NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

*బంగాళాఖాతంలో కొనసాగుతున్న రేమాల్ తుఫాన్.. నేటి అర్ధరాత్రి తర్వాత తీరం దాటే ఛాన్స్‌!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫాన్‌గా మారింది. దానికి రేమాల్‌గా నామకరణం చేశారు. రేమాల్ అంటే అరబిక్‌ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ను ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌లో అధికంగా రేమాల్ తుఫాను ప్రభావం చూపనుంది. ఏపీపై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించిందియ. ఉత్తర బంగాళాఖాతంలో రేమాల్ తుఫాన్ కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీపై తుఫాన్‌ ప్రభావం లేకపోయినా.. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విజయవాడలోని పలు రహదారులపై వాననీరు నిలిచిపోయింది.

 

*రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్.. ఇలా చేస్తే ఓటు చెల్లదు..
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. పోలింగ్ ముగిసే 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు. దీంతో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అన్ని రకాల ప్రచారాలు నిలిచిపోయాయి. అయితే చివరి రోజు కూడా అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని ముగించారు. కొందరు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తే, మరికొందరు ర్యాలీలు, సభలు నిర్వహించారు. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు ముగియడంతో అందరి దృష్టి పోలింగ్ పైనే పడింది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. అంతకు ముందే అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ల నియామకాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల ప్రారంభం నుంచి అభ్యర్థులంతా తమ పరిధి మేరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు కృషి చేశారు. ఇతర ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలకు పార్టీ గుర్తు ఉండదు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్‌పై మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్యాలెట్ పేపర్‌లో సీరియల్ నంబర్, అభ్యర్థి పేరు, అభ్యర్థి ఫోటో మాత్రమే ఉంటాయి. అభ్యర్థి పక్కనే ఉన్న పెట్టెలో ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయాలి. ఓటింగ్ సమయంలో చిన్న పొరపాటు జరిగినా ఓటు చెల్లకుండా పోతుంది. 2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20 వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి.. అభ్యర్థుల గెలుపులో కూడా చెల్లని ఓట్లు కీలకంగా మారనున్నాయి.

 

*ఐటీలో ఉద్యోగాల కల్పనలో దేశంలోనే టాప్‌ ప్లేస్ లో హైదరాబాద్‌..
ప్రపంచంలో నలమూలల్లో ఐటీ రంగం ప్రస్తుతం కుదేలవుతున్న పరిస్థితి అందరికి తెలిసిందే. ఇక మన భారత దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు క్రమక్రమంగా తగ్గుతున్న.. అందుకు విరుద్ధంగా హైదరాబాద్ మాత్రం ఐటి జోరును కొనసాగిస్తుంది. గడిచిన ఏప్రిల్ నెలలో హైదరాబాదులో ఏకంగా 41.5% ఐటి నియామకాలు పెరిగినట్లు ఇన్ డీడ్ అనే ఆన్లైన్ జాబ్స్ వచ్చింది సంస్థ నివేదికను వెలువడించింది. ఈ నివేదికలో హైదరాబాద్ తర్వాత బెంగళూరు స్థానాన్ని సంపాదించింది. బెంగళూరులో 24% నియామకాలు పెరిగినట్లు తన నివాదికలో పేర్కొంది. ఇక ఇన్ డిడ్ ప్రకటించడం నివేదిక ప్రకారం.. హైదరాబాదులో పని చేసేందుకు 161 శాతం మంది ఉద్యోగతులు ఆసక్తిని చూపిస్తున్నారని., అలాగే 80 శాతం మంది బెంగళూరు పై ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొంది. కాకపోతే., ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితి కారణంగా ఐటి నియామకాలు జరిపేందుకు కంపెనీలు ఇష్టపడట్లేదని తెలిపింది. ఈ నివేదికలో దేశంలో 3.6శాతం ఐటీ రిక్రూట్మెంట్ తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుత టెక్నాలజీ నేపథ్యంలో ఎక్కువగా ఏఐ సాంకేతిక రంగంలో నియామకాలు జరుగుతున్నాయని పేర్కొంది. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలతో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇలాంటి వారికి ఏకంగా 50% పైన అధిక వేతనాలు ఇవ్వడానికి కంపెనీలు వెనుకంజ వేయడం లేదు.

 

*నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. సూచనలు ఇవే..
NTA దేశవ్యాప్తంగా JEE అడ్వాన్స్‌డ్ 2024 పరీక్షను నేడు నిర్వహించనుంది. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీలోని 26, తెలంగాణలోని 13 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 3 గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావాలి. మొదటి పేపర్‌ను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. రెండో పేపర్‌ను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ రాయనున్నారు. జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన వారికి మాత్రమే ఈ పరీక్షలో హాజరుకావడానికి అనుమతి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తీర్ణత సాధిస్తే ఐఐటీల్లో బీటెక్ సీట్లకు పోటీపడే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇప్పటికే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈరోజు ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థులు ఈ కింది జాగ్ర‌త్త‌లు పాటించాలి.

 

*నేడు యూపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశ ఏడో విడత ఎన్నికల కోసం బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మిర్జాపూర్, మౌ, డియోరియాలలో నిర్వహించే బహిరంగ సమావేశాల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. తొలి సమావేశం ఉదయం 9:30 గంటలకు మీర్జాపూర్‌లో జరగనుంది. బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్) జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అప్నా దళ్ (ఎస్) కూడా రాబర్ట్స్‌గంజ్ స్థానం నుంచి పోటీలో ఉంది. అక్కడి నుంచి పార్టీ ఎమ్మెల్యే రింకీ కోల్‌ను రంగంలోకి దించింది. ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేయాలని మోడీ ప్రజలకు కోరనున్నారు. అలాగే, నేటి ఉదయం 11:15 గంటలకు మౌలోని మేవారి కలాన్‌లోని ఘోసి, బల్లియా, సేలంపూర్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోడీ ప్రచారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు డియోరియాకు చేరుకుంటారు. అక్కడ రుద్రాపూర్‌లో ఆయన ఎన్నికల సభలో పాల్గొంటారు. బన్స్‌గావ్, డియోరియా నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు సపోర్టుగా మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీర్జాపూర్, వారణాసి, ఘాజీపూర్, గోరఖ్‌పూర్‌లలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మిర్జాపూర్‌లో ప్రధాని మోడీతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత వారణాసిలోని శివపూర్‌లోని కచ్చా బాబా ఇంటర్ కాలేజీలో, మధ్యాహ్నం 2.45 గంటలకు ఘాజీపూర్‌లోని టౌన్ నేషనల్ ఇంటర్ కాలేజీలో చందౌలీ లోక్‌సభ స్థానం అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇక, మధ్యాహ్నం 3.10 గంటలకు గోరఖ్‌పూర్‌లోని జనతా ఇంటర్‌ కళాశాలలో ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

 

*బేబీ కేర్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు నవజాత శిశువులు దహనం
ఢిల్లీలోని వివేక్ విహార్‌లోని రెండంతస్తుల బేబీ డే కేర్ సెంటర్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ కేంద్రంలో 11 మంది నవజాత శిశువులు జాయిన్ అయ్యారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడి మరణించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో సంఘటన ప్రదేశానికి చేరుకుని కొందరిని రక్షించింది. గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా సమీపంలోని గుప్తా నర్సింగ్ హోమ్, తూర్పు ఢిల్లీ అడ్వాన్స్‌డ్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. సంఘటన ప్రదేశానికి పోలీసు బృందాలు, రెస్క్యూ టీమ్ చేరుకుని పలువురు నవజాత శిశువులను రక్షించారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం తర్వాత బేబీ కేర్ సెంటర్ నిర్వాహకులు, ఉద్యోగులు పరారీ అయ్యారు. ఈ ప్రమాదంపై కనీసం బాధితుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. శనివారం రాత్రి 11:30 గంటలకు బేబీ కేర్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ సురేంద్ర చౌదరి చెప్పుకొచ్చారు. బేబీ కేర్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పొగలు రావడాన్ని ప్రజలు చూశారు. ఆ కొద్దిసేపటికే మంటలు పై అంతస్తులకు చేరాయి. మంటలు ఒక్కసారిగా భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంరక్షణ కేంద్రం వెనుక వైపు నుంచి అద్దాలు పగులగొట్టి, నవజాత శిశువులను ఒక్కొక్కరిని బయటకు తీశారు. ప్రస్తుతం గాయపడిన నవజాత శిశువులందరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది చెప్పుకొచ్చిందని అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ సురేంద్ర చౌదరి వెల్లడించారు. అయితే, బేబీ కేర్ కేంద్రానికి ఇరువైపులా ఉన్న నాలుగు అంతస్తులు, రెండంతస్తుల భవనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో పాటు ఈ సెంటర్ కు 100 మీటర్ల దూరంలో ఉన్న ఐటీఐ క్యాంపస్‌లో ఒక సిలిండర్ పేలడంతో స్థానిక ప్రజలు భయపడిపోయారని పోలీసులు చెప్పుకొచ్చారు.

 

*మూడోసారి ఛాంపియన్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ అవతరిస్తుందా.. ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధం..
ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం మే 26, 2024న మే 26న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని, కేకేఆర్ క్వాలిఫయర్ 1లో నేతృత్వంలోని SRH ను ఓడించి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు, ఆరెంజ్ ఆర్మీ క్వాలిఫయర్ 2లో సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గ్రాండ్‌ గా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. లీగ్ దశలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండూ వరుసగా పట్టికలో అగ్రస్థానంలో నిలిచాయి. శ్రేయాస్ అయ్యర్ జట్టు 14 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లలో గెలిచి ఐదు ఓడిపోయి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. దింతో కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడడం ఇది మూడోసారి. కోల్‌కతా నైట్ రైడర్స్ 2012, 2014లో 2 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకోగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ట్రోఫీని కైవసం చేసుకుంది. హైదరాబాద్, కోల్‌కతా జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో 27 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. నైట్ రైడర్స్ హైదరాబాద్ జట్టుపై చాలా ఆధిపత్యాన్ని కలిగి ఉంది. కేకేఆర్ 18 గెలిచి., తొమ్మిది మ్యాచ్‌ లలో మాత్రమే ఓడిపోయింది.

 

*చెన్నైలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. హైదరాబాద్లో హంగామా..!
ఐపీఎల్‌– 2024లో తుది సమరానికి సర్వం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్‌–17 విజేతను తేల్చే మ్యాచ్‌ నేడు చెన్నై వేదికవుతోంది. ఫైనల్‌ చేరిన సన్‌రైజర్స్‌ జట్టు రాజస్థాన్ కు ఆఖరి పంచ్‌ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తమను దెబ్బ తీసిన కేకేఆర్ తో ఇప్పుడు మళ్లీ పోటీ తలపడబోతుంది. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకునేందుకు హైదరాబాదీ టీమ్ ఎదురు చూస్తుంది. సన్ రైజర్స్‌ చెలరేగితే రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచే ఛాన్స్ ఉంది. 2016లో చివరిసారిగా టైటిల్‌ సాధించిన హైదరాబాద్‌ 2018లో ఫైనల్‌ వరకు వచ్చి ఓడిపోయింది. 2012, 2014లలో ఐపీఎల్‌ టైటిల్ గెలుచిన కోల్‌కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై నజర్ పెట్టింది. ఈ మ్యాచ్‌ చెన్నైలో జరుగుతుండడంతో మన హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్‌ గెలిస్తే మనకు టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్ గా ప్యాట్ కమిన్స్‌ నిలుస్తాడు. ఇక, ఐపీఎల్‌ ఫైనల్‌ చెన్నైలో జరుగుతున్నప్పటికీ హంగామా అంత హైదరాబాద్ నగరంలోనే కనిపిస్తుంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్‌ స్క్రీనింగ్‌ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు రెడీ అవుతున్నాయి. పబ్స్, లాంజ్‌లు.. క్రికెట్‌ థీమ్‌ అలంకరణతో క్రికెట్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మన హైదరాబాద్ టీమ్ ఫైనల్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌ నగరవాసులను ఉర్రూతలూగించనుంది. దీంతో ఎంట్రీ ఫీజు కనీసం రూ.500 నుంచి ప్రారంభించి ఆపై ధరలో విభిన్న రకాల ఆకర్షణలతో క్రికెట్‌ అభిమానుల్ని లైవ్‌ ఏర్పాట్లతో హోటల్స్, పబ్స్, లాంజ్ లు ఆహ్వానిస్తున్నాయి. కాగా, గచ్చిబౌలిలోని ముస్టాంగ్‌ టెర్రస్‌ లాంజ్‌లో ఏకంగా 3 స్క్రీన్స్‌ ఏర్పాటు చేసేశారు. కార్ఖానాలోని ద బార్‌ నెక్ట్స్‌ డోర్‌లో 2 బిగ్‌ స్క్రీన్స్‌, జూబ్లీహిల్స్‌లోని ఎయిర్‌లైవ్‌లో 2 స్క్రీన్స్, మాదాపూర్‌లోని రష్‌ స్పోర్ట్స్‌ బార్‌ అండ్‌ బౌలింగ్‌ సెంటర్‌లో పెద్ద స్క్రీన్ తో పాటు చిన్నపాటి టీవీలను కూడా ఏర్పాటు చేయడంతో పూర్తిగా ఐపీఎల్‌ సందడికి నెలకొంది. హైదరాబాద్ నగరంలోని పబ్స్, బార్స్, రెస్టారెంట్స్‌తో పాటు సికింద్రాబాద్‌ క్లబ్, జింఖానా క్లబ్, ఫిలింనగర్‌ క్లబ్‌.. లాంటి సంపన్నులకు చెందిన క్లబ్స్‌ కూడా ప్రత్యేక ఏర్పాట్లతో క్రికెట్ అభిమానులను ఆహ్వానిస్తున్నాయి. కాగా, ఇప్పటికే మాల్స్, మల్టిఫ్లెక్స్‌లూ, కెఫెలు సైతం స్పెషల్ స్క్రీన్స్‌ ఏర్పాటులో పోటీ పడుతున్నాయి.