ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వీటికి గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గం.. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. ఇక, ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నారు.. మరోవైపు, 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఇక, వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకువచ్చిన ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.. పలు సంస్థలకు భూకేటాయింపులు, రాయితీల కల్పనపై చర్చించి.. ఆ ప్రతిపాదలనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నింబధనల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు, ఏపీ షాప్స్ ఆండ్ ఎస్టాబిలిష్ మెంట్ బిల్లు 2025 చట్టంలో నింబధనల సవరణలకు ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్..
మంత్రులతో కీలక అంశాలపై చర్చ.. దూకుడు పెంచాలని సీఎం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికాంర దూరమై.. తిరుగులేని మెజార్టీ స్థానాలు సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఏడాది పాలన పై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.. సంక్షేమ పథకాల విషయంలో జనానికి స్పష్టంగా చెప్పాలని సూచించారు.. తల్లికి వందనం అమలుపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది.. మంత్రులతో పలు విషయాలు చర్చించారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న ఆయన.. రాజకీయ నేతలు ఒకప్పుడు నేరస్థులను కలవాలంటే భయపడేవారు.. ఇప్పుడు నేరస్థులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు.. నేరస్థులకు కొమ్ము కాస్తూ రాజకీయాలను ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదన్నారు.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన అంతా బాగుంది.. మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలి – ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలని.. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు..
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు అభినందనలు తెలిపిన కేబినెట్..
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు మంత్రులందరం అభినందనలు తెలిపామని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించిన పార్థసారథి.. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. ఖైదీలు బయటకు వచ్చి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే క్షమాభిక్ష వెనక్కు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ..
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి అమానవీయ ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఇలా రాసుకొచ్చారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మన నగరాన్ని కలచివేసింది. మృతుల కుటుంబానికి ఊహించలేని దుఃఖాన్ని కలిగించింది. బాధితులకు పరిపాలన సాధ్యమైనంత మద్దతు అందించాల్సిన సమయంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి వారిపట్ల అసభ్యకరంగా, అనైతికంగా వ్యవహరించాడు.
రాహుల్ గాంధీ ఆపరేషన్ సిందూర్‌ని వ్యతిరేకించలేదు..
పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు. భారత దేశానికి చెందిన ఏ విషయంలో అయినా క్రెడిట్ మన దేశానికే రావాలని.. అమెరికా కి కాదన్నారు. తమకు భారత రక్షణ దళాల మీద అత్యంత గౌరవం ఉందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కేవలం మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి లొంగి యుద్ధాన్ని ఆపేశారు అని అన్నట్లు హనుమంతరావు వెల్లడించారు. ఆయన ఎక్కడ కూడా ఆపరేషన్ సిందూర్ ని వ్యతిరేకించలేదని తెలిపారు. ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినపుడు ఏం చేయలేకపోయారన్నారు. ఇపుడు మీ తప్పుకి రాహుల్ గాంధీని ఏజెంట్ అనడం మీ వైఫల్యమని మండిపడ్డారు. అసలు ఈ దేశనికి స్వాతంత్ర్యం తెచ్చిందే గాంధీ ఫ్యామిలీ… ఆ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు. రాహుల్ గాంధీని అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ఉప్మా వద్దు బిర్యానీ కావాలన్న బుడ్డోడు.. కేరళ సర్కార్ ఏం చేసిందంటే..!
అంగన్‌వాడీ కేంద్రాల్లో పెడుతున్న ఉప్మాకు బదులుగా మాకు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ ఓ బుడ్డొడు చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ పిల్లాడి కోరిక ప్రకారం కేరళ రాష్ట్రంలోని అంగన్‌వాడీ మెనూనే మార్చేసింది అక్కడి ప్రభుత్వం. మంగళవారం అంగన్‌వాడీల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. ఈ సందర్భంగా అంగన్‌వాడీల్లో పిల్లలకు అందించే ఆహారం మెనూ మారుస్తూ.. కొత్త మెనూను ప్రవేశ పెట్టింది. అయితే, కేరళలోని అలప్పుజకు చెందిన చిన్నారి శంకు మాట్లాడుతూ ఉప్మాకు బదులుగా బిర్యానీ కావాలని గత ఫిబ్రవరి నెలలో అడిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో కాస్తా అక్కడి ప్రభుత్వాన్ని కదిలించింది. దీంతో కేరళ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ అంగన్‌వాడీ సెంటర్ పిల్లలకు ఇచ్చే ఫుడ్ మెనూనే మార్చేశారు. కొత్తగా రూపొందించిన జాబితాలో బిర్యానీతో పాటు ఎగ్ బిర్యానీ, పులావ్, పప్పు, పాయసం, సోయా డ్రై కర్రీ, లడ్డూలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో వారానికి 2సార్లు అందించే పాలు, గుడ్లు ఇప్పుడు వారానికి 3 సార్లు అందించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. పిల్లాడి కోరిక మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో బిర్యానీని అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వీణా జార్జ్ తెలిపింది.
ఆర్మీని కించపరిచేలా మాట్లాడే స్వేచ్ఛ ఎవరిచ్చారు.. రాహుల్ గాంధీపై కోర్టు ఆగ్రహం
2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండియన్ ఆర్మీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు (జూన్ 4న) విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు మీకు ఇస్తుంది.. కానీ, ఈ స్వేచ్ఛ కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది అని గుర్తి చేసింది. అయితే, భారత సైన్యాన్ని కించపరిచేలా ప్రకటనలు చేసే స్వేచ్ఛ ఎవరు ఇచ్చారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే, భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022లో రాజస్థాన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించి, 20 మంది భారతీయ సైనికులను చంపి, మన సైనికులను కొట్టిందని ఆరోపించారు. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తే.. వారు ఒక్క ప్రశ్నకు కూడా జావాబు ఇవ్వరని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్‌లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. ట్రయల్ కోర్టు అతనికి సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించి.. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కోరారు.
ఈ విజయం ఆర్సీబి అభిమానులకు అంకితం.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..!
ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న సమయంలో, అందరికన్నా ఎమోషనల్‌గా స్పందించిన వ్యక్తి విరాట్ కోహ్లీ. ఈ గెలుపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది. ఈ టైటిల్ అతడి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణంగా నిలిచింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, కోహ్లీ ఆర్సీబీకి తన సేవలను అంకితం చేశాడు. ప్రతి మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టును ప్రేరేపించాడు. ఎంతోమంది లెజెండ్స్ ఆడిన ఈ జట్టుకు టోఫీ అందించడం యువ క్రికెటర్ల ద్వారా సాధ్యమైంది. కానీ, ఆ ట్రోఫీని ఎత్తి పట్టుకున్నప్పుడు కోహ్లీ కళ్లలలో వచ్చిన ఆనందానికి ఆర్సీబి అభిమానులు ఉప్పొంగిపోయారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో అతడి ఆనందం ఉక్కిరిబిక్కిరయ్యే భావోద్వేగానికి గురిచేసింది. అతడి దీర్ఘకాలం పాటు అందించిన కృషికి, నిబద్ధతకు ఇదే అసలైన ఫలితం. ఆర్సీబీ విజయ గాథలో విరాట్ పేరు చిరస్థాయిగా నిలవనుంది. ఇకపోతే ఏ విజయాన్ని అందుకున్న తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా తన భావాలను వ్యక్త పరిచాడు.
బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ.. స్వాగతం పలికిన కర్ణాటక డిప్యూటీ సీఎం
దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, జూన్ 3వ తేదీన రాత్రి జరిగిన ఉత్కంఠ భరితమైన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఈరోజు (జూన్4న) బెంగళూరుకు చేరుకున్న ఆర్సీబీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అయితే, ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచి బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆర్సీబీ ప్లేయర్స్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం బయట వేలాదిగా తరలి వచ్చిన క్రికెట్ లవర్స్ “ఆర్సీబీ! ఆర్సీబీ!” అంటూ నినాదాలతో హోరెత్తించారు. అలాగే, ఆర్సీబీ ప్లేయర్స్ ను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విమానాశ్రయంలో స్వయంగా కలిసి అభినందనలు చెప్పారు. విక్టరీ పరేడ్ లో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం ఆర్సీబీ టీమ్ జెండా చేత పట్టుకుని తన వాహనంలో ప్రయాణించారు. మరోవైపు , ఆర్సీబీ విక్టరీ పరేడ్ వేడుకల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం పాల్గొన్నారు.
ఇది కదా గిఫ్ట్ అంటే?
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన చేసిన కెజీయఫ్, సలార్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ ప్రశాంత్ నీల్‌కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది కూడా తన అభిమాన హీరోతో చేయాలని ఉంది. అది ఇప్పుడు నెరవేరుతోంది. ప్రశాంత్ నీల్ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్. పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఆయనతోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు నీల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. అదే సమయంలో ఆర్సీబీ ఈ సీజన్ ఐపీఎల్ కప్ కొట్టింది. ఇది కూడా ప్రశాంత్ నీల్ డ్రీమ్‌లో భాగమే. ఆర్సీబీ టైటిల్ నెగ్గడంతో ప్రశాంత్ నీల్ ఎగిరి గంతేశాడు. ఎన్టీఆర్ సినిమా సెట్‌లో భారీ స్క్రీన్ సెట్ చేసుకొని.. మ్యాచ్‌ను వీక్షించిన ప్రశాంత్ నీల్.. బెంగళూరు విజయం సాధించడంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ వీడియోను ఆయన సతీమణి లికితారెడ్డి ఇన్‌స్టాలో పోస్టు చేశారు.