Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

అనంతపురంలో జంట హత్యల కలకలం.. తల్లి, కొడుకు దారుణ హత్య
అనంతపురం జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి.. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామం ఎస్సీ కాలనీలో మంగళవారం తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఎల్లమ్మ (38) అనే అంగన్వాడీ టీచర్‌, ఆమె కుమారుడు చిన్న (22)ను హత్య చేశారు. ఈ ఘటన వెనుక కుటుంబ ఆస్తి వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామానికి చెందిన నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నల్లప్ప మృతి అనంతరం రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో తీవ్ర వివాదం నెలకొంది. ఈ క్రమంలో మొదటి భార్యకు చెందిన కుమారులు, రెండో భార్య ఎల్లమ్మతో పాటు ఆమె కుమారుడు చిన్నను హత్య చేసినట్లు సమాచారం. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

నేడు రైల్వే కోడూరుకు జనసేన విచారణ కమిటీ.. పవన్‌ నిర్ణయంపై ఉత్కంఠ..!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ అంతర్గత విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జనసేన విచారణ కమిటీ నేడు, రేపు రైల్వే కోడూరులో పర్యటించనుంది. బాధితురాలు వీణా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై NGRCను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వీణా విడుదల చేసిన వీడియోలు, వాటిలో ఉన్న అంశాలను విచారణ కమిటీ సేకరిస్తోంది. అలాగే అసెంబ్లీలో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన సందర్భానికి సంబంధించిన వీడియో వివరాలపై కూడా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో జనసేన పార్టీ అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో విచారణ కమిటీ బాధితురాలు వీణాతో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, అలాగే ఘటనకు సంబంధించిన మరికొందరిని కూడా కలవనుంది. వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలతో కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా, నిన్న జరిగిన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కూడా ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. విచారణ కమిటీ నివేదిక అందిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. 30కి పైగా అంశాల ఎజెండాతో భేటీ..
ఇవాళ ఏపీ కేబినెట్‌ భేటీ కానుంది. ఉదయం 10.30 గంటలకు అమరావతి సచివాలయం ఫస్ట్ బ్లాక్‌లో మంత్రులు భేటీ కానున్నారు. నేటి సమావేశంలో లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు-అరెస్టుల అంశంపై సమగ్ర చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మంత్రులకు.. చంద్రబాబు సూచనలు చేయనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్‌లో 30 అంశాలకు పైగా ఆమోదం తెలిపారు. మళ్లీ వారం రోజులకే కేబినెట్ పెట్టడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడులు. పరిశ్రమలు.. భూ కేటాయింపు లపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, కేబినెట్‌ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది.. తిరుమల లడ్డూ వ్యవహారానికి సంబంధించి సీబీఐ ఇచ్చిన నివేదిక.. సిట్ నివేదిక ఈ రెండు పరిశీలించాలని ఇప్పటికే సీఎం.. చంద్రబాబు మంత్రులకు సూచించారు. అదేవిధంగా తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ చేస్తున్న విమర్శలు ఇతర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు వీటి మీద కూడా ప్రధానంగా క్యాబినెట్ తర్వాత చర్చకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నాయకులు రెచ్చగొట్టే.. వ్యాఖ్యలు చేసినా..సంయమనం పాటించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు.

నేడే మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు.. బుజ్జగింపులు షురూ!
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. దీంతో పట్టణాలలో రాజకీయ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారనుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో ఆయా మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులకు గాను భారీగా 19,608 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సంఖ్య ఎన్నికలపై పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల్లోనూ ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైన అనంతరం మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. దీంతో పోటీకి నిలిచే అభ్యర్థుల తుది చిత్రం స్పష్టమవడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది. కాగా.. కొన్ని పార్టీలు ఇంకా కొన్ని వార్డుల్లో బిఫారాలు అందించలేదు. నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల అధికారులకు బిఫారాల అందజేతకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే చివరి గడువు. దీంతో అన్ని పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేయాల్సిందే. బిఫారాలు ఇవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో బిఫారం దక్కని వారు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారంతా స్వతంత్రులుగా పోటీలో ఉంటే పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు పలుచోట్ల ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక బుజ్జగింపులు మొదలవుతాయి. రెబల్ అభ్యర్థులను తప్పించేందుకు అనేక కీలక మీటింగ్‌లు, హామీలతో అగ్రనేతలు బిజీ బిజీగా ఉంటారు.

భారతీయ ఉత్పత్తులకు శుభవార్త.. భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై నిర్మలమ్మ వ్యాఖ్య
భారత్-అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం మోడీ-ట్రంప్ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. అనంతరం భారత్‌పై 18 శాతానికి సుంకం తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడ్డాయి. అంతేకాకుండా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థకు దోహదపడనుంది. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం మధ్య సుంకాల తగ్గింపును ప్రశంసించారు. ‘‘భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులకు శుభవార్త’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘#MadeInIndia ఉత్పత్తులకు శుభవార్త. అవి ఇప్పుడు 18 శాతానికి తగ్గిన సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. PM @narendramodi, @POTUS నాయకత్వానికి ధన్యవాదాలు. ఈ అభివృద్ధి కోసం. మన రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల ప్రజలు ప్రయోజనం పొందుతారు.’’ అని నిర్మలా సీతారామన్ రాసుకొచ్చారు.

పాకిస్థాన్‌కు ట్రంప్ బిగ్ షాక్! టారిఫ్ అంశంలో సీన్ రివర్స్.. భారత్‌కు లాభం, పాక్‌కు నష్టం
పాకిస్థాన్‌కు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు! తాజాగా భారత్‌–అమెరికా మధ్య మరో కీలకమైన వాణిజ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా ఒప్పందం ప్రకారం.. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పన్ను 50 శాతం నుంచి నేరుగా 18 శాతానికి తగ్గనుంది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని హామీతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు ఎలా షాక్ అవుతందనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. అయితే.. ఈ మధ్య పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ ఎంత సానిహిత్యంగా మెరిగారో ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. ఓ వైపు… ట్రంప్ చాలా గ్రేట్ అని షరీఫ్, మునీర్ కొనియడుతుంటే.. మరోవైపు.. మునీర్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని ట్రంప్ చెప్పారు. కానీ.. టారిఫ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఇక్కడ పాకిస్థాన్‌పై అమెరిక 19 శాతం టారిఫ్‌ను విధించింది. భారత్‌పై మాత్రం ఒక శాతం తక్కువ అంటే 18 శాతం సుకం విధించింది. భారత్‌ కంటే పాకిస్థాన్‌పై టారిఫ్ ఒక శాతం ఎక్కువగా ఉంది. ఇదే పాకిస్థాన్‌కు అమెరికా ఇచ్చిన షాకింగ్‌గా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ట్రంప్ టారిఫ్ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికలో ప్రకటించారు. భారత్ ఇకపై అమెరికా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని, అవసరమైతే వెనిజువెలా నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. “మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పన్ను 18 శాతానికి తగ్గడం చాలా సంతోషకరం. ఈ గొప్ప నిర్ణయానికి భారత ప్రజల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు,” అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఎన్నో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని మోడీ పేర్కొన్నారు.

రణబీర్‌లో రాముడినే చూస్తారు – అరుణ్ గోవిల్ సెన్సేషనల్ కామెంట్స్!
భారతీయ సినీ చరిత్రలో ‘రామాయణం’ వెండితెరపై ఆవిష్కృతమవుతుందంటే ప్రేక్షకుల్లో ఉండే ఉత్కంఠే వేరు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, మన సౌత్ బ్యూటీ సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా సీనియర్ నటుడు అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గతంలో బుల్లితెర రామాయణంలో రాముడిగా నటించి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన అరుణ్ గోవిల్, రణబీర్ లుక్స్.. పర్‌ఫార్మెన్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అరుణ్ గోవిల్ మాట్లాడుతూ.. ‘దేవుడి పాత్రలను పోషించడం సామాన్యమైన విషయం కాదు. ప్రేక్షకులు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు పాత పాత్రలతో పోల్చడం సహజం. మనం దేవుడి పాత్ర చేస్తున్నప్పుడు, చూడగానే ఆ దేవుడే దిగి వచ్చాడా అన్నట్టుగా ఉండాలి. అందుకే ఈ పాత్రలకు ‘లుక్స్’ అనేవి చాలా ముఖ్యం’ అని ఆయన వివరించారు. అలా రణబీర్ కపూర్ గురించి చెబుతూ.. ‘ఆడియన్స్ తెరపై మనల్ని (నటులను) చూడరు, ఆ పాత్రలో ఉన్న దేవుడిని చూస్తారు. బహుశా దేవుడు నిజంగా ఇలానే ఉంటాడేమో అన్నట్లుగా మనం ప్రేక్షకులను ప్రభావితం చేయాలి. రణబీర్ కపూర్ ఆ విషయంలో సక్సెస్ అవుతాడు, జనం ఆయనలో దేవుడిని చూస్తారని’ అరుణ్ గోవిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన రాముడి పాత్రల కంటే ఇది భిన్నంగా, ప్రభావవంతంగా ఉండబోతోందని ఆయన హింట్ ఇచ్చారు.

అజిత్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమా..
గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద  సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే గత కొంతకాలంగా అజిత్ నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చ నడుస్తోంది. అయితే డైరెక్టర్ ఆధిక్ ఇప్పుడు అజిత్ కోసం మరో పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ (AK Entertainments) నిర్మించబోతుందట. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ వ్యయంతో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అజిత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అధిక్ రవిచంద్రన్ ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తోంది. అజిత్ చిత్రం కోసం అజిత్ ఏకంగా రూ. 170 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఒక టాలీవుడ్ నిర్మాణ సంస్థ తమిళ హీరోకు ఈ స్థాయి రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘AK64’పై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయండంలో సందేహమే లేదు.

విశ్వంభర టీజర్‌పై విమర్శలు.. యూవీ క్రియేషన్స్ షాకింగ్ డెసిషన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఒక సంచలనం. ఆయన సినిమా వస్తుందంటే చాలు అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం చిరంజీవి యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara) పై భారీ హైప్ ఉంది.చిరంజీవి క్లాసిక్ హిట్స్ అయిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లోని అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్, వినోదం.. అలాగే ‘హిట్లర్’ సినిమాలో ఉండే అన్న-చెల్లెళ్ల సెంటిమెంట్.. ఈ రెండు షేడ్స్ ‘విశ్వంభర’లో హైలైట్‌గా నిలవనున్నాయి. సృష్టి, స్థితి, లయ అనే అంశాల చుట్టూ తిరిగే ఈ కథలో చిరంజీవి విశ్వంభరుడుగా కనిపించబోతున్నారు.అయితే, రీసెంట్‌గా విడుదలైన టీజర్‌లోని గ్రాఫిక్స్ (VFX) పట్ల మెగా అభిమానుల్లో కొన్ని అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారు? సినిమా అసలు కథేంటి? అనే విషయాలపై తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. తాజాగా జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో యూవీ క్రియేషన్స్ ప్రతినిధి అజయ్ కుమార్ మాట్లాడుతూ ‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై వస్తున్న కామెంట్స్‌కు క్లారిటీ ఇచ్చారు. “టీజర్‌లోని విజువల్స్ విషయంలో వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను మేము గమనించాం. ఒక పెద్ద సినిమాను రూపొందిస్తున్నప్పుడు ఇలాంటివి సహజం. అందుకే, రెండో టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా పటిష్టంగా, నెక్స్ట్ లెవల్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. విఎఫ్ఎక్స్ నాణ్యత కోసం కొంచెం ఎక్కువ సమయం పడుతోంది” అని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రెండో టీజర్ మెగా ఫ్యాన్స్‌కు ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ సినిమా కేవలం గ్రాఫిక్స్ మీద మాత్రమే కాకుండా స్ట్రాంగ్ ఎమోషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుందని సమాచారం.

వారణాసి లేటెస్ట్ అప్డేట్.. జార్జియాకు టికెట్ బుక్ చేసుకున్న మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ సినిమా వారణాసి. హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్‌  హైదరాబాద్‌లోని కోకాపేట మరియు అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో నిరంతరాయంగా జరుగుతోంది.ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు- ప్రియాంక చోప్రాపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే, చిత్ర బృందం విదేశీ ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఈ నెల ఆఖరున మూవీ టీమ్ జార్జియా వెళ్లనుంది. అక్కడ సుమారు 15 రోజుల పాటు ఒక కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. జార్జియాలో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు భారీ యక్ష్ణ ఎపిసోడ్ ను కూడా అక్కడ షూట్ చేయనున్నారు. జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న తర్వాత చిత్ర యూనిట్ మళ్ళీ హైదరాబాద్ చేరుకోనుంది. ఇక్కడ తర్వాతి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. రాజమౌళి మార్క్ మేకింగ్‌తో, హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్లోబల్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

Exit mobile version