వైఎస్ జగన్‌కు అచ్చె్న్నాయుడు సవాల్.. చర్చకు సిద్ధమా..?
అబద్ధాలకు అంబాసిడర్‌గా వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు అని ఆరోపణలు గుప్పించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. వైఎస్ జగన్ చేస్తున్న నీచ ఆరోపణల గురించి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని మంత్రి స్పష్టం చేశారు. కేవలం 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అబద్ధాలను బట్టబయలు చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని జగన్ మాట్లాడే అర్హతే లేదని మంత్రి తేల్చిచెప్పారు. గత ప్రభుత్వంలో 1,674 కోట్లు దాన్యం బకాయిలు చెల్లించకుండా వదిలిపెట్టగా, కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించిందని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు గత ప్రభుత్వం ఇవ్వని పరిహారాలను కూడా కూటమి ప్రభుత్వం తక్షణమే అందజేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. మద్దతు ధరల కోసం రైతుల సంక్షేమార్థం 16 నెలల్లోనే 800 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన వివరించారు. వాస్తవాలపై బహిరంగ చర్చకు వైఎస్ జగన్ సిద్ధమైతే తాను ఎప్పుడైనా సిద్ధమేనని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు..
వర్షంలో రైతులను చూసి కాన్వాయ్ దిగిన పవన్ కల్యాణ్..
చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తిరుగు ప్రయాణంలో రైతులను చూసి కాన్వాయ్ దిగి వచ్చారు.. తిరుపతిలో దామినేడు నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న సమయంలో వర్షంలో ప్లే కార్డులతో ఎదురుచూస్తున్న రైతులను గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి వారితో మాట్లాడారు.. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు రైతులు.. 1961లో ప్రభుత్వం ఎస్టేట్ అబోలిషన్ యాక్ట్ కింద తమ గ్రామాన్ని స్వాధీనం చేసుకుందని.. 1962 సర్వేలో పొరబాటుగా 175 ఎకరాలు అనాధీన భూములుగా నమోదు అయ్యాయని తెలిపారు.. గ్రామం ఇనాం ఎస్టేట్‌గా ఉన్న సమయంలో 26 కుటుంబాలు శిస్తులు చెల్లిస్తూ భూములను సాగుచేసుకుంటూ వచ్చామని.. రైతుల మధ్య ఎలాంటి వివాదాలు లేవని, తమ అనుభవంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు.. ఇక, తమ సమస్యలపై పవన్ కల్యాణ్‌కు అర్జీలు అందజేశారు రైతులు.. మరోవైపు, రైతుల విన్నపాలను ఆలకించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్‌తో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు..!
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిని జిల్లా ప్రధాన కేంద్రంగా కొనసాగిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ, ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రాయచోటిలో భారీ కృతజ్ఞతా ర్యాలీ మరియు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీ కార్యకర్తలు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలతో కలిసి చెక్‌పోస్ట్ శివాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన కృతజ్ఞతాభినందన సభలో పాల్గొన్నారు. సభలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గజమాలలు పెట్టి ఘనంగా సన్మానించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో అన్నమయ్య జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, రాయచోటి జిల్లా కేంద్రానికి అత్యంత అనువైన ప్రదేశం అని, నీటి సౌకర్యం మరియు మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయని, జిల్లా ఏర్పాటు కోసం సహకరించిన మంత్రివర్గ ఉపసమితికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతాభినందన సభ నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా హాజరవడం తమకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు. రాబోయే మూడున్నర సంవత్సరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఎస్పీబీ పేరుతో రాజకీయాలా..? మహేశ్ గౌడ్ కౌంటర్
ప్రజాపాలన రెండేళ్ల వేడుకలను దారి మళ్లించే ప్రయత్నంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు తెగబడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్న ఆయన, అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌లో రాకుండా ఉండేందుకు హీల్ట్ పాలసీని తీసుకొస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల ఉదాహరణతో మాట్లాడితే దాన్ని మతరాజకీయాలుగా మార్చడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కుల, మతాల పేరుతో రాజకీయాలు చేయడం ప్రజలు ఒప్పుకోరని స్పష్టం చేసిన మహేశ్ గౌడ్, హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల పరిశ్రమల వికాసానికి అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు.
షాకింగ్.. షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!
షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ సంఘటన ప్రయాణికులలో, విమానాశ్రయ అధికారులలో కలకలం సృష్టించింది. ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. విమానంలో “మానవ ఐఈడీ (IED)” ఉన్నట్లుగా ఈ మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలిసింది. బెదిరింపు రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, విమానాన్ని దాని గమ్యస్థానం హైదరాబాద్‌కు కాకుండా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్ళించారు. అహ్మదాబాద్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే, ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. అనంతరం భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్‌తో కలిసి విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండవసారి. గతంలో, కువైట్ నుండి హైదరాబాద్‌కు రావాల్సిన మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో, ఆ విమానం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పుడు కూడా ప్రయాణికులను దించి, బాంబు డిస్పోజల్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి.
5000 మంది “మహిళా ఉగ్రవాదులు” రిక్రూట్.. జైషే మహ్మద్ ఆత్మాహుతి ట్రైనింగ్..
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ తన వర్కింగ్ స్టైల్‌ను మార్చుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా జైష్ మహిళా ఉగ్రవాదుల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. జైష్ చీప్ మసూద్ అజార్ సోదరి సయీదా నేతృత్వంలో జమాత్-ఉల్-మొమినాత్ అనే మహిళా ఉగ్రవాదం సంస్థను ఏర్పాటైంది. మహిళల్ని రిక్రూట్ చేసుకోవడం ద్వారా తమ దాడుల్ని విస్తరించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 5000 మంది మహిళల్ని రిక్రూట్ చేసుకున్నట్లు, ఆత్మాహుతి కోసం వారికి శిక్షణ ఇస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ చెబుతోంది. మసూద్ అజార్ సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల, 5000 మందికి పైగా మహిళలు ఉగ్రవాద సంస్థలో చేరారని, నియామకం, శిక్షణ సులభతరం చేయడానికి పీఓకే అంతటా జిల్లా స్థాయిలో సంస్థల్ని ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక మహిళా అధిపతి లేదా ముంతాజియా నేతృత్వంలో ఒక ప్రత్యేక ఆఫీస్ ఉంటుందని, ఇది మహిళా వింగ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది.
రూ.200, రూ. 500ల నోట్లను ఆ దేశానికి తీసుకెళ్లొచ్చు.. నిషేధం ఎత్తివేసిన ఆర్‌బిఐ
నేపాల్‌లో అధిక విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్ల వాడకంపై ఉన్న ఆంక్షలను భారత కేంద్ర బ్యాంకు ఎత్తివేసింది. మరింత సరళమైన వ్యవస్థను ప్రవేశపెట్టింది. నేపాలీ రూపాయి, భారత రూపాయి చలామణిని నియంత్రించే పాత నిబంధనలను భారత రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ఇప్పుడు రూ.200, రూ. 500ల డినామినేషన్ల భారత రూపాయి నోట్లను నేపాల్‌కు తీసుకెళ్లడానికి, ఉపయోగించడానికి అనుమతిచ్చింది. గతంలో, నేపాల్‌లో అధిక విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్లపై నిషేధం ఉండేది, దీని వలన ప్రయాణికులు, వ్యాపారులు అసౌకర్యానికి గురయ్యేవారు. భారత్ నుంచి నేపాల్ లేదా భూటాన్‌కు ప్రయాణించేవారు రూ.200, రూ. 500ల డినామినేషన్ నోట్లతో సహా 25,000 రూపాయల వరకు భారతీయ కరెన్సీని తీసుకెళ్లడానికి వీలుగా భారత రిజర్వ్ బ్యాంక్ విదేశీ మారక నిర్వహణ నియమాలను సవరించింది. అంతేకాకుండా, నేపాల్ లేదా భూటాన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చేటప్పుడు అదే పరిమితి వరకు భారతీయ కరెన్సీని తిరిగి తీసుకురావడం సాధ్యమవుతుంది. ఈ చర్య రెండు దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక ప్రయత్నంగా పరిగణిస్తున్నారు.
కోహ్లీ- రోహిత్ భవిష్యత్తును నిర్ణయించేది మీరా.. హర్భజన్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తును.. తమ కెరీర్లో పెద్దగా ఏం సాధించలేని వారు నిర్ణయించడం దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. వారు ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు.. ప్రస్తుతం ఇద్దరు వన్డే క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నారు.. వన్డే ప్రపంచ కప్ 2027లో పాల్గొనడమే టార్గెట్ గా ముందుకు కొనసాగుతున్నారు. అయితే, వారు వరల్డ్ కప్ ఆడబోయే టీమ్‌లో ఉంటారా.. అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే, ఈ అంశంపై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. స్వయంగా నేను ఆటగాడిని కాబట్టి సమాధానం చెప్పడం లేదు.. నా విషయంలోనూ ఇలాగే జరిగింది. నా సహచరుల్లో చాలా మందికి ఇలాగే జరిగింది. అయినా మేం దాని గురించి మాట్లాడం, చర్చ కూడా జరపమని తెలిపారు. విరాట్ కోహ్లీ ఇప్పటికీ అద్భుతంగా ఆడుతున్నాడు.. ఈ విషయంలో సంతోషంగా ఉన్నా.. అయితే, తమ కెరీర్లో పెద్దగా సాధించని వ్యక్తులు కూడా.. రోహిత్, విరాట్ భవిష్యత్తును నిర్ణయించడం దురదృష్టకరం అని హర్భజన్ సింగ్ విమర్శించారు.
సంయుక్త మీనన్ రెమ్యునరేషన్ కోసం కక్కుర్తి పడిందా?
సాధారణంగా నటీమణులు తమ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. ఆ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి సంయుక్త మీనన్. అచ్చం పద్ధతికి లంగా ఓణీ వేసినట్టుగా, తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన డిగ్నిఫైడ్ రోల్స్ చేసిన సంయుక్త, ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంయుక్త మీనన్ అంటే, అందమైన నవ్వు, చక్కటి నటన, ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా, డీసెంట్‌గా కనిపించే పాత్రలే గుర్తొస్తాయి. ‘సార్’, ‘బింబిసార’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ‘సార్’ సినిమాలో టీచర్‌గా ఆమె చేసిన డిగ్నిఫైడ్ రోల్, సాయి పల్లవి, నిత్యా మీనన్ వంటి నటీమణుల తరహాలో పెర్ఫార్మెన్స్‌కే ప్రాధాన్యత ఇస్తుందనే మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేసింది. అయితే, తాజాగా బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ చిత్రంలో సంయుక్త ఐటమ్ సాంగ్ (‘జాజికాయ సాంగ్’) చేయబోతోందనే వార్త అందరినీ షాక్‌కి గురిచేసింది. అంతేకాకుండా, అందులో ఆమె చేసిన స్కిన్ షో, మాస్ స్టెప్పులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉండటం అభిమానుల మనసుల్లో పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ఈ అనూహ్యమైన మార్పు వెనుక కారణం ఏమిటనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మెయిన్ హీరోయిన్‌గా కాకుండా, కేవలం ఒక పాట కోసం ఇంతటి గ్లామర్ డోస్‌ను పెంచాల్సిన అవసరం సంయుక్తకు ఏమొచ్చింది? సాధారణ పాత్రల కంటే మాస్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌కి ఇచ్చే పారితోషికం (రెమ్యునరేషన్) చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, భారీ మొత్తంలో పారితోషికం ఆశించి సంయుక్త ఈ పాట చేయడానికి ఒప్పుకుందని భావిస్తున్నారు.
గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి
తెలంగాణ సంస్కృతి, కళలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ ప్రతినిధులను మన భిన్న సాంస్కృతిక మరియు కళారూపాలతో ఆహ్వానించనున్నారు. ఈ వేడుకల్లో ముఖ్య ఆకర్షణగా, ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన అద్భుతమైన సంగీత కచేరితో అతిథులను అలరించనున్నారు. ఆయన 90 నిమిషాల పాటు ప్రత్యేక సంగీత కచేరిని నిర్వహించనున్నారు. కీరవాణి కచేరీతో పాటు, అనేక ఇతర కళా ప్రదర్శనలు ఈ సమ్మిట్‌కు ప్రత్యేక శోభను తేనున్నాయి: వీణా విద్యాంసురాలు పి. జయలక్ష్మీ గారి వీణా కార్యక్రమం. కళా కృష్ణ ఆధ్వర్యంలో మన సాంప్రదాయ పేరణి నాట్యం. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.