NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఆందోళనలో అన్నదాతలు!
తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వణికిపోతున్నాయి. ఆకాలంగా కురుస్తున్న వానలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాల వల్ల పంట నష్టపోయి ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల దెబ్బ కొట్టాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు మరో నేడు, రేపు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పిడుగులు.. ఉరుములు.. మెరుపులతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. ముఖ్యంగా తెలంగాణలో గరిష్టంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో 13.6 సెంటీమీటర్ల వాన కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లా్ల్లో 7 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇంకో వైపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. 5 డిగ్రీల సెల్సియస్ స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈదురు గాలులతో ప్రజలు వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని పేర్కొంది.

ఎమ్మెల్యేలపై ఇంటెలిజెన్స్ నిఘా..! ఎందుకో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి.. ఈ నెల 23వ తేదీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇప్పటికే దీనిపై తమ ఎమ్మెల్యేలకు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా విప్ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని.. 23వ తేదీ పార్టీ సూచించిన అభ్యర్థికి ఓటు వేయాలని విప్ జారీ చేసింది వైసీపీ.. అయితే, విప్ ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు చీఫ్ విప్ ప్రసాద్ రాజు. మరోవైపు.. ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.. 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. ఎమ్మెల్యేల కదలికలపై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టించిందట.. అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా? అని జిల్లాల్లో ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం.. అయితే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏడు మాత్రమే ఖాళీగా ఉన్నా.. ఇప్పడు 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.. అనూహ్యంగా తెలుగు దేశం పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టింది.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్క ఓటు చే జారినా ఫలితాలపై ప్రభావం పడనుంది.. అయితే, ఈ మధ్యే వైసీపీకి రెబల్‌గా మారిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి.. ఆత్మ ప్రభోదానుసారం ఓటేస్తాం అని ప్రకటించడంతో.. వారి ఓట్లు వైసీపీకి పడడం డౌట్‌గానే ఉంది.. ఇక, ఆ ఇద్దరు ఎమ్మెల్యేల దారిలో ఇంకెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తోంది వైసీపీ అధిష్టానం.. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం చేజారకుండాజాగ్రత్తలు తీసుకుంటోంది వైసీపీ.

ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 ఎన్నికలే టీడీపీకి చివరివి..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్‌ వచ్చింది.. ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇక 2024 ఎన్నికల్లోనూ ఈ ఫలితాలు రిపీట్‌ అవుతాయని చెబుతున్నారు.. అయితే, ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు అంటూ హాట్‌ కామెంట్లు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే పార్టీ గెలిచినట్లు చంద్రబాబు ఫీలవుతున్నారన్న ఆయన.. తనకు తానే తిరుగులేదని చెప్పుకోవటం హాస్యాస్పదమని సెటైర్లు చేశారు.. ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 సాధారణ ఎన్నికలు టీడీపీకి చివరి ఎన్నికలు అవుతాయని జోస్యం చెప్పారు. ఇక, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఉంది సభలో టీడీపీ సభ్యుల తీరు అని ఫైర్‌ అయ్యారు మంత్రి కాకాణి.. చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు.. మోసాలు చేయటంలో‌ చంద్రబాబుకు గజకర్ణ, గోకర్ణ విద్యలు తెలుసు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. వర్షాలు ఆగిన వెంటనే పంట నష్టం అంచనా వేస్తామని ప్రకటించారు. దిగుబడి ఆధారిత, పంట నష్టం ఆధారంగా వేసే పంటలకు అంచనా వేస్తున్నాం.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం అని ఇప్పటికే నిరూపించాం అన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన వాటిని జగన్ ప్రభుత్వమే చెల్లించిందని.. దీంతో.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.

కుక్కపై కర్కశత్వం.. బండికి కట్టి ఈడ్చుకెళ్లిన వైనం
ఉత్తరప్రదేశ్ లో హృదయ విదారక ఘటన జరిగింది. మూగజీవి పట్ల క్రూరంగా ప్రవర్తించాడో వ్యక్తి. కుక్కను మోటార్ సైకిల్ కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఘజియాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మూగజీవం పట్ల ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో శనివారం ఇస్మాయిల్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ కు ఓ కుక్కను కట్టి రెండున్నర కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఈ అమానుష ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. కాగా ఇస్మాయిల్ తన బండికి కుక్కను కట్టి విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ విహార్ ఔట్ పోస్ట్ నుంచి వెళుతున్నాడు. అవుట్ పోస్ట్ దగ్గరికి రాగానే స్థానికులు అతడిని గమనించి.. ఆపమని కేకలు వేశారు. అతన వినకపోవడంతో టూ వీలర్ మీద వెంటపడ్డారు. మరికొందరు పీపుల్స్ ఫర్ యానిమల్స్ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని మీద జంతువులను హింసిస్తున్నాడన్న కేసు నమోదు చేశారు. అయితే ఇలా ఎందుకు చేశావు అని ఇస్మాయిల్ ను అడగగా.. ఆ కుక్క చాలా మందిని కరిచిందని తెలిపాడు. అందుకే.. దాన్ని తమ ప్రాంతానికి దూరంగా వదిలేయడానికి తీసుకు వెళ్తున్నానని పోలీసులకు తెలిపాడు.

కరోనా ఎంతలా మార్చేసింది..! నివేదికలో ఆసక్తికర అంశాలు
ఏదైనా చెబితే కరోనాకు ముందు.. కరోనా తర్వాత అని చెప్పాల్సి వస్తుందేమో.. ఎందుకంటే.. ఎంతో మందిని దూరం చేసింది.. తమకు కష్టసమయంలో అండగా ఉండేది ఎవరు? దూరం జరిగేది ఎవరు అనేది కూడా బయటపెట్టింది.. అయ్యో అంటూ ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా.. నా వాళ్లు అని చెప్పుకుని స్థితి కూడా లేకుండా చేసింది.. మొత్తంగా కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది. కోవిడ్‌ సోకిన భారతీయుల్లో 35 శాతం మంది ఇంకా తీవ్ర నిరాశ నిస్పృహల్లోనే ఉన్నారంటూ ఓ అధ్యయనం తేల్చింది.. కోవిడ్-19 మహమ్మారి తర్వాత భారతీయులలో ఒత్తిడి, కోపం, విచారం మరియు ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలతో ఇటీవలి కాలంలో కష్టాలు మరియు బాధలు పెరుగుతున్నాయని ఒక అధ్యయనం కనుగొంది. కన్సల్టింగ్ సంస్థ హ్యాపీప్లస్ ద్వారా ‘ది స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ 2023’ నివేదిక ప్రకారం ప్రతికూల అనుభవాలు పెరుగుతున్నాయి. ప్రతివాదులు 35 శాతం మంది 2022లో 33 శాతంతో పోలిస్తే ఇటువంటి భావోద్వేగాలను అనుభవించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల భావోద్వేగాల జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది, రాష్ట్రానికి చెందిన 60 శాతం మంది తాము అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో 58 శాతం, గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్‌లో 51 శాతం మంది చొప్పున ఇదే పరిస్థితిలో ఉన్నారు.. మరోవైపు, భారతీయులలో సానుకూల భావోద్వేగాలు 70 శాతం నుండి 67 శాతానికి పడిపోయాయి. జీవిత మూల్యాంకన స్కోర్, ఆత్మాశ్రయ శ్రేయస్సు, 2022లో 6.84 పాయింట్ల నుండి 2023లో 10కి 6.08 పాయింట్లకు పడిపోయింది. జీవితంలోని అనేక అంశాలు ప్రతికూల భావోద్వేగాలకు ప్రధాన ఐదు కారణాలతో భారతీయ ప్రజలను అసంతృప్తికి గురిచేస్తాయని సర్వే అంచనా వేసింది. ఆర్థిక సమస్యలు, కార్యాలయంలో ఒత్తిడి, సామాజిక నిబంధనలు, ఒంటరితనం మరియు COVID-19 మహమ్మారి తర్వాత ఈ పరిస్థితులు నెలకొన్నాయి.

ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి.. ఆ స్కామ్ వల్లే..?
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపుర్ లో జరిగింది. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ స్కామ్ లో ఉన్నవారే తమ మృతికి కారణమని రాసి ఉంది. ఈ దారుణ ఘటన దుర్గపుర్ లో జరిగింది. మృతులు అమిత్ కుమార్ మొండల్(35), రూపా మొండల్(31).. దంపతుల పిల్లలు నిమిత్ కుమార్ మొండల్(6), నిఖితా మొండల్( ఏడాదిన్నర వయసు)గా పోలీసులు గుర్తించారు. అమిత్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది. రూపా, ఆమె ఇద్దరి పిల్లల మృతదేహాలు కింద పడి ఉన్నాయి. మృతుల మొబైల్లో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. టీఈటీ కుంభకోణంలో పాల్గొన్నవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో ఓ మెసేజ్ ఉంది. స్థానికులు మాత్రం అత్మహత్య కాదు.. కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ విషయంలోనే వీరిని హత్య చేసి ఉంటారని చెబుతున్నారు.

Show comments