దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ఏపీ, యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ
తీరం వైపు మొంతా తుఫాన్ దూసుకొస్తుంది.. మరింత బలపడి.. ముందుకు సాగుతోంది.. గంటకు 17 కిలో మీటర్ల వేగంతో కదులుతోంది.. దీంతో, ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలో మీటర్లు, కాకినాడకు 310 కిలో మీటర్లు, విశాఖపట్నానికి 370 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని.. ఈ ఉదయం తీవ్రమైన తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఈ సాయంత్రం లేదా రాత్రి కాకినాడ – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.. ఈ సమయంలో గంటకు 90 – 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఓ దశలో 110 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.. ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది మొంతా తుఫాన్.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.. మరోవైపు, అరేబియా సముద్రంలో మరో వాయుగుండం ఏర్పడింది.. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో డిప్రెషన్ కొనసాగుతుంది.. గత 12 గంటల్లో స్థిరంగా కొనసాగిన వాయుగుండం.. ప్రస్తుతం ముంబైకి 650 కిమీ, గోవాకు 710 కిమీ, మంగళూరుకు 920 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది.. 48 గంటల్లో ఉత్తర – ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది.. గుజరాత్, మహారాష్ట్ర తీరాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ..
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం..
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో కీలక నిందితుడు ఏ-వన్ అద్దేపల్లి జనార్దన్ అతని సోదరుడు ఎటు అద్దేపల్లి జగన్మోహన్ పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇద్దరిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి స్పిరిట్ గోవా నుంచి తీసుకువచ్చినట్టుగా విచారణలో జనార్థన్ అంగీకరించాడు. స్పిరిట్ ను జనార్ధన్ కు బెంగళూరుకు చెందిన బాలాజీ అతని తండ్రి సుదర్శన్ అందిస్తున్నట్టు గుర్తించి వాళ్ళని అధికారులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా.. గోవా లింకులపై అధికారులు విచారణ ముమ్మరం చేశారు. నకిలీ మద్యానికి సంబంధించి తయారీలో స్పిరిట్ కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు బాలాజీ మాత్రమే స్పిరిట్ ను అందించినట్టుగా అధికారులు నిర్ధారించారు. అయితే, గోవా నుంచి కూడా స్పిరిట్ దిగుమతి అయినట్టుగా జనార్ధన్ అంగీకరించడంతో.. బాలాజీ అదే విధంగా గోవా లింకులు ఒకటేనా..? లేక వేరువేరా.? అనేదానిపై లోతైన విచారణ చేపట్టారు. జనార్దన్ నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు అధికారులు. మరొక మూడు రోజులు జనార్ధన్ అతని సోదరుడు జగన్మోహన్ ను అధికారులు విచారించనున్నారు..
10 జిల్లాలపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు..
తుఫాన్ ఎఫెక్ట్‌తో ఒక్కసారిగా ఏపీలో వాతావరణం మారిపోయింది. విశాఖ, కోస్తా జిల్లాల్లో తీరం వెంట వర్షం కురుస్తోంది. 24 గంటల్లో అతి భారీవర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం వణికిస్తోంది.తుఫాన్ తీరం దాటే సమయంలో 105 కిలోమీటర్ల వేగంతో తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు అధికారులు. అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బుధవారం వరకూ ఏపీకి తుఫాన్ ముప్పు కొనసాగుతుందన్నారు. మొంథా తుఫాన్ ఏపీలోని 10 జిల్లాలపై ప్రభావం చూపిస్తోంది. విశాఖ, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై తుఫాన్ ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని అధికారులను అలర్ట్ చేసింది ప్రభుత్వం. కంట్రోల్ రూమ్‌లు సిద్ధం చేసింది. మరీముఖ్యంగా.. కాకినాడ జిల్లాపై తుఫాన్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. కాకినాడ సిటీతో పాటు రూరల్ మండలాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాకినాడ సమీపంలోనే తుఫాన్ తీరం దాటుతుండటంతో…ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది IMD. ముఖ్యంగా ఉప్పాడ బీచ్, సమీప తీరప్రాంతాల్లో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడి, బీచ్ కోతకు గురయ్యే ఛాన్స్ ఉంది. కాకినాడ సిటీలోనే 105 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇటు పెద్దాపురం, పిఠాపురం, తుని, సామర్లకోటలో జోరు వర్షాలు పడుతున్నాయ్. మరోవైపు..తుఫాన్‌తో కాకినాడ రూరల్ మండలాలు చిగురుటాకులా వణికిపోతున్నాయ్. గాలివానకు వరి, అరటితో పాటు వాణిజ్య పంటలు దెబ్బతింటాయని టెన్షన్ పడుతున్నారు రైతులు.
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. రైళ్లు, విమానాలు రద్దు.. స్కూళ్లు బంద్..
మొంథా తీవ్ర తుఫాన్ విధ్వంసంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను తొలుత ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా.. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 27, 28, 29, 30 తేదీల్లో రద్దు చేసిన పలు రైళ్లకు సంబంధించిన జాబితాను అధికారులు సంబంధిత ఎక్స్ ఖాతాల్లో పోస్టు చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రద్దైన రైళ్ల జాబితాలో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ , ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. మంగళ, బుధ, గురువారం తేదీల్లో రద్దు చేసిన రైళ్ల జాబితాను విడుదల చేసింది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నడిచే రైళ్లను అధికారులు రద్దు చేశారు. రాజమండ్రి, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖ, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయల్దేరే పలు రైళ్లను క్యాన్సిల్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ డబ్బులను రిఫండ్ చేయనున్నట్లు ప్రకటించారు. మంగళ, బుధ, గురువారాల్లో విశాఖ మీదుగా వెళ్లే పలు రైళ్లను క్యాన్సల్ చేశారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక రైళ్లను రెడీ చేశారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, దువ్వాడ, రాయగడ స్టేషన్లలో కంట్రోల్ రూమ్‌లు సిద్ధం చేశారు. హెల్ప్ లైన్‌లు సైతం సిద్ధం చేశారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా విమానయాన శాఖ కూడా హై అలర్ట్‌లోకి వెళ్లింది. విజయవాడ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకారం, షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.ఈ అన్ని సర్వీసులను ఇవాళ్టికి రద్దు చేసినట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.ప్రత్యేకంగా, షార్జా నుంచి రావాల్సిన మరియు షార్జాకు వెళ్లాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను కూడా రద్దు చేశారు.మొత్తంగా, మొంథా తుఫాన్ ప్రభావంతో విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన, అలాగే విజయవాడకు రావాల్సిన అన్ని విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా తాత్కాలికంగా నిలిపివేసింది. ఇక, తుఫాన్ ఎఫెక్ట్‌తో పలు జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు.. గుంటూరు, బాపట్ల జిల్లాలకు రెడ్ ఎలర్ట్, పల్నాడు జిల్లాకు ఆరెంజ్ ఎలర్ట్ జారీ కాగా.. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. నేడు, రేపు మిర్చి యార్డుకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇక నేడు, రేపు స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.. మరోవైపు, తుఫాన్ ప్రభావంతో అర్ధరాత్రి నుంచి నెల్లూరులో వర్షాలు కురుస్తున్నాయి.. ఇవాళ కూడా రోజంతా వర్షాలు పడే అవకాశం ఉండటంతో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్.. ఇక తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షం మొలైంది.. ఈ నేపథ్యంలో.. నేడు, రేపు అన్ని విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు..
హరీష్‌రావుకు ఫోన్ చేసిన కేసీఆర్.. ప్రగాఢ సానుభూతి తెలిసిన సీఎం రేవంత్, భట్టి..
బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతితో హరీశ్ రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుకు ఫోన్ చేసి పరామర్శించారు కేసీఆర్.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు.. సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసమైన క్రిన్స్ విల్లాస్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
వామ్మో.. ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టిన ప్రియురాలు..
దేశ రాజధాని ఢిల్లీ తిమార్‌పూర్‌లో అక్టోబర్ 6న జరిగిన యూపీఎస్‌సీ అభ్యర్థి దారుణ హత్యకు సంబంధించిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను ఢిల్లీ పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసులో ప్రియురాలితో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసి చంపి, సాక్ష్యాలను నాశనం చేసినందుకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 6న గాంధీ విహార్ లోని నాల్గవ అంతస్తు ఫ్లాట్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి కాలిపోయిన మృతదేహం కనిపించింది. తరువాత మృతుడిని 32 ఏళ్ల రామ్ కేష్ మీనాగా గుర్తించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కుట్రను బయటపెట్టింది. సంఘటన జరిగిన రోజున ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో కనిపించింది. వారిలో ఒకరు దాదాపు 39 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత.. తెల్లవారుజామున 2:57 గంటలకు ఒక మహిళ, మరో వ్యక్తితో కలిసి ప్లాట్ నుంచి బయటకు వచ్చింది. వెంటనే అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది.
నేడు ఛత్ పూజ.. ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
ఛత్ పండుగ. దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించే ఫెస్టివల్. అక్టోబర్ 25న ప్రారంభమైన ఈ పండుగ మంగళవారంతో ముగుస్తుంది. ఈరోజు ఛత్ పూజ నిర్వహించనున్నారు. ఉదయం నుంచే సూర్య నమస్కారాలు చేస్తూ.. నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉత్సాహంగా సాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఛత్ పూజలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్ పూజలో పాల్గొనడం అదృష్టం అన్నారు. ఇక ఛత్ పండుగను పురస్కరించుకుని ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఛత్ పూజను పురస్కరించుకుని ఈరోజు ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. వివిద నగరాల్లో మంగళవారం బ్యాంకులు పని చేయవు. బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో బ్యాంకులు మూసేసి ఉంటాయి. ఈ మూడు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా ఛత్ పండుగ నిర్వహిస్తుంటారు. అలాగే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఈ పండుగను జరుపుకోవడంతో అక్కడ కూడా బ్యాంకులు మూసేసి ఉంటాయి.
టర్కీలో భారీ భూకంపం.. కూలిన భవనాలు
పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఇస్తాంబుల్, బుర్సా, మనీసా, ఇజ్మీర్ ప్రావిన్సుల్లో భూకంపం సంభవించింది. ప్రకంపనలు కారణంగా పలు భవనాలు కూలిపోయాయి. మూడు భవనాలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. అయితే ప్రాణనష్టంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి పట్టణంలో 6.1 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైందని విపత్తు, అత్యవసర నిర్వహణ సంస్థ ఏఎఫ్‌ఏడీ(AFAD) తెలిపింది. 3.72 మైళ్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా పేర్కొంది. సిందిర్గిలో మూడు ఖాళీ భవనాలు, రెండంతస్తుల దుకాణం కూలిపోయాయని అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ వెల్లడించారు. గతంలో వచ్చిన భూకంపంలోనే ఈ నిర్మాణాలు దెబ్బతిన్నాయని.. తాజా ప్రకంపనలకు కూలిపోయాయని చెప్పారు.
ట్రీట్‌మెంట్ అయ్యింది అన్న రష్మిక.. కంగారులో ఫ్యాన్స్
సినీ ప్రపంచం అంటే గ్లామర్, అందం, ప్రెజెంటేషన్ ఎంత ముఖ్యమో తెలిసిందే. ప్రేక్షకుల దృష్టిలో స్టార్ ఇమేజ్ అంటే కేవలం నటన కాదు లుక్, స్టైల్, ప్రెజెన్స్ కూడా చాలా కీలకం. ముఖ్యంగా హీరోయిన్‌లకు అయితే, బ్యూటీ మెయింటెనెన్స్ అనేది కెరీర్‌లో భాగమే. అందుకే వారు వ్యాయామం, యోగా, స్ట్రిక్ట్ డైట్‌లు, స్కిన్ కేర్, బ్యూటీ ట్రీట్‌మెంట్లు అన్నీ పాటిస్తూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఎప్పటిలాగే ఆమెను చూసిన అభిమానులు, ఫోటోగ్రాఫర్లు వెంటనే చుట్టుముట్టారు. బ్లాక్ డ్రెస్, బ్లాక్ మాస్క్‌తో సింపుల్‌గా ఉన్న రష్మికను చూసి “మాస్క్ తీయండి మేడమ్, ఒక ఫోటో ప్లీజ్!” అని ఫోటోగ్రాఫర్లు అడిగారు. అయితే ఈసారి రష్మిక మాత్రం మాస్క్ తీయకుండా నవ్వుతూ, “ఫేస్ ట్రీట్‌మెంట్ అయ్యింది గైస్, తీయలేను” అని చెప్పింది. ఆ ఒక్క మాట చాలు సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. “రష్మిక ముఖానికి ఏమైంది?”, “ఏ ట్రీట్‌మెంట్ చేయించుకుందో?”, “లిప్ ఫిల్లర్ వేసుకుందేమో?” అంటూ నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. కొంతమంది అభిమానులు ఆమె తాజా ఫోటోలు, వీడియోల్లో లుక్‌లో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె లిప్స్ దగ్గర మార్పులు కనిపిస్తున్నాయంటూ చర్చ జరుగుతోంది. “లిప్ ఫిల్లర్స్ వేసుకుందేమో” అని కొందరు అంటుండగా, “స్కిన్ గ్లో ట్రీట్‌మెంట్ చేసుకుందేమో” అని మరికొందరు అభిప్రాయపడ్డారు.
నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్లే సక్సెస్ కాలేదు – ధన్య బాలకృష్ణ
తెలుగు ప్రేక్షకులకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజుగారి గది’, ‘నేను శైలజా’, ‘జయ జానకీ నాయక’ వంటి సినిమాల ద్వారా బాగా పరిచయమైన నటి ధన్య బాలకృష్ణ. నటనలో మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ, పెద్దగా స్టార్ స్థాయికి చేసుకోలేకపోవడం పై ఆమె ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడుతుంటుంది. తాజాగా ధన్య “కృష్ణ లీల” మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె కెరీర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ధన్య మాట్లాడుతూ.. “నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నేనే. ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే కేవలం నటన సరిపోదు, కొన్ని సార్లు గ్లామర్ కూడా అవసరం అవుతుంది. కానీ నేను ఆ దారిని ఎంచుకోలేదు. గ్లామర్ లేదా బోల్డ్ సీన్లను చేయడానికి అంగీకరించలేదు. అందుకే చాలా మంచి అవకాశాలు నా చేయి జారిపోయాయి. మొదట్లో నాకు చాలా బాధ వేసేది, ఎందుకు నేను ఎదగలేకపోతున్నానని ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది నేను తీసుకున్న నిర్ణయాలే నా మార్గాన్ని నిర్ణయించాయి. నా కుటుంబం చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగాను. అందుకే నేను చేసే ప్రతి పని ముందు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అనే భావనతోనే నిర్ణయాలు తీసుకున్నాను. కొన్ని పాత్రలు తిరస్కరించిన కారణం కూడా అదే. నా కుటుంబ విలువలు, నన్ను నేను గౌరవించుకోవడం ఇవే నాకు ముఖ్యమని నమ్మాను” అని ధన్య చెప్పింది.