ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను సస్పెండ్ చేయాలి.. వైసీపీ డిమాండ్
మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వైవీఆర్.. నిన్నటి దినం గుత్తి పట్టణంలో టీడీపీ పట్టణ మండల కమిటీ సమావేశాల ఏర్పాటులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.. వైసీపీ కార్యకర్తలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. దీనిపై స్పందించిన గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేతల నామినేషన్లు వేస్తే తోకలు కత్తిరిస్తాం అన్న గుమ్మనూరు జయరాంను ఎమ్మెల్యే పదవి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. వైసీపీ కార్యకర్తల జోలికి వచ్చి బెదిరించి ధోరణితో మాట్లాడితే వాటికి ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసునని, రాజకీయాలు అంటే మాకు ఏమీ కొత్త కాదని.. ప్రత్యేకంగా గుమ్మనూరు జయరాం గురించి నాకు బాగా తెలుసని.. ఆయన చరిత్ర ఏమో.. ఏ విధంగా పైకి వచ్చాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. గుంతకల్ నియోజకవర్గంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నించేసుకోవాలి.. అలా కాకుండా మా వైసీపీ కార్యకర్తలకు భయపెట్టే ధోరణితో మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెప్తామని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి హెచ్చరించారు.
బనకచర్ల ప్రాజెక్టుపై హర్షకుమార్ సంచలన ఆరోపణలు..
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది.. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. ఏపీ ఎలా ఈ ప్రాజెక్టు నిర్మిస్తుందని టీజీ సర్కార్ ప్రశ్నిస్తోంది.. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అయితే, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ బనకచర్లపై సంచలన ఆరోపణలు చేశారు.. జేబులు నింపుకోవడానికే 81 వేల కోట్లతో పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చేపడుతున్నారని విమర్శించారు హర్షకుమార్. ముందు పోలవరం పూర్తి చేయకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఎందుకు అంటూ ప్రశ్నించారు. మరోవైపు, రాజధాని అమరావతిలో 90 శాతం భూములు ఖాళీగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ విధానాలు సరిగా లేవని విమర్శించారు. యోగా డే పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారని, ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాపత్రయ పడుతున్నారని ఆరోపించారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్..
జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి జీర్ణించుకోలేక పోతున్నారు.. అందుకే..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. చిత్తూరులో మాజీ ఎమ్మెల్య చింతల రామచంద్రారెడ్డి సతీమణిని పరామర్శించడానికి కుటుంబ సమేతంగా వెళ్లిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు మనస్థత్వంతోనే మామిడి రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు.. ఓ పక్క జిల్లా కలెక్టర్ నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తాం, పల్ప్ ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలు ఇవ్వాలని ఆదేశాలిచ్చినా.. ఫ్యాక్టరీ యజమానులు మాటవినడం లేదన్నారు. రైతులు మూడు రూపాయలకు ఇస్తామన్నా ఫ్యాక్టరీలు నిరాకరిస్తున్నారని విమర్శించారు.. రాష్ట్రంలో రైతు అన్నవాడు ఎవ్వరూ సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు పెద్దిరెడ్డి.. ఇక, ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఆయనపై వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని అన్నారని మండిపడ్డారు.. వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తే.. వారి నుంచి వస్తున్న జనాదరణను చూసి సీఎం చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి..
టీజీ ఎడ్‌సెట్-2025 ఫలితాలు విడుదల..
టీజీ ఎడ్‌సెట్-2025 (తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్న విద్యా మండలి పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 30,944 మంది క్వాలిఫై అయ్యారు. 96.38 శాతం అర్హత పొందారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. ఈ పరీక్షకు మొత్తం 38,758 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 1న రెండు సెషన్‌లలో కలిపి ఎడ్‌సెట్‌కు 32,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా.. ఇప్పటికే ప్రీప్రైమరీ ‘కీ’ని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు.
బై బ్యాక్ పాలసీ పేరుతో కుచ్చుటోపీ.. రూ. 500 కోట్లు స్వాహా..!
పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బై బ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే ఒకటికి రెండింతలు డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేటా ముంచేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట ఈ భారీ మోసం చేశారు. దీంతో బాధితులు సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏవీ ఇన్ఫ్రా ఛైర్మన్ విజయ్ గోగుల.. మాదాపూర్ కేంద్రంగా బై బ్యాక్ పేరుతో వసూళ్లు చేపట్టాడు. ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టిన వారికి డబుల్ అమౌంట్ ఇస్తామని ఇవ్వకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చాడు. నారాయణఖేడ్, యాదగిరిగుట్ట, బుదేరా తదితర ప్రాంతాల్లో వెంచర్లు ఉన్నాయంటూ నమ్మించాడు. 18 నెలలకు 50శాతం అదనంగా ఇస్తానని చెప్పి చేతులు ఎత్తేశాడు.
ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతపై స్పందించిన సోనియా గాంధీ..
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆమె ఖండించారు. మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువల సర్పణ” అని ఆమె పేర్కొన్నారు. భారత్ చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని.. మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం బాధాకరమన్నారు. అంతర్జాతీయ మానవతా బాధ్యతను గుర్తు చేశారు. ఈ మేరకు సోనియా గాంధీ ఓ వ్యాసం రాశారు. దాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నారు. ఇరాన్ భారతదేశానికి మిత్ర దేశమని, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ బాగానే ఉన్నాయని సోనియా గాంధీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇరాన్- భారత్ మధ్య స్నేహానికి ఉదాహరణగా.. 1994 నాటి జమ్మూ కశ్మీర్ సమస్యను గుర్తు చేశారు. 1994లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌లో కశ్మీర్ అంశంపై భారతదేశాన్ని విమర్శించే తీర్మానాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ తీర్మానాన్ని నిరోధించడంలో ఇరాన్ సహాయపడిందన్నారు.
పాక్ ఆర్మీ చీఫ్- డొనాల్డ్ ట్రంప్ భేటీపై జమ్ముకాశ్మీర్ సీఎం సంచలన వ్యాఖ్యలు
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్‌ల లంచ్ భేటీపై తీవ్ర దుమారం కొనసాగుతుంది. ఈ ఇష్యూపై తాజాగా జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. యూఎస్ తన ప్రయోజనాలను పొందే వరకు మాత్రమే ఇతర దేశాలతో ఫ్రెండ్షిప్ చేస్తుంది.. అలాగే, తనను తాను కాపాడుకునేందుకు ఏమైనా చేస్తుందని కామెంట్స్ చేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇవ్వడంపై విలేకరులు అడిగిన క్వశ్చన్ కు ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌లో మళ్లీ భూకంపం.. అణు పరీక్షలతోనేనా.. ?
ఇజ్రాయెల్ దాడులతో సతమతమవుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే, టెల్ అవీవ్‌తో ఉద్రిక్తతల వేళ టెహ్రాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించడం వల్ల భూకంపానికి ఇది కారణం కావచ్చనే అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. అంతరిక్ష, క్షిపణి కాంప్లెక్స్ ఉన్న నగరానికి సమీపంలోనే ఈ భూకంపం సంభవించింది. అయితే, ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రావిన్సులోనే అంతరిక్ష కేంద్రంతో పాటు మిస్సైల్ కాంప్లెక్స్‌లు.. అక్కడి రక్షణశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటికి సమీపంలోనే తాజాగా భూకంపం వచ్చింది. బలమైన భూ ప్రకంపనలు ఉత్తర ఇరాన్‌లో అనేక ప్రాంతాలను తాకినట్లు తెలుస్తుంది. ఇక, దీని వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, నష్ట తీవ్రత తక్కువగానే ఉందని తేలింది. కాగా, ప్రపంచంలో భూకంప ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇరాన్ ఒకటి. అరేబియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ఆల్పైన్-హిమాలయన్ సెస్మిక్ బెల్టు వెంబడి ఉండటంతో.. ఏడాదికి దాదాపు 2 వేలకుపైగా భూకంపాలు వస్తుంటాయి. ఇందులో 5 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చేవి సుమారు 15 నుంచి 16 వరకు ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా 2006-15 మధ్యకాలంగా ఇక్కడ 96 వేల భూకంపాలు వచ్చినట్లు తెలుస్తుంది.
సైలెంటుగా మలయాళ హిట్టు కొట్టిన తెలుగు నిర్మాత
ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో రెండు భాషల సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగు సినిమాల గురించి. ఇప్పుడంటే పరిస్థితులు బాగాలేవు, హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ బాహుబలి తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇతర భాషలకు కూడా వెళ్లి అక్కడ కూడా హిట్‌లయ్యాయి. అయితే ఆ తర్వాత ఎక్కువగా మలయాళ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుగువారు, తమిళ ప్రేక్షకులు సైతం ఆ భాషల సినిమాలకు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు నిర్మాతలు సైతం మలయాళ సినిమాల మీద ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది అక్కడి సినిమాలను చేసి తెలుగులో డబ్బింగ్ చేస్తుంటే, మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థలు ఏకంగా అక్కడికి వెళ్లి సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చాయి.
అయోమయంలో కింగ్ డమ్.. ఏ డేట్ కు వస్తాడో..?
విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే మే 30 నుంచి జులై 4కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావట్లేదని తేలిపోయింది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో వాయిదా తప్పేలా లేదు. అందుకే ప్రమోషన్లు చేయకుండా సైలెంట్ అయిపోయారు. మొన్నటి వరకు జులై 24కు వాయిదా పడుతుందని టాక్ వచ్చింది. హరిహర వీరమ్లు ఆ డేట్ ను తాజాగా లాక్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఒకవేళ జులై రెండో వారం వరకు పనులు అయిపోయినా.. పవన్ సినిమా ఉంది కాబట్టి జులై చివరలో రిలీజ్ చేయరు. కాబట్టి జులై నెలలో వచ్చే అవకాశమే లేదు. పోనీ ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేద్దామా అంటే దుల్కర్ సల్మాన్ సినిమా ఉంది. ఆగస్టు 15కు కూలీ, వార్-2 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ పెద్ద సినిమాలతో పోటీ పడటం కింగ్ డమ్ మూవీకి ఇష్టం లేదు. మొదటి నుంచి సినిమాను సోలోగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వరుసగా రెండు నెలలు పెద్ద సినిమాలే ఉన్నాయి. ఈ లెక్కన కింగ్ డమ్ కు రిలీజ్ డేట్ దొరకడం కష్టమే.
కొల్లగొడుతున్న ‘కుబేర’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించిన కుబేర సినిమా జూన్ 20, 2025 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అందుబాటులో ఉన్న సమాచారం బట్టి చూస్తే సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు షో షోకి పెరగడంతో మొత్తం మీద మంచి కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు: సినిమా మొదటి రోజున 30 కోట్ల రూపాయల గ్రాస్ రేంజ్‌లో వసూళ్లు సాధించినట్లు అంచనా. ఆఫ్‌లైన్ లెక్కలు బట్టి ఈ సంఖ్య కొంత అటూ ఇటూగా ఉండవచ్చు. తెలుగు రాష్ట్రాలు: తెలుగు రాష్ట్రాల్లో 12 నుంచి 13 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. హౌస్‌ఫుల్ బోర్డులు, అదనపు షోలతో సినిమా బాగా ఆకట్టుకుంది.