నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం..
బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఆశ్విజ శుద్ధ పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.. తొలి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం 8 గంటలకు దర్శనాన్ని అందించారు. ఇంద్రకీలాద్రి పై నవరాత్రులలో మొదటి రోజు దర్శనమిస్తున్న బాలా త్రిపురసుందరీ దేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. సమస్త దేవి మంత్రాలలో కంటే బాలా మంత్రం ఎంతో గొప్పదని.. విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత బాలాదేవి. ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారని పురాణాలు చెపుతున్నాయి. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి అని ప్రతీతి.
హ్యాట్సాఫ్ వెంకటరత్నం.. మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..
తోటివారి కష్టాన్ని చూసి వెంటనే స్పందించి వారికి తోచిన సాయం చేసేవాళ్లు ఉంటారు.. ఐదో.. పదో ఇచ్చి తాము సాయం చేశాం అనుకునేవాళ్లు ఉంటారు.. అయితే, మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా స్కూల్‌కు వెళ్తున్న కొంతమంది పిల్లలను చూసి చలించిపోయారు వెంకటరత్నం అనే హెడ్ కానిస్టేబుల్. పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోన్న వెంకటరత్నం.. విద్యార్థులను చూసి వదిలేయకుండా.. వెంటనే వారిని తీసుకుని సమీపంలోని ఫుట్‌వేర్ షాపుకు వెళ్లారు.. అక్కడ ఎవరికి ఏ సైజ్ చెప్పులు పడతాయో.. వారికి అవి ఇప్పించారు.. దీంతో, ఆ చిన్నారుల ఆనందానికి అవదలు లేకుండా పోయాయి.. వారి ముఖంలో చిరునవ్వు చూసి.. ఆయన మురిసిపోయారు.. తమకు చెప్పులు కొనిపించిన కానిస్టేబుల్ వెంకటరత్నంకు షేక్ హ్యాండ్ ఇస్తూ.. థ్యాంక్స్ చెబుతూ.. ఆ చిన్నారులు మురిసిపోయారు.. ఇక, ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో.. మంత్రి నారా లోకేష్ స్పందించారు.. “హ్యాట్సాఫ్ వెంకటరత్నం గారు.. స్పందించిన మీ మనసుకు సెల్యూట్..” అంటూ ట్వీట్ చేశారు.. ” ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ని నియంత్రించే విధి నిర్వహణ. అటెన్షన్, టెన్షన్లు ఉన్నా పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హాట్సాఫ్. చెప్పుల్లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు. వారందరినీ ఓ చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి సరిపడే సైజు చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ, థాంక్యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం గారి ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి.. ఎంత గొప్పది! ఇంకెంత అమూల్యమైనది.. మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు..” అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్..
ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్..
ఐఫోన్ అంటే చాలా మందికి పిచ్చి.. ముఖ్యంగా యూత్ అయితే.. నచ్చిన ఐఫోన్ తమ చేతిలో ఉండాలని కలలు కంటారు.. ఈ మధ్యే ఐఫోన్ కొత్త మోడల్ మార్కెట్ లోకి రావడం.. స్టోర్ల వద్ద మరీ పడిగాపులు కానీ.. ఆ ఫోన్లు సొంతం చేసుకున్నవారు కూడా ఉన్నారు.. అక్కడి వరకు బాగానే ఉంది.. కానీ, ఫోన్ కోసం ప్రాణాలు సైతం తీసుకునేంత పిచ్చిమాత్రం ఎవ్వరికీ ఉండకూడదు.. కానీ, ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుడు సాయి మారుతి తండ్రి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తండ్రి చంద్రశేఖర్ ను ఐఫోన్ కొని ఇవ్వాలని అడిగేవాడు.. ఈ ఫోన్ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.. అనంతరం గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు.. కెవిన్ సాయంత్రమయినా బయటకు రాకపోవడం పై అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపును బలవంతంగా తెరవడంతో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు.. తల్లిదండ్రులు మృతుడు కేవెన్ ను దించగా అప్పటికే మృతిచెందాడు.. సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెందుర్తి పోలీసులు..
దసరా బోనస్ పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం- సింగరేణి కార్మికుల సంబరం
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన లాభాలు సాధించే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.3 వేల కోట్ల లాభాలు రాబోయే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది (2023-24)లో సింగరేణి రూ.2,412 కోట్ల లాభాలను అందుకుంది. అందులో 33 శాతం మేరకు రూ.796 కోట్లను కార్మికులకు లాభాల వాటా రూపంలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈసారి లాభాలు మరింత పెరగనున్న నేపథ్యంలో, కార్మిక సంఘాలు లాభాల వాటా శాతం కూడా పెంచాలని రాష్ట్ర సర్కార్ ను కోరుతున్నాయి. ముఖ్యంగా, 35 శాతం లాభాలను కార్మికులకు కేటాయించాలని సింగరేణి యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, లాభాల శాతం పెరిగితే దాదాపు రూ.900 కోట్ల వరకు కార్మికులకు లాభాల వాటా పంపిణీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ నేడు ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకి సింగరేణి కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది.
వేములవాడ రాజన్న క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు
వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. సుమారు 11 రోజుల పాటు భక్తులకు ప్రతి రోజు ఒక్కో అవతారంలో, ఒక్కో అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇక, స్వామివారి కల్యాణ మండపంలో స్వస్తి పుణ్యాహవాచనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో రాజేశ్వరి దేవి దర్శనం ఇవ్వనుంది. అయితే, వచ్చే నెల 1వ తేదీన అమ్మవారి తెప్పోత్సవం జరగనుంది. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి సందర్భంగా ఆయుధపూజ, అమ్మవారి అంబారి సేవపై పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు కొనసాగనుంది. ఈ 11 రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
నేడు అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురలో మోడీ పర్యటన
ప్రధాని మోడీ సోమవారం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రూ.5,100 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. జలవిద్యుత్, మౌలిక సదుపాయాలు, మాతా త్రిపుర సుందరి ఆలయ అభివృద్ధి సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. తొలుత ప్రధాని మోడీ అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శించనున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (240 మెగావాట్లు), టాటో-ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తారు. మొత్తం రూ. 3,700 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌లు చేపట్టనున్నారు. ఇక తవాంగ్‌లో 9,820 అడుగుల ఎత్తులో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. 1,500 మందికి పైగా అతిథులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది.
ట్రంప్-మస్క్‌ను కలిపిన చార్లీ కిర్క్ స్మారక కార్యక్రమం.. పక్కపక్కనే కూర్చుని సంభాషణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చాలా రోజుల తర్వాత పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఇందుకు చార్లీ కిర్క్ సంతాప కార్యక్రమం వేదిక అయిది. ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్‌ను గుర్తు చేసుకుంటూ ఆదివారం స్మారక మెమోరియల్ సర్వీస్ జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రంప్, జేడీ వాన్స్, చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్, మస్క్ సహా ప్రముఖులంతా హాజరయ్యారు. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్-మస్క్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికల్లో గెలిచాక ఇద్దరు కూడా చాలా సాన్నిహిత్యంగా మెలిగారు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరికి పొసగక విడిపోయారు. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని మస్క్ విమర్శించారు. ట్రంప్ తీసుకొచ్చిన బ్యూటీఫుల్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విమర్శల నేపథ్యంలో ఇద్దరూ దూరమైపోయారు. అంతేకాకుండా ఈ మధ్య వైట్‌హౌస్‌లో ఐటీ దిగ్గజ అధినేతలకు ప్రత్యేక విందు ఇచ్చారు. కానీ మస్క్ హాజరు కాలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి.
సామాన్యులకు బిగ్ రిలీఫ్.. అమల్లోకి జీఎస్టీ 2.o.. వీటి రేట్లు తగ్గాయి..
నేటి నుంచి జీఎస్టీ 2.o అమల్లోకి రానుంది.. ఇవాళ్టి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబ్‌లు అమలు చేస్తున్నారు.. దీంతో, పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి.. జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు ప్రధాన పన్ను స్లాబులు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉంటాయి. అదనంగా, విలాస వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించనున్నారు. కొత్త విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. కేంద్ర సర్కారు జీఎస్టీ సంస్కరణల వల్ల పలు వస్తువుల ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించనుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు, యాంటీ-క్యాన్సర్ మందులు, థర్మామీటర్లు, గ్లూకోమీటర్లు వంటి మెడికల్ ఉత్పత్తులపై పన్ను పూర్తిగా రద్దు చేశారు. నిత్యావసర వస్తువులైన పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, బియ్యం, సబ్బులు, షాంపూలు, టాయిలెట్రీస్ 5% స్లాబ్‌లోకి వస్తాయి. టెలివిజన్లు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిజ్‌లు, పెట్రోల్ 1200cc వరకు, డీజిల్ 1500cc వరకు కార్లు, 350cc లోపు బైకులు 18% స్లాబ్‌లోకి వస్తాయి. సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తులు, చక్కెర కలిగిన కార్బొనేటెడ్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ బెవరేజెస్, పెద్ద కార్లు, 350cc పైగా బైకులు, ప్రైవేట్ హెలికాప్టర్లు, యాట్స్ వంటి వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధించనున్నారు. ఇంతకుముందు వీటిపై 28% + సెస్ అమలులో ఉండేది. కొత్త విధానం ద్వారా దీన్ని ఒకే 40% స్లాబ్ లోకి తీసుకొచ్చారు. రైతుల కోసం వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించారు. నోట్‌బుక్స్, ఎరేసర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్ వంటి విద్యా సామగ్రిపై పన్ను 12% నుండి 5%కి తగ్గించారు. 18% స్లాబ్‌లోనే 67% రెవెన్యూ వస్తోంది. కాగా 12% స్లాబ్ ద్వారా కేవలం 5% ఆదాయం మాత్రమే వచ్చింది. 5%, 28% స్లాబుల ద్వారా వరుసగా 7%, 11% రెవెన్యూ లభించింది. దీంతో 12% స్లాబ్ పెద్దగా ఉపయోగం లేకపోవడంతో రద్దు చేశారు. 28% స్లాబ్‌ను తొలగించి తయారీదారులను ధరలు తగ్గించేలా ప్రోత్సహించేందుకు 18%లో కలిపేసారు. అయితే ఈ సంస్కరణల వల్ల కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 48,000 కోట్ల వరకు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా. కానీ ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు మిగలడం ద్వారా వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. జీఎస్టీ సంస్కరణలు 2025 ద్వారా పన్ను వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభంగా మారనుంది. సాధారణ వస్తువులు చౌక అవుతాయి. లగ్జరీ, సిన్ గూడ్స్‌పై మాత్రం కఠిన పన్నులు అమలవుతాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం రాగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం లభించింది. కారు, ఫ్రిజ్, ఏసీని 28 శాతం నుంచి 18 శాతం శ్లాబ్‌కు తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ శ్లాబుల సవరణకు ఆమోదించిన కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్.. సీబీఐసీ జీఎస్టీ రేటు నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే సవరించిన రేట్ల నిర్మాణం ఏడు షెడ్యూళ్లలో సుమారు 1,200 వస్తువులపై ప్రభావం చూపుతుందని తెలిపింది.
ఛీ.. ఛీ.. మొత్తానికి పాకిస్థానీ బుద్ధి బయటపెట్టావ్ కదరా.. వీడియో వైరల్
ప్రస్తుతం క్రికెట్లో భారత్‌తో పోటీపడి గెలవడం పాకిస్థాన్‌కు రోజురోజుకు కష్టమవుతోంది. ఇక ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన కూడా మైదానంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇకపోతే, ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో భారత్‌పై గెలిచేందుకు తన జట్టుకు అవసరమైన వికెట్లు తీయలేకపోయిన పాకిస్థాన్ పేసర్ ‘హారిస్ రవూఫ్’ బౌండరీ లైన్ వద్ద అభిమానులతో అనుచితంగా ప్రవర్తించాడు. రవూఫ్ ‘విమానం కూలిపోతున్నట్లు’ చేసిన సైగలు భారతీయ అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. 2022 టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రెండు వరుస సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ భారత అభిమానులు ‘విరాట్ కోహ్లీ’ అని నినాదాలు చేశారు. అయితే, రవూఫ్ ఆ తర్వాత చేసిన పని రెచ్చగొట్టే విధంగా ఉంది. ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత జరిగిన సైనిక పోరాటంలో ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ చేస్తున్న నిరాధార వాదనలను సూచిస్తూ ఆ పాకిస్థాన్ పేసర్ అభిమానుల వైపు ‘6-0’ అని సైగ చేశాడు. ఆ తర్వాత విమానాలు కూలిపోతున్నట్లు చేతి సైగలు కూడా చేశాడు.
సీనియర్ నటి రాధిక తల్లి గీత కన్నుమూత..
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కుటుంబంలో శోకసంద్రం నెలకొంది. ఆమె తల్లి గీత ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గీత వయస్సు 86 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం రాత్రి 9.30 గంటలకు చివరి శ్వాస విడిచారు. గీత, ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్. రాధ భార్య. చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టిన రాధికకు గీత నిరంతరం మద్దతుగా నిలిచారు. ఆమె జీవితం కుటుంబం, ప్రేమ, సామాజిక సేవలకు అంకితం అయ్యింది. వెనుకబడిన ప్రాంతాల్లో అనేక సామాజిక కార్యకలాపాలలో కూడా ఆమె ప్రతిష్టాత్మకంగా పాల్గొన్నారు. గీత అంత్యక్రియలు సోమవారం, 22 సెప్టెంబర్ 2025, సాయంత్రం 4.30 గంటలకు బెసెంట్ నగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాధిక కుటుంబానికి, సినీ వర్గాలకు, అభిమానులు ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. గీత జీవితాంతం కుటుంబ, సినిమా, సామాజిక రంగాల్లో చేసిన కృషి చిరస్మరణీయం గా నిలుస్తుంది.
భాష తెలియకపోయినా.. మంచి కథ ఉంటే చేసేస్తా: దర్శన
మలయాళ నటి దర్శన రాజేంద్రన్ తన ఎంపికలతో ఎప్పుడూ ప్రత్యేకతను చూపిస్తూ ముందుకు సాగుతోంది. భాష అడ్డంకి కాదని, మంచి కథ ఉంటే ఎక్కడైనా నటిస్తానని ఆమె స్పష్టం చేసింది. ఇటీవల అనుపమ పరమేశ్వరన్తో కలిసి నటించిన ‘పరదా’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శన, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నాకు తెలుగు అస్సలు రాకపోయినా, పరదా స్క్రిప్ట్ నన్ను ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమాలో నటించాను. భాషను తర్వాత నేర్చుకున్నా. మంచి కంటెంట్ ఉన్న కథ వస్తే భాషతో సంబంధం లేదు. మొదట్లో ఒక భాష రాకపోతే అందులో నటించడం కష్టం అనుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తోంది మంచి స్క్రిప్ట్ ఉంటే ఏ భాషలోనైనా చేస్తా” అని తెలిపింది. అలాగే పాత్రల ఎంపిక పై తన అభిప్రాయం వెల్లడిస్తూ.. “ఒకే రకమైన పాత్రలను పదే పదే చేయడం నాకు ఇష్టం లేదు. ఆలా చేస్తే నా నటనలో వైవిధ్యం ఉండదు. స్క్రిప్ట్ విన్నప్పుడు అది నాకు సుపరిచితంగా అనిపిస్తే అటువంటి పాత్రలను తప్పించుకుంటాను. కానీ కొత్తదనం ఉన్న ప్రత్యేకమైన పాత్రలు వస్తే మాత్రం వాటికి ఎప్పుడూ నో చెప్పలేను” అని చెప్పుకొచ్చింది. దర్శన వ్యాఖ్యలు ఆమెకు ఉన్న కథ పట్ల ఉన్న ఆసక్తి, భిన్న తను వెతుక్కునే తపనను చూపుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఆమె మరిన్ని విభిన్న భాషల్లో, విభిన్న పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని చెప్పవచ్చు.
నాకు ఏ కష్టం వచ్చినా ఫస్ట్ కాల్ అతనికే చేస్తా ..
మలయాళీ బ్యూటీ అయినప్పటికి కల్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం. హలో, చిత్రలహరి, రణరంగం సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ, తాజాగా విడుదలైన ‘కొత్త లోక’లో సూపర్ ఉమెన్ పాత్రతో అలరించింది. ఇంతవరకు ప్రధానంగా సరదా పాత్రలు చేసిన ఆమె, ఈ సినిమాలో తొలిసారి యాక్షన్ సీన్లలో కనిపించడం ప్రత్యేకం. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో కల్యాణి తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె మాటల్లో.. “మా స్వస్థలం కేరళ అయినప్పటికీ నేను చెన్నై లో పుట్టి పెరిగాను. అమ్మానాన్న ఇండస్ట్రీలో ఉండటంతో చిన్నప్పటి నుంచే షూటింగ్ సెట్స్ వాతావరణం నాకు పరిచయం. అక్కడి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. 2017లో ‘హలో’ ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా అడుగు పెట్టాను. అప్పటి వరకు ఎక్కువగా లైట్ హార్ట్డ్ రోల్స్ మాత్రమే చేసాను. కానీ ‘కొత్త లోక’ కోసం నేను ఆరు నెలలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని యాక్షన్ సీక్వెన్స్ చేశాను. ఇది నాకు కొత్త అనుభవం” అని చెప్పింది. అలాగే తన స్నేహితుడు దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ.. “సినీ ఇండస్ట్రీలో నాకు దుల్కర్ బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా, లేదా ఏదైనా సలహా కావాలన్నా మొదటి ఫోన్ దుల్కర్కే చేస్తాను. ఆయన నాకు చాలా సపోర్ట్‌గా ఉంటారు” అని చెప్పి తన బంధాన్ని బయటపెట్టింది. కల్యాణి ప్రస్తుతం మలయాళం, తెలుగు సినిమాల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, విభిన్న పాత్రల ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోంది.