NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు ఢిల్లీలో బిజీబిజీగా పర్యటిస్తున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి తోడ్పాటు అందించాలని కోరే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన 15 వేల కోట్ల రూపాయలు త్వరగా అందేలా చూడాలని ప్రధానినీ ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీకానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరనున్నారు. కాగా, ఈ రోజు రాత్రి 7 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన సమస్యలు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరనున్నారు. అయితే, అంతకు ముందు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టులా నిర్మాణానికి కావాల్సిన పనులపై చర్చించారు.

ఏపీలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలను 14కు పెంచాలని నిర్ణయం..
ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుతం ఉన్న 7 విమానాశ్రయాలను 14కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే, పుట్టపర్తిలో ఉన్న ప్రైవేట్ ఎయుర్ పోర్ట్ ను కూడా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నాం.. 500 నుంచి 700 ఎకరాలు ఉంటేనే చిన్న ఎయర్ పోర్ట్ లు అభివృద్ధి చేయవచ్చు.. పెద్ద ఎయిర్ పోర్ట్ లు నిర్మించాలంటే, కనీసం 3 వేల ఎకరాలకు పైగా భూమి కావాలి అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఏపీలో ఉద్యోగుల బదిలీలు.. ఆ రెండు శాఖల్లో ట్రాన్స్పర్స్ లేనట్లే..!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ తప్పని సరి చేసింది సర్కార్.. ఈ నెల 31వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేసేయాలని ఆదేశాలు ఇచ్చింది. బదిలీలు జరిగే శాఖలు.. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, గ్రామ వార్డు సచివాలయాలు, మైనింగ్, సివిల్ సప్లైయస్, దేవదాయ, రవాణ, అటవీ- పర్యావరణం, పరిశ్రమలు, విద్యుత్‌ , స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలతో పాటు అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్‌ సిబ్బందికి బదిలీలు కంపల్సరీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక, టీచర్లు, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత శాఖల ఉద్యోగులకే బదిలీలను కూటమి ప్రభుత్వం పరమితం చేసింది. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల పాటు పని చేసిన ఉద్యోగులకూ బదిలీల వర్తింపు చేసింది. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు లేదా వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించింది. భార్య భర్తలు ఉద్యోగులైతే.. ఒకే ఊళ్లో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

“అవును నాకు మహిళా కమిషన్ నుంచి నోటీసు వచ్చింది”
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క.. ‘బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కూతలు అల్లికాలు చేసుకుంటే తప్పేంటీ’ అని ప్రశ్నించారు. దానిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు.. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని సమాధానమిచ్చారు. దీంతో మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మహిళా కమీషన్ పేర్కొంది. తెలంగాణ మహిళలను కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్న కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళ శారద, కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై కేటీఆర్ తాజాగా స్పందించారు. తెలంగాణ భవన్ లో మీటింగ్ అనంతరం ఏర్పాటు చేసిన చిట్ చాట్ లో ఆయన నోటీసు వచ్చినట్లు స్పష్టం చేశారు. “నాకు మహిళా కమిషన్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. నేను మహిళా కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాను. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళల పై జరిగిన దాడి వివరాలు కూడా అందిస్తాను. చెప్పిన విధంగానే 24 వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్తాను.” అని మాజీ మంత్రి స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యలు మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని తెలిపారు. నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదని కేటీఆర్ అన్నారు. బస్సుల్లో సీట్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం ఇంకా బస్సులను పెంచాలనే ఉద్దేశంతో అన్నానని తెలిపారు. నా సోదరీమణులను అవమానించే ఉద్దేశం తనకులేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా క్షమాపణలు కోరారు.

గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు.. నిమజ్జనం తేదీ ఖరారు
వచ్చే 17న జరగబోయే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పై అన్ని శాఖలతో సమన్వయం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారం రోజుల్లో ప్రజా ప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి వారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని తెలంగాణ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ( ICCC)లో 2024 గణేష్ పండుగను పురస్కరించుకొని అన్ని విభాగాలతో ప్రభుత్వం ప్రాథమిక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈరోజు ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ అధికారులతో నిర్వహించామని వెల్లడించారు. గతంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఈ ఏడాది జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ముంబై తరువాత హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని మంత్రి అన్నారు. బోనాలు ఎలా అయితే ఘనంగా జరుగుకున్నామో అలాగే గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామని తెలిపారు. హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేలా చూస్తామని అన్నారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, ఘనంగా నిర్వయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హుసేన్ సాగర్ నిమజ్జనం అనే అంశం కోర్ట్ ఆదేశాలు ప్రకారం ముందుకు పోతామని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర.. ముడా స్కామ్‌పై కర్ణాటక సీఎం..
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కాములో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్కామ్‌లపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారియి. మైసూర్ నగరం అభివృద్ధి కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన భూమి ఉండటం, వారికే ఎక్కువ లబ్ధి జరిగేలా చూడటం వంటి ఆరోపణలు ఈ స్కాముతో ముడిపడి ఉన్నాయి. ముడా భూ కుంభకోణం కేసులో ప్రదీప్ కుమార్, టిజె అబ్రహం మరియు స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు పిటిషన్ దాఖలు చేయడంతో, గవర్నర్ గెహ్లాట్ విచారణకు ఆమోదం తెలిపారు. ఈ కేసులో గవర్నర్, సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఓకే చెప్పడం సంచలనంగా మారింది. అయితే, తాను ఏ తప్పు చేయలేదని కర్ణాటక ముఖ్యమంత్రి అన్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమని చెప్పారు. దీనిని కోర్టులో సవాల్ చేస్తానని అన్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం బినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంతా నా వెంటే ఉన్నారని సీఎం చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

విద్యార్థుల మధ్య గొడవ, కత్తి పోట్లు.. ఉదయ్‌పూర్‌లో మతహింస..
రాజస్థాన్ ఉదయ్‌పూర్ నగరం అట్టుడుకుతోంది. మతహింసతో ఆ నగరంలో హింసాత్మక వాతావరణం ఏర్పడింది. ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ ఆ తర్వాత మత విద్వేషాలకు కారణమైంది. నగరంలో మత ఘర్షణల కారణంగా శుక్రవారం ఉదయ్‌పూర్‌లో 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ గుంపు రాళ్లు రువ్వి మూడు నాలుగు కార్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని బాపూ బజార్, హతిపోల్, ఘంటా ఘర్, చేతక్ సర్కిల్ మరియు సమీప ప్రాంతాలలో మార్కెట్లు మూసివేయబడ్డాయి. షాపింగ్ మాల్‌లపై కూడా రాళ్ల దాడి జరిగింది. ఉదయ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలతో 10 తరగతి విద్యార్థి అతని సహవిద్యార్థిపై కత్తితో దాడి చేయడంతో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ ఘటనలో దాడి చేసిన బాలుడు ముస్లిం వర్గానికి చెందడం, గాయపడిన విద్యార్థి హిందూ వర్గానికి చెందడంతో నగరంలో మత హింసను ప్రేరేపించింది. ఈ ఘటనపై ఉదయ్‌పూర్ కలెక్టర్ అరవింద్ పోస్వాల్ మాట్లాడుతూ.. ఇద్దరి పిల్లల మధ్య జరిగిన గొడవ గురించి మాకు సమాచారం అందిందని, గాయపడిన విద్యార్థిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు.

డాక్టర్ల భద్రత కోసం కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం..
కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా వైద్యుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన సమ్మె ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ల భద్రతకు అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారికి హామీ ఇచ్చింది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా హత్యాచారం జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు, సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే నిందితుడు అత్యాచారం చేసి, హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుని కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.

బంగ్లాలో మారని పరిస్థితులు.. నటి రోకెయా ప్రాచీపై మూకదాడి..
బంగ్లాదేశ్ రిజర్వేషన్ కోటాపై ప్రారంభమైన అల్లర్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా తన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియా పారిపోయినా, ముహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా కూడా అక్కడ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు. ముఖ్యంగా హసీనా పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 15న బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్తున్న వారిపై కూడా దాడులు జరిగాయి. ఇదిలా ఉంటే, ప్రముఖ బంగ్లాదేశ్ నటి రోకెయా ప్రాచీపై దాడి జరిగింది. హసీనా తండ్రి అయిన షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు నివాళులు అర్పించేందుకు 32-బంగబంధు రోడ్‌కి వెళ్తున్న సమయంలో తనపై హింసాత్మక గుంపు దాడి చేసినట్లు చెప్పింది. దాడి సమయంలో తనను చంపేస్తామని బెదిరించినట్లు వెల్లడించింది. వారంతా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ పార్టీల మద్దతుదారులు, కార్యకర్తలని వెల్లడించింది. వారు తనను చంపాలనుకున్నారని, తనను కొట్టడమే కాకుండా బట్టలు కూడా చింపారని, శారీరకంగా వేధించారని తెలిపింది. ప్రస్తుతం దేశాన్ని ఎవరు నడుపుతున్నారో తెలియడం లేదని, వారు కేవలం ప్రజల్ని చంపేసి, మృతదేహాలను వేలాడదీస్తున్నారని అన్నారు.

‘బిగ్ బాస్’లోకి హాట్ ఆంటీ?
ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎనిమిదవ సీజన్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. షో మొదలవడానికి ఇంకా సమయం ఉంది కానీ ఇప్పటినుంచే ఎంపికలు సెషన్ నడుస్తోంది. నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ సీజన్లో ఆసక్తికరమైన వ్యక్తులను పంపి టిఆర్పి ప్రధానంగా షో నడిపే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక కొత్త పేరు లిస్టులో ఆడ్ అయింది. ఆమె ఇంకెవరో కాదు జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వజ్. తెలుగులో గుప్పెడంత మనసు అనే సీరియల్ తో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అందులో హీరో తల్లి పాత్రలో ఆమె అలరించింది. అయితే అంతకు మునుపే ఆమె కన్నడలో అనేక సీరియల్స్ చేసింది. తెలుగులో సుక్కు పూర్వజ్ అనే దర్శకుడుతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. బుల్లితెర మీద ఎంత పద్ధతిగా కనిపిస్తుందో సోషల్ మీడియాలో దానికి భిన్నంగా అందాలు ఆరబోస్తూ కనిపించడం ఆమె స్పెషాలిటీ. ఈ లేటు వయసు భామ హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలలోకి వస్తోంది. అయితే ఆమె బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పటికే విష్ణు ప్రియ, రీతు చౌదరి లాంటి హాట్ భామలు లోపలకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వాళ్లకు జ్యోతి కూడా తోడైతే ఇక ఈ సీజన్ హాట్ నెస్ కి ఏ మాత్రం ఢోకా లేదని ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ ఏడాది సీజన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది.

రెజ్లర్ బజరంగ్ పునియా దుశ్చర్య.. జాతీయ జెండా పోస్టర్‌పై కాళ్లు.. నెటిజన్ల విమర్శలు
రెజ్లర్ బజరంగ్ పునియా తీరు విమర్శల పాలైంది. సోషల్ మీడియా వేదికగా రెజ్లర్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం పతకం కోల్పోయి.. తీవ్ర మనస్తాపంతో వినేష్ ఫోగట్‌ భారత్‌కు తిరిగొచ్చింది. శనివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడ సాటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆమెకు స్వాగతం పలికారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వినేష్ ఫోగట్‌ను ఓపెన్ టాప్‌లో ర్యాలీగా తీసుకెళ్తుండగా సాటి రెజ్లర్ బజరంగ్ పునియా.. కారు కేబిన్‌పై ఉన్న జాతీయ జెండాపై కాళ్లు వేశారు. చూడకుండా వేశారో.. తొందరపాటులో అలా జరిగిందో తెలియదు గానీ… ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతీయ జెండాను అవమానించారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. పునియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిస్ 2024 ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ మహిళల 50 కేజీల ఈవెంట్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంతో ఆమె అనర్హతకు గురైంది. దీంతో బంగారు పతకం మిస్ అయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం సిల్వర్ ఇవ్వాలని కాస్‌(CAS)ను అభ్యర్థించింది. కానీ అందుకు నిరాకరించారు. వినేష్‌కు భారతీయులంతా అండగా నిలిచారు.