ్ గురించి అందరం కలిసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని వారికి సీపీ సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ముందుకు వచ్చిన వారికి సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు
రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యాంగ దినోత్సవ చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు. దేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని అమిత్ షా ప్రశంసించారు. సర్దార్ పటేల్ పోరాటం వల్లే భారత్.. ప్రపంచం ముందు పటిష్టంగా నిలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి జరిగిందన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో జరిగిన చర్చలు దేశ యువతకు విద్యాబోధన కలిగిస్తాయని తెలిపారు. రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవించింది.. ఏ పార్టీ గౌరవించలేదు అనే విషయాన్ని కూడా దేశ ప్రజలకు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుందన్నారు. నియంతృత్వ అహంకారంతో విర్రవీగిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కళ్లద్దాలు పరాయి దేశానివైతే.. భారతీయత ఎప్పటికీ కనిపించదంటూ రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును కాలరాసేందుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో 77 సార్లు రాజ్యాంగ సవరణ జరిగిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంచేశారని ఆరోపించారు. ప్రజల అభిమానాన్ని పొందలేక.. ఎన్నికల్లో ఓడిపోయి.. ఈవీఎంలను తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు.
సీఎం ఫడ్నవీస్‌ను కలిసిన ఉద్ధవ్ ఠాక్రే.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు, పార్టీ ఎమ్మెల్యేలు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్, వరుణ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అసంతృప్తిగా.. రాజకీయాల్లో హాట్ హాట్‌గా ఉన్న తరుణంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను అభినందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. కాగా.. మహాయుతి కూటమి ప్రమాణ స్వీకారోత్సవానికి ఠాక్రేతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. అయితే వారు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అధికార పక్షం, ప్రతిపక్షాలు కలిసి పని చేసేందుకు రాజకీయ పరిపక్వత కనబరచాలని అన్నారు. ‘ఈరోజు మా పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను కలిశారు. మహారాష్ట్ర ప్రభుత్వం కోసం పని చేస్తూ దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా (అధికార పార్టీ, ప్రతిపక్షం) ఇద్దరూ కలిసి పనిచేయాలి. రాజకీయ పరిపక్వత ఉండాలి.” అని ఆదిత్య ఠాక్రే అన్నారు. ఈ సమావేశం మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త అవకాశాలకు దారితీసింది. ఏక్‌నాథ్ షిండే అసంతృప్తి తర్వాత, భవిష్యత్తులో ఏర్పడే కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది సూచనగా పరిగణించబడుతుందా అనే ప్రశ్నలు ఈ సమావేశం నుండి లేవనెత్తుతున్నాయి.
జనవరి 1న క్రావెన్: ది హంటర్
యాక్షన్ డ్రామా, క్రావెన్: ది హంటర్ ఇంకో రెండు వారాల్లో థియేటర్లలో విడుదల కానుంది. సోనీ సంస్థ నుంచి రానున్న సూపర్ హీరో సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాకి ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యం లో డైరెక్టర్ చందూర్ మీడియాతో మాట్లాడారు. “ఈ చిత్రానికి ఆర్ రేటింగ్ రావడం ఒక వరం గా భావిస్తున్నాను. దీని ద్వారా కథ కి నేను నాయయం చేయగలను అని అనిపిస్తుంది. క్రావెన్ కథ ని అత్యద్భుతంగా చెప్పడం అవసరం. అందుకే ఈ సినిమా కి ఆర్ రేటింగ్ రావడం శుభ పరిణామం అని నేను భావిస్తున్నాను.” అని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “కోపం, ఆవేశంతో సెర్గీ ఇద్దరు పిల్లలని టీనేజ్ లో చంపేస్తాడు. ఆ తర్వాత అతను ఈజీగా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతనలా చేయకుండా ఉన్నాడు. అందుకు కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది: చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులు అని అతను భావించడంతో, ఆపుకోలేనటువంటి కోపావేశముతో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావించాడు. ఆ కోపమే ఈ కథకి ఆయువుపట్టు.” అని చెప్పారు. క్రావెన్: ది హంటర్ సినిమా ఆద్యంత యాక్షన్ ఎలిమెంట్స్ తో అలరిస్తుందని ఆయన అన్నారు. మార్వెల్ కి సంబందించిన ఒక ఐకానిక్ విలన్ కథ ని మనం ఇందులో చూడొచ్చు. ఆరాన్ టేలర్-జాన్సన్, అతని గ్యాంగ్స్టర్ తండ్రి నీఙ్కళై తో ఉండే పగ, ప్రతీకారం ఈ సినిమా లో చూడొచ్చని అన్నారు. చాందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ మరియు రస్సెల్ క్రౌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 1 న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.
విషమంగానే శ్రీ తేజ్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల
సంధ్య థియేటర్ లో గాయపడిన శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కిమ్స్ హాస్పిటల్. శ్రీ తేజ ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని పేర్కొన్నారు. అతని జ్వరం తగ్గుతోందని మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఫీడ్‌లను బాగా తట్టుకుంటున్నాడని కూడా పేర్కొన్నారు. స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుండి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. మరోపక్క శ్రీతేజ్ ప్రస్తుతానికి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు ఆ బాలుడిని హైదరాబాద్ సి పి సి వి ఆనంద్ పరామర్శించారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి రెండు వారాలు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ప్రభుత్వం తరఫున తనతో పాటు హెల్త్ సెక్రటరీ కూడా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నామని అన్నారు. తొక్కిసలాటలో శ్రీ తేజ బ్రెయిన్ డామేజ్ జరిగిందని, రికవరీ జరగడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు ఈ ట్రీట్మెంట్ సుధీర్గంగా సాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే శ్రీ తేజ్ ఆరోగ్యం గురించి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని చెప్పుకొచ్చారు. మరోపక్క హెల్త్ సెక్రటరీ క్రిస్టినా మాట్లాడుతూ శ్రీ తేజ్ ట్రీట్ మెంట్ గురించి మానిటర్ చేస్తున్నామని అన్నారు. వైద్యులను ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నామని పేర్కొన్న ఆమె శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.