తీరం వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. భారీ వర్షాలు..!
ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది రేపు ఉదయం తీరం దాటే ప్రమాదం ఉందంటోంది వాతావరణశాఖ. దీంతో ఏపీ ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 300 కి.మీ., గోపాల్‌పూర్‌కు 300 కి.మీ., పారాదీప్‌కు 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ఈ వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి శుక్రవారం తెల్లవారుజామున ఒడిశా-ఆంధ్ర తీరాలను గోపాల్‌పూర్ పారాదీప్ మధ్య దాటే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు.
నేడు దేవరగట్టు కర్రల సమరం.. అసలు ఏంటి దాని ప్రత్యేకత..?
విజయదశమి వచ్చిందంటే చాలు.. అంతా జోష్‌లోకి వెళ్తారు.. అయితే, కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం.. కర్రల సమరం ప్రత్యేకంగా నిలుస్తోంది.. ఈ సారి పోలీసులు భారీగా మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో స్వయంబుగా వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్ఈడీ లైట్లు అమర్చారు. 10 డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు.. 10 చెక్ పోస్టులు, వీడియో కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఇక, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పోలీసులు..
బాపూ ఘాట్ కు సీఎం..
గాంధీ జయంతి సందర్బంగా నేడు ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ లో జరిగే గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా, బాపూజీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం బాపూ స్మారక భవనాన్ని సందర్శించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కూడా హాజరై, ముఖ్యమంత్రితో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఈ కార్యక్రమం ముగిసాక మధ్యాహ్నం 1:30 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లెకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరవుతారు. రాత్రి 10 గంటలకు ఆయన కొడంగల్ చేరుకుంటారు.
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత….
మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 4వ తేదీన తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ హయాంలో ఐటీశాఖ మంత్రిగా పనిచేశారు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి… ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామానికి చెందిన రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలమ్మ దంపతులకు 1952 సెప్టెంబరు 14న దామోదర్‌రెడ్డి జన్మించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామసాగర్ జలాలను తరలించేందుకు విశేష కృషి చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు ఐదుసార్లు పోటీ చేయగా.. నాలుగుసార్లు గెలుపొందారు. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. 1988, 1989లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి… టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2004లో విజయఢంకా మోగించారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి 2009లో గెలుపొంది.. వై.ఎస్ కేబినెట్ లో ఐటీశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014, 2018, 2023 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
నేడే వెస్టిండీస్ తో భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్.. భారత్ దూకుడును విండీస్ తట్టుకోగలదా?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య నేటి (గురువారం) నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టు ప్రారంభం కానుంది. భారత గడ్డపై సాధారణంగా కనిపించే పరిస్థితులకు భిన్నంగా ఈ టెస్టు మ్యాచ్ సాగనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ కండిషన్స్ పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయి. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భారత్‌కు ఇది తొలి హోమ్ సిరీస్. ఈ ఏడాది ఫైనల్ కు అర్హత సాధించని తర్వాత, భారత్ ఈసారి ఎలాగైనా ఫైనల్ చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌తో శుభ్‌మన్ గిల్ మొదటిసారి భారత గడ్డపై టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో రెడ్ సాయిల్ పిచ్ ను ఎంచుకున్నారు. ఇది పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నందున మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. అక్టోబర్ 2వ తేదీ, మొదటి రోజు, 84% వర్షం పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు, మూడు రోజులు (శుక్ర, శని) వర్షానికి అవకాశం 25% మాత్రమే ఉన్నప్పటికీ, నాలుగు, ఐదవ రోజు (ఆది, సోమ) వర్షం పడే అవకాశం మళ్లీ 71% నుంచి 90% వరకు ఉండవచ్చు. అయితే, వర్షం రోజు మొత్తం కాకుండా మధ్యమధ్యలో మాత్రమే వస్తుందని, కాబట్టి మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. నేటి భారత్ వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్టులో ఆడే అంచనా ప్లేయింగ్ ఎలెవన్ జట్లు ఈ క్రింది విధంగా ఉండవచ్చు..
బాలయ్య – గోపీచంద్ సినిమాకు కాంతార కెమెరామెన్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య. వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. బాలయ్యతో గోపీచంద్ మలినేని చేయబోయే ఈ సినిమా టైమ్ ట్రావెల్ లాంటి కథనంతో హిస్టారికల్ నేపథ్యంలో రాబోతుంది. ఇప్పటికి స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేసాడు గోపించంద్ మలినేని. అయితే ఈ సినిమా కోసం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అర్వింద్ కశ్యప్ వర్క్ చేయబోతున్నారు. ఇప్పటికే కథ చర్చలు ముగిశాయి. కన్నడ ఇండస్ట్రీ హిట్ అయిన కాంతార, కాంతార చాప్టర్ 1 సినిమాలతో పాటు దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత వంటి సినిమాలకు అర్వింద్ కశ్యప్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించాడు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అద్భుతమైన విజువల్స్ మరియు సినిమాటిక్ గ్రాండియర్‌గా బాలయ్య – గోపిచంద్ సినిమా ఉండబోతుందనడంలో సందేహం లేదు. డాకు మహారాజ్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్.కూడా బాలయ్యను అద్భుతంగా చూపించాడు. అందుకే బాలయ్య సినిమాలకు రెగ్యులర్ గా ఉండే డీఓపీని కాదని అర్వింద్ కశ్యప్ తో వెతున్నారు NBK111 టీమ్.
వరుస ప్లాపులు.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి పరిమితమైన హాట్ బ్యూటీ
నిధి అగర్వాల్‌కు ఎంత కష్టమొచ్చిందీ పగొడికి కూడా రాకూడదు ఇట్లాంటి కష్టం. కెరీర్ స్టార్ట్ చేసి ఎనిమిదేళ్లవుతున్నా డజన్ సినిమాలు కూడా చేయలేదు. అందులోనూ ఇస్మార్ట్స్ శంకర్ తప్ప బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు. తెలుగు కాదని తమిళ ఇండస్ట్రీకెళ్లినా సీన్ సేమ్ రిపీట్. కెరీర్ ఎటుపోతుందో తెలియని టఫ్ టైంలో హరి హర వీరమల్లు నుండి పిలుపొచ్చింది. పవన్ సార్‌తో ప్రయాణం అంటే తిరుగులేదనుకుంది కానీ ఆ సినిమా వాయిదాలుగా తెరకెక్కేసరికి త్రీ, ఫోర్ ఇయర్స్ ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రమోషన్లను భుజాల మీద వేసుకుని చేసింది. కానీ ఈ కష్టమంతా వృథాగా మారింది. సినిమా రిజల్ట్ ఏంటో టాలీవుడ్ ఆడియన్స్‌కు తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ అంతా ఐటమ్ సాంగ్స్‌లో మెరిసి కెరీర్ బిల్డ్ చేసుకుంటే తనెందుకు చేయకూడదన్న గ్లామరస్ డాల్ మిరాయ్‌లో స్పెషల్ స్పెప్పులేస్తే చివరకు ఫ్లోకు అడ్డొస్తుందని తీసేశారు. తను నర్తించిందన్న చిన్న ఆనందం కూడా మిగల్లేదు ఆమెకు. మిరాయ్ టీం జస్ట్ థ్యాంక్స్ కార్డ్ వేసేసి సరిపెట్టేసింది. ఇక నిధి అగర్వాల్ హోప్స్ అన్నీ రాజా సాబ్‌పైనే. ఈ సినిమా కోసం కూడా 2 ఇయర్స్ టైం కేటాయించింది మేడమ్. కానీ వాయిదాల పర్వంతో వచ్చే ఏడాదికి జరిగిపోయింది. రాజా సాబ్ ప్రమోషన్లకు టైం ఉండటంతో వరుసగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు వెళ్లిపోతుంది. ప్రజెంట్ ఆమె చేతిలో ఉన్న ఏకైక ఫిల్మ్ రాజా సాబే. ఇస్మార్ట్స్ శంకర్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ చూడని అంటే ఆరేళ్లుగా సక్సెస్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేని భామకు డార్లింగ్ ఏమన్నా లక్కీ మ్యాన్ అవుతాడేమో. నిధి బిజీగా మారుతుందో లేక షాప్ ఓపెనింగ్స్‌కే పరిమితమౌతుందో చూడాలి.
కాంతార చాప్టర్1 ఆడియెన్స్ రివ్యూ.. ‘శెభాష్ రిషబ్ శెట్టి’
కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ 1 ను తీసుకువచ్చారు. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా గడచిన రాత్రి పిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఆయింది. ఈ సినిమా ప్రీమియర్స్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. పెట్టిన రూపాయికి న్యాయం చేశాడు రిషబ్. అలాగే టెక్నికల్ గా ‘వావ్’ అనేలానే ఉంది కాంతార. అటవీ నేపథ్యాన్ని తెరపై చాలా అందంగా, సహజంగా చూపించాడు దర్శకుడు రిషబ్. అలాగే ‘గార్డియన్ ఆఫ్ కాంతారా’ పాత్రలో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడు. ఈ చిత్రంలో రిషబ్ నటనకు చాలా అవార్డులను గెలుచుకోవడం ఖాయం. ఒక అవతార్ నుండి మరొక అవతార్‌కు మారినపుడు రిషబ్ నటన అద్భుతం అనే టాక్ వినిపిస్తోంది. రిషబ్ శెట్టి టాప్ నాచ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్ 30 నిమిషాలు రిషబ్ శెట్టి జీవించేసాడు. ఒక నటుడిగా దర్శకుడిగా రిషబ్ ఈ సినిమా కోసం పడిన కష్టం మాటల్లో చెప్పలేనిది. తానూ రాసుకున్న ప్రతి పాయింట్ ను అంతే డిటైల్ గా తెరపై మలిచాడు. సినిమా చూసిన ఆడియెన్స్ చెప్పే ఒకే ఒక మాట శెభాష్ రిషబ్. అలానే హ్యాట్సఫ్ టు యువర్ డెడికేషన్.