ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై ఫోకస్ పెట్టారు.. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులను.. జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎస్పీల బదిలీలపై సుదీర్ఘ కసరత్తు చేసింది.. హోంశాఖ మంత్రి, డీజీపీతో సమావేశమైన సీఎం చంద్రబాబు.. ఏ జిల్లాకు ఎవరు ఎస్పీ అయితే, బాగుంటుందనే దానిపై సమాలోచనలు చేశారు.. చివరకు పెద్ద ఎత్తున ఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది ప్రభుత్వం.. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు రాగా.. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు.. ఇక, 12 జిల్లాల్లో ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించింది ప్రభుత్వం…
వారి ఉచ్చులో పడొద్దు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి
ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా… సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. సామాజిక మాధ్యమాల ముసుగులోనో, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నాం. వారి ఉచ్చులో పడి, ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావరణానికి తావీయవద్దు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు.. ఇటీవల మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణగా చూసిన పవన్ కల్యాణ్.. ఒక యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి, ప్రచారం చేయడం వెనక ఉన్న కుత్సిత ఆలోచనను పసిగట్టాలి. దానిపై చట్ట ప్రకారం కేసులుపెట్టి ముందుకు వెళ్ళాలి. తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణపడటం ద్వారా సమస్య జటిలం అవుతుంది. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారని పేర్కొన్నారు పవన్..
మెడికల్ సీట్స్ కోసం కౌంట్‌డౌన్ మొదలు.. మీ పేరు లిస్ట్‌లో ఉందా.?
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 15న జనరల్ మెరిట్ జాబితాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపింది. తాజా షెడ్యూల్ ప్రకారం, మొదటి విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు 17 నుంచి 19 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి 24లోగా ఆయా కాలేజీలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు జరుగుతుంది. ఈ విడతలో సీట్లు పొందిన వారు సెప్టెంబర్ 29న కాలేజీలలో హాజరు కావాలి. ఆ తరువాత మాప్‌అప్ రౌండ్ నిర్వహించి, సెప్టెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు యూనివర్సిటీ స్పష్టం చేసింది.
రైతు ప్రభుత్వం అంటూ రైతులను ముంచుతున్నారు
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు యూరియా కోసం విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “వరి పొట్ట దశలో ఉంది. వారం రోజుల్లో యూరియా రాకపోతే రైతుల దిగుబడి తీవ్రంగా పడిపోతుంది. రైతు ప్రభుత్వం అంటూనే రైతులను ముంచుతున్నారు” అని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. “రేవంత్ రెడ్డి మాటలు బుడ్డ ర్ ఖాన్ మాటల్లా ఉన్నాయి. అబద్ధపు హామీలే తప్ప రైతులకు ఎలాంటి సహాయం చేయడం లేదు. కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపించాలన్న ఆలోచన తప్ప రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన విమర్శలు చేశారు. “రెండు లక్షల 20 వేల కోట్ల అప్పులు చేసి రోడ్లపై ఉన్న ఒక గుంత కూడా పూడ్చలేదు. నాలుగు లక్షల కోట్లతో ఎక్కడైనా ఒక్క ప్రాజెక్ట్ కట్టావా? ఒక బ్రిడ్జ్ అయినా కట్టావా?” అని ప్రశ్నించారు. రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని, లేకుంటే రైతులతో పాటు మహిళలను తీసుకుని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. “కబర్దార్… ఇక మౌనంగా ఉండం” అని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నర్సుతో సె*క్స్ కోసం, రోగిని ఆపరేషన్ మధ్యలో వదిలేసిన డాక్టర్..
రోగికి ఆపరేషన్ సమయంలో వైద్యులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎంత ఎమర్జెన్సీ అయినా, శస్త్రచికిత్స పూర్తయిన తర్వాతే, మిగతా పనులు చూసుకుంటారు. కానీ బ్రిటన్‌లో పాకిస్తానీ వైద్యుడు మాత్రం సె*క్స్ కోసం ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లాడు. 44 ఏళ్ల కన్సల్టెంట్ అనస్థీషియా నిపుణుడు డాక్టర్ సుహైల్ అంజుమ్, గాల్ బ్లాడర్ సర్జరీ సమయంలో ఒక రోగిని అనస్థీషియా ఇచ్చి వదిలి వెళ్లాడు. ఈ ఘటన యూకేలోని గ్రేటర్ మాంచెస్టర్‌లోని టేమ్ సైడ్ హాస్పిటల్‌లో జరిగింది. హాస్పిటల్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో ఒక నర్సుతో సెక్స్ చేయడానికి డాక్టర్ వెళ్లినట్లు యూఎస్ మెడికల్ ట్రిబ్యునల్ చెప్పింది. ఈ సంఘటనను వేరే నర్స్ ప్రత్యక్షంగా చూశారు. డాక్టర్ అంజమ్‌ను నర్స్ సీ అని పిలుబడే నర్సుతో అసభ్యకరమైన స్థితిలో చూసినట్లు వేరే నర్స్ చెప్పింది. డాక్టర్ నర్సుతో శృంగారంలో పాల్గొన్న 8 నిమిషాల తర్వాత సర్జరీ పూర్తి చేయడానికి తిరిగి వచ్చాడు. తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. రోగిని ప్రమాదంలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, రోగికి ఎలాంటి హాని జరగలేదు. ఇదే కాకుండా, తన పరిస్థితికి తన కుమార్తె అకాల మరణం, వైవాహిక ఒత్తిడి కూడా కారణమని పేర్కొన్నాడు.
మా వేదనను అప్పుడే మర్చిపోయారా?.. బీసీసీఐపై పహల్గాం బాధితురాలు ఆగ్రహం!
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు ప్రదర్శించిన పెను ఉన్మాదానికి 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో కాన్పుర్‌కు చెందిన వ్యాపారి శుభమ్ ద్వివేది కూడా ఉన్నారు. తన సతీమణి ఐషాన్య ద్వివేదితో కలిసి హనీమూన్ కోసం కశ్మీర్‌కు వెళ్లిన శుభమ్‌ను బైసరన్ లోయలో ఉగ్రవాదులు తలపై కాల్చి చంపారు. అప్పటినుంచి ఇషానాయ్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్ ఆడొద్దని దేశ ప్రజలు, ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. బాయ్‌కాట్ ఆసియా కప్ 2025 అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అయితే నిబంధనల మేరకే మ్యాచ్ జరుగుతున్నట్లు ఐసీసీ, ఏసీసీ ప్రకటించింది. బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఏ రకంగానూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఐషాన్య ద్వివేది బీసీసీఐపై మండిపడ్డారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది త్యాగాలను బీసీసీఐ విస్మరించిందని ఫైర్ అయ్యారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను అప్పుడే మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ సింగ్?.. టర్బోనేటర్ టు అడ్మినిస్ట్రేటర్!
భారత జట్టు మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ టీమిండియాలో మరోసారి కీలక పాత్ర పోషించనున్నాడా? అంటే.. అవుననే సమాధానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇందుకు తాజాగా పంజాబ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కూడా బలం చేకూరుస్తోంది. ఏజీఎంలో తమ ప్రతినిధిగా భజ్జీని పంజాబ్ నామినేట్ చేసింది. ఈ నెల చివరలో జరిగే ఏజీఎంకు పంజాబ్ తరఫున అతడు హాజరవుతాడు. సెప్టెంబర్ 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పంజాబ్ తరఫున హర్భజన్ సింగ్ హాజరవుతాడు. అలానే బెంగాల్ క్రికెట్ సంఘం తరఫున ఏజీఎంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాల్గొంటాడు. భారత మాజీ ప్లేయర్ కిరణ్ మోరే కూడా బీసీసీఐ అధ్యక్షుడి రేసులో ఉన్నారని తెలుస్తోంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడిని నియమించేందుకు ఎన్నికలు నిర్వహించకూడదని బీసీసీఐ భావిస్తోంది. రాష్ట్ర బోర్డులు ఏకగ్రీవంగా అధ్యక్షుడికి మద్దతు తెలిపేలా బీసీసీఐ చర్యలు చేపట్టినట్లు సమాచారం. హర్భజన్‌కే బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కనుందని సమాచారం. మరో రెండు వారాల్లో ఎవరు బాస్ అనేది తేలనుంది.
అతను నా కుటుంబాన్ని నిలబెట్టాడు.. మనోజ్ ఎమోషనల్
మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నారు. మిరాయ్ సినిమాలో విలన్ గా చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో మనోజ్ కు విలన్ గా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. తేజసజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా నిర్వహించిన మూవీ సక్సెస్ మీట్ లో మనోజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మూడేళ్ల క్రితం ఓకే చెప్పాను. నన్ను చాలా మంది ఫ్యాన్స్ అడుగుతుంటారు. అన్న ఎప్పుడు కమ్ బ్యాక్ ఇస్తున్నావ్ అని. త్వరలోనే అని చెబుతూ వచ్చాను. చాలా సినిమాలు చేతుల దాకా వచ్చి చేజారిపోయాయి. అలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఈ సినిమా నాతో చేస్తున్నప్పుడు చాలా మంది వద్దని నిర్మాత విశ్వ ప్రసాద్ కు చెప్పి ఉంటారు. కానీ ఆయన నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా నాకు కేవలం ఒక పాత్రను మాత్రమే ఇవ్వలేదు. ఈ సినిమాతో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని నా కుటుంబాన్ని నిలబెట్టాడు. అతనికి జన్మంతా రుణపడి ఉంటాను. ఆయన వల్లే ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నాను. తేజ నాకు తమ్ముడు. అతని కోసం ఎప్పుడూ నా వంతు సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఈ సినిమా అతను అడిగాడు కాబట్టే చేస్తానని చెప్పాను. ఎప్పటికీ మంచి కథలు చేయాలని అనుకుంటాను. కానీ అన్ని సార్లు కుదరకపోవచ్చు. ఈ సినిమాతో అది కుదిరింది అంటూ ఎమోషనల్ అయ్యాడు మనోజ్.
అవన్నీ శాశ్వతం కాదు.. రిలేషన్ పై సమంత షాకింగ్ కామెంట్
సమంత ఏం మాట్లాడినా ఇట్టే వైరల్ అయిపోద్ది. సినిమాలు పెద్దగా చేయట్లేదు గానీ.. ఈ మధ్య బాగా టూర్లు వేస్తోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుగా క్లోజ్ గా కనిపిస్తోంది. కానీ వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందా లేదా అనేది చెప్పట్లేదు. కానీ వరుస ఇంటర్వ్యూల్లో రిలేషన్ షిప్, పర్సనల్ లైఫ్, హెల్త్ గురించి ఎన్నో కామెంట్లు చేస్తోంది. వరుసగా స్టేట్ మెంట్లు ఇస్తోంది ఈ బ్యూటీ. ఆమె చేస్తున్న కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవరూ లేకపోయినా మనం ముందుకు వెళ్లాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం అంటూ తెలిపింది. ఈ సమాజంలో ఆడపిల్లలకు ఎప్పుడూ అడ్డంకులే ఉంటాయి. అది చేయకు.. ఇది చేయు అంటుంటారు. రిలేషన్ లో ఇలాంటివి కామన్ గానే వినిపిస్తాయి. మనం ఎంచుకున్న పని కరెక్ట్ అయినప్పుడు ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు. మన నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనల్ని నమ్మిన వారు ఎప్పుడూ మనతోనే ఉంటారు. తాత్కాళిక డ్రామాలు ఎప్పటికీ శాశ్వతం కావు. మనం హెల్త పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే కచ్చితంగా దెబ్బ పడుతుంది. నా బాడీ ఏది చెబితే నేను అదే పాటిస్తాను. ఎంత ఫిట్ గా ఉంటే అంత బెటర్. హెల్త్ కు ఉన్న వాల్యూ ఎలాంటిదో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అంటూ చెప్పుకొచ్చింది సమంత.