వైసీపీకి కేతిరెడ్డి గుడ్‌బై..!? క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం కొనసాగుతోంది.. నిన్నటికి నిన్నే సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు.. ఇక, మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా జనసేనలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ తరుణంలో.. మరికొందరు నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. పార్టీలో కీలకంగా ఉన్న నేతలు సైతం.. వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది.. అందులో భాగంగా.. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. అయితే, పార్టీ మార్పు ప్రచారంపై సోషియల్ మీడియా వేదికగా స్పందించారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు వైసీపీ నేత కేతిరెడ్డి. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నామని.. ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని పేర్కొన్నారు కేతిరెడ్డి. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంటే ఉంటానంటూ క్లారిటీ ఇచ్చారు..
శ్రీకాకుళం పర్యటన రద్దు.. ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ముందుగా నిర్ణయించిన ప్రకాశం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. ఆ పర్యటనను ఆకస్మికంగా రద్దు చేశారు.. అయితే, ఇదే సమయంలో ప్రకాశం జిల్లా పర్యటనను ఖరారు చేశారు.. దీంతో. ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. నాగులప్పలపాడు మండలంలో ఏర్పాటు చేసిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో నిర్వహించనున్నారు.. ఇక, ప్రకాశం జిల్లా పర్యటన కోసం.. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్‌లో చదలవాడలోని శ్రీ విష్ణు విల్లాస్ లో ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. అనంతరం మద్దిరాలపాడులో కొన్ని నివాసాలకు వెళ్లి ప్రజలను కలుస్తారు. అనంతరం ఆంజనేయస్వామి విగ్రహం వద్ద గ్రామసభలో పాల్గొని ప్రసంగించనున్నారు.. కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి విజయవాడకు బయల్దేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. మరోవైపు.. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.. కాగా, వరుసగా వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు.. మరోవైపు జిల్లా పర్యటనలపై కూడా ఫోకస్ పెట్టారు..
బాలినేని ఎఫెక్ట్..! ప్రకాశం జిల్లా నేతలతో జగన్ భేటీ..
ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం చర్చగా మారింది.. ఇదే సమయంలో.. ఆయన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవడం.. త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్టు కూడా ప్రకటించారు.. అయితే, బాలినేని వెంట మరికొందరు వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు కూడా వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం ఉంది అంటున్నారు.. జిల్లా అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్పులు చేయవచ్చనే ప్రచారం సాగుతోంది.. మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టారు పార్టీ అధినేత వైఎస్ జగన్.. బాలినేని వెంట ముఖ్య నేతలు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు..
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లపై రెడ్ కార్నర్ నోటీసులు..
ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పై సీబీఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అనుమతించింది. ఇక ఛానల్ ఎండి శ్రవణ్ రావు పై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీకి సిద్ధమైంది. ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఫోన్ టాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్ కు సీబీఐ లేఖ రాసింది. ప్రభాకర్ రావు పై రెడ్ కార్నర్ నోటీసి అనుమతించాలని సీబీఐ కి సిటీ పోలీస్ లేఖ రాశారు. దీంతో హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సీబీఐ అనుమతించింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు శ్రవణ్ కు రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ కానున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ప్రభాకర్ రావు ఇండియాకి తీసుకురానున్నారు. ప్రభాకర్ తో పాటు శ్రవణ్ లని ఇండియాకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అమెరికాలో ప్రభాకర్ రావు చికిత్స చేయించుకుంటున్నారు. కానీ శ్రవణ్ రావు ఆచూకీ ఇప్పటికీ కనుగొనలేక పోయిన పోలీసులు. 196 దేశాల్లో ఇంటర్పోల్ కి నిందితులను అప్పగించేకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ఫోన్ టాపింగ్ లో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అంటున్నారు.
సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటి.. కీలక అంశాలు ఇవే..
ఈరోజు ఉదయం 11.30 కు సచివాలయంలో హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. హైడ్రాకి చట్ట బద్దత ద్వారా ఆర్డినెన్సు తీసుకురావడం?, మూడు యూనివర్సిటీలకు పేర్లు ఖరారు చేయడం, భారీ వర్షాలు- వరదల కారణంగా జరిగిన నష్టం, రేషన్ కార్డులు జారీ, హెల్త్ కార్డులు మంజూరు?, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, త్రిబుల్ ఆర్ భూసేకరణ, పనుల ప్రారంభం, ఎస్ఎల్బిసి పనులు – నిధుల విడుదల, ఉద్యోగుల డీఏలు – సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
నేటి నుంచి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు ఈరోజు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. కమిషన్ పబ్లిక్ హియరింగ్‌కు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు హాజరవుతారు. గత నెలలో కమిషన్ 15 మందికి పైగా విచారణ జరిపింది. ఇవాల్టికి చెందిన 25 మందికి పైగా కమీషనర్ జస్టిస్ పీనాకి చంద్రఘోష్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌డిఎస్‌ఎ, పుణె నివేదిక కోసం లేఖలు రాసిన కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అందజేస్తామని ఆయా బృందాలు తెలిపాయి. కమిషన్ కోరిన న్యాయవాదిని అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిపై కమిషన్ బహిరంగ విచారణ జరుపుతుంది. ఇకపోతే.. కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్రఘోష్ ఇప్పటికే కమిషన్ విచారణ కార్యాలయానికి చేరుకున్నారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఘోష్‌తో సమావేశమయ్యారు. నేటి నుంచి ఎవరిని విచారించాలి, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చించారు. ఇప్పటికే ఓపెన్ కోర్టు విచారణ ప్రారంభమైంది. గత 20 నుంచి ఐదు రోజులుగా ఇరిగేషన్ అధికారులను, సీఈవోను జస్టిస్ ఘోష్ విచారించారు.
జానీ మాస్టర్‌ను హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. గురువారం గోవా కోర్టు అనుమతితో జానీ మాస్టర్‌ను హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. మాస్టర్‌ను రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. నేడు సైబరాబాద్ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం జానీ నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో అవుట్ డోర్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. కొన్నిసార్లు తనపై దాడులు కూడా చేశాడని మహిళా అసిస్టెంట్ ఇటీవల రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నార్సింగి పోలీసు స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అత్యాచారం జరిగినప్పుడు ఆమె మైనర్ అని వెల్లడి కావడంతో.. జానీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
జాన్వీ కపూర్ బాటలో సారా అలీ ఖాన్.. సరైన కథ కోసం ఎదురుచూపు!
తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, కల్కి చిత్రాలు భారతీయ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయడానికి ‘దేవర’ సిద్ధం కాగా.. పుష్ప 2, ఎస్ఎస్ఎంబీ 29 రికార్డు నెలకొల్పడానికి రెడీ అవుతున్నాయి. ప్రస్తుత క్రేజ్ కారణంగా తెలుగు సినిమాల్లో నటించడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు టాలీవుడ్‌పై కన్నేస్తున్నారు. బాలీవుడ్ భామలు కృతి సనన్, కియారా అద్వానీ, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనెలు తెలుగు సినిమాల్లో నటించారు. అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే దేవర పార్ట్ 1 పూర్తి చేసిన జాన్వీ.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. దేవర హిట్ అయితే జాన్వీకి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం పక్కా.
ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. నా భర్తను వదిలేస్తా!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా పేరు టాలీవుడ్‌లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ అరెస్ట్ అనంతరం ఆయన సతీమణి సుమలత అలియాస్ ఆయేషా స్పందించారు. ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. తన భర్తను వదిలేస్తా అని సవాల్ చేశారు. తన భర్త ఎప్పుడూ ప్రతిభను ప్రోత్సహించేవారని చెప్పారు. జానీ మాస్టర్ సతీమణి సుమలత మీడియాతో మాట్లాడుతూ… ‘టాప్ కొరియోగ్రాఫర్‌గా లేదా హీరోయిన్‌గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి కోరిక. ఆమె తల్లి కూడా ఇదే కోరుకునేది. స్టేజ్ షోల నుంచి వచ్చిన ఆమె.. సినీ రంగాన్ని చూసి లగ్జరీ లైఫ్ కావాలని కోరుకుంది. ఎవరైనా తనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనుకునేది. మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి?, నా భర్త జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా?, ఇప్పటివరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా?, అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైంది?’ అని ప్రశ్నించారు.
సీఎం మమతకు ఉపశమనం.. సమ్మెను విరమించుకున్న జూనియర్ డాక్టర్లు..
కోల్‌కతాలోని ఆర్‌జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత సమ్మెలో కూర్చున్న జూనియర్ డాక్టర్లు తమ నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆగస్టు 9న కోల్‌కతా ఘటన జరిగినప్పటి నుంచి నిరసనలు తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు నెల రోజుల తర్వాత తిరిగి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్లంతా శనివారం (సెప్టెంబర్ 21) విధుల్లో చేరనున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇది గొప్ప ఉపశమనం కలిగించే వార్త. ఎందుకంటే., ఆమె కోపంగా ఉన్న జూనియర్ డాక్టర్లను శాంతింపజేయడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వైద్యులు, సీఎం మమత మధ్య పలుమార్లు చర్చలు జరిగినా వైద్యులు మాత్రం తమ డిమాండ్లపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉన్న జూనియర్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య దారుణమైన నేరం జరగడం గమనార్హం. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు ఆర్‌జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, ఎస్‌హెచ్‌ఓను అరెస్టు చేసింది. ఈ కేసు విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరుగుతోంది. దేశవ్యాప్తంగా సమ్మెలో ఉన్న డాక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. ఆ తర్వాత కోల్‌కతాలోని జూనియర్ డాక్టర్లు మినహా అందరూ తమ సమ్మెను ముగించారు.
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయ్ నిధి ప్రమాణం చేసేది ఆరోజే..!
ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చని తమిళనాడు మంత్రి మో అన్బరసన్ అన్నారు. రేపు లేదా మరో వారం రోజుల అయిన ఆయన డిప్యూటీ సీఎం కావడం ఖామయని ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 28న కాంచీపురం పచ్చయ్యప్ప కళాశాల ప్రధాన మైదానంలో డీఎంకే డైమండ్ జూబ్లీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారు. ఇందులో కూటమి పార్టీ సభ్యులు పాల్గొని ప్రసంగించనున్నారు. కాంచీపురం సౌత్ డిస్ట్రిక్ట్, నార్త్ డిస్ట్రిక్ట్ సమన్వయంతో బహిరంగ సభ జరగనుంది. నిజానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ్ నిధి స్టాలిన్ ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఇప్పుడు తమిళనాడు మంత్రి అన్బరసన్ ప్రకటన తర్వాత, ఊహాగానాలు నిజమేనని అనిపిస్తున్నాయి. ఏడు నుంచి 10 రోజుల్లో లేదా శుక్రవారం (రేపు) ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చని మంత్రి చెప్పారు. అంతకుముందు, ఉదయ్ నిధి స్టాలిన్ తన ఔన్నత్యంపై ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఉదయ్ నిధి స్టాలిన్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో క్రీడా మంత్రిగా ఉన్నారు. దీంతో పాటు డీఎంకే యువజన విభాగం కమాండ్ కూడా ఉదయ్ నిధి చేతిలోనే ఉంది.
రైలును బోల్తా కొట్టించేందుకు భారీ కుట్ర!
గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాలలో రైల్వే ట్రాక్ లకు అంతరాయం కలిగించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కాన్పూర్ లోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ఇక తాజాగా యూపీలోని రాంపూర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై ఇనుప స్తంభం పెట్టి ఉండడం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ చర్య రైలును పట్టాలు తప్పించేందుకు ఎవరో ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే., లోకో పైలట్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. బిలాస్‌పూర్ నుండి రుద్రపూర్ సిటీ మధ్య నడుస్తున్న డూన్ ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రయాణ సమయంలో లోకో పైలట్‌కు ట్రాక్‌పై పొడవైన ఇనుప స్తంభం కనిపించింది. దాంతో లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపి స్టేషన్ మాస్టర్ రుద్రాపూర్ సిటీకి సమాచారం అందించాడు. అనంతరం అధికారులు వచ్చి ట్రాక్‌ను క్లియర్ చేశారు. అనంతరం రైలును సురక్షితంగా ప్రయాణం కొనసాగించారు.
ఇంట్లోనే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..?
మహారాష్ట్రలోని ధులే జిల్లా నుంచి సంచలన సంఘటన జరిగింది. ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయమై పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇంట్లో శవమై కనిపించారని., వారి మృతదేహాలు కుళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇది హత్యా లేక కుటుంబ సభ్యుల ఆత్మహత్యా అనే సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అందిన సమచారం ప్రకారం, ఈ కేసులో ఒక అధికారి మాట్లాడుతూ.., ప్రమోద్ నగర్ ప్రాంతంలోని ఒక కాలనీలో జరిగిన ఈ సంఘటన రాత్రి 11 గంటలకు కొంతమంది పొరుగువారు కుటుంబం యొక్క బంగ్లా నుండి భరించలేని వాసన రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. బంగ్లాలో ప్రవీణ్ సింగ్ గిరాసే (53), అతని భార్య దీపాంజలి (47), వారి పిల్లలు మితేష్ (18), సోహమ్ (15) మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రవీణ్ సింగ్ మృతదేహం పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని, అతని భార్య పిల్లలు నేలపై చనిపోయారని అధికారి తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి లేఖ లభించలేదని ఆయన తెలిపారు.
విమానాలలో పేజర్లు, వాకీ టాకీలు నిషేధం
పేజర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో పేలుడు కారణంగా లెబనాన్‌లో భయాందోళన వాతావరణం ఉంది. ఇంతలో లెబనాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ రాఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరే అన్ని విమానాలలో పేజర్లు, వాకీ-టాకీలను నిషేధించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు జెట్ విమానాలలో పేజర్లు, వాకీ-టాకీలను తీసుకెళ్లడం నిషేధించబడిందని ప్రయాణికులకు తెలియజేయాలని అన్ని విమానయాన సంస్థలను కోరింది. ప్రయాణీకులు అలాంటి పరికరాలతో కనిపిస్తే, వాటిని జప్తు చేస్తారు. మంగళ, బుధవారాల్లో లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల పేలుళ్లు సంభవించాయి. వీటిలో చాలా మంది చనిపోయారు. మూడు వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్ల తర్వాత, ఇజ్రాయెల్ నుండి దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రకటించారు. ఇజ్రాయెల్ వేలాది మంది పేజర్లను టార్గెట్ చేసిందని నస్రల్లా చెప్పారు. వాటిని పేల్చాడు. పౌరులు లక్ష్యంగా చేసుకున్నారు. దీని కోసం ఇజ్రాయెల్‌పై ప్రతీకార చర్య ఉంటుంది.
మరోసారి ట్రావిస్ హెడ్ దూకుడు ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా విజయం..
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. 5 వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ బాగానే ఉన్నా ఎప్పటిలాగే ఇంగ్లండ్ విజయానికి ఆస్ట్రేలియన్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అడ్డు గోడలా నిలిచాడు. హెడ్ అద్భుతమైన స్టైల్ లో సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. ఇక మొదట బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ బెన్ డకెట్ శుభారంభం అందించాడు. 91 బంతుల్లో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టుకు శుభారంభం అందించాడు. విల్ జాక్వెస్ కూడా 56 బంతుల్లో 62 పరుగుల హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ సాధించి జట్టును ట్రాక్ లోకి తీసుకొచ్చాడు. ఈ కారణంగా ఇంగ్లాండ్ జట్టు 315 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మార్నస్ లాబుషాగ్నే, స్పిన్నర్ ఆడమ్ జంపా చెరో 3 వికెట్లు తీశారు. ట్రావిస్ హెడ్ 2 వికెట్లు తీశాడు. ఇక దీని తర్వాత, హెడ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఒక ఎండ్ నుంచి వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. అయితే, ఇంగ్లండ్ బౌలర్లు ట్రావిస్ హెడ్ వికెట్ కోసం తహతహలాడారు. కేవలం 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ దక్కించుకోగా, ఆస్ట్రేలియా 169 పరుగుల వద్ద ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది. అయితే మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ నిలదొక్కుకున్నాడు.
Kethireddy Venkatarami Reddy: వైసీపీకి కేతిరెడ్డి గుడ్‌బై..!? క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే..