ప్రవీణ్ పగడాల కేసుపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు.. నాకు నమ్మకం లేదు..!
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు వివాదంగా మారింది.. క్రైస్తవ సంఘాల ఆందోళనలతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చివరకు ప్రవీణ్ పగడాలది రోడ్డు ప్రమాదమేనని క్లారిటీ ఇచ్చారు.. దానికి సంబంధించి కొన్ని సీసీ ఫుటేజ్‌లు కూడా బయటపెడుతూ.. వివరించారు.. అయితే, ప్రవీణ్ పగడాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేవారు. మాజీ ఎంపీ హర్ష కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును నేను నమ్మడం లేదన్నారు.. రోడ్డు ప్రమాదం కాదు కచ్చితంగా హత్యే నంటూ హాట్ కామెంట్లు చేశారు.. ఆర్ఎస్ఎస్, హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని నా అనుమానం అన్నారు. ఇక, మత మార్పిడి నిషేధ చట్టానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్.. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు.. రేపు సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల తన వాదనలు వినిపించాల్సిన ఉంది.. ఇదే కేసులో బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వాదిస్తున్నారు.. ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు, అశోక్ కుమార్ ఉపాధ్యాయ కలిసి హత్య చేయించారని నా అనుమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హర్షకుమార్.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండడంవల్లే ప్రవీణ్ ల్యాప్ టాప్ ను పోలీసులు తీసుకెళ్లారు.. ఆ రోజు విజయవాడ సమీపంలోని తెంపెల్లి వద్ద సువార్త సభలకు పాస్టర్ ప్రవీణ్ వెళ్లారని తెలిపారు..
విజయసాయిరెడ్డికి షాక్.. లిక్కర్ కేసులో నోటీసులు..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్ తగిలినట్టు అయ్యింది.. మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి ఈనెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్.. ఇప్పటికే ఈ కేసులో విచారణకు రావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మూడు సార్లు సిట్ నోటీసులు జారీ చేసినా.. ఆయన విచారణకు హాజరు కాలేదు.. తాజాగా విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీచేయటం చర్చనీయాంశంగా మారింది.. మరోవైపు.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మూడోసారి నోటీసు ఇచ్చారు సిట్ అధికారులు.. ఈ నెల 19వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. కసిరెడ్డి కంటే ఓకరోజు ముందే విచారణకు రావాలని విజసాయిరెడ్డికి నోటీసు ఇచ్చారు.. లిక్కర్ స్కాం అంతా కసిరెడ్డి సూత్రధారిగా జరిగిందని గతంలోనే విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే కాగా.. కసిరెడ్డి దొరకకుంటే సాయిరెడ్డి నుంచే తదుపరి విచారణకు స్టెప్ తీసుకునే విధంగా సిట్ ముందుకు సాగుతోంది..
24 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. మొత్తం 24 అజెండా అంశాలతో మంత్రివర్గ సమావేశం జరిగింది.. వాటిపై చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రి మండలి.. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో చర్చ సాగింది.. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్ కు నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది.. ఇక, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. ఇక, సీఆర్డీఏ 46 ఆథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్.. అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల టెండర్లకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. ఎల్ వన్ గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. రూ.617 కోట్లతో అసెంబ్లీ బేస్ మెంట్ + జీ + 3 + వ్యూయింగ్ ప్లాట్ ఫాంలు + పనోరమిక్ వ్యూ(బిల్టప్ ఏరియా 11.22 లక్షల చదరపు అడుగులు, ఎత్తు 250 మీటర్లు) అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో ఎల్ వన్ గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది.. రూ.786 కోట్లతో హైకోర్టు బేస్ మెంట్ + జీ + 7 అంతస్తుల్లో నిర్మాణం, బిల్డప్ ఏరియా 20.32 లక్షల చదరపు అడుగులు ఎత్తు 55 మీటర్లు.. ఎల్ వన్ గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం లభించింది.. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్సైపీబీ) 5వ సమావేశం నిర్ణయాలను ఆమోదించింది మంత్రివర్గం.. 30, 667 కోట్ల పెట్టుబలతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల ఎస్ఐపీబీలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. వీటి ద్వారా 32133 ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
మంత్రులకు సీఎం సీరియస్ వార్నింగ్.. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా..?
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. అయితే, కొన్ని విషయాల్లో ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తిరుపతిలో గోవుల మృతిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాన్ని తిప్ప కొట్టడంలో మంత్రులు వైఫల్యం చెందారని మండిపడ్డారు సీఎం.. దేశంలో ఎక్కడా అమలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తుంటే.. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలం అవుతున్నారని దుయ్యబట్టారు.. జిల్లాలు యూనిట్‌గా తీసుకొని పార్టీ.. ప్రభుత్వం.. మంత్రులు సమన్వయంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లాలన్నారు.. అంతేకాదు.. ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల తీరిలో మార్పు రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.. వ్యక్తిగత కార్యదర్శులు, వోఎస్‌డీలు చేస్తున్న తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయి.. వాటిని సరిదిద్దుకోవాలని హెచ్చరించారు.. మంత్రులూ.. జాగ్రత్త.. అవినీతి అధికారులను దూరం పెట్టండి అని సూచించారు సీఎం చంద్రబాబు.. మత పరమైన అంశాలపై సంయమనంతో స్పందించాలన్న ఆయన.. ఎన్ని సార్లు చెప్పినా మీలో మార్పు కనపడడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.. చేసింది చెప్పుకోలేకపోతున్నాం.. సరిగ్గా స్పందించలేకపోతున్నాం.. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
ప్రధాని మోడీ అమరావతి పర్యటన ఖరారు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పునఃనిర్మాణంపై దృష్టిసారించింది.. ఇప్పటికే పలు రకాల పనులకు సీఆర్డీఏ అథారిటీ, ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.. అయితే, గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు, అమరావతి పునఃనిర్మాణానికి కూడా రాబోతున్నారు.. మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగనుంది.. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోడీ పర్యటన ఉంటుందని మంత్రులకు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.. మూడేళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ , హైకోర్టు, రహదారులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు ఏపీ సీఎం..
ఎంపీ చామలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. మంత్రి వర్గంపై మాట్లాడొద్దు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఇటీవల ఎంపీ చామల, రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ వస్తున్న వ్యాఖ్యలు పార్టీకి మంచి పేరు తీసుకురావని సీఎం హెచ్చరించారు. మంత్రి వర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, ఈ అంశంపై ఇకపై ఎవరూ మాట్లాడొద్దని రేవంత్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ లక్ష్యాలను స్పష్టంగా వివరించారు. “మన ప్రధాన లక్ష్యం రెండోసారి అధికారంలోకి రావడం. అందుకు అనుగుణంగా అందరూ పని చేయాలి. నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే మన ఫోకస్,” అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలకు సీఎం ఓ కీలక సూచన కూడా చేశారు. “మీ నియోజకవర్గంలో గెలవడానికి కావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోండి. వాటిని పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా,” అని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సీఎం సూచించారు. “మీరు పర్యటనలు ముగించాక, నాతో అపాయింట్‌మెంట్ తీసుకుని మాట్లాడొచ్చు. ప్రతి నియోజకవర్గ అవసరాలను పరిశీలిస్తా,” అని రేవంత్ అన్నారు.
ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం
బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు సమాచారం ఉందని ఆమె చెప్పారు. “ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటాం,” అంటూ హెచ్చరించారు. బెదిరింపులకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదని, పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కవిత, కాంగ్రెస్ నాయకులపై కూడా విమర్శల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే అధికారులను, నాయకులను ఉపేక్షించమని స్పష్టం చేశారు. “వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా భయపడేది లేరు ఇక్కడ,” అని కవిత ఘాటు వ్యాఖ్య చేశారు. “మాట తప్పడమే, మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం” అంటూ ఆమె విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ పంచి ఓట్లు సాధించారని, కానీ ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.
పార్టీ మారడంపై కీలక వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతారన్న ఊహగానాలను కొట్టి పడేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి… వి. హనుమంత్ రావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా… జానారెడ్డి కూడా నా తర్వాత పార్టీ లో నాలుగు సంవత్సరాల తర్వాత చేరాడని, పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు పార్టీని వీడనని ఆయన తెలిపారు. నేను అసంతృప్తితోనే ఉన్నాను నా సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు కాబట్టి అసంతృప్తితోనే ఉన్నానని, 2014లో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేనొక్కడినే శాసనసభ్యుడిని అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ అంటే నేను.. నేను అంటే కాంగ్రెస్ గా పార్టీ ని బలోపేతం చేశా అని ఆయన వెల్లడించారు. పది సంవత్సరాల బిఆర్ఎస్ నిరంకుశ ప్రజాస్వామ్య పాలన లో నేను ఎమ్మెల్యేగా,ఎమ్మెల్సీగా ఒంటరిగా పోరాడానని, పార్టీ ఆలోచన మేరకు రెండుసార్లు కేసీఆర్ పై పోటీ చేశానన్నారు. రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు లు మంత్రి పదవులు ఆశించడం లో తప్పు లేదన్నారు జీవన్ రెడ్డి.
రైతన్నలకు గుడ్ న్యూస్.. మాన్‌సూన్ అప్‌డేట్ వచ్చేసింది.. ఈ ఏడాది జోరుగా వానలు..
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. పంటలు సమృద్ధిగా పండాలంటే వర్షాలే ఆధారం. సమయానికి వర్షాలు కురిస్తేనే అన్నదాత కళ్లల్లో ఆనందం నిండుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ అందించింది. మాన్‌సూన్ అప్‌డేట్ అందించింది. ఈ సంవత్సరం జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. IMD అంచనా ప్రకారం.. ఈసారి రుతుపవనాలు సగటు కంటే 105 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు చేస్తాయని అంచనా వేసింది. లడఖ్, ఈశాన్య, తమిళనాడులలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ఎల్ నినో, హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులు సాధారణంగా ఉంటాయని, దీని ఫలితంగా మంచి వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఈ రెండింటి అనుకూల పరిస్థితుల కారణంగా, దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవనున్నట్లు తెలిపారు.యురేషియా, హిమాలయ ప్రాంతంలో మంచు పరిమాణం తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హిమాలయాలు, దాని పరిసర ప్రాంతాలలో మంచు తక్కువగా ఉన్నప్పుడు, భారతదేశంలో రుతుపవన వర్షపాతం సగటు కంటే ఎక్కువగా ఉంటుంది.
పూజారిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు దాడి.. కేసు నమోదు
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు రుద్రాక్ష శుక్లా రెచ్చిపోయాడు. దేవాస్‌లోని ఒక కొండపై ఉన్న ప్రసిద్ధ మాతా టేక్రీ ఆలయాన్ని మూసేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో వచ్చి పూజారిపై దాడి చేశాడు. ఏడు కార్లలో వచ్చిన ఓ గుంపు.. ఆలయాన్ని తెరవాలంటూ అర్చకుడిపై ఒత్తిడి చేశారు. అందుకు ససేమిరా అనడంతో పూజారిపై దాడికి పాల్పడ్డారు. గత వారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. రెండు ఎస్‌యూవీ వాహనాలతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లుగా రికార్డైంది. బలవంతంగా ఆలయాన్ని తెరిపించేందుకు ప్రయత్నించారు. కానీ పూజారి అంగీకరించలేదు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు దుద్రాక్ష శుక్లా సహా మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. సోమవారం రాత్రి రుద్రాక్ష శుక్లాతో సహా మరో ఎనిమిది మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు అధికారి వెల్లడించారు.
‘రామ..రామ’ కోట్లు.. ఆ మాత్రం ఉండాల్సిందేలే!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్నారు, ఇంతకుముందు బింబిసారా చిత్రంతో తన సత్తా చాటిన ఆయన, ఈ చిత్రాన్ని తన కలల ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ జానర్‌లో హిందూ పురాణాల నుంచి ప్రేరణ పొందిన అంశాలను కలిగి ఉంది. సినిమాలో దాదాపు 70% విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి ఉంటుందని, 13 ప్రత్యేక సెట్స్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మించినట్లు తెలుస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వంభర నుంచి తొలి సింగిల్ ‘రామ… రామ…’ విడుదలైంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ భక్తిమయ గీతం, సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. ఈ సాంగ్స్ విజువల్స్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అదేమంటే ‘రామ… రామ…’ పాటను రూపొందించడానికి మేకర్స్ దాదాపు రూ.6 కోట్లు వెచ్చించారు. కలర్‌ఫుల్‌గా, అత్యంత గ్రాండియర్‌గా తెరకెక్కిన ఈ గీతం విజువల్ విందుగా నిలిచింది.
’RRR’ రికార్డు బద్దలు కొట్టిన హిట్-3 ట్రైలర్
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న రెండో సీక్వెల్ ఇది. మొదటి నుంచి ఈ మూవీపై మంచి హైప్ ఉంది. నాని ఇందులో సీరియస్ పాత్రలో నటిస్తున్నాడు. ముందు నుంచే హైప్ ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా రికార్డును కూడా లేపేసింది. త్రిబుల్ ఆర్ మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో 20.45 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాని హిట్-3 ట్రైలర్ కు మాత్రం 24 గంటల్లోనే 21.30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీంతో త్రిబుల్ ఆర్ రికార్డును బద్దలు కొట్టేసింది. ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక వ్యూస్ పుష్ప-2 పేరిట ఉంది. ఈ మూవీ ట్రైలర్ కు 24 గంటల్లోనే 44.67 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. నాని ఇప్పటి వరకు నటించిన ఏ ట్రైలర్ కు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. ఆల్రెడీ వచ్చిన రెండు పార్టులు మంచి హిట్ కావడంతో ఇప్పుడు మూడో పార్టుపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో నాని చాలా వైలెంటిక్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు నానిని క్లాస్ పాత్రల్లో మాత్రమే చూశాం. కానీ మొదటి సారి ఇందులో ఆయన వైలెంటిక్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయబోతున్నారు.