నేడు పెనుగొండకు ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటించనున్నారు.. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. ఆపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు, సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. వివిధ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కోనసీమలో కలకలంరేపుతోన్న గంజాయి..!
ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా ఉండే కోనసీమ జిల్లాలో ఇప్పుడు గంజాయి వినియోగం కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి మారుమూల లోతట్టు గ్రామాల వరకు విచ్చలవిడిగా గంజాయి లభ్యమౌతోంది. కళాశాలలు, విద్యాసంస్థల వద్ద యదేచ్చగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ఇటీవల జరిగిన పలు చోరీలు, నేరాలకు సంబంధించి గంజాయి వినియోగమే ప్రధాన కారణమన్న అంశం గూఢీ అవుతోంది. తాజాగా బైక్‌లను చోరీ చేస్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పోలీసులకు తలతిరిగే సమాచారం అందుబాటులోకొచ్చింది. ఈ దొంగతనాల అన్నింటి వెనుక గంజాయే కారణమన్న దిశగా దర్యాప్తులో తేలుతోంది. మూడ్నాలుగేళ్ళ క్రితం వరకు కోనసీమంటే పచ్చని పొలాలు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. జిల్లాలా పునర్విభజన నేపథ్యంలో రగిలిన కులచిచ్చు పట్టణంలో దావానంలా వ్యాపించింది. అప్పటి వివాదం నుంచి కోనసీమ ఇంకా తేరుకోలేదు. అప్పటి కక్షలు, కార్పణ్యాలింకాచల్లా రలేదు. అప్పట్లో. కుల ఉద్యమాల కారణంగా పలువురు యువకులు ఊళ్ళను వదిలిపెట్టి పరారు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎప్పుడూ లేనిదిలా కోనసీమ యువతపై పోలీసులు కేసులెట్టి వేధించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా ఇప్పుడు కోనసీమ యువతలో కొందరు గంజాయికి అలవాటు పడుతున్న వైనం వెలుగుచూడ్డం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. వాస్తవానికి కోనసీమలో ఊళ్ళన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పరిసర గ్రామాలకు వేగంగా సమాచారం చేరిపోతుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా లభ్యం కావడం పలు సందేహాలకు తెరదీస్తోంది.
నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. లోకేష్ టీమ్ రెడీ అవుతుందా..?
తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా..? పాత తరం నేతలను పక్కన పెట్టేసి.. యువతరానాకి పెద్దపీట వేయనున్నారా? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఇవాళ టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది.. సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానుంది పొలిట్‌బ్యూరో.. పార్టీ పదవుల విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పొలిట్‌బ్యూరోకు ప్రాధాన్యత ఏర్పడింది.. మూడు సార్లుకు మించి పార్టీ పదవులు ఉండకూడదన్నారు మంత్రి లోకేష్.. గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు మార్పులు ఉండాలని పేర్కొన్నారు.. దీంతో లోకేష్ టీమ్ రెడీ అవుతుందనే చర్చ స్టార్ట్ అయింది.. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమావేశంలో ఈ దిశగా నేతలకు చెప్తారా..? పొలిట్‌బ్యూరోలో మార్పులు ప్రస్తావిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.. కాగా, కూటమి ప్రభుత్వంలో.. గతంలో మంత్రులుగా పనిచేసినవారిని, సీనియర్ నేతలను సైతం పక్కనబెట్టి.. యువ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు.. అయితే, పార్టీ పదవులుల్లో కొందరు సీనియర్ నేతలు ఉన్నారు.. లోకేష్ వ్యాఖ్యలతో ఆ సీనియర్లకు కూడా రెస్ట్ ఇస్తారా? అనే చర్చ సాగుతోంది.
నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ
తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు (జనవరి 31) ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11.54 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఈ ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం దవాఖాన అఫ్జల్‌గంజ్‌లో ఉండగా.. నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించబోతున్నారు. రెండు వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ భవనం కార్పొరేట్ హస్పటల్స్ ను తలదన్నేలా ప్రభుత్వం నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. ఇక, రాబోయే వందేళ్ల పాటు ప్రజల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్షలో తెలిపారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ప్రతి విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు ఒక పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు ఉండాలన్నారు. అలాగే, కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నొస్టిక్ సేవలు ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. దీంతో ఈ నూతన భవన నిర్మాణానికి సుమారు రూ.2700 కోట్ల వరకు ఖర్చు కానుందని అంచనా వేస్తున్నారు. కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత 20 శాతం వైద్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల రోజుకు ఐదు వేల మంది ఓపీ రోగులను చూడటంతో పాటు 30 విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం చూస్తుంది.
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి స్టార్ట్ కానున్నాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో రేపు (ఫిబ్రవరి 1న) కేంద్ర బడ్జెట్‌ను ఆమె సభకు సమర్పించనున్నారు. అయితే, ఈసారి బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఈరోజు (జనవరి 31) నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరుగుతాయి. తొలి విడత ఫిబ్రవరి 13వ తేదీ జరగనుండగా.. సెకండ్ విడత మార్చ్ 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరగబోతున్నాయి. కాగా, నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండటం ఇది వరుసగా 8వ సారి కావడం విశేషం. అయితే, బడ్జెట్ సమావేశాల్లో పలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. వక్ఫ్, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లుల లాంటివి ఇందులో లిస్ట్ చేశారు. వక్ఫ్ బిల్లుపై నివేదికను స్పీకర్ ఓం బిర్లాకు గురువారం నాడు పార్లమెంటరీ కమిటీ ఇవ్వగా.. అది ఈ సమావేశాల్లోనే సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బిల్లుల్లో ‘ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్, త్రిభువన్ శాకరీ యూనివర్సిటీ, బ్యాంకింగ్, రైల్వేస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఆయిల్ ఫీల్డ్స్, 2025 ఫైనాన్స్ బిల్లు ఉన్నట్లు పేర్కొన్నారు. గత సమావేశాల్లో పెండింగ్‌లో ఉన్న మరో 10 బిల్లులూ ఈసారి సభలోకి రానున్నాయి
మహా కుంభమేళా ప్రాంతంలో వాహనాల ప్రవేశం పై నిషేధం.. వీవీఐపీ పాసులు రద్దు
మహా కుంభమేళా నుండి భక్తులు సజావుగా తిరిగి వచ్చేలా చూసేందుకు, ప్రయాగ్‌రాజ్ కమిషనరేట్ నుండి వాహనాల ప్రవేశం, నిష్క్రమణను తొలగిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మాంధాద్ గురువారం తెలిపారు. గురువారం ఉదయం, కుంభమేళా ప్రాంతంలోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. వీవీఐపీ పాస్‌లను కూడా బ్లాక్ చేశారు. “ఫిబ్రవరి 4 వరకు ప్రయాగ్‌రాజ్‌లో వాహనాల ప్రవేశం నిషేధించబడుతుందని సోషల్ మీడియాలో ఒక వార్త ఎక్కువగా వైరల్ అవుతోంది” అని ఆయన అన్నారు. ఈ వార్తలు పూర్తిగా ఆధారం లేనివి. మౌని అమావాస్య దృష్ట్యా ప్రయాగ్‌రాజ్లో కి వాహనాల ప్రవేశాన్ని పరిమితం చేశారు. రవీంద్ర కుమార్ మాంధాద్ మాట్లాడుతూ.. “ఈ రోజు జనవరి 30న భక్తులందరూ తిరిగి వస్తున్నారు. ‘డైవర్షన్ స్కీమ్’ను పోలీసులు తొలగిస్తున్నారు. బారికేడ్లను తొలగించాలని పోలీసులకు సూచనలు ఇచ్చారు. జనవరి 31, ఫిబ్రవరి 1 , ఫిబ్రవరి 4 తేదీలలో ఏ రకమైన వాహనాల ప్రవేశంపై ఎటువంటి పరిమితులు ఉండవు. ‘డైవర్షన్ స్కీమ్’ ఫిబ్రవరి 2 , 3 తేదీలలో (బసంత్ పంచమి స్నానోత్సవం) మాత్రమే వర్తిస్తుంది” అని ఆయన అన్నారు. జాతర ప్రాంతంలోకి వాహనాల ప్రవేశానికి ప్రత్యేక విధానం ఉంది. దీని గురించి ఫెయిర్ ఆఫీసర్, డిఐజి విడివిడిగా తెలియజేస్తారు. ప్రయాగ్‌రాజ్ కమిషనరేట్ ప్రాంతంలో వాహనాలపై ఎటువంటి పరిమితి లేదు.
సిరియాపై అమెరికా వైమానిక దాడి.. సీనియర్ ఉగ్రవాది హతం
సిరియాలోని వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం హతమార్చింది. తీవ్రవాద గ్రూపులను నాశనం చేసి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. జబీర్ అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన హుర్రాస్ అల్-దిన్ అనే గ్రూప్‌తో అతను సంబంధం కలిగి ఉన్నాడు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ సైనిక చీఫ్ మహ్మద్ దైఫ్ మరణించినట్లు ధృవీకరించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించిన నెలల తర్వాత ఈ నిర్ధారణ వచ్చింది. నివేదిక ప్రకారం, హమాస్ ప్రతినిధి అబు ఒబైదా వీడియో ప్రకటనలో దైఫ్ మరణాన్ని ధృవీకరించారు. జూలై 13న ఖాన్ యునిస్ ప్రాంతంలో వైమానిక దాడిలో మహ్మద్ దైఫ్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ ఆగస్టు 2023లో ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో 1200 మందికి పైగా మరణించారు. వారిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు. అంతేకాకుండా వందల మంది కిడ్నాప్‌కు గురయ్యారు. దీని తరువాత, ఇజ్రాయెల్ హమాస్‌కు ప్రతీకారంగా గాజాలో 46000 మందికి పైగా పాలస్తీనియన్లను మట్టుపెట్టింది.
బడ్జెట్‌లో ఏం జరిగినా.. ఫిబ్రవరి నుంచి ఛేంజ్ అయ్యేవి ఇవే
ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రవేశపెడతారు. బడ్జెట్‌తో పాటు అనేక ముఖ్యమైన మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించిన ఈ మార్పులు సామాన్యుల ఖర్చులలో మార్పులను తెస్తాయి. ఫిబ్రవరి 1 నుండి అమలు చేయబడే మార్పుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. LPG సిలిండర్ ధరలు ప్రతి నెల మొదటి తేదీన అప్ డేట్ అవుతాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించిన ధరలను విడుదల చేశాయి. ఇది సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి 1న బడ్జెట్ రోజున LPG గ్యాస్ ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది చూడాలి. జనవరిలో కొన్ని మార్పుల తర్వాత 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర తగ్గించబడింది. UPI కింద జరుగుతున్న కొన్ని లావాదేవీలలో మార్పులు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయించింది. ఫిబ్రవరి 1, 2025 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న UPI లావాదేవీ ఐడీలు ఆమోదించబడవు. ఇప్పుడు ఆల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) లావాదేవీ ఐడీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఏదైనా లావాదేవీకి వేరే ఏదైనా రకమైన ఐడీ ఉంటే అది విఫలమవుతుంది.
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 నేడు.. బ్యాటింగ్ విభాగం పుంజుకోకుంటే..!
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మూడో టీ20లో ఓడిన సూర్యసేన.. తిరిగి గెలుపు బాట పట్టి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. తొలి విజయం రుచి చూసిన ఇంగ్లండ్ నాలుగో టీ20లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. పుణెలో శుక్రవారం కీలక నాలుగో టీ20 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. రాత్రి 7 నుంచి మ్యాచ్ ఆరంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. 2024లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన సంజు శాంసన్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నిరాశపరుస్తున్నాడు. మూడు టీ20ల్లో వరుసగా 26, 5, 3 పరుగులే చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో 0, 12, 14 పరుగులే చేశాడు. సంజు, సూర్య పుంజుకోవాల్సిన అవసరం ఉంది. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫామ్‌లో ఉండడం భారత జట్టుకు సానుకూలాంశం. వెన్ను నొప్పి కారణంగా గత రెండు టీ20లకు దూరమైన రింకు సింగ్ ఫిట్‌నెస్ సాధించాడు. రింకు తుది జట్టులోకి వస్తే ధృవ్ జురెల్ తప్పుకోక తప్పదు. శివమ్ దూబె ఆడే అవకాశాలు లేకపోలేదు.
హమ్మయ్య.. పాకిస్థాన్‌కు రోహిత్ వెళ్లాల్సిన అవసరం లేదు!
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు మ్యాచ్‌లతో బిజీగా ఉన్న కారణంగా కెప్టెన్ల ఫొటోషూట్ నిర్వహించడం లేదని పీసీబీ వర్గాలు తెలిపాయి. ‘ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అన్ని జట్లకు తీరిక లేని షెడ్యూల్ ఉంది. భారత్‌తో ఇంగ్లండ్ వన్డే సిరీస్ ఆడనుంది. శ్రీలంకలో పర్యటనలో ఆస్ట్రేలియా ఉంది. టోర్నీకి ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ పాక్ చేరుకుంటాయి. సమయం లేకపోవడంతో కెప్టెన్ల ఫొటోషూట్, విలేకర్ల సమావేశం నిర్వహించడం లేదు’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కెప్టెన్ల ఫొటోషూట్ లేకపోవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫిబ్రవరి 19 నుంచి ఆరంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎనమిది టీమ్స్ తలపడనున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నీ జరగబోతోంది. టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్ Aలో భారత్ సహా పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ దుబాయ్ వేదికగా తలపడనుంది. చివరిసారిగా 2013లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ విజేతగా నిలిచింది.
పుష్ప 2 దారిలో దేవర 2.. కొరటాల మాస్ జాతర ప్లానింగ్.?
పుష్ప పార్ట్ 1 నార్త్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కోసం సుకుమార్ లెక్కలన్నీ మారిపోయాయి. నార్త్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ముందుగా అనుకున్న పుష్ప2 కథలో చాలా మార్పులు చేశాడు. ఫైనల్‌గా సుకుమార్, అల్లు అర్జున్ మాస్ తాండవానికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చీర కట్టి బన్నీ చేసిన మాస్ జాతరకు గూస్ బంప్స్ వచ్చాయి. సినిమాకే గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలెట్‌గా నిలిచింది. ఇప్పుడు దేవర 2లో కూడా ఇలాంటి గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాడట కొరటాల శివ. దేవర పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఎన్టీఆర్ కు నార్త్ లో స్టాండర్డ్ మార్కెట్ వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో నార్త్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి దేవర2 ను గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. అందుకే ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో కీలక మార్పులు చేస్తున్నాడట. పుష్ప 2 తరహాలో ఒకటి కాదు మూడు నాలుగు ఎపిసోడ్స్ గూస్ బంప్స్ వచ్చేలా దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను పీక్స్‌లో ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఈసారి సైఫ్‌తో పాటు మరో విలన్‌గా బాబీ డియోల్‌ని రంగంలోకి దింపుతున్నాడట. మొత్తంగా ఈసారి ఎర్ర సముద్రం మీద జరిగే యుద్ధానికి పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలయ్యేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే వార్ 2 ఆల్మోస్ట్ పూర్తి చేసిన యంగ్ టైగర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఆ తర్వాతే దేవర 2 ఉండనుంది.
శుద్ధ పూసలా కబుర్లు చెప్పొద్దు.. అంటూ సిద్దార్థ్ పై నెటిజన్స్ కౌంటర్లు
ఒకప్పుడు తెలుగులో స్టార్ హోదా అనుభవించిన హీరోల్లో సిద్దార్థ్ ఒకరు. లవర్‌బాయ్‌గా అద్భుతమైన ప్రేమ కథ చిత్రలో నటించిన సిద్ధుకి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. కానీ ప్రజెంట్ టాలీవుడ్ లో సిద్ధికి ఆఫర్ లు పూర్తిగా కరువయ్యాయి. ఆపై మాతృ భాష తమిళ్ లో సినిమాలు చేసుకుంటున్నప్పటికి.. అక్కడ కూడా సిద్దార్థ్‌కు చాలా ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేదు. ఐతే ఎప్పుడు తన సినిమాల ప్రమోషన్ల టైం లో గత వైభవం గురించి మాట్లాడుతూ.. తన ప్రస్తుత చిత్రాలు సరిగా ఆడకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తుంటాడు సిద్ధు. కొన్నిసార్లు తన కెరీర్ దెబ్బ తినడానికి కారణం వారే అంటూ ఇండస్ట్రీ, ప్రేక్షకులను విమర్శిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా తాజాగా ఒక కార్యక్రమంలో తాను పెద్ద స్టార్ కాకపోవడానికి చెప్పిన కారణాలు చర్చనీయాంశం అయ్యాయి. సిద్ధు మాట్లాడుతూ.. ‘హీరోయిన్‌ల నడుములు గిల్లే, వాళ్లను చెంపదెబ్బ కొట్టే సీన్లు.. వాళ్లను కించపరిచేలా ఉన్న సన్నివేశాలు ఉండడం వల్ల చాలా సినిమాలు నేను రిజెక్ట్ చేశాను.. అందుకే పెద్ద స్టార్ కాలేక పోయా’ అని సిద్ధు తెలిపాడు. అయితే ఈ మాటలపై నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో తను నటించిన సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. ‘ఆట’ సినిమాలో ఇలియానాతో కలిసి అతను చేసిన రొమాంటిక్ సాంగ్స్.. అందులో హీరోయిన్ కట్టుకుని ఉన్న టవల్ తీసి ఆమెతో పాటు చుట్టుకునే సన్నివేశం తాలూకు వీడియో తీసి.. ‘ఇలాంటి సీన్లు విషయంలో ఏ అభ్యంతరాలు లేకుండా నటించి ఇప్పుడు శుద్ధ పూసలా కబుర్లు చెబితే ఎలా’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘గృహం’ లాంటి చిత్రాల్లో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్ల మాటేంటి.. ఇలాంటి స్టెట్‌మెంట్‌లు పాస్ చేసెముందు కొంచెం ఆలోచించి మాట్లడండి సార్..అంటూ సిద్ధు పై నెటిజన్లు కామెంట్‌ల వర్షం కురిపిస్తుంది. మరి ఈ కౌంటర్లకు సిద్ధు ఏమని రియాక్ట్ అవుతాడో చూడాలి?